ఋతుభ్రమణంలో


లెక్కకి పాతిక వారాలు మా పూలసాగుకి-
ఈ యేటి మధుమాసపు వెచ్చనల్లో
మరోమారు ఉత్సాహపు పల్లవింపు
పడమర నేలలోనూ, నాలోనూ.

ఓ గ్రీష్మ సంధ్యాసమయాన పచ్చని మడుల్లో
లెక్క పెంచుతూ ఈ రెండు మొక్కలు.
కలుపుగా పెకిలించలేని నా తనం
వల్లమాలిన ప్రేమ ఉబికే ప్రతి వనమాలి వైనమే!

ఉదయారుణ కాంతిలో వాటినే చూసుకుంటాను
ఒకవైపు పసుపు పచ్చని పూలు
ఆ వంక చివురు మెత్తని మ్రోల
కలివిడిగా తిరుగుతూ గాలులు, నా మురిపాల వలెనే..

శరదృతువు రానున్న దండోరాతో
పెంచుకున్న పూరెక్కలు, వన్నె మారిన పండుటాకులు
కోలాటాలు కట్టి వీడు వదిలే వేళ
కలవరపాటుని కప్పిపుచ్చలేని నా కనులు, నేలలోని వేరులూ...

అయితేనేమి, శిశిరపు ఘడియని పక్కకి నెడుతూ
ముదురాకు కొమ్మలతో ఆ మొక్క,
మొగ్గ వెనుక మొగ్గగా పుష్పిస్తూ ఈ పూల తీగె
ఎవరివైతేనేమి ఎగురుతున్న ప్రకృతి బావుటాలు?

పదిలమైన గురుతుల దిగుబడి మోస్తూ
పదును తగ్గని పచ్చదనాలు మోస్తూ-
నేనూ,  నేలనంటిపెట్టుకున్న నా వలస మొక్కలు
పొగమంచు, లేతెండల పోరు చూస్తూనే ఉన్నామింకా...!

(కౌముది డిశంబర్ 2017 ప్రచురితం)