తోటపనితో నాలో నేను-సమాప్తం!

ఇరుకుబాటలో ఇరుసులేని బండిలో కృషీవలుడు,
చెంత సోయాచిక్కుడు, మొక్కజొన్న విత్తుల మూటలు,
ఐదుమాసాల్లో అవి పండించును బంగారు పంటలు.
కాలినడకన ఎదురువస్తూ, ఏరువాకని తలపోస్తూ నేను.
చుట్టూరా విరగకాయనున్న పళ్ళతోటలు,
బళ్ళునిండే గుమ్మళ్ళ, ఖర్బూజాల తీగెల మడులు
ఆ పూలలో తల పెట్టుకుని ఎన్నో దుఃఖాలను జయించాను...
 తల్లితండ్రులు పెంచే తాత్కాలిక తోటలు- ఏడాదికొక యజమాని- మరొక రకపు పంట
 మా ఇండోర్ బంగారాలు
స్నేహ ఫార్మ్ యానిమల్స్ తో 
..ఇలాగ ఉండేవి నా అనుభవాలు ప్రతి వేసవిలోనూ. ఆ సమయం లో ఒక చక్కని వివరం చదివాను. 

మిడ్వెస్ట్ (షికాగో సమీప రాష్ట్రాల) కి చెందిన ఒక వ్యక్తి టెక్సాస్ నుంచి వెనక్కి వస్తూ పట్టుకువచ్చిన గుప్పెడు మెలాన్ విత్తనాలు (పుచ్చకాయల వంటివి), ఒక అర ఎకరం సాగుగా మొదలై వ్యాపారపంటగా మారి, అవి షికాగో చేర్చేందుకు రైలుమార్గం పడటం, రైలు వద్దకు రోడ్డు మార్గం, కాకా హోటళ్ళు, ఆ వర్తకం కొరకు కేంద్రాలు ఇలా ఇలా ఒక గుప్పెడు గింజలు 6 సంవత్సరాల్లో ఎలా ఈ ప్రాంతపు ఎకానమీ మీద ప్రభావం చూపిందో విపులంగా రాసిన ఒక వ్యాసం నన్నెంతో ప్రభావితం చేసింది. కుదిరినా కుదరకపోయినా ఇప్పటికి మాత్రం మన దేశానికి తిరిగి వచ్చాక మన భూమిలో ఒక చిన్న స్థాయి లో వ్యవసాయం కొద్దికాలం అయినా చేసి తీరాలన్న కల తోనే మాకు ఉండే 4 నెలల వేడిమి కాలం లో పెరటితోట పెంపకం చేసేదీను...!

అలాగే, ఇంటి వెనుక స్థలం లేనివారికి స్థానికి భూముల సొంతదారులు వేసవి పంటలకు చిన్న చిన్న భాగాలుగా విభజించిన నేల అద్దెకు ఇస్తారు. ఆపై, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములు కూడా కూరగాయలు, పూలు పంటలకు చాలా చిన్న మొత్తం లో రుసుము తీసుకుని ఇస్తారు. కొన్ని చోట్ల నీరు వారే ఇస్తారు, కొన్ని చోట్ల ఎవరికివారు తీసుకువెళ్లాలి. ఎక్కువగా గ్రీస్, ఐరిష్, ఇటాలియన్, భారతేతర ఆసియా దేశాల వారి తల్లితండ్రులు కనపడతారు ఆ పనులు చేస్తూ. వారి వెంట వారి సంతానం వస్తారు..ఏదో ఒక విజ్ఞానం అలా సులువుగా సాయంత్రపు వేళల్లో వాహ్యాళి కి వచ్చినవారికీ అందుతుంది. ఎందుకో మనవారి తల్లితండ్రులు మనవల వెంట పార్కుల్లో, గుళ్ళలో, కొట్లలో నా బోటి బోడమ్మ బోసి మెడని చూసి జాలిగా వెళ్తుంటారు (సంపాదన అంటే నగలు మొదటిమెట్టు అనే అపోహ తొలగని తరాల ప్రతినిధులు) ఆపై టీవీ షోస్ గురించి చెప్పుకోవటం వినపడుతుంది. నేను ఎక్కువగా విదేశీ వారితో తిరుగుతాను, ఆయా ప్రాంతాల సంస్కృతీ సాంప్రదాయం అవీ పుస్తకాలలో దొరకని నిధులు వారితో సన్నిహితంగా ఉంటె అందుతుంది. మనవారి పట్ల నాకు అవగాహన ఉంది, ఆరోపణ చెయ్యలేని అతి చిన్న జీవన పరిధినుంచి వచ్చేవారికి విశాల ప్రపంచం ఎన్ని ఇస్తున్నా ఎలా స్వీకరించాలో తెలియదనే నేనూ ఒక సానుభూతితో తొలగిపోతాను. ఇక, పిల్లలకి ఫార్మ్ కి తీసుకెళ్లి, కొన్ని పనులు నేర్పొచ్చు- కలుపు తీయటం, కాయలు కోయటం వంటివి తరుచుగా అమెరికన్ పిల్లలు చేస్తూ కనపడతారు. మన పిల్లకాయలు కాస్త జంతువుల వెంట పరుగులుపెట్టే పనుల్లో ఎదురౌతారు. నా పిల్లదీ అలా ఆడుకునే పెరిగింది...

మనవారిలో ఒక పట్టుదల ఉంటుంది- నయానో భయానో సాధిస్తారు కొన్ని ధ్యాస పెడితే- అటువంటిదే సన్నజాజి, విరజాజి, మల్లెల పెంపకం, ఇండోర్ మొక్కల్ని సాకటం. "మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో" అని పాడకున్నా ఈ చలిలో పసిపాపల్లా కాసుకొని ఆ పూలని పూయించి, నలుగురికీ పంచటం అనే సాహసం లో ఆరితేరుతారు. అటువంటి ఒక వ్యక్తినే నేను, ఆ పూలలో తలపెట్టుకుని ఎన్నో దుఃఖాలు జయించాను, ఎన్నెన్నో ఆనందాలు విరబూయించుకున్నాను..నిజానికి, ఎండు పూవు అనేది లేనేలేదని దాన్నిండా అనుభవాల సుగంధం అనుభూతి గా ఆస్వాదించినంత మేరా ఉందని తెలుసుకున్నాను. అవన్నీ తోటపని పోస్టులు రాయక మునుపు...

ఇప్పుడు ఒక పండిన ఫలం, కాసిన కాయ గుండెలో బళ్ళకొద్దీ గర్వాతిశయాన్ని నింపుతాయని గగుర్పాటు చెందాను. రాయమని తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు అడిగినప్పుడు నా మానసిక స్థితి, కాస్తగా ఉన్న ఒకానొక విషాదభరిత దుర్భలత పంచుకున్నప్పుడు "లేదు,మీకు చాలా రిలీఫ్ కలుగుతుంది.మీరెన్నో స్ధితులకు లోనౌతారు.అయినా సరే అదే మీకు రిలీఫ్!మీకు తోచిన విధంగా రాయండి." అన్నారు. ఆ మాటల్లోని నిగూఢత అర్థం అయింది. వారికి కృతజ్ఞతలతో ఇన్నాళ్లూ గత 11 భాగాలు చదువుతూ ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ నెనర్లు! ౩ దేశాల్లో దాదాపు పాతికేళ్ళ తోట పెంపకం నాదని ఇప్పుడు తృప్తిగా చెప్పుకుంటూ రాయాలంటే ఇంకా ఉన్నాయి కానీ వైవిధ్యం కొంత తగ్గవచ్చు అంతే కాక కొంత స్థానికత పట్ల దృష్టి పెట్టలేని, అవగాహన లేనివారికి నేను అందించే సమాచారం వినోదానికే కానీ విజ్ఞానం, విపులమైన అనుభవ సారం గా మిగలదు కనుక ఇంతటితో ఈ సిరీస్ ముగిస్తున్నాను. 

చివరిగా ఒకమాట: నేను ఈ విషయాలు వ్యాఖ్యల కోసం మాత్రం రాయలేదు. లబ్ది పొందాము అనేవారి ఒక్కమాట చాలు బదులుగా...!

(మా పాప రాసిన) ఆలాపన!

(NRI గా ఎదిగిన తను, పాటకి తనకి నడుమ అనుబంధాన్ని పూర్తిగా తనకి వచ్చిన తెలుగుతో అనుసంధానం చేస్తూ రాసుకుంది.. నేను కేవలం సరైన పర్యాయపదం, వ్యాకరణం సరిదిద్దాను)

వరాల వానగా వచ్చిందో గీతం-
మునుపెరగని ఆ పరిచయంలో
రేగిన వాంఛతో మొదలైయిందీ,
బంధం గట్టిపడింది.

గానంతో కీర్తి శిఖరాలు చేరే అభిమతం
ఉత్సాహపు వెల్లువైంది నాలో...
హత్తుకొని మత్తెంకించేసి, బానిసైన
నాతో రాగాలు కట్టించింది.

పాటలుగ మారిన ఈ పరిచయం
మళ్ళి మళ్ళి కరుణించి మరలివచ్చింది
మదిలో అవే పదాలు భాగమౌతుంటే
తనలో లీననం అయిపోయాను.

అవసరం లేదనిపించిన సంగతుల్లోనే
సారం వుందని తెలియని స్థితిలో
కరిగిపోయాను సరాగమై-
ఆవిర్భవించింది నా హృదయగానం
జనించింది నాకై నూతన గమ్యం...!

తోటపనితో నాలో నేను-11

"మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు... " అనే ఎత్తుగడతో ఒక శీతగానం రాసాను ఆ మధ్యన..

పాశ్చాత్యులకి నాలుగు ఋతువులు, అవి కూడా కవుల కల్పనలో చూడనక్కరలా; కంటికి స్పష్టంగా మనసుకి మరింత దిట్టంగా తెలిసే ఋతువుల నడుమ విభజన, వాటి రాకపోకలు వలననే ప్రకృతి తో ఇక్కడ మనిషికి మరింత అవినాభావ సంబంధం ఏర్పడుతుందని నా అనుభవరీత్యా చెప్పగలను. తోటపని బొత్తిగా కుంచించుకుపోయి ఉండేది ఈ శీతాకాలంలోనే..సుమారుగా మన ఋతువులకి వీటికీ అనుసంధానం ఇలా ఉంటుంది:
వింటర్: Dec-Mar శిశిర(చలిని పెంచే మంచువానలు)
స్ప్రింగ్: Mar-Jun వసంత (చివుర్లపై వానలు, పూత కాలం)
సమ్మర్: Jun-Sep గ్రీష్మ (నిండారు పూలపై వేసవి ఎండా వానలు, పళ్ళ వరద)
ఫాల్: Sep-Dec శరదృతువు హేమంత (ఆకులు రాలు కాలాన వర్ష పోకడ)


ఫాల్ లో కొన్ని చెట్లు, మొక్కలు వర్ణాలు మారిన ఆకులతో, మరి కొన్ని పచ్చనాకుల్నే అక్టోబరు, నవంబరు మాసాల్లో గాలివాన సమయాల్లో రాల్చేస్తాయి. డిశంబరునాటికి మోడులై శీతాకాలపు చిక్కని గాలికి కదలక మెదలక ధ్యానిస్తున్నట్లు అలా నిలిచుంటాయి. ఐసింగ్ రెయిన్ కానీ మంచు కాని కురిసి కప్పేస్తాయి..జనవరి ఫిభ్రవరి నెలల్లోలో తెల్లని పత్తి పూలు దాల్చినట్లో, స్ఫటికాల్లా మెరిసే ఐస్ అద్దకాలతోనో కనపడతాయి. అలా సాగిన కాలం ఏప్రిలు, మే నాటికి ఋతువు మారి వసంతునాగమనంతో లేలేత కిరణాలు మంచుని పారద్రోలాక, అంతదాకా చలికి జడిసి దాక్కున్న గాలి బయటకి వచ్చి తన వంతు ప్రభావం చూపుతుంది. పూమొగ్గల కాలమంతా ఆ గాలికి తలవొంచి చెట్లు, మొక్కలు ఎటు వీస్తే అటు వూగుతూ నాట్యాలు చేస్తాయి. జూలై, ఆగష్టు, సెప్టెంబరు మాసాల్లో మటుకు నిండుగా ఫల పుష్పాలతో గంభీరంగా మాకెదురు లేదన్నట్లు నిటారుగా నిలిచివుంటాయి.

Tree City USA అనే గుర్తింపు పొందిన ఊర్లలోనే నేను నివసించాను. లక్ష జనాభా ఉన్న మా ఊరిలో 1,10,000 చెట్లు ఉండేవి. ఆయా ఊరి ప్రభుత్వ నియమాలు, యాజమాన్య సంస్థల ప్రణాళికలను బట్టి ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు వేయాలి. ప్రాంగణం ని బట్టి రెండవ చెట్టు ఖర్చులో కొంత కౌంటీ వారు ఇస్తారు. రోడ్డు నుంచి 30-40 అడుగుల వెనక్కి ఇల్లు కట్టాలి. ఆ స్థలం లో గడ్డి పెంచి, ఇష్టానుసారం పూల మొక్కలవీ వేయాలి. గడ్డి సరిగ్గా కత్తిరించి ఉంచనట్లైతే జరిమానా ఉంటుంది. ఎండుటాకులు పోగేసి శుభ్రం చెయ్యాలి. ఇవి ఖచ్చితం గా పాటించాక..
ఇంటి వారగా వరసలో వేసిన ఎవర్ గ్రీన్స్/నిత్య పచ్చ కుదుర్లు ఉంటాయి (క్రిస్మస్ ట్రీ, బాక్స్ వుడ్ వంటివి), అలాగే పెరినియల్స్ గా పిలవబడే మొక్కలు ఏళ్ల తరబడి ఉంటాయి- వసంతం చివురించి, హేమంతం లో నేలమట్టం అయిపోతాయి. లేదా ఫాల్ లో నేలలో దుంపలు పెట్టి సరిగ్గా కప్పితే స్ప్రింగ్ లో చక్కగా మొలకెత్తుతాయి. వసంతం కొన్ని మట్టి నుంచి పూలతో లేస్తాయి; కొన్ని కొమ్మలు పువ్వులుగానే పరిచయం అవుతాయి. వేసవిలో మొలకెత్తి పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి. మొక్కల చుట్టూ కలుపు పెరగకుండా రంపపు చెక్కల పొడి కానీ రాళ్లు కానీ వేస్తారు. సెప్టెంబర్ అక్టోబర్ లో చలి తాకిడి లేకుండా మొక్కల్ని కప్పి ఉంచుతారు. నారు ఇంట్లో స్టారర్ కిట్స్ లో వేసి పెంచి బయట కి తెచ్చి మే నెలలో పాతుతాము. వేసవి అంతా చాలా పని ఉంటుంది. ఫాల్ లో ఇవన్నీ పెద్దా చిన్నా లేకుండా రంగులు మారిపోతాయి..వింటర్ నాటికే మాయమైపోతాయి- చలికి దాసోహమై లొంగిపోతాయ్ సమస్త జీవుల దేహాలు.

కలిపిన చిత్రం లో వేసవి నాటి రూపుతో కళకళ లాడే మా ఇల్లు. నాలుగు సీజన్స్ ని అద్దం పడుతూ ఇంటి ముందున్న చెట్ల పోకడ, మొక్కల మురిపాలు ఉన్నాయి. నేను చెప్పిన రాళ్లు చెక్క ఎలా పరిచిఉన్నాయో కూడా కనపడుతుంది.
0 ఇంటి ముందర పూల మళ్ళు , చెట్టు వేసవి నిండుదనం
1.1, 1.2 ఒకటే మొక్క స్ప్రింగ్ వేసవి ల మార్పు చూపుతుంది
2,3 స్ప్రింగ్ పూల కొమ్మలు
4,5 ఫాల్ లో రంగు మార్పు, రాలిన ఆకుల వన్నెలు
6.1, 6.2, 6.3, 6.4 నాలుగు ఋతువుల పట్టిక
7,8 పూలు పూసిన, మంచు పూలు చుట్టుకున్న చెట్ల తీరు

తోటపనితో నాలో నేను-10



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..మా పూలే పేర్చితీ ఉయ్యాలో
బొమ్మలు బొమ్మలు గుమ్మాడి..మా కాయే చెక్కీతి గుమ్మాడి
అని పాడేసుకునే అక్టోబర్ లోకి వెళ్ళేలోపుగా ఐదు నెలల ఆత్రం ఉంటుంది..
The love of gardening is a seed once sown that never dies -Gertrude Jekyll
(తోటపని పట్ల ప్రేమ అనేది ఒకసారి నాటుకున్నాక ఎప్పటికీ చనిపోదు – గర్ట్రూడ్ జాకేల్)

మే నెలాఖరులో వచ్చే “మెమోరియల్ డే” నాటికి ఇంటి లోపల వేసి ఉంచినదో, నర్సరీ లో తెచ్చి వేసేదో పెరటి తోట నాట్ల పని పూర్తవుతుంది. ఇంటి ముంగిట పూల మడులు కూడా సిద్దమైపోతాయి..ఇక, పసిబిడ్డ, పాడికుండలా ‘పెరటి తోట, లాన్ గడ్డి’ పెంపకం తో రేయిపొద్దుల లెక్క చెరిగిపోతుంది.. ఉదయానే నీరు పెట్టటం, సాయంత్రం తతిమా పనులు. ఒక పక్కన ఇంట్లో వంట, బిడ్డల పోషణ, ఆఫీసు వత్తిళ్ళు, వేసవి లో పిల్లల అదనపు వ్యాపకాలు ఆ పై ప్రియమైన ఈ పచ్చని బిడ్డల పెంపకం.
ఒక టమాట వంగడం పేరు “జూలై 4th” సరీగ్గా అలానే అమెరికా స్వాతంత్ర దినానికి కాసేస్తుంది. కానీ, బీర, సొర వంటివి మన వైపు రకాలు కనుక ఎండ కావాలి, కాపు పట్టటానికి సమయం కావాలి. అవి నిరాశని మిగిల్చేవి. క్రమేణా స్థానికులతో పరిచయాలు, సత్సంబంధాలు పెరిగాక ఇక్కడి వాతావరణానికి ఏవి ఎలా పెంచాలో తెలిసాక చాలానే పెంచాము. మనకి అక్కడ దొరకవు కనుక వాటి పేర్లు/చిత్రాలు కలపలేదు. బెండ కాయ కోయగానే అక్కడి ఆకు కూడా తీసేయాలి. దానివలన మొక్క తర్వాతి పిందె లేతాకులకి బలాన్ని ఇస్తుంది. ఈ చిట్కా ఎంత బాగా పనిచేసిందో, ఆ సలహా ఇచ్చిన అతనికి మా ఇంటివారమంతా రుణపడిపోయాము.
జుకినీ అనేది మన బీరకాయ లా తీపిగా ఉండే నీటి శాతం, పీచు ఉండే కూరగాయ. చాలా రకాలు ఉంటాయి, బాగా కాస్తాయి..కాయ కోయగానే అక్కడి ఆకు కూడా తీసేయాలి. కూరలకి, పచ్చళ్ళకి, బ్రెడ్ తయారీకి బాగుంటుంది. పూత చూడ్డానికి గుమ్మడి పూలలా ఉంటుంది. చిత్రం లో ఆ కుదురు కలిపాను. అలానే టమాటో ఎన్నో సైజుల్లో రంగుల్లో పండుతుంది. బుట్ట మిర్చి, కాప్సికం కలిపి ఓ పదిరకాలు వస్తాయి. ఇవన్నీ పెంచుతూనే చిక్కుడు, ముల్లంగి వంటి మన విత్తనాలూ నాటి అవీ పెంచాము.
అలా అలా “ఫాల్” అనే శరదృతువు, హేమంతం కలిసిన వాతావరణం నాటికి దసరా, దీపావళి నడుమ అమెరికన్ల గుమ్మళ్ళ పండగ, మన సంక్రాంతికి పంట ఇంటికి వచ్చేప్పుడు లా కొన్ని సంప్రదాయ వేడుకలు కలుస్తాయి. మొక్కజొన్న పంట కొసాక, గడ్డి బళ్ల మీద పిల్లల ఆటలు ఇలా చాలానే ఉంటాయి గుమ్మడి మన కారపు వంటతో పాటుగా, వీరి pie వంటి తీపి పదార్థాలు చేస్తాము ఆపై అందానికి చెక్కి దీపాలు ఉంచే ప్రమిద మొహం లా చెక్కే సాహసం చాలా పెద్దది, వేళ్ళు విరిగేలా చెయ్యాలి..ఇక, ఈ దేశాన melting pot/ అంతా సమ్మిళితమైన సంస్కృతీ సరదాలు అన్నాను కదా! బతుకమ్మ నేనూ చేస్తాను; ఎవరి గార్డెన్ పూలు వారివే, అమెరికన్లూ ఆనందం గా కోసుకోనిస్తారు కొన్ని షరతులతో..అటొక కాలు ఇటొక కాలుగా అన్నీ చేసేసుకుని చూసేసరికి మొక్కలన్నీ తలవాల్చేస్తాయి..బాధ పడుతూనే పీకి, మడులు శుభ్రం చేసుకుని సెలవు చెప్పి ఇంట్లోకి వచ్చి పడతాము, ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కి తోడుగా కొన్ని కుండీలలోకి మార్చిన బయటి మొక్కలు వచ్చి చేరతాయి..తిరిగి ఇంటి తోట పనులు సిద్దం!

స్మరిస్తే..స్ఫురిస్తే...!

ఈసరికే
ఇంకొన్ని రంగులు
కలగాపులగం చేస్తూ
పోతుంటాయా అల్లరి మేఘాలు
నన్నో, 

నా ఊహలనో అందబుచ్చుకుని
నువ్వు సృజించే
వర్ణాల వలెనే..
ఒక్కసారిగా

ఎన్నో చుక్కలు హత్తుకున్న
ఆకాశం
సిగ్గుగా చీకటిలోకి
తప్పుకుంటుంది,
మెత్తగా వత్తిగిల్లిన

నా తనువులో, 
కనులు విప్పని చూపులలో
నీ జాడ
మెరుపు నింపినట్లే...!