పరవశం

చుక్కల మెడ తిప్పుతూ పావురాయి,
ముక్కున కరిచిన మేతతో కొక్కిరాయి
దిగువ పాయల వెంట ఎగిరిపోయాయి
కనుల కొలనులో చూపు ఎగువకి సాగింది

రంగురంగుల రేకులలో ఉషస్సు,
రంగు మీద రంగుగా ఇంద్రధనుస్సు
మెరుపు దాడుల దూతలమంటున్నాయి
మేని సీమలో మైమరపు  పరుగులు తీసింది

తనివి తీరని కాలం, ఋతువు దాటి ఋతువులోకి
అలవి కాని మోదం, అక్షర భారతి పాద సన్నిధికి
బిరబిరల గోదావరి మారురూపాలౌతున్నాయి
పదాల సంద్రాన భావం ముత్యాలరాశిగా మారింది!

కూరిమి

'మారాము చేసానులే...'
మూసిన తలుపుల నుంచి
దూసుకువచ్చే వాన సడిలా
బిగించిన ఆ పెదాల నుంచి
చిన్న మాట!

దుఃఖ మేఘం కమ్ముకున్న
తన కనులు
దిగులు భారం మోయనన్న
తనువూ
ఈ చేతులలో...

'గారాలు నీవంతు కదు!?'
మాట సవరించిన తన మమత,
జడిగా, సడిగా ఎన్నెన్నో జల్లులు
తేటపడ్డ ఆకాశమై
ఇరువురి అనుబంధం.