ఉదయాన్నే- ఒకానొక ఉద్భవం!

మేఘపు మెరుపు రూపు మారుతుంటేనే ఈ బింబపు ఆకృతి ఊహామాత్రం గా తోస్తుంది కదా!? ఇప్పుడు నేను మేఘాన్ని చూస్తున్నానా..భ్రమణం తో నా చూపు ఆవరణ మార్చే మౌనమూర్తి భూమి ని కాంచానా..నిశ్చలంగా నిలిచినా కర్మసాక్షిని దర్శిస్తున్నానా..ప్రతి ఉదయం లో నాలోని ఒక నేను ఉద్భవిస్తూ వస్తున్నానని మాత్రం తెలుసుకున్నాను...! 
(సప్త అశ్వాల సాక్షి గా కొన్ని ఉదయాల పయనాలు ఈ చిత్రమాల తో సమాప్తం, అందరికీ నెనర్లు!)







ఉదయాన్నే-7

తనకన్నా ముందుగా మరేవో జాడలు వెలికి వచ్చాక, తప్పదన్నట్లు సాగినంతనే మరి కొన్ని మాయమౌతాయి..ఉద్భవం ఉన్నచోట నిష్క్రమణ కూడా తావు చేసుకుంటూ ఉండదూ...మరి!



ఉదయాన్నే-6

ఊడల్లా నేలలోకిదిగుతుంటాయి కొన్ని వెలుగు ధారలు
ఒడుపుగా కొసలు ముడివేస్తూ ఊయలూగుతుంటుంది ఒంటరి గాలి
నీడలే ఇటుకలుగా కొమ్మకి కొమ్మకీ వంతెన వేస్తూ పనిచేసుకుంటూ పోతుంది పగటివేళ ...!





ఉదయాన్నే-5

నల్ల మబ్బులు రెక్కలు విప్పుకుని రివ్వు రివ్వున  ఎగిరిపోతాయి
అల్లరి గువ్వలు అమాంతం పట్టేసి రయ్యి రయ్యిన లాక్కుని వస్తాయి ...! 



ఉదయాన్నే-4

అదేవిటో పొడుస్తూ యే ఛాయలో ఉన్నాడో ఆలాపిస్తూ 'గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ' అంటూ అసలు కంటి ఆవరణకి వస్తూ ఏ రూపున ఉన్నాడో ఆ ఛాయలకి ఎవరూ పోరేమి!? అదేమో గానీ ఇదిగో అసలు పొద్దుగూకులా పూస్తూనే ఉండేటి పూవు!

ఉదయాన్నే-3


దొంగాటల, దోబూచుల మునిగి తేలుతూ ఉంటాడతను
తటాలున ఆకాశం దారి పరిచి చూపులకి జాడ తెలుపుతుంది..
దాగని ద్యుతులు వ్యక్తమయే వేళలో మదిలో కొత్త రంగు మిగిలిపోతుంది...!


ఉదయాన్నే-2

మంచు పరుచుకుని ఉన్నప్పుడు ఆకాశం రాత్రంతా తెల్లగా కనిపిస్తుంది, తెల్లారుతుండగా రంగుల కుంచె పని మొదలుపెడతాడు ఆదిత్యుడు...

ఉదయాన్నే -1

ఓ వెలుతురులో వన్నెలు మరింత ఒదిగి వేకువ పట్ల ఒక అణకువ ని మనసంతా వ్యాపించేలా చేస్తుంటే..ఇలా...!