నిను చేరక నేనుండలేను

గమనిక: ఈ కవితలోని మొదటి రెండు పంక్తులు గిరీష్ గారి టపా రాధామాధవీయం! నుండి సంగ్రహించటమైనది.

జీవించడానికే ప్రేమిద్దాం
ప్రేమించడానికే జీవిద్దాం

ఈ మార్గానే ప్రయాణించాను
బీడు భూములు దాటాను
మోడు నీడల నిలిచాను
వాగు పొంగున ఈదాను
హరిత వనాల హసితనయ్యాను

రాళ్ళు, ముళ్ళు దర్శించాను
ఫలపుష్ప రంగుల ఆదమరిచాను
రెక్కల జోరు విన్నాను
అడుగుల జాడ కన్నాను
పయనం అన్వేషణైంది
పరుగుల ఆరాటమైంది

ఎగువ దిగువ ఎంచలేదు
వేగం పెంచటమాపలేదు
ఊర్ధ్వముఖమైంది చలనం
వూపిరి సలపని గమనం
కాలం లెక్కలు విడిచాను
చివరి మజిలి చేరాను
శిఖరాగ్రం కాంచాను


పుడమి గుండె పగులువారినా,
ఎదలోతుల ప్రేమ చెలమ పదిలమవదా!
గరికకాడ వెన్ను విరుచుకు నింగికెగిసినట్లు,
నాలోని నీకై నా నిరంతరాన్వేషణ సాగదా!
నీవున్న తావుల జాడకై మరిన్ని బీటలై విచ్చనా,
ఆ నడుమ పాయలై నిను చేరగ నాప్రేమసాగరాన్ని చీల్చనా!

23 comments:

  1. ఈ కవిత చదువుతుంటే అన్యాపదేశంగా నేను గతంలో రాసిన "గంగమ్మ పరవళ్ళు" గుర్తుకొచ్చింది. భావసారూప్యం వల్ల కావచ్చు.
    మొత్తానికి భలే ఉంది ఈ కవిత.

    ReplyDelete
  2. మనిషి గుండె పగిలితేనే
    ప్రేమ విలువ తెలిసేది.
    ప్రేమ విలువ తెలిస్తేనే
    మనిషి విలువ తెలిసేది.

    హిమశిఖరాలు చేరినా
    సిగపట్లు తప్పలేదు.
    ఊపిరి సలపని గమనంలో
    కాలం లెక్కలు కాకి లెక్కలే

    రాళ్ళు ముళ్ళ దారులు
    నిత్య రహదారులు.
    ఫల పుష్ప వనాలు
    తూనీగ ఘూంకారాలు
    సెలయేటి గలగలలు
    జలతారు వన్నెలు
    వెన్ను త్రిప్పి చూసినా
    కనిపించని ఎండమావులు.

    ReplyDelete
  3. "నీవున్న తావుల జాడకై మరిన్ని బీటలై విచ్చనా,
    ఆ నడుమ పాయలై నిను చేరగ నాప్రేమసాగరాన్ని చీల్చనా!"
    చాలా బాగారాసారండి!

    ReplyDelete
  4. ఆఖరి పంక్తులు చిక్కగా ఉన్నై.

    ReplyDelete
  5. 'ఎండమావులని తెలిసినా..... తెలీని నిరంతర
    ఆరాటంతో దాహం తీర్చుకోవాలని పరిగెడుతున్నాను ..కాలగమనాన్ని లెక్కచేయక ....'

    ReplyDelete
  6. ప్రదీప్, మీరు ఆ కాలమానానికి వెళ్ళాక మొదటిసారి #1 వ్యాఖ్య మీది. అదీ మీకు నచ్చటం నాకు చాలా సంతోషం. అలాగే భావసారూప్యానికి వస్తే నేను మునుపే చెప్పాను మన కవితావేశంలో సామ్యంవుంది. మీ కవిత గుర్తుకి తెచ్చారు. అదీ మంచిదే, మళ్ళీ వెళ్ళి చదువుతాను. నెనర్లు.

    ReplyDelete
  7. భా.రా.రె, ఒక్కోసారి మీ ప్రతి కవిత నా కవితకి విలువనిస్తుంది. ఇంకోసారి మీ ప్రశంస విలువ కట్టలేని తృప్తినిస్తుంది. రెండిటికీ నేను ఋణపడివున్నాను. కృతజ్ఞతలు.

    ReplyDelete
  8. పద్మార్పిత, కొత్తపాళీ గారు, సుజ్జీ, ఆ చిక్కని చివరి పలుకులే ఈ కవితకి చివరి మజిలీ, దాన్ని చేరటానికే ఆ ముందు గమనం. ధన్యవాదాలు.

    ReplyDelete
  9. చిన్నీ, నాకు గుర్తున్నంత వరకు మీరు వ్యాఖ్యలో వెల్లువవటం ఇదే. మీ ముక్తసరి మురిపాలకి అలవాటు పడ్డ నాకు ఈ వరవడి కొంగ్రొత్తగావుంది. ఇలాగే మీరీవనాన పరవళ్ళు త్రొక్కాలి. నెనర్లు.

    ReplyDelete
  10. వర్మ, మొత్తానికి కవిసమ్మేళనాన్ని జ్ఞప్తికి తెచ్చారు, కాకపోతే నేను "జీ హుజూర్" అనాలా? :) థాంక్స్.

    ReplyDelete
  11. Oh! wonderful articulation. Finishing is excellent!

    ReplyDelete
  12. ఉష గారు, మీ కవిత కి ధీటు గా స్పందించ లేను. అలా అని చాలా బాగుంది అని ఒక్క మాట తో సరిపుచ్చలేను. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండీ మంచి మంచి కవిత లు రాసి.

    ReplyDelete
  13. అద్బుతంగా ఉంది

    ఎత్తుగడ కొనసాగింపు, ముగింపు చాలా చాలా గొప్పగా అమరాయి. a very very good poem.

    ReplyDelete
  14. Specially I congratulate for the flow and frequent of your writing

    keep it up!

    Best wishes

    ReplyDelete
  15. గిరీష్, మురళీ, ధన్యవాదాలండి. నా కవితల్లో ముగింపు నిజ స్పందన, దాన్ని చేరను సాగేవే ఎత్తుగడ, కొనసాగింపు. నెనర్లు.

    ReplyDelete
  16. వేణూ శ్రీకాంత్ , భలే మీరు మరీను. ఇక "మంచి" అన్నది కవితని స్వీకరిస్తున్న మీ మంచి మనసుకి, ఆ మనసులోని స్పందనకి చెందాల్సిన గౌరవం. నా కవిత అందుకున్న అర్హతాను. నెనర్లు.

    ReplyDelete
  17. బాబా గారు, నా దగ్గర ఇక మాటలేమీ మిగలలేదు. ఇతర బ్లాగుల్లో మీరు వ్రాసే విశ్లేషణని బట్టి మీరు నా కవితకింత సమీక్షనిచ్చారంటే అది నా భాగ్యం. ఈ మధ్య భావావేశం నా వశం కావటం లేదు, అది ఇలా వెల్లువౌతుంది. మీ దృష్టికి రావటం, మెప్పుదల పొందటం అన్నీ అనుకోని ఘటనలు. కృతజ్ఞతలు.

    ReplyDelete
  18. జాన్‌హైడ్ గారు, అనుభవశాలి అయిన మీరు నాపట్ల అటూవంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, నా కవితల ధారణని మెచ్చుకోవటం మీ ఆకాంక్షలు అందించటం నాకెంతో ముదావహం. ఇంత ప్రేరణ నాకు కలిగిస్తున్న తనకి, ఈ కవితాశక్తి నాకిచ్చిన ఆ దైవానికి, మీవంటి వారి అభిమానాన్ని అందుకున్న జన్మకి, మీకు అన్నిటికీ శతకోటి దండాలు.

    ReplyDelete
  19. జీవించడానికే ప్రేమిద్దాం
    ప్రేమించడానికే జీవిద్దాం
    ఈ మార్గానే ప్రయాణించాను....... చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి కవిత.

    ReplyDelete
  20. కారుణ్య, మరువపు వనాన మీ తొలి పలుకులకి ధన్యవాదాలు. నిజానికి ఏ అద్భుతం జరిగినా అది ప్రేమించే మనసు వలనో లేదా ప్రేమని అందుకున్న మనసు వలనోనే జరుగుతాయేమో! నాకు ప్రేమని పంచిన మనసుకి ఈ అభినందన చెందాలి. మీ స్పందనకి నెనర్లు. మీ బ్లాగు చూసాను. సమయాభావం వలన క్షుణ్ణంగా చదవలేదు. మళ్ళీ వస్తాను.

    ReplyDelete