"రంగశాల" - ఒక రచయిత కన్ఫెషన్ - అంతరంగశాల

 "new year is one imaginary mark on time continuum" as a friend wrote...but for me 'Now' is an imaginary point between transcendentally ideal and empirically real. As Eliot said "The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality" - I have a long way to reach that quiet yet!
అసలీ కవితకి మూలమైన భావావేశం నన్నింకా సుడులు చుట్టి ఊపుతుంది. అసలు కవితగా వెలికి తేవాలని క్లుప్తత, స్పష్టత సంకెళ్ళలో దాని ఆత్మని చంపేశానా? దెయ్యం పట్టిన మనసులా ఉంది స్థితి. అందంగా ముస్తాబు చేయాలని ముఖం కందేలా దిద్దానేమో. ఇప్పటికి ఇదే నా పరిమితి కనుక, మొదటి దశ లోని రూపాన్నీ ఇక్కడ ఉంచాను.


కవితారూపుగా అమర్చలేకపోయిన భావాలు:
"జీవితం నాటకం. ఎందుకు అలా పోల్చాను?"
"జీవితనాటక ప్రతి లో గతం అన్నది ఎన్నో తీరని కలలు, ఆశలు - తెరవని పేజీల్లా, నటన కట్టని పుట/మాటల్లా మోస్తుంది, ఎప్పుడైనా ఒక గెలుపు, తీరిన తలపు, మరొక నిరాశ వాటిని తెరిచి చూపుతుంది."
"ఎవరి జీవితమూ ఆదర్శం కాదు. ఎన్ని సత్యాలు తెలుసుకున్న, వైరాగ్యాలు అడ్డుకున్నా, జీవిత కర్తలం మనమే."
"లైఫ్ స్పాన్ లో సఫలత, సంపూర్ణత, ఓటమి, నిరాశ [నాటక నిడివి అనుకుంటే] - ఒక యూనిట్ లో కొలవలేము. ఆయా వ్యక్తుల ఏకాంకం వారిని బట్టే."
"జీవితాలు కాలానుగుణ నాటకాలు/మిగిలే చరిత్రలు."
మొదటి ప్రతి:
ఏకాంకిక ఈ వీధినాటకం,
చావు తెర పడే వరకు.
చెప్పేందుకేముంది విష్కంభం?
వచ్చిపోతున్న రేపుమాపుల్లో
కిక్కిరిసిన వీధి...
ఉండుండి గగ్గోలు పెట్టే గతం,
మడతపడిన పేజీలకి ముఖచిత్రం.
నిడివి తెలిసినా నిష్ఫలం,
నాటకానికొక ఏకాంకం,
మనుషుల నడుమ లేదా అంతరం?
ఎదురుచూసినా రాదే విరామం.
ఏకపాత్రాభినయం మరో విశేషం
మానవ యంత్రాలు కదులుతుంటే
కాలపు నటనలు జీవితచరిత్రలు...
తెలుసుకుంటే జీవిత సత్యం,
వదులుకుంటే వైరాగ్యం,
నాటక కర్తలు నాగరీకులు
*****
మార్పు చేసాక:
ఏకాంకిక ఈ వీధినాటకం,
ముగింపు వరకూ
నిర్విరామ అభినయనం
చెప్పేందుకేముంది విష్కంభం?
వచ్చిపడుతున్న రేయింబవళ్ళతో
కిక్కిరిసిన వీధిలో,
నిత్య ప్రదర్శన
గతపు ఈలల గోల, చప్పట్ల హోరు
నాటక ప్రతి అవసరపడదు,
జరుగుబాటు నటన తెలిసాక.
ఎపుడైనా జీవించాలనిపిస్తే
తక్షణమే మనిషిగా నీ ఆవిర్భావం

పరిణామం

కట్టడాలు కనులెదురుగా ఎదుగుతున్నాయి,
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రచురితమవకపోయినా.
కూల్చివేతలు, కాల్చివేతల గాథలు
కాలెండర్ పేజీలో సంవత్సరీకాల తిథులు
సమాధుల మీద వాడిన పుష్పాలు
అనాధలు, అభాగ్యులు, అసహాయుల అశ్రుధారలు
మనసు భాండాగారం లో ముద్రితాలుగా...
ఇప్పుడిప్పుడే మెదడు కొత్త ప్రక్రియ నేర్చింది కాబోలు,
ఆముద్రిత రచనలుగా పదిలపరుచుకుంటూ!?
నిండు గర్భిణిలా కొత్త గృహాలను మోస్తూ నేల
మూడవ సమూహానికి సిద్దపడుతూ నాగరికత
సమాజ ప్రాధాన్యతలు మారుస్తూ నవతరం
సమైఖ్య భావనలు, శాంతి కాముకత సాగు చేస్తూ విశ్వజనులు
మదిలో మరో ప్రపంచపు చిత్రానికి తుది మెరుగులు దిద్దుతూ...
బలవంతుడు బలహీనులు సాధించలేని నిర్మాణమొకటి
సమీప కాలంలో నిలుస్తుందని కనువిప్పుతో నా కనులు సజలాలుగా.

Huge Universe of Tiny Creatures!

మనిషి మౌలికం గా ఒంటరి, నిజమే! బహుశా ప్రతి ప్రాణీ అంతేనేమో!? ఏకాంతం ఎంత మధురం, ఆస్వాదించటం ఎలానో సాధించాక. అలా ఎలా అని అడగొద్దు- సవ్వడి చెయ్యకుండా ఓ చిన్ని పిట్టని చిటారు కొమ్మనా, చికిలించి చూస్తేనే తప్పా కంటికానని చిట్టి పువ్వుని, బ్రతకటానికి ఒంటరి పోరాటం చేస్తున్న మొక్కని, మరు నిమిషానికి మనుగడ ఎరుగని ఒక జీవిని- గమనించి మనసు తీరా మాట్లాడి, ఆరాధించి, మౌనం గా తప్పుకుని, కంటి తడి తుడుచుకుని- ఇలా కూర్చున్నానే అలా, అంటే అంతకన్నా యేమీ లేదు, నిరంతరం ఒక లిప్త అనంతరం మరొకటిగా కాలం నీలోకి వస్తున్నంత వరకు...



 

కొన్ని వెన్నెలలు వెచ్చగా వుంటాయి!

ఎపుడైనా విద్యుల్లతలు- వికసించే గిన్నెమాలతీ తీగలై- మంచు దారాలకి గుచ్చబడి నా వైపుకి విసరబడితే ఎంతో మురుసుకుని మరిన్ని గీతాలు రాసుకున్నాను
మరీవేళ ఎవరో నల్ల జాజులు- వినువీధి నెలతల సిగలో- ముడిచినట్లు ఆ జాబిల్లమ్మ సగసగాల మోముతోనో పసిడికాంతుల బిడియంతోనో చూస్తుంటే మాటేరాని దానినైనాను...
మనసు వెచ్చబడే ఈ వెన్నెల జ్వరాలకి, జాబిలి తాకి నలిగే తనువుకీ ప్రకృతి తనే చికిత్స చెయ్యాలిగా! 
dated 12/09/14

"కలలు వచ్చే వేళయని, కనులు తెరచి నిదురోతే పొద్దుపొడుపు వేళల్లోనా ముద్దరాలు పిలిచింది, తీపి ముద్దులిచ్చింది" - దేవులపల్లి మురిసినట్లే
"కవితలు ఒలికే వేళయిది, కనులు మూయనీయని పండువెన్నెల వేళల్లోనా నిండు జాబిలి నిలిచింది, రేయి నిద్దుర తొలిగింది" - అని నేను మురుసుకున్నాను

ఇప్పుడీ జాబిలి అంబరాన సిగ్గులొలికే ముగ్ధలా నాకేనా!?
dated: 12/07, 08 2014


Blood Moon eclipse on the night of October 7-8, 2014

నిర్వేదం...

ఏవేవో దిగుళ్ళ నెగళ్ళు సెగలు రేపి ఎదని కాల్చుతూ ఉంటాయి,
మెలిపెట్టి బూడిద రాసిగా మారుస్తుంటాయి
జ్ఞాపకాలవో ఆత్మీయులవో స్పర్శ తెచ్చి అద్దుకోవాలని,
ఆవేదనని అడ్డుకోవాలని ఆత్రుత పడతావు
చిత్రంగా అవీ కాలిపోతాయి,నీ రూపుగా మారిపోతాయి,
చివరికి ఒక ఊదా మెరుపు నిర్వేదం గా మిగిలిపోతావు…



Despondence - NS Murthy
-------------------------------
Some vague fears rake up flares to torment the heart,
Wrench and reduce you to a heap of ashes.
You long for the caressing touch of either memories or dear ones,
And would be eager to resist the arresting angst.
Strangely, they too get incinerated and transform into you.
And you ultimately remain…
A purple glow of doleful despondence.