ఇవాళనేమిటీ ఎప్పుడూ ఉపమానం, ఉపమేయం రెండూ తనలోనే చూసాను..ఎవరిలో అనేనా. కోక్ కాన్ ఊపి ఊపి, ఓపెన్ చేస్తే బుస్సున పొంగే నురగ మీద ఓ చిటికెడు ఉప్పు పోస్తే మరింత చివ్వున ఎగుస్తుందే అలాగ, వేదననీ ఆనందాన్నీ ఒకేలా దాచుకుని ఊపుని బట్టి ఒక్కో రకం పొంగుని నామీదకి విసిరే నా మనసులో. కనుక నా మనసుకి మనసే సాటి. యస్.. అనన్వయాలంకారం. నా అస్తిత్వం చిరునామా అయిన స్వయానా నా మనసులోనే. పాపం ఎంత కాదనుకున్నా ఏకాకి నాకు ఏకాంతం లో మిగిలిన తోడు.. ఇవాళ కాస్త గలాటా చేస్తుంది.. సరే పోనీ వదిలిచూద్దాం కాసేపు...
"మీరు ఏముట్లు" అడిగినావిడ చూడబోతే పెద్దవారు, వెనక ప్రాధేయపడుతున్న మనిషి చూపు కాస్త వెనక్కి లాగగపోతే [మనసు చెప్పే కబుర్లు వింటూ మళ్ళీ ఈ మనసులో మాట ఏమిటో] "ఆ.. లాగకపొతే ఏం చేస్తావు?" పాట పాడతా 'గాలికీ కులమేది ఏదీ నేలకి కులమేది.' ఇలాకాదు గానీ మొక్కలు, పూలు, నీళ్ళు మారలేదు కానీ మారినవి - యాంత్రికజీవితాలు, పనిముట్లలో కలిసిపోయిన జనాలు, అందులో నేనూను. కానీ కులానికి మనిషిని.. కనుక నేను స్త్రీలింగం కలిపితే "మమ్ముట్టి" ని. యస్.. కడోస్ మనసా! కులం, తత్వం, లింగం కలిపి ఒకటే మాట మనిషి+పనిముట్టు+స్త్రీ == మమ్ముట్టి చెప్తే విని అడిగినావిడ తట్టుకోగలరా?
మరి గోత్రం. అదెవరికి అవసరం.. చివరిసారి ఎక్కడ చెప్పాను..ఏదో గుళ్ళో ఎవరో పూజారి అడిగితే. పూజారి అంటే గుర్తుకి వచ్చింది. ద్రాక్షారామం గుడి పూజారి ఎంత దైన్యంగా ఉన్నారు. ఎలాగోలా ఆర్థికసాయం చేద్దామనుకున్నానే. సమయాభావం అని వంక. ప్చ్.. నిజంగా అదేనా కారణం. మూలకి నెట్టేసిన ఆలోచన ఆచరణకి నోచుకోక ఆగిపోయింది.
షాపింగ్ మాల్లో ఓ మూల కూర్చుని మాసిన దుస్తులు, గడ్డం అసలుకి మాపులేనిదేదీ లేని ఆ వృద్దుని కళ్ళలో నిర్లిప్తత ఎలా వచ్చిందో? అసలే భవబంధాలూ లేనివాడిలా పది డాలర్స్ ఇచ్చినా అదేచూపు, చీటోస్ పాక్ ఇచ్చినా మారని చూపు. అతని రూపు చూస్తే ఎప్పుడో ఓ రోజు హఠాత్తుగా ఫలానా పుస్తకం రాసిన కవి/రచయిత నేనే అంటాడేమో.. ఛా..ఛా..అలాగ పోయిందేం ఆలోచన. ఏం కాకూడదా?
ఒకప్పుడు వెనక నుంచి డాష్ ఇచ్చి సిడ్నీలో ఆ కార్ వాడు నాది ఈష్ట్ టీమోర్, నీది ఇండియా, మనం మనం భాయీ భాయీ...పోలిసుల్ని పిలవకు అంటాడా.. నిన్న వాడేమో ఆ ఆఫ్రికన్ అమెరికన్ కుర్రాడు ముందు బైక్ మీద వెళ్తూ ఏమీ కాకుండానే అసహ్యంగా చూస్తాడా. అవసరార్థం అభిమానాలు, అకారణద్వేషాలు. "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం."
పిల్లది పెద్దదైపోతుంది. నిన్నామొన్నా బెంచ్ టాప్ మీద కూర్చుని ముంజేతిమీద పుట్టుమచ్చ ని ఆవగింజ అనుకుని "మా లుక్, టిక్ టిక్ నా చేతి మీదకి రోల్ అయింది." అన్న చిన్నారేనా ఇది? సరిగ్గా నమిలి తినకపొతే వంటిలోకి పాకుతాయి అన్నమాట నమ్మింది మొత్తానికి. చిన్నప్పుడు నేనూ ఇంతేగా.. పొరబాట్న మింగేసిన బత్తాయిగింజ బొడ్డులోంచి మొలకెత్తితే నన్ను భూమిలో పాతేస్తారని, నా మీద చెట్టు పెరిగిపోతుందని అన్నయ్య చెప్తే నమ్మి, అనంత పద్మనాభుని రూపంలో నన్ను నేను ఊహించుకుని భయపడలేదా? తరతరాల మన మూఢనమ్మకాలకి ప్రతినిధులం.
అవటార్ చూస్తున్నా అంతే. నానమ్మ చెప్పేది, నిద్ర పోయే ముందు మంచినీళ్ళు తాగకపోతే జీవుడు అర్థరాత్రి లేచి అలా ఎగిరెళ్ళి చెప్పులు కుట్టేవాడి తోళ్ళు నానేసిన గిన్నెలో నీరు తాగి వస్తుందని. అప్పుడు కలలన్నీ అవే. "ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్చ కోరగా. మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను.." పాడుకుంటూ గాల్లో ఎక్కడెక్కడికో ఎగిరేదాన్ని కాదా? తను చెప్పిన మాట మాదిరిగా కాక చక్రవాక పక్షిలా మబ్బుల్లో నీరు తాగి వచ్చేదాన్ని.. ఏమయ్యాయి నా కలలు?
తను అన్న సర్వనామం ఒక్కరికే అంకితమిచ్చేసాక, "అంతగా లీనమైపోకు, తగ్గించు." అన్న తన మాట వింటూ "మరి తను మునగొచ్చే, తనకి నచ్చిన పనుల్లో తలమునకలుగా మునిగితేలొచ్చు. ఎరిక మరిచి లీనమవచ్చు. నేను మాత్రం మామూలు మనిషిలా కాదు యంత్రంలా బతకాలి. నాకు నచ్చినపని (ప్చ్ .. అదీ తనమీద ధ్యాస / ప్రేమ అని తెలియదా?) మాత్రం వదిలేయాలి. హిపోక్రాట్." యాక్, ఇలా పైకి అనలేని నేనో సూడో ప్రేమికని.
తిట్టాలి ఇంకా తిట్టుకోవాలి చాలదిది. ఎవర్ని అడగాలి కాసిని తిట్లు అప్పియ్యమని. మొన్నామధ్య ఇండియాకి వెళ్ళొచ్చిన రెండేళ్ళ నా బుల్లి నేస్తం ఎలా పట్టిందో, పట్టి పట్టి అన్నమాట[ట].. అనేస్తున్నా.. [నాన్నగారు మన్నించండి] అచ్చ తెలుగులో "చెత్త నాయాల" :) ఆధునిక పోకడలో పొడిగిస్తే "ఇడియట్" ఎవరూ నేనే. ఆత్మదూషణ తగదే మనసా.. మరి ఎవర్ని తిడదాం.. ఆ వాడే ఆ బజ్జీలబండి వాడు వెళ్ళకెళ్ళక ఇండియా వెళ్ళి, దొరక్క దొరక్క నడిచి అదీ బజ్జీల బండి దొరికే వీధిలో వెళ్ళగలిగితే "అమ్మా నీకు అమ్మేవికావివి." అంటాడా? వ్యాపారనీతి తెలియని వెర్రి పీనుగ, నిజాయితీలో నన్ను సవాల్ చేసిన అసమర్థుడు. వాడిదీ నాదీ ఒకటే జీవిత యాత్ర ఇక. నాది పడమటి సంధ్యా రాగం.. వాడిది తూర్పు తిరిగి దణ్ణం పెట్టే బేరం. వెరసి అసమర్థుని జీవితయాత్ర.
మొన్న ఆదివారం నా పిల్లాడు అంటించిన Sunday bloody Sunday పాడుకుంటుంటే ఎండన పడి వచ్చిన ఆ పిల్లాడు చాక్లెట్స్ అమ్ముకుంటూ, సంఘసేవ పేరిట అచ్చంగా వీధులు వాడలు పట్టి తిరిగిన, చిన్నప్పటి నాలా లేడు? చల్లటి నిమ్మ మజ్జిగ శొంఠి పొడి వేసి ఇవ్వాలనిపించింది. ఇవ్వలేకపోయానే. ఏం.. మరి ఆఫీసులో వాళ్ళంతా అంత తేలిగ్గా డ్రింక్స్ ఆఫర్ చేస్తారే.. నేనే సందేహంగా "నాన్ ఆల్కహాలిక్ కదూ?" అని వందసార్లు అడిగి తాగుతాను గాని. "కన్యాశుల్కం" బుచ్చెమ్మ నుంచి నా వరకు, అంతా అచ్చమ్మలమేనా, తింగర ప్రశ్నలు వేయటానికి?
మాట వినని మనుషులని వదిలి చెప్పినట్టు పద బంధనల్లో ఇమిడే ఈ అక్షరాలు ఎంత ఆనందాన్ని వెలికి తెస్తున్నాయి? అవి రాస్తున్నది వేదన అయినా బయటకి పరావర్తించేది సంతోషమే, నిజంగా నిజ్జంగా..నా కళ్ళు నిజాన్ని దాయలేవు. మనసుకి కొత్త కళ్ళు అక్కరలేదు. ఇవే కళ్ళు ఇన్నాళ్ళూ ఇవే నాకున్నవి. ఇకపైనా ఇవే.
గాయపు కోత గెలుపుకి చిహ్నం. బ్రతుకున బాధల నలుపు మిగిలిన సుఖం, సంతోషం, శాంతి, తృప్తి వంటి ఇంద్రధనుస్సు రంగులకి తరగని వన్నెనిస్తుంది. పళ్ళెం అంచుకి తొగరు వంటివే ఈ భారపు గడియలు. ఆ చుట్టంచు నడుమనున్నదే ఈ అందమైన బంగరు పళ్ళెం, ఆరు రుచులనూ మనకు అందించే జీవితం. చాల్లే మెట్టవేదాంతం. వేదం సినిమా లో వాడు చెప్పలేదా "పెరుగువడలో పెరుగు ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు." అని. అలాగే బతుకులో ఎప్పుడూ ఏదో ఉంటుంది, మరేదో ఉండదు. ఉన్నవీ లేనివీ వెదుక్కోపోతే బతుకే లేదు. నాకు నేను దొరకనినాడు వాళ్ళూ వీళ్ళూ ఉండి లేనివాళ్ళే.
సరే మనసా, ఈ స్వగతాన్ని ఏమంటారు? మమెలీ ఇదేమిటీ, మమెలీ అంటే? మమ్ముట్టి మెమొరీ లీక్. ఏం నువ్వూ రోజూ ఏదో ఒక మెమరీలీక్ డీబగ్ చేయవా? అదేమిటి, అది కంప్యూటర్, పైగా ముందే తెలిసిన మాట "This Computer does what you tell it and not what you want it to do" అని. మనసు అంతేనోయ్ పిచ్చి పుల్లాయ్. నీ మాట వినే ఆ పిచ్చిదాన్ని పట్టుకుని "మనసు మాట వినదు" అంటావా.
అమ్మో, "గుర్రం ఎగరా వచ్చు, పక్షి పాకావచ్చు" అన్నారందుకే. ఇక పద, రౌతు చేతికి నిన్ను ఇవ్వకపోతే మనసా నన్ను ఎక్కడకి తీసుకుపొతావో ఇక. "ఏం మాయ చేసావే మనసా?" తెగ కంత్రీవి.
స్వగతం వర్షంలా కురిసి బ్లాగులో పడితే, గొంతు తడిసి దాహం తీరి, ఆ వర్షానికి మొలిచిన సంతోషపు మొలకల పచ్చదనం కళ్లకు నిండుగా కనిపిస్తే మమ్ముట్టి, మమెలీలి మాయమయిపోతాయోచ్చ్.
ReplyDeleteఅర్థం అయీ అవనట్లు ఉంది:))ఇంకొకసారి చదవాలమ్మాయి!
ReplyDelete"బతుకులో ఎప్పుడూ ఏదో ఉంటుంది, మరేదో ఉండదు. ఉన్నవీ లేనివీ వెదుక్కోపోతే బతుకే లేదు"...ఇది మాత్రం నిజం.
@ సౌమ్యా, నేను ఉషమమ్ముట్టి, మిమ్మల్నీ జతచేయనా? థాంక్స్. మనసు సొదలు స్వఛ్ఛమైనవి. బాగా నప్పేమాట "మనసుకి వర్జిన్ ఫ్రెష్నెస్" ఉండాలి. ఈమాటని నాకు పరిచయం చేసిన నేస్తానికి నెనర్లు.
ReplyDelete@సిరిసిరిమువ్వా, మీరు కాదుగానీ, అమ్మాయ్ నువ్వు స్నేహ కవితలు చదివిరా. అవయితే అర్థం అవుతాయి మరి. ;) ధన్యవాదాలు. అన్నీ చెప్పాక ఆ మనసు చెప్పాలనుకున్న ఒక్కాముక్కా పట్టేసారు. అది చాలు.
ReplyDeleteజత చేసేయండి చేసేయండి...సందేహెమెందులకు :)
ReplyDelete"మనసుకి వర్జిన్ ఫ్రెష్నెస్"...వావ్ ఎంత అందమైన మాట !
@సౌమ్యా, డన్ డీల్. ఇక నో ఎగ్జిట్. పాపం పడ్డారుగా. యా ఇంకెన్ని ఆణిముత్యాలు ఏరుకోవచ్చో ఆ మిత్రుని నోటినుంచని పిచ్చ పిచ్చగా ఆశ/కల! ;)
ReplyDeleteచెత్తనాయాలా :)
ReplyDeleteభా.రా.మమ్ముట్టీ [ఇక్కడ వ్యాఖ్య రాసినవారంతా మమ్ముట్టిలే] - అంతేనండి. అందరికీ ఒకటే పిచ్చి. ఎదుటివాడి వైఫల్యం/వైకల్యం వాడితో చె.నా. అనిపిస్తే చూసి ఆనందించాలని. అందుకే భానుమతి గారు పాడారుగా "పిచ్చి పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి" నాదో పిచ్చి, మీకు నా పిచి నచ్చి అదో పిచ్చి! :)
ReplyDeleteమళ్ళీ చె.నా :)
ReplyDeleteఓకేనండి, "బలవంతులె బతకాలని సూక్తి మరవకుండా
ReplyDeleteశతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ" - సిరివెన్నెల. తప్పదు, ఇక చె.నా. [పూర్తిగా అక్కడ రాసేసా గానీ అనటానికి కాస్త ఇబ్బందే సుమీ!] అని నేనే అనుకున్నాక మీరు ఎన్నిమార్లు అన్నా సాధించేదేముంది కానీ. మొండివాడు రాజు కన్నా బలవంతుడు కదా, నా తాను అదే. ఇక ఇంతే! ఇప్పటికే సరిపడా నలిగిందీ మాట. :)
బాగుంది. మనసు మనసుతో అనుకునే మాటలు బయటకొస్తే అంతే. ఆవగింజ నుంచి అంతరిక్షం దాకా అరక్షణం లో ప్రదక్షిణం చేసి వస్తాము.
ReplyDeleteఒక్కొక్కసారి ఆ మనసుని అలా గంతులేయనిస్తే... అడుగున అగాధంలో పడిపోయిన ఎన్నో ఎన్నో అలోచనలు ఎగురుకుంటూ పైకి వచ్చేసి మనల్నెంత ఆశ్చర్యపరుస్తాయి? నాలో ఇటువంటి ఆలోచన వుందా అని మనమే తెల్లబోతాం... అబ్బే అలా ఆలోచించకూడదూ... ఇలాగే అనుకోవాలీ అని అనుకుంటాం. కాని అది సాధ్యమా..
మనసుకి వర్జిన్ ఫ్రెష్ నెస్ అన్నమాట ఎంత బాగుందో..
నా మనసు మార్చుకున్నాను అంటూంటారు కొందరు. నమ్మగలమా..
మాటిమాటికీ మారే మనసులంటే రాసి రాసి చెరిపేసిన పలకల్లాంటివి
కొత్తమాట దానిమీద రాసినా పాతమాట నేనున్నానంటూ కిందనుంచి తొంగిచూస్తుంది.
మనసులోని భావాలు పైకి రావడం వల్ల ఆ మనసే చల్లబడుతుంది. బాగుంది.
చివరి మమ్ముట్టి శ్రీలలితగారికి ధన్యవాదాలతో ఓ ప్రకటన. కనుక మిత్రులారా నాకు మొత్తం ఏడుగురు మమ్ముట్టీలు దొరికిపోయారు గాన ఇక ఈ టపాకి వ్యాఖ్యలు వచ్చినా మమ్ముట్టి స్థానాలు లేవు. ఐదుగురి పేర్లు, నాతో సహా, ఇక్కడ. మిగిలిన ఇద్దరూ ఎక్స్, వై నాకు రాసిన లేఖల్లోను. ఎలాగైనా అమ్మమ్మగారు చాలా గ్రేట్. ఏడుగురు అన్నారు అలానే అయింది. :) అందరికీ మరోమారు నెనర్లు.
ReplyDelete"తను అన్న సర్వనామం ఒక్కరికే అంకితమిచ్చేసాక" -> ఎంత అందంగాను, బలంగాను చెప్పారండి - ఈ మధ్యకాలంలో చూడలేదు ఇలాంటి అభివ్యక్తి- అదీ వచనంలో.
ReplyDeleteబాగా రాసేవు ఉష. మనసు మాట వినని ఒక పొద్దు తోచినవన్ని కాగితం మీద కెక్కించావా.. బాగుంది.
ReplyDeletevookadampudu గారు, ఈ టపాకి అసలు మూలకారణాన్ని ఇట్టే పట్టేసారు. ఆశ్చర్యం, మహదానందం. నాకు అందిన మరొక చిక్కని స్పందన నా దగ్గరే దాచేసుకోవాలన్న స్వార్థం గొంతునొక్కి అది కీచుమని అరిచేలోగా పెట్టేస్తున్నాను.."జీవితానికి అను నిత్యం ఒక second-person pronoun ఉండటమేనేమో, ప్రేమలో వుండటం అంటే! ఇక అప్పుడు మన స్వగతాలన్నీ వాళ్లకే ఉద్దేశించినవైపోతాయి. కాస్త నరకం, కాస్త స్వర్గం!" ఆ నిష్టూరాన్ని కాదనలేని నా మనసుకి ఎదురవుతున్న నిత్య సంఘర్షణ అదే. కొంచం అది కొంచం ఇది. ఆ అది ఇదీల మధ్యన/మీదన సాగే నదిని నేను.
ReplyDeleteపోతే కొన్ని బ్లాగులు నేను చదివినా మౌనంగా వచ్చేయటమే తప్పా [అదే నేను ఇవ్వగల గౌరవం అని తోచి] తోచింది/తోచనిది రాసేయలేను. మీ బ్లాగు అందులో ఒకటి.
ఈ రకంగా మీరు తొలివ్యాఖ్య రాసినందుకు సంతోషం. నెనర్లు.
విజయోస్తు
ReplyDeleteశుభాభినందనలతో
భవదీయుడు
ఊకదంపుడు