Memories are arbitrary

లోక సంచారి ఒకరు
పరిమళరూపాన పూటకొక పూసత్రం లో
విడిది చేసి
వేకువఝాముకి పుప్పొడి కంబళి విసిరి కొట్టి
పయనమైనట్లుగా ఉంటుంది...
తాను తిరిగిన దారులన్నీ నాకెరుకనే!
గూడు కట్టని ఒక్కొక్క జాతి పిట్ట
కొమ్మ అంచునో, గుమ్మం మూలనో

నిదుర చేసి
పొద్దు పొడుపు వేళకి పాటతో చుట్టుముట్టి
బందీని చేస్తూంటాయి!
అంత్యాక్షరి ప్రాసలు కలుపుతూ నేనూ జతపడతా...
తలవాకిట నిలిచిపోతాను,
చుక్కలు పొదిగిన దుప్పటి కప్పుకుని
నేలని అదుముకుని
జీవన పరిమళమై తిరుగాడుతాను
కలల సానువుపై రాగమై ధ్వనిస్తాను.



కరుగుతున్న దృశ్యం

అంగుళాల చొప్పున పేరుకుని అడుగుల్లో ఎదిగాక 
ఆ మంచు గుట్టల మీద
ఆకతాయి గాలుల ఆటకాయతనం ముద్ర వేస్తుంది.
గాలికి కుంచె రూపు వస్తే, 
సృష్టిలో అద్వితీయమైన చిత్రలేఖన సృష్టి జరుగుతుంది.
ఊపిరి తీయనీయని బ్రతుకు నుంచి
త్రుంచి తెచ్చుకున్న ఓ గుప్పెడు క్షణాలు ఊదామా, 
ఇక ఆరీ ఆరని వైనాల ఆ చిత్రాల మీద గంపెడు ఊహలై నిశ్వసిస్తాయి...
ఎవరికి ఆ అందమైన గానం వినిపించాలో
తెలియక తడిబడిపోతాము, 
మరవరాని కాల గమనం అని మురిసిపోతూ...
పరకాయించి చూస్తే ఆ మంచులో
ఎన్నెన్నో లోతైన సంగతులు ఉన్నాయి!

తరువుకో ప్రణామం

నగరపు నడిబొడ్డున
నిలవనీయని /మనిషి/తనాన్ని
ఒప్పుకోని చెట్టు ఉంది
నిజానికి ఉంటుంటాయి బోలెడన్ని విడివిడిగా.

అడవిలో గుంపులుగా ఉంటాయోమో
వేరు వేరు కలుపుకుని
వెన్నుదన్నుతో ఎదుగుతుంటాయి.

ఇక్కడేమో-
ఇంటికొక ఒంటరి చెట్టు తప్పనిసరి
మీటలు నొక్కి విరిచిపడేసే
ఎందరెందరో యంత్రాల మరిడయ్యలు
చేతబడి చేస్తుంటారు.
బతుకులేని, చావలేని
మొండిమాను
ఎండుదనంతో నిండిపోయాక
ఆకృతులు చెక్కుతారు
‘అందమైన నగరం’ అని పేరు పెడతారు.

మరెందుకో..
గాలికీ, వానకీ అంత అక్కసు?
ఎడాపెడా వీస్తాయి,
లేరెమ్మలని, చిటాకులనీ చిద్రం చేసిపోతాయి
పాడుబెట్టిన గూటి నుంచి ఈక ఒకటి
నిశ్శబ్ద గానంతో రాలిపడుతుంది.

అంతలోనే..
ఎగురలేక ఆగే పిట్టలు,
మొదలున లేచే పిలకలు
ఎదగమని, ఎదురు నిలవమని చెప్పినట్లే
మొక్కవోని తెంపరి అవుతుంది ఆ చెట్టు
కొమ్మమీద కొమ్మతో తిరుగుబాటు చేస్తుంది
గరగరలాడే ఆకొకటి బాకా ఊదినట్లే తోస్తుంది.

విచ్చుకునే గుత్తులలో
ఆవురావురంటూ తుమ్మెదలు వచ్చి వాలతాయి
పరుచుకునే నీడలలో
రాలిపడే రేకుల జాజర పచ్చిపచ్చిగా పడుతుంది
నిలబడిన, నిలకడ గలిగిన చెట్టు
మనిషికి సవాల్ విసురుతుంది.

అక్కడక్కడ,
మనసున్న మనుషులూ ఉంటారు
చెట్టుని హత్తుకోవటానికి
ప్రాణిగా ఎంచటానికీ!

మూడు చెట్లు


అంగుళాలు, అడుగుల ప్రమాణంలో
నేను ఎదుగుతున్న దశలో, మా నాన్న
మూరెడు బారున్న ఓ వేపమొక్కని నాటారు
గుప్పెడు మట్టి చల్లిన ఊసు నాకెంతో గొప్ప ఈనాటికీనూ!

వసారా నిండా మనుషులు, మాటలు
పరుచుకుని ఉన్న సమయాల్లో
నేను, మొక్క ఏపుగా ఎదిగాము
మొక్క చెట్టు అయింది, నేను ఎదగటం నేర్చుకున్నాను.

చెట్టు నీడకి, నాన్న కాలక్షేపానికి లంకె పడింది,
వచ్చే పోయేవారి లెక్క తరిగిపోయింది, నాన్న నేను మిగిలాము.
చెట్టుకి పూలు, పళ్ళు, కాకులు, ఆకులు క్రమం తప్పని కృత్యం
నాలోనూ తను పెంచిన కలలు, కళలు, లోకాలు, ఆచరణలు విస్తరిస్తూ...

వేప పండు, నాన్న మాట ఒకటే రుచిగా ఉండేవి.. నాన్నని ఒక వృక్షం గా దర్శించాను
తన మందలింపు, చేదు వేపాకు రక్షలా నన్ను కమ్ముకునేది
పందుంపుల్ల వాడేవారున్నారు ఇంకా.. తరుచు కొమ్మల మీద కన్నేసి ఉంచుతూ.
నాన్న మాటలు నేనూ పంచుతూ ఉంటాను..తరిచి నా చేతల మీద మనసు పడ్డవారికి.

వసారాలో నేను ఒంటరిగా పుస్తకాలు, కాగితాలు
పరుచుకుని ఉండే సమయాల్లో
చెట్టు, గాలి సందడి చేస్తాయి
నాన్న ఈ నడుమే జీవితం చాలించారు, నాలో తిరిగి పెంచడం నేర్చుకున్నాను- మరో మహా వృక్షంగా...!