తోటపనితో నాలో నేను-9

ఆ మధ్య మా అబ్బాయ్ ఒక మాట అన్నాడు "అమ్మా! నిన్ను గనక బార్బిక్యూ (కుమ్ములో కాల్చటం) చేస్తే ప్రపంచంలో వంటకాలు అన్నిటికన్నా రుచికరంగా ఉంటావ్," అని.. అంటే వాడు నరమాంస భక్షకుడు అని కాదు అర్థం, అదీ నన్ను గూర్చిన ప్రశంసల్లో భాగం! 


నేను ఆకుకూరలు మెండుగా, తాజా కూరగాయలు ఇంకాస్త నిండుగా కూర్చి వంటలు చేస్తాను కనుక. నా ఆరోగ్యం సమస్తం శాకాహారం మీదుగానే ఉందని చెప్పలేను ఎందుకంటే నేను ovo-lacto vegetarian ని. So used to eat eggs for some time now stopped and take milk products. Rest of my family eat non veg predominantly...

సరే! అసలు ఇవాళ మనం మాట్లాడుకునేది; అన్నప్రాశన నాడు ఆవకాయ కాదు గానీ ఆకుకూర మాత్రం రుచి చూపించి ఉంటారు, అందుకు నాకు తగని మక్కువ, నేను పుట్టింటికి వెళ్తే మా వదిన అనే మాటలు మచ్చుక్కి "నీకు నీసు పడదు, నువ్వు వచ్చినపుడు మా వంటింటి నాచు వాసన నాకు పడదు." :) ఆకుకూరలకి తన పర్యాయపదం - నాచు.

ఎందుకో చిన్ననాటి జీవితం నుంచి మరువలేని చిత్రం కూరలమ్మి కేక "తోటకు..రా పాలకు..రా చుక్కకూ..ర (అలా మొదలై వేగం పుంజుకుని) బచ్చలికూర గోంగూర...కొత్తిమీర కర్వేపాకూ" కొత్తల్లో తోటకు రా అనే అర్థం చేసుకునేదాన్ని నిజానికి.. ఆ తర్వాత ఆ పేరు "తోటకూర" "పాలకూర" పేర్లు ఎలా వచ్చాయి; బచ్చలి చుక్క నామధేయాలకి మూలం ఏమిటి అని వండిన ఆకుకూరని బట్టి తెగ శోధన చేసేదాన్ని. మా ఇంట్లో మధ్యాహ్న భోజనం లో ఆకుకూర పప్పు తప్పనిసరి (యిప్పటికీ చాలా వరకు ఉంటుంది). అదీకాక గోంగూర, కొత్తిమీర, కర్వేపాకూ నిలవ ఉండే పచ్చళ్లుగా, కర్వేపాకు కారం గా తయారుచేస్తారు. తోటకూర లేత కాడలు పాలుకలిపి వండిన కూర, ముదిరాక స్తంభాలు అనే కాండం తో దప్పళం చవులూరించే రుచులు. వేడన్నం వెన్నపూస/తాజా నెయ్యి అనే మాధ్యమానికి ఘుమఘుమ రావాలంటే రోటి పచ్చళ్ళు అందులో అగ్రగామి గోంగూర; అగ్రశ్రేణి వంటలు ఏవీ ఆకుకూర పప్పుకి సాటిరావు. కాదన్నవారు ఇక్కడితో చదవటం ఆపేసి పోండి ;) లేదా నా ఆగ్రహానికి శాపానికి గురౌదురుగాక! ;) పోగా పోగా మెంతికూర, గంగవాయలకూర, పొన్నగంటికూర, పుదీనా, సిలోన్ బచ్చలి కలుస్తూ వచ్చాయి అమ్మ వంటల్లోకి. అలా పాతికేళ్ల క్రితం వరకు ఓ 10 రకాలు తినటమే గొప్పగా ఘనమైన ఆకుకూరల గంప మనది అనుకునేదాన్ని.

తీరా సిడ్నీ వెళ్ళాక అంతవరకూ మేము ఆచరించిన ఒక నిత్యవ్రతానికి, ప్రతి శనివారం గోంగూర వండటం అనే సంప్రదాయానికి అడ్డుకట్ట పడింది. ఒక 3 నెలలు సమీపాన ఉండే లెబనీస్, టర్కిష్ కొట్లలో వెతికి వెతికి వేసారాక ఎవరో చెప్తే ఒక ఫిజీ ఇండియన్ షాప్ కి వెళ్ళా- ఇక సరి అక్కడి ప్రహసనమే ఒక కథాసరిత్సాగరం సుమీ! మొత్తానికి కట్టా భాజీ అనాలి అనీ, కట్టాభాజీ కూడా కట్ట ల్లా దొరకదు, డాలర్ కి 3 తప్పితే 4 కొమ్మలు మాత్రమే ఇస్తాడు అనిన్నూను అర్థం అయింది. ఆ మాటకొస్తే చుక్కకూర ని కూడా అదే అంటారు తప్పితే అది అమ్మకానికి దొరకదు. ఇప్పటికీ మన ప్రాంతపు ఆకుకూర తూకానికే కొనాలి అమెరికాలో నేనున్న ఊరులో. మరీ ప్రియంగా దొరికే ఆకులకి ప్రత్యామ్నాయంగా (ఈ మాట ఎందరికి తెలుసో కానీ నా కీబోర్డ్ కి నేర్పటానికి ఒక అరనిమిషం పెట్టుబడి!) మాకన్నా ప్రవాసం లోకి చేరిన ఆద్యులు కొన్ని విదేశీ ఆకుల వంటలు నేర్చి వెనుగ్గా వెళ్లిన మాబోటివారలకి నేర్పారు. మీకు సరదాకి కొన్ని పేర్లు ముచ్చటగా- బోక్ చోయ్, రుబార్బ్, రపిని, కేల్, చార్డ్, సొరెల్... ఆపై, కొన్ని పచ్చివే నవలటం తప్పలా లెటూస్, సెలెరీ, పార్సెలీ వంటివి. ఇక్కడొక పాతికేళ్ల పూర్వం జరిగిన కథ కానీ కథ చెప్తానేం (పాపం! మరి కష్టపడి చదువుతున్నారు కదా!?)

మా బంధువుల బాబు, మూడు నాలుగేళ్ళ వయసు అప్పటికి, ఇండియాకి వచ్చాడు; ఒక విందు భోజనం లో నా పక్కన కూర్చోబెట్టారు వాడి అమెరికా భాష+యాస అర్థం కాక..అరిటాకులు పరుచుకుంటూ ఒకరు, నీరు జల్లుతూ మరొకరు వేగంగా వచ్చిపోయారు. నేను ఆకు శుభ్రం చేసుకుని, తతిమా వారు ఎక్కడ చికన్ ఫిష్ దబదబా వడ్డించేస్తారో అని తదేకధ్యాసతో నా విస్తరి మాత్రమే చూస్తూ, బజ్జీలు, పులిహోర, స్వీట్ దబాయించి మరీ అదనంగా వేయించుకుంటూ ఉన్నాను.. "eewww! yukky, it tastes disgusting, how do you eat it?" (ఛీ! ఛండాలంగా ఉంది, ఎలా తింటారు మీరు? అనే అర్థం వచ్చేలా అడిగాడు) వార్నీ ఇన్ని రుచులని వాడలా తీసి పారేస్తాడా అని చూద్దును కదా.. వాడు అరిటాకు ముక్క తుంపి అందులో అన్నం, కూరలవీ చుట్టుకుని కిళ్ళీలా నవులుతూ ఉన్నాడు.. తెగ నవ్వేసుకుని ఆపైన ఒక అరగంట వాడికి అలా తినక్కరలేదు, వేడి అన్నం తగిలితే వచ్చే పోషకాలు చాలు ఆకు నుంచి అన్నీ అందుతాయి, ఇతర కూరగాయలు, ఆకుకూరలు మనకి ప్రధాన పీచ పదార్థాలు అని చెప్పానన్నమాట!

సగం కూరల ఖర్చు ఆకుకూరకి పెట్టలేని పరిస్థితిలో బిల్ అనే ఆయన గోంగూర పళ్లకోసం పెంచుతాడు అని తెలిసింది, ఒకట్రెండు సార్లు ఆయన ఇచ్చిన తాజా ఆకుతో పండగే పండగ. ఇక ఇలా లాభం లేదని చెప్పి కొద్దికొద్దిగా పెంచటం మొదలుపెట్టాను.. అమెరికా మీదుగా కెనడా వెళ్లి తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న తెలిసినవారు "మాకేం గిఫ్ట్స్ వద్దు, మీ గోంగూర నాలుగాకులు ఇవ్వండి చాలు, మా చేత్తో కోసే భాగ్యం కలిగించండి అదే పదివేలు," అంటూ తెల్ల రకం, ఎర్ర రకం ఓ పెద్ద గిన్నెడు కోసుకుని, నూనెలో మగ్గబెట్టుకుని వెంట తీసుకెళ్తుంటే మోతుబరి రైతుల కుప్పం నుంచి ధాన్యం కొలిపించి ఇచ్చిననాటి ఆనందం పొందాను. ఇక ఆ ఊపుతో అన్ని ఆకుకూరల విత్తనాలు మంచి రైతుబజారు నుంచి తెచ్చి మడులు కట్టి పెంచాను. కాకపొతే ఒక ఢక్కా మొక్కీ తిన్నాను. ఏ విధమ్మున ఆ దెబ్బ తిన్నాను అనంటే-
మళ్ళీ ఎండా ఉండదు, ఓ పదిమందికి పంచుదాములే అనిచెప్పి ఒక ఏడాది ముందుగా మడి అంతా పెరుగుతోటకూర చల్లేసా.. ఏపుగా ఎదిగిన ఆకు ఒక వారం ఫరవాలా, ఆ తర్వాత అదుపు చేయటం నాకు అలవి కాలేదు. ఎందరికని వండిన కూర, తెంపి బాగు చేసిన ఆకు పంచగలను, నేను మాత్రం ఒక్క చేత్తో? ఎవరికి ఫోన్ చేసినా "ఏమనుకోకుండా తెచ్చి ఇస్తారా?" అని గారాలు. 'ఛీ నీ..' అనే నిషిద్ధ పదాలతో తిట్టుకుని, మనశ్శాంతికి నిరోష్ఠ రాగం తో స్వకృతి రాసి పాడుకుని, ఇల్లు శుభ్రం చెయ్యటానికి వచ్చే చైనీస్ భార్యాభర్తలకి సైగలతో అడిగా 'కాస్త పీకుదాము,' రండి అని ("నీకు నా భాష రాదు, నాకూ నీ భాష రాదు, ఇద్దరం అమెరికాలో ఎదురుపడ్డాం," అనే పాట తప్పదు పాడితీరాలి వారికి, గార్డెన్ యార్డ్ కలుపు తీసి, గడ్డి కోసే మెక్సికన్ అతనితోనూ..సైగలతో సంభాషణ కొనసాగించే ముందు) తరుచుగా వాళ్ళు వచ్చే టైం కి నేను నాట్యం చేస్తుంటాను కనుక నా సైగలు వాడికి నా నాట్యం బాగుందా అని అడిగినట్లు, అప్పటికి యజమాని కనుక అతను నేను చాలా బాగా dance చేసాను అని సైగ చేస్తుంటే (అదీ వాడూ నన్ను అనుకరిస్తూ గెంతుతూ డాన్స్ చేస్తూ :)) 'ఓ అలాగా సరే' అనుకుంటూ తలపట్టుకుని వాడి సంగతి పక్కన పెట్టి, మెక్సికన్ వాడికి కాస్త గోడు వెళ్లబోసుకుంటే గంటకి $15 చొప్పున వేతనం పుచ్చుకుని, రెండు గంటలు పీకిన తోటకూర స్తంభాలు మళ్ళీ yard waste bags లోకి ఎత్తి నడుములు భుజాలు విరిగేలా మోసాక నిజంగానే కల్లంలో బస్తాలు మోసే రైతన్నలు ప్రత్యక్షదైవాల్లా కనపట్టమే కాదు, కర్షక/శ్రామిక కృషి పట్ల అవగాహన/సోదరభావం మరింత పెరిగింది. కొనాల్సిన ఆకుకూరని పెంచి డబ్బు కట్టి పీకి పారేయటం ఎంత క్షమించరాని నేరం కారణం ఏదైనాగాని!

ఇప్పుడు ఎలా వంతులుగా మడులు కట్టి వెయ్యాలి, కలుపు తీయాలి, మడి లో ముందు ఏది వస్తుంది ఏ ఆకుకి ఎంత మడి అవసరం అన్నీ తెలిసిపోయాయి. మట్టి ఎరువు ఏ పాళ్ళలో కలపాలి తెలిసింది కానీ ఏప్రిల్ లో సోరెల్ చిగర్చగానే కలుపుమొక్కలు తెగ పెరుగుతాయి. వాటి కబంధహస్తాల పట్టు నుంచి నేలని విడిపించి, ఆకుకూరకి స్వేచ్ఛగా యథేచ్ఛగా పెరిగే అనుకూలత కల్పించటం అంటే ఇక జిమ్ మాని ఈ నాట్లు, కోతలు పనిలో నిష్ణాత పెంపొందించుకుంటే చాలు..వసంతం, వర్ష ఋతువు, హేమంతం, శరదృతువు లో ఆకుకూరకి సరైన వాతావరణ స్థితి ఉంటుంది. వేసవి కి త్వరగా పూత వచ్చేస్తుంది, కలుపు పూలు చుక్కకూర పూలు చూస్తూ గంటలు గడిపేయొచ్చు...అలా ఎన్నోవరసల స్వానుభవంతో నేర్చిన మడిమాలి తనం తో ఎందరికో బడి లేకుండానే పాఠాలు నేర్పాను. పచ్చళ్ళు చేసి ఎంచక్కా తిన్నాము కూడా! ఇక కర్వేపాకు చెట్టు ఉండటం ఇంట్లో కల్పవృక్షం ఉన్నట్లే! ఒక రెబ్బ డాలర్ కి కొనేవారికి నాలుగు రెమ్మలు విరిచి ఇస్తే మన పాదాల మీద పడినంత పనిచేస్తారు :) అంత కాదు గానీ నిలువెత్తు చెట్లు రెండు పెంచినందుకు నాకు మాత్రం స్వర్ణ పతాకం ఇవ్వాలి మీరంతా...!!! ఇక్కడ కలిపిన చిత్రంలో నన్ను తంటాలు పెట్టిన తోటకూర మడి, తొలినాళ్ళ మొక్కల జాడలు ఉన్నాయి (కలుపు కూడా!) ఎన్ని ముద్దలు తిన్నా ఆకుకూర పప్పు, గోంగూర పచ్చడి+నెయ్యి+పచ్చి ఉల్లిపాయ నంజుకుననిదే సంపూర్ణం కాదు అని మరవకండి!

ఇక ఎవరికీ తోచిన పాట వారు పాడుకోండి, లేదా పాడించుకోండి:
1. గో గో గోంగూర..
2. గోంగూర తోట కాడ కాపు కాసా
3. ఆవకాయ మన అందరిదీ గోంగూర పచ్చడీ మనదేలే

తోటపనితో నాలో నేను-8

“గులాబీల తావులీనే కులాసాల జీవితాల
విలాసాలివే, వికాసాలివే” - సముద్రాల రాఘవాచార్యులు





గులాబీ తో ఎవరెవరికి ఎలాటి అనుబంధమో, అదెంత మధురభావనయో నాకైతే తెలియదు కానీ, పిన్న వయస్సులో బార్టర్ పద్దతి నేను ఆచరణ లో పెట్టగలిగాను అనంటే అందుకు మాత్రం ఈ పూలే కారణం.. ఆపై, పదేళ్ళ ప్రాయంలో ఇంటి తోట నా ఆజమాయిషీకి రావటం తో తొలివిడత అనుభవాల్లో సింహభాగం ఈ పూలమొక్కల పెంపకం అయింది..మరో దశాబ్దం దాటేసరికి కలాం గారి చలువతో నేను రక్షణ శాఖలో శాస్త్రవేత్తగా పనిచేసిన సమయాన నాదైన సొంత తోట పెంచటంలో వైవిధ్యం ఉన్నా రోజా పూయని రోజు గడవలేదు అప్పట్లో... ముచ్చటగా మూడవసారి అమెరికా గడ్డ మీదే తత్త్వ విచారణ/జీవన సంఘర్షణ కి గులాబీ మొక్క జీవితమే మూలకారణం అయింది.
4వ తరగతి సెలవుల్లో నాన్నగారికి ఉద్యోగరీత్యా బదిలీ కారణంగా హైదరాబాద్ తరలివెళ్ళాము. అప్పటి వరకు విశాలమైన ప్రభుత్వ నివాసాలలో గడిపిన మాకు ఆ పట్టణవాసం, అద్దె ఇంటి ఆంక్షల ఇబ్బందితో పాటుగా ఇంటి చుట్టూ కాంక్రీట్ నేల వలన సొంత మొక్క అనేది లేనితనం/లేమితనం తెలిసి వచ్చింది. అప్పుడు పరిచయం రేవతి; తను నాకన్నా రెండేళ్ళు పెద్దది, కానీ, కలిసి బడికి వెళ్ళటం వలన కుదిరిన స్నేహం ఇంకా గట్టిపడటానికి కారణం వాళ్ళ అమ్మగారు శ్రద్దగా పెంచే హైబ్రిడ్ గులాబీలు. ఎలాగా మొదలైందో- నా మూడుగిన్నెల లంచ్ కారియర్ లో అడుగున కూరన్నం, మధ్యన పెరుగన్నం, పైన ఉండే చివరి గిన్నెలో అమ్మ చేసిన స్వీట్ ఉంటాయి అనీ, అవి చాలా రుచిగా ఉంటాయనీ తనకి తెలిసి వాటిని నా నుండి సంపాదించే- యుక్తితో రేవతి మా మధ్య బార్టర్ పద్దతి ప్రవేశపెట్టింది. తనకి స్వీట్ ఇవ్వటం నేను రెండు గులాబీలు తీసుకోవటం ఒకటి నాతల్లోకి ఒకటి నోట్లోకి (బహుశా అదేనేమో సలాడ్స్ తినటానికి నాందీ). పాపం! అమ్మ ఎంత కష్టపడి చేసేవోరో గానీ నేను సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ అడిగి తింటుంటే మధ్యాహ్నం తిన్నావుగా అని ఒక్కసారీ గద్దించి అడగకపోయేసరికి నాకు గులాబీల గిట్టుబాటు బానే సాగింది. కానీ, నా మొక్కలు నేనే పెంచి పూలు పూయించాలి అని పట్టుదల పెరిగింది సుమా!

ఇంతలో మాకు నాగార్జునసాగర్ జీవితం అనే మహర్దశ పట్టింది, ఆ తరువాతి పదేళ్ళు మా peon నరసింహులు driver చంద్రయ్య నాన్నగారికన్నా నాకే report చేసి పని చేసారని నేనే ఒప్పుకుంటా! “అమ్మా, పాప! ఏడ పెడతావ్, దినానికొక గల్లీ కి పోతవ్, మన యింట్ల లేని రకం ఇంకేడా బతకనీవా?” అని గునుస్తూనే పాపం నేను చెప్పిన మొక్కలన్నీ పోగేసుకువచ్చేవాడు. ఎవరిన్ట్లోనైనా నా దగ్గర లేనిది ఉంటే తెచ్చి వేసేవరకూ ఊరుకోక వేసిన మొక్కలలో గులాబీ రంగు గులాబీ కుదురు నా ప్రియాతిప్రియమైన నేస్తం! చంద్రయ్య జీప్ ఎక్కించుకుని మరీ మరి కొన్ని సందులు తిప్పి మొక్కల సర్వేకి సాయం చేసేవాడు.

నా విద్యాభ్యాసం ముగిసి డిఫెన్స్ లాబ్స్ లో Scientist గా తొలి ఉద్యోగం; మాకు/ Gazetted ranks వారికి అప్పట్లో ప్రధాన బాధ్యతలతో పాటుగా, non-Gazetted వారికి salary disbursement వంటివి ఉండేవి..అలా కృష్ణ నాకు పరిచయం అయ్యాడు. తెలంగాణా ప్రాంతపు సన్నకారు రైతు కుటుంబం; రాబడి లేని సాగు కట్టిపెట్టి వలస వచ్చిన వాడు కానీ చాలా విషయాలు తెలుసు తనకి. Helping hand పని (files ఇచ్చిరావటం వంటివి) చేసేవాడు.
నాకు కుండీలలో ఒక 40 వరకు హైబ్రిడ్ గులాబీ మొక్కలు ఉండేవి. మరో పాతిక నేలలో వివిధ రకాలు, ఇంకో పాతిక క్రోటన్స్ ఉండేవి. అప్పుడప్పుడు వచ్చి చూసి మా common తోటమాలి నారాయణ పట్టించుకోని విషయాలు తను పూర్తి చేసేవాడు. ఆ క్రమంలో చెప్పాడు “గుర్రం ఎరువు” వేస్తే గులాబీకి మంచి ఎదుగుదల వచ్చి, పెద్ద పూలు వస్తాయని. సరే, ఐదేళ్ళు అలా గడిచాక నేను ప్రవాసం తీసుకువెళ్ళబడ్డాను, నేను అయిష్టంగా వెళ్ళిన కారణంగా ఎవరికీ ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాను. మొదటిసారి వెనక్కి వచ్చినప్పుడు కొన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోటానికి lab కి వెళ్లాను. కాసేపటికి రెండు బిల్డింగ్స్ మధ్య నడుస్తున్న నాకు ఎవరో పిలిచినట్లైంది..వెనక్కి చూస్తే కృష్ణ గబగబా నా దగ్గరకి వస్తూ
(ఇక్కడ నాకు ఆ మాండలీకం పెద్దగా రాదు కానీ తనెలా మాట్లాడాడో అలానే రాస్తే ఇప్పుడున్న nostalgia కాస్త తీరుతుందని)

కృ: ఏడకి బోయ్నావ్ మేడం? మంచిగున్నవా?
నే: ఏదోలే ఎక్కడో దూరానికిలే.. ఎలా ఉన్నావ్?
కృ: గుర్రం లద్దె పట్కరా అంటివి. మంచిగ పూయాల్నంటే అసుంటి ఎరువు ఎయ్యాల్న అన్జేప్పలే..
నే: అవును అన్నావ్, ఇప్పుడు కుదరదులే
కృ: ఎప్పటి సంది జూస్తున్నా.. ఎవులూ జెప్పలే!? రేపు తేవాల్నా
నే: ఏంటి రెండేళ్లుగా గుర్తు పెట్టుకున్నావా? అయినా వద్దు ఇంక
కృ: ఏం అట్లంటవ్, ఏమ్గాదు. మంచిగ కట్టి ఇస్తా.. మీ ఊర్కి తీసకపో
నే: దూరం కృష్ణా! పట్టుకెల్లకూడదు
కృ: యాడనో జెప్పు.. పద్దినాల్లో వస్త... (అలా సాగింది తన మాట)


నేను వెళ్ళిన దేశాంతరం కి తనూ విమానం లో మూట గట్టిన ఎరువుతో వస్తానని అభిమానం గా చెప్పించిన కృష్ణ అమాయకత్వం ఇప్పటికీ ఇంకా ఎప్పుడు గులాబీ మొక్క మొదల్లోకి చూసినా ఒక జీవనసారం లా తోస్తుంది.


సరే, మరొక విడత గులాబీ అమెరికాలో పెంచినప్పుడు గులాబీ పళ్ళు గా కూడా టీ తయారీ వాడకంలోకి ప్రవేశించింది, రేకులు అమెరికా సాంప్రదాయంలో ఇంకా విస్తారంగా వాడతారు, రేకులతో చేసిన Gulkandi ఉత్తరాదివారు మక్కువగా తింటారని ఇలా అమితమైన గులాబీ ఉపయోగాలు దృష్టిలోకి వచ్చాయి. మాది lake front ఇల్లు. ఆ చెరువు మనిషి తవ్వించినది కనుక ఆ 30 అడుగుల లోతైన సరస్సు తయారుకావటానికి తవ్విపోసిన బంక మన్ను వలన మా ఇంటి చుట్టూ నేల చాలా గట్టిగా ఉండేది. గులాబీ తరుచుగా చనిపోయేది. ముమ్మారు వరసగా మొక్క చనిపోయాక, సంరక్షణలో అదనపు జాగ్రత్తలకై curator ని అడిగినప్పుడు మేము ఒక రెండు మూడు అడుగుల లోతు వరకు తవ్వించి వేస్తున్న గుల్ల మట్టి వలన చక చకా పెరిగిన మొక్క వేర్లు, సరీగ్గా గట్టి మట్టి ని తొలుచుకుని లోపలికి చొచ్చుకుపోయే సమయానికి ఋతు మార్పు, అత్యంత శీతల వాతావరణం రావటం వలన వేర్లు గుట్టగా పడిపోయి తిప్పుకోలేక తిరిగి వసంతంలో చివురించకుండా చీకిపోయి చనిపోతూ ఉందని చెప్పాడు. ఇక్కడ ఏప్రిల్-అక్టోబర్ వరకే మొక్క పచ్చనాకులు, రంగురంగు పూలు, తర్వాత అంతా మోడు గా ఉంటుంది.. సెప్టెంబర్ లో కొమ్మలు కత్తిరించి, మొదల్లో కంపాస్ట్ వేసి వదిలితే తర్వాత ఆర్నెల్లకి ఏపుగా కొమ్మలేసి పెరుగుతాయి. అతను చెప్పిన మాట ఇది “గట్టి నేలలోనే పాతండి; పెరగటానికి ఎండ ఉండే స్థలం చూడండి; నీరు ఎరువు ఇవ్వండి.. ఊరికే పురుగుల మందు వెయ్యకండి.. వేర్లు ఘర్షణ తో పైనుంచి లోనికి ఎదగటం నేర్చితే శీతాకాలంలో లోలోపలికి నిదానం గా పెరుగుతూ జీవంతో ఉంటాయి. వాటి ఉనికి అవి చూసుకోవాలి. మనిషి చేసేదే మీరు చెయ్యాలి” అక్కడితో ఆ సూత్రం ప్రకారం చేస్తే చాలానే పూలు పూసింది మొక్క. ఎన్నెన్నో విధాలుగా, ఎన్నో వేడుకల్లో ఆ పూలూ పాలు పంచుకున్నాయి!!!

అదే సూత్రాన్ని దైనందిన జీవితానికి, పిల్లల పెంపకానికి, with aid of metaphysics/మనలోని ఆధిభౌతిక శాస్త్రం, ఆధ్యాత్మిక విద్య, తత్వజ్ఞానం లా వృద్దికి కూడా వాడవచ్చు కదా?
ఆ పచ్చని కొమ్మనున్న ఈ నాలుగు సుమాల సంకేతాలు;
పూత ప్రాయం దాటని తల్లి కొమ్మ కి దశల లెక్కెందుకు! కాకుంటే,
పూట లోన రాలు పూవుకి దశలవారీ జీవితం తప్పుతుందా మరి?
మనిషి జీవితదశ కి ఆ ప్రాయపు స్వభావానికి యేదో సాపేక్షత ఉన్నట్లుగా-
అదేమి చిత్రమో ఓ చిరుమొగ్గ ఆకుల్లో దాగి, విచ్చుకుంటున్న పూవు ధిక్కారంతో, విరిసిన పుష్పం అదొక ఒద్దికతో, చివరిగా రాలనున్న దశలో కడసారి అందం విరజిమ్ముతూ ఒక ఉన్నతమైన ఆత్మ తత్త్వాన్ని, తనువు ని గౌరవిస్తున్నట్లుగా...


అలాగే, These savoring and shattering bugs on the petals of that sweet tender rose are alike human devouring the nature... అనిపిస్తున్నా చిన్న బీటిల్స్ పురుగులు కూడా అందంగానే ఉంటాయి రేకుల మీద రెక్కలుగా..

ఒక ఏడాది మాత్రమే బ్రతికే మొక్కల్ని “annuals” అంటారు, అలాకాక చలికి వానకి మంచుకి, సుడిగాలికి తట్టుకుని పోరాడి బ్రతికేవి “perennials” వాటిలో గులాబీ, మందార వంటివి కూడా భాగమే పెద్ద పెద్ద చెట్లతో సమానం గా ఏళ్ళ తరబడి బ్రతికే hardy plants గా పేరుబడి. ఇవాళ ఇంకాచెప్పాలంటే ఇప్పుడు -8 డిగ్రీల 31km/h గాలులతో నేను ఇంట్లోనే వణికిపోతున్నాను..ఎన్నో మొక్కలు రానున్న వసంతం వరకు అలా సంఘర్షిస్తూ జీవిస్తాయి పోరాట పటిమతో -40 డిగ్రీల వరకు పడిపోయే చలిలో...

*****
నాదొక పాత అక్షర మాలతో ముగిస్తూ...


ముద్దులొలికే గులాబీకా అందం ఉందంటే
ముళ్ళకొమ్మ శిలువను ధరించినందుకే కదా?
సీతాకోకచిలుక అతిశయమంతా,
గొంగళి ఛీత్కారాలు భరించి తన రూపు మార్చుకున్నందుకే కాదా?
.
.
అనుభూతికి అందని అసలు అందం,
అనుభవం ప్రోదిచేసుకున్న హృదయంది కాదా?
ఆ అసమాన సౌందర్య్యాన్ని కాంచని మనం,
ఈ సుందర ప్రపంచాన అందవిహీనులం కాదా?

తోటపనితో నాలో నేను-7



“థిమిత థిమిత..ఏమి థిమిత..పసుపు థిమిత..ఏమి పసుపు
వంట పసుపు..ఏమి వంట..పిండి వంట..ఏమి పిండి..తెలక పిండి..ఏమి తెలక..గొర్రె తెలక..ఏమి గొర్రె
పాల గొర్రె..ఏమి పాలు..జెముడు పాలు..ఏమి జెముడు..పాత జెముడు... “
ఈ పాట ఎందుకు ఎత్తుగడలోకి వచ్చిందంటే కాస్త నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళాలి..ఆహా! అంత తేలిగ్గా తీసుకెళ్ళను, ఆ ఫ్లాష్ బాక్ కి ముందు గా పదారేళ్ళ కథ ఆరంభం కావాలి..అక్కడ నుంచి ఇక్కడకి రావాలి మరి!!!


ఫ్లాష్ బాక్:1
అమెరికా నుంచి అమాంతంగా సిడ్నీ కి చేరాము.  నా ప్రవాసం లో తొలి పాతిక శాతం ఆస్ట్రేలియా గడ్డ మీద గడిచింది; అంచేత ఈ సహస్రాబ్దికి పూర్వపు ఊసన్నమాట ఇవాళ మనందరం మననం చేసుకునేదీ, ఒక విధమైన భక్తిరాహిత్యంతో నిర్లక్ష్యం గా తుంపి పసితనపు ఆటకాయ తనానికి ఆకతాయితనం జమిలి వేసి భీకరం గా పోరాటాల ఆటలకి బలి చేసిన మొక్క ని అందంగా కుదురుగా పెంచుకున్న అనుభూతి, అసలు ఉపయోగ రీత్యా ఇంకా భక్తిశ్రద్దలు పెంచుకున్న అనుభవమూను.

ఫ్లాష్ బాక్:2
మా కాన్వెంట్ క్రమశిక్షణ నాన్నగారి నియమానుసార పెంపకం నుంచి ఆటవిడుపు ముమ్మారు వచ్చేది, ఏడాదిలో దసరా సంక్రాంతి వేసవి సెలవులలో అమ్మమ్మగారి ఊరికి ‘పల్లెకు పోదాం, అల్లరి చేద్దాం ఛలో ఛలో’  లెవల్లో వెళ్ళినప్పుడు.. అన్నట్లు నిజం ఒప్పుకోండి, మీరంతా ఇంతే కదా చేసినది ఆ వయసులో!?

వేసవికాలం అమ్మమ్మగారికి మా సంగతి కన్నా కారాలు కొట్టించి, నువ్వులు గానుగాడించి, వడియాలు, పచ్చళ్ళు పెట్టించే పనుల జోరు కనుక పాలేర్లని బెదిరించో, లొంగదీసో కాదు వారంతా మా దోస్తులే కనుక వాళ్ళ భుజాల మీద స్వారీ చేస్తూ పొలానికి చెక్కేసేవాళ్ళం (దసరా సంక్రాంతి కానుకల లంచాలు కూడా బెలిపించి లే) తాటి కమ్మలు,  కిత్తనార ఆకులు,  బ్రహ్మ జెముడు, నాగ జెముడు మా భీకర గర్జనల పోరాటాలకి రాతి గదల్లా మారేవి, పొలాల గట్లు,  పల్లెపట్టు బంజరులు మా యుద్ధభూములు..పల్లేరు, బలురక్కసి పెరిగిన నేలమీదకి శత్రువుని తోసుకోడం ఒక కళ.  అలా పాపం ఆ సాత్వికమైన, సాధు మొక్కల్ని ముల్లచేట్లు, పిచ్చి పొదలు పేరిట దుమ్ము దులిపేవారం.  అంతకు మించి పెద్దగా పాత్ర లేదు వాటికి.  మరి ఆ పాటో అని స్వగతాల్లోకి జారకండి, నాతో పాటు కలిసి నడవండి.. కారాలకి నాలుగు రోకళ్ల పోటు లేదా రెండు రోకళ్ళ పోటు వేయటానికి వచ్చే బాపనమ్మ, చంద్రమ్మ వంటివారు పాడేవోరు, ఆయాసం అలసట తెలియకుండా అలా జానపదాల్లో మంచి ముత్యాలవంటి పాటల సాహిత్యం వెలిగింది ఒకప్పుడు.  పాట అంతా కాదు కానీ కొట్టుకునేప్పుడు పిల్లలం ఒక విధంగా కసిగా పిండికొట్టేసినట్లే థిమిత థిమిత అని అరిచేవారం! కనుక పాట పాత్ర ముగిసి జెముడు ప్రవేశించింది కథనంలోకి...

సరే, అక్కడితో చక చకా సిడ్నీ కి ఎగిరిపోయాము (మేము కాదు మనం) రెండేళ్ళు గడిచాక మొదటిసారి పిల్లాణ్ణి తీసుకుని అమ్మగారింటికి వచ్చాను, వచ్చేముందే ఇల్లు మారాము కనుక ఇరుగు పొరుగు ఎవరూ తెలియదు.  ఎంచక్కా ఏడూ వారాలు అడ్డు ఆపు లేకుండా హాయిగా గడిపి వెనక్కి వెళ్తూ ఓ బుల్లి సనికెల్లు పట్టుకుని వెళ్ళటం మరవలేదు. అంతకు మునుపు గడిచిన రెండేళ్ళు చాలా ఇబ్బంది పెదిపోయా అల్లం వెల్లుల్లి కొట్టుకోవాలన్నా, మిరియాలవీ దంచుకోవలన్నా..వెనక్కి వచ్చిన రెండో రోజు ఇండియాలో అల్లరి మరిగిన పిల్లాడు “Chicken Corn Cob” నవుల్తూ గంతులు వేస్తూ, సోఫాలు ఎక్కి దూకుతూ ఆడుతున్నాడు. నేను ఓ పిడికెడు మిరియాలు Omelette కోసం పొడికొడుతున్నాను; అప్పుడు ఎవరో తలుపు కొట్టారు అనేకన్నా బాదేస్తున్నారు.  కంగారుగా peephole నుంచి చూస్తే ఒక బాహుబలి ఎర్రగా మొహం వేసుకుని ఊగిపోతూ..హడలిపోతూ తలుపు తెరిచా.. 

సంభాషణ ఆంగ్లంలో జరిగింది.  “ఏమి థిమిత” (అతను) “మిరియాల థిమిత” (నేను) “మిరియాలు కాదు నా తల పగలకొడుతున్నావు. నీ సంతు గోడలు కూలుస్తున్నాడు” అతనలా అనగానే తెగ సంబరం వేసినా మర్యాదగా అడిగాను “అందుకు నేను ఏమి చెయ్యగలను. “ అని మెల్లిగా అడిగాను. కాస్త తాగిన మత్తులో ఉన్నాడు.  “నువ్వేమీ చెయ్యనక్కర్లా, మీ పనులన్నీ నేనే చేస్తా.  మీ తలలు, గోడలు పగలకొడతా” అని అరుస్తూ వెళ్ళిపోయాడు.  ఇక యువ నడవటం కూడా మానేసి పాకేవాడు భయం భయం గా.  నేను సన్నికెల్లు కడిగి ఆరబెట్టి పూజ చెయ్యటం మొదలుపెట్టా ‘మరే ఆపదా రాకుండా చూడు రాయమ్మా!’ అని.  అలా మూడేళ్ళు గడిచే క్రమంలో పరిచయాలు పలకరింపులుగా, పరామర్శలుగా మారాక చెప్పాడు “ఆ రోజు మనసు బాగోలేదు, ఏమీ అనుకోవద్దు..నువ్వు కూడా ఎగిరి దూకొచ్చు, నా గుండు కూడా పొడి చేయొచ్చు” అని నవ్వుతూ ఆ  యుగోస్లోవియన్ వ్యక్తి.   
కొన్నాళ్ళకి స్నేహ పుట్టినప్పుడు మళ్ళీ వచ్చాడు ఈసారి వలలుడు లా బూందీ దూసే అపకలా, యుద్దానికి ఊదే కొమ్ముబూరలా ఇంత బారు జెముడు ముక్క ఇచ్చి తినమన్నాడు; “నీకు మంచిది మా ప్రాంతంలో తింటాము,” అని.  అప్పుడు తెలిసింది ఆహారమని, చిన్ననాటి గద కాదని..ముందు పెద్ద “బీరకాయ” అనుకున్న నేను జడుసుకున్నాను.  ఇంకా ఏమి చెయ్యొచ్చు అంటే నీకు అలవాటు కదా కుండీలో పెట్టి పెంచుకో అన్నాడు. అలా ఒక కుండీ లో వేసిన ఆ కొమ్మ చిలవలుపలవాలు గా పెరిగి భలే పూసేది, కాసి పళ్ళు కూడా వచ్చాయి.  కానీ Stem, fruit మాత్రం నేను తినలేదు.  పిల్లలని ‘ఆ మొక్కలా ఎదగాలి,’ అనుకుని పక్కన నుంచో పెట్టి ఎత్తులు బేరీజు వేస్తుంటే వాళ్ళు కూడా కాస్త ఎడంగా ముళ్ళు గుచ్చుకోకుండా నుంచుని చూసుకునేవారు.  అలా అలా రెండేళ్ళు నన్ను భలేగా ఆకట్టుకున్న ఆ మొక్కని వదిలిరాక తప్పలేదు..పొరుగున ఉన్న కొంకిణీవారు సంతోషంగా దత్తత చేసుకున్నారు.

ఇక్కడితో  ఫ్లాష్ బాక్:2 కూడా అయిపోయి వేగంగా 2015 వచ్చిపడ్డాము (మీక్కావాల్సిన BGM కలుపుకోండి)
ఇక్కడ మెక్సికన్ గ్రోసర్స్ కి ఎక్కువగా వెళ్ళను కానీ పోయినేడాది ఒక సిరియన్ ఆవిడ హుషారుగా ఒక పాతిక ఎర్రటి పళ్ళేవో కొంటుంటే కుతూహలం గా అడిగితే అవి నాగజెముడు లేదా బ్రహ్మజెముడు పళ్ళని చెప్పి, ఎలా తినాలో ఎందుకు తినాలో కూడా చెప్తూ, నా కార్ట్లో ఉన్న “బీరకాయలు” వైపు ఆసక్తిగా చూస్తూ వాటిని గూర్చి అడిగింది (చిత్రంగా!) నేనూ యధావిధిగా వివరించి ఆవిడ ఓ రెండు బీరకాయలు కొనటానికి కారణమయ్యాను.  ఒక రెండు జెముడుపళ్ళు ఆవిడనే ఏరిపెట్టమని, ఇంటికి తెచ్చాను.  కాస్త అనుమానంగా ఎందుకైనా మంచిదని పిల్లలకి చెప్పాను ‘కొత్త ఫలం తింటున్నాను..తేడా వస్తే...” అని అర్థోక్తిలో ఆపగానే ఇద్దరూ భయంగా మాకు పెట్టకు అని అన్నారు (వారికీ రుచి చూపకుండా ఊరుకోను అని తెలుసు నేను బ్రతికి బట్టగడితే) సరే ఎంత రుచిగా ఉందొ అంతా ఆరోగ్యానికి మంచిది.  మళ్ళీ కొనటానికి వెళ్ళినపుడు ఒక దక్షిణ అమెరికా వ్యక్తిని పట్టుకుని జెముడు కొమ్మలు ఎలా తినాలి అంటే నోరూరేలా ఎలా ముళ్ళు చేక్కేసి, పైన చెక్కు తీసేసి, ముక్కలుగా కోసుకుని ఉల్లిపాయలవీ వేసి వండాలో చెప్పాడు.. అచ్చంగా బీరకాయ లా వండుకోడమే.  పెంచడం చాలా తేలిక! తినడం అరాయించుకోడం ఇంకా సులువు మరి ఆరోగ్యానికి ఎంతో మెరుగు. 

Mexican Organ Pipe Cactus, Prickly Pear or Cactus Fruit; నాగజెముడు లేదా బ్రహ్మజెముడు అనే ఈ పళ్ళ రుచి ఎర్ర జామ జీడిమామిడి నడుమ రుచి/ కొంచం ఉప్పుప్పగా లైటుపులుపుగా కొద్దితీపికలగలిపి జ్యూసీగా గింజలతో ఉంటుంది గుజ్జు.  గింజలు కాస్త ఉలవలు మాదిరి ఉన్నాయి, బచ్చలి పళ్ళలా బీట్రూట్ లా రంగు పడుతుంది చేతులకి.  ఇక్కడ మాత్రం టెక్సాస్ లో బాగా ఉంటాయి, అక్కడున్న కొద్దిసమయంలో ఎన్నో చూసాను. మా మిడ్వెస్ట్ లో కోసిన ముక్కలు, పళ్ళు ఎప్పుడూ దొరుకుతుంటాయి.  There are many benefits specifically for weight watch and cholesterol control. Not to leave out fact of the Source of Essential Micronutrients part.

నా  చిన్నప్పుడు నాగజెముడు.., బ్రహ్మజెముడు మొక్కలు/పొదలు విరివిగా ఉండేవి.  ఇప్పుడు మావైపు ఊళ్ళల్లో ఎక్కువగా కనపడటం లేదు.  కనుక నేను ఇక్కడ నుంచి కొమ్మంట్లు కట్టి తేలేను కనుక వీలువెంబడి ప్రయత్నించి ఓ పదుగురైనా పెంచినట్లయితే, అందులో నలుగురు తిన్నామని చెప్పినట్లయితే ఈ టపాకి సార్థకత! 

తోటపనితో నాలో నేను-6

వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే

 

వంకాయ ప్రశస్తిని తెలపటానికి నిజానికా చాటువు ను చాటుచేసుకుని చెప్పనక్కరలేదు కాకపొతే బసవరాజు అప్పారావు గారి పాట అడ్డం పెట్టుకుందామంటే ఆయన గుత్తొంకాయ కి మాత్రమే పట్టం గట్టారు; ఆపై ‘కూరలోపల నావలపంతా,’ అని వెర్రిపిల్లతో పాడించి నా సమగ్ర అభినవ వంకాయ వంటల కౌశలానికి పరిధి యేర్పరిచినందున..కాస్త ఈ పోలికలతో సరిపెట్టుకొమ్మని (అలా కాకపోయినా మీరు చదవటం తప్పదని నొక్కి వక్కాణిస్తూ)
వంకాయ మూడు దేశాల్లో ముప్పది రూపాల్లో నా గిన్నెల్లోకి ఎక్కినమాట మాత్రం వాస్తవం! వంకాయ, బ్రింజాల్, ఎగ్ ప్లాంట్ ల ఖండాంతర నా వంటలపెద్ద అనుభవాలు కోకొల్లలు; టపా చిట్ట చివర్న ఆ చిట్టా ఇచ్చాను; ఆగండాగండి అప్పుడే దృష్టి క్రిందకి మలపకండి..నిదానం గా చేతి వేళ్ళు గుప్పిట బిగించి చదివితే కూరలన్నీ తిన్నంత రుచిగా ఈ అక్షరం కూడా ఉండొచ్చునేమో ఓమారు ఆలోచించండి.
దంతసిరి ఉంటేనే ఈ రుచి దొరుకుతుందని నాన్నగారి సిద్దాంతం మేమంతా నమ్మి ఆచరించాము. వంకాయ లేని కూరలబండి/కొట్టు, ఆ కూర వండని చట్టి/దాక ఇలలోన కలవా!? అనర్గళంగా షోడశ వంటలు గుక్క తిప్పుకోకుండా చెప్పగల నాకు వంకాయ కొనటం అనే దుస్థితి ప్రవాసం కలిగించింది. కసరెక్కుతుందని వీలైనంత తాజాగా ఇలా కొమ్మ నుంచి గిల్లిన కాయ అలా మగ్గబెట్టి తినటం అలవాటైన సాంప్రదాయం,- నిజానికి ఈ వంకాయ హరప్పన్ల నాగరికత కాలం నాటిదని తెలుసుకోకమునుపే- ఇంటి భోజన సంస్క్రతికి ప్రధాన ప్రతినిధి అనుకునేవారి సత్సాంగత్యం తో కొని తినటానికి సిద్దమైనప్పుడు తెలియలేదు. కొనటం కాదు అసలు సంగతి, ఆ రుచీ పచీ లేని కండపుష్టి కాయలోకి ఘుమఘుమలు తేవటంలో ఉందన్నదే అసలు కిటుకు అనేసి..
ఇక మొదలైంది అమ్మ చేతి వంట, మామ్మ చేతి వంటలు కాక మనదైన బ్రాండ్స్ కలపటం.. “అమ్మా! మీకన్నా అందెవేసిన చెయ్యి అయిపొయింది వంకాయతో నా వంట,” అంటే నిండుగా నవ్వేవోరు అమ్మ. మురిపెంగా మెటికలు విరిచి ముద్దాడేది మా సుబ్బమ్మ (ఈ బంగారి ని గూర్చిన వివరం మరొకసారి). ఇన్నేసి కూరలు ఉండటంతో పిల్లకాయలు అమ్మమ్మ కూర, అత్త కూర, శైలజాంటీ వాంగీబాత్ ఇలా వర్గీకరణలు కూడా చేసారు.
అలా ఒక దశాబ్దం కొనటం లో ఆరితేరాక, ఆర్గానిక్ వంగడాలలో అదనపు రుచి మరిగాక నాకూ వచ్చింది ఒక పెరటి తోట దాదాపుగా ఐదారు బెడ్స్ వేసుకునేంత వెసులుబాటు ఇస్తూ 2003లో. ఇక మెళకువలు తెలిసాయి. బన్నీ (అనినా అర్జున్ అనుకునేరు కానేకాదు, మా డెక్ క్రిందన స్ప్రింగ్ లో పుట్టి మొగ్గలు, కొమ్మలు ఎడాపెడా కొరికి పడేసే కుందేలు పిల్ల) బారిన పడకుండా తీగలతో తడిక ఏర్పరిచి, సెప్టెంబర్లో చివరి ముదురు మొక్కలు పెరికి, అక్టోబర్ లో ఫాల్ క్లీనప్ అయాక చక్కగా సారం పెట్టిన నేల ఐదారు నెలలు మంచుకి నాని, లోలోపల సారవంతమైన భూమిగా మారాక, ఎండా తొంగిచూసే మే నెలాఖరులో నారుమొక్కలు నాటుకుని, ఆపై పెంపకం మీద అమితమైన శ్రద్దతో, చీడ పీడా రాకుండా జాగరూకతతో కాచుకుంటే “వంకాయ ఉన్ననాడు పేచీలు ఉండవమ్మా నైబరూ.. వండిన రకాము తిరిగి నెల వరకు దొరకదయ్యా కలీగూ..” అని పాడుకుంటూ వండుకుని తినొచ్చు. పిల్లలు అడిగి తింటారు. అడగనివారికి కూడా పిలిచి మరీ పెట్టినదీ వంకాయనే.. అంత కాపు, ఎంతో రుచి! కాపు బాగుంటుంది, దిగుబడి ఎక్కువ, సంరక్షణ తేలిక మనకి మిగిలే ఆరోగ్య పోషణ ఇంకెంతో ఎక్కువ.

మరెందుకిక ఆలస్యం?! మీ కాయ మీరే పండించుకుని మాక్కూడా పంచండి. నీరొంకాయ పొడుగ్గా వంకాయ రంగులోనే ఉంటుంది కదా.. ఇక బుల్లి మువ్వొంకాయలు, బండ కొండరాళ్ళంత కాలిఫోర్నియా వెరైటీ, తెలుపు కలగలిసిన ఛారలతో ఉండే జపనీస్/Asian రకం అన్నీ పండించా కానీ మనవైపు దొరికే తెల్లటి మెట్టొంకాయ అక్కడి విత్తనాలు తెచ్చిన ఒకసారి మాత్రమే సాధ్యపడింది. 

వంకాయ లో సాధారణంగా ఉల్లిపాయ వేయని వంటకం నేను చెయ్యను. ఇదిగో ఓ ముప్పై మూడు రాస్తున్నాను పేర్లు, వస్తే వండి పెడతాను ఒక షరతుతో మీ పెరటితోట కాయలు పుచ్చుకు రావాలి...
వంకాయ కూర లో రకాలు లోపల కలిపే రుచిని అనుసరించి:1) పాలు, వెల్లుల్లి, జీలకర్ర ; 2) కొత్తిమీర కారం; 3) ధనియాల కారం 4) అల్లం, పచ్చికారం 5) వెలిగారం 6) +టమాటా 7) +దోసకాయ 8) + చిలకడదుంప 9) +బంగాళా దుంప 10) +తెల్ల గోంగూర 11) + ములక్కాయ 12) + కారెట్ 13) + బఠాణీ 14) + చిక్కుడు 15) కలగూర పులుసు 16) పచ్చిపులుసు 17) మజ్జిగపులుసు 18) సాంబారు 19) దప్పళం 20) బజ్జీ 21) బెంగన్బర్తా 22) వంకాయ సెనగపప్పు 23) వాంగీ బాత్ 24) మలయాళీ కూర 25) గుత్తివంకాయ ఆంధ్రా స్టైల్ 26) గుత్తివంకాయ తెలంగాణా రకం 27) వంకాయ పకోడీ కూర 28) చైనీస్ రెసిపి 29) ఇటాలియన్ eggplant parmesan 30) పచ్చడి 31) పచ్చి దోసకాయ కలిపి 32) మిక్సేడ్ వెజ్ 33) వంకాయ ఊరగాయ


ఏమంటారు నిజమని ఒప్పుకుంటారా- ఒక్క వంకాయ అనే శాకాంబరిని రోజుకొక సారి తలిస్తే నెల తిప్పెయొచ్చునని గరిటతో పాటుగా? నేను పండించినవీ, వండినవీ ఒక శాంపిల్ ఫోటో తో ముగిస్తూ...

తోటపనితో నాలో నేను-5

"పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూచేను?
మా పెరటితోటలో చిలకడ పూచేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను" - మరువం ఉష




జాన్ నా సహోద్యోగి.. వృత్తిలో పోటీ కాకుండా సహకారంతో మెసిలినవారం. తన పూర్వీకులు చాలా తరాల క్రితం యూరోప్ దేశాల నుంచి ప్రవాసం వచ్చినవారు; కాస్త జర్మన్ కాస్త స్వీడిష్ వారసత్వం ఉంది ఇంకా చాలానే కలిసాయి క్రమేణా వారి తరతరాల పరంపర లో. అయినప్పటికీ జాన్ తాత, తండ్రి తరంలో వ్యవసాయదారులే, తనకీ చాలా శ్రద్ద. తల్లి తోటలవీ పర్యవేక్షిస్తూనే ఇలా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో సీనియర్ స్థాయి ఉద్యోగ జీవితం కూడా సాగించాడు. మా ఇద్దరికీ వెనక 3-4 తరాల వారిపట్ల గౌరవం, వారి జీవితాల పట్ల అవగాహనతో పాటుగా ఆథ్యాత్మికత, తోటపని, వంట పట్ల ఇష్టాలు కలిసేవి.

ఒక సంవత్సరం మే నెల 3వ వారంలో సంభాషణలో " ఈ ఏడాది కొత్తగా ఏ మొక్క పెంచనున్నావు?" అని అడిగాడు. ఏడాదికొక కొత్త వంగడం/రకం కూరగాయ పెంచటం నాకు అలవాటు. "ఇంకా ఏమీ అనుకోలేదు.." అంటుండగానే అటుగా వచ్చిన రాబ్ (దక్షిణ అమెరికా మూలాలు ఉన్నవాడు) "హే! ఆలీ (లెబనాన్ నుంచి వచ్చిన ప్రవాసి) చిలకడదుంపల నారు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాడు. మేము నలుగురం ఉన్నాము, మీరిద్దరూ కలిస్తే ఆరుగురం కలిపి కొంటే 25 మొక్కల కట్ట అందరం తీసుకోవచ్చు," అన్నాడు. కనీసం పాతిక కొనాలి అన్నమాట. నేను ఎప్పుడూ నర్సరీలో చూసి తెచ్చుకోవటమే కానీ అలా తీసుకోలేదు. సరదా వేసింది కాస్త సంశయం ఎలాగ వస్తాయో అన్చెప్పి... "సరే!" అంటూ నేనూ, జాన్ కలిసాము. ఒక వారానికి వచ్చింది నారు జాగ్రత్తగా నలగకుండా సర్ది పంపిన పాకేజీ. రాబ్ గబగబా వాటిని సగం వరకు నీరు పోసిన చిన్న జగ్ లో పెట్టి మా అందరికీ ఈమెయిల్ ఇచ్చాడు. మీటింగ్ కారణం గా నేను వెళ్లేసరికి ఆరోగ్యవంతమైన నారు మొక్కలు కొత్త యజమానులు చేతికి వెళ్లి కాస్త బక్కచిక్కిన ఆరేడు మాత్రం మిగిలి ఉన్నాయి. సరేలెమ్మని ఒక నాలుగు తీసుకుని, రాబ్ కి డబ్బు ఇచ్చి, ఫర్వాలేదు అన్నా తాను ఎవరినో అడిగి నాచేతిలో కచ్చితంగా పెట్టేసిన చిల్లర కూడా పుచ్చుకుని ఇంటికి రాగానే ముందుగా వెనుక ఉన్న మడిలో రెండేసి చొప్పున కలిపి పాతి, పోషణ చేసాను. జూన్ మొదటివారానికి (అంటే 15 రోజులకి) మొక్కలో కాంతి, చిగురాకు వేసే తేజస్సు కనపడ్డాయి. అసలు అంతవరకూ అవి తీగెలా పాకే వత్తైన కుదురుగా ఉంటాయని తెలియదు. ఇక ఆ పక్కన ఉన్న తోటకూర, చుక్కకూర వంటి మొక్కల మీద పాత మోజు పక్కదారి పట్టి కొత్తదారి తీసుకుంది. జాన్ తో అప్పుడప్పుడు 'నీ మొక్కలెలా ఉన్నాయి' అని అడిగి నా తీగె సంగతి చెప్పేదాన్ని. అలా నిండుగా ఉంది చాల్లే అని కూడా అనేసుకున్నాను ఇంతలోకి చిగురుల మీదుగా మొగ్గలు వచ్చి పూలు పూశాయి. తూటిపూల లా ఉన్నాయి.. తెలియకుండానే దేవులపల్లి పాట అని గుర్తు ఆ ఎత్తుగడ తో "పూచేనమ్మా పూచేనమ్మా ఏమి పూచేను? మా పెరటితోటలో చిలకడ పూచేనూ... " అని పాట అందుకుంది నా మనస్సు. అదే తర్వాత పూర్తి చేసాను. నాన్నగారికి ఫోన్లో చెప్తూ, సాయంత్రపు నడకకి వెళ్తూ నా మొక్కలు చూడ్డానికి ఆగేవారికి చూపుతూ సంబరంగా ఆ ఎదుగుదల చూస్తుండగా కాస్త ఛీడ పట్టినట్లుగా ఆకుల తీరు చూసి గ్రహించినా, క్రిమిసంహారక మందు చల్లితే పక్కనున్న అన్ని మొక్కలమీదా ఆ ప్రభావం తో దుష్ఫలితం ఉండవచ్చని, సాధారణంగా ఛీడ పీడలను తట్టుకునే వంగడాలను మాత్రమే ఆ కంపెనీ వారు పెంచుతారని విన్నాను కనుక అలా వదిలేసాను. అక్టోబర్ నెలలో మొక్కలు చలికి వడిలిపోవటం మొదలుపెట్టినా ఇంకా పూత మీద జోరుగా ఉన్న తీగెలు ఫోటో తీసి, జాన్ తో చెప్పాను. ఒక పదిరోజులకు హడావుడిగా వచ్చి "ఓయ్! ఇవాళ తీసేయ్.. అలా వదిలేస్తే నీకేమీ దుంపలు మిగలవు," అన్నాడు. ఎలా దుంప సేకరించాలి కూడా వివరించాడు. కాస్త ఆసక్తితో విన్నాను..ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎప్పటిలానే మొక్కల్లోకి వెళ్తూ పిల్లకి చెప్పాను "ఇవాళ జాగింగ్, డాన్స్ చెయ్యను కానీ నీకొక వింత చూపిస్తా!" అని. లోలోపల అనుమానం అసలు పైన పూలు ఉన్నాయంటే లోపల దుంపలు ఉండి ఉంటాయా అనేసి...

'అయ్యో! సందెవేళ పచ్చటి మొక్కని అలా ఎలా తవ్వి తీయాలి?! నాన్నగారితో చెప్తే కోప్పడతారు..' అనుకుంటూ పైపైన తవ్వేసే ఆషామాషీ పనిలా నాలుగుసార్లు చిన్ని గునపం వంటి పరికరంతో మొదలు చుట్టూ కదిపి చూస్తే, చలికి బిగిసి ఉన్న మట్టి ఒక చిన్న పెళ్ల కూడా కదల్లేదు. అలా అలా ఒక గంట పైనే చీకటి పడిపోతున్న ఆ మునిమాపు వేళలో (సాధారణంగా వాన పడదు కానీ ఆరోజు అదీ తోడయింది) కొంకర్లు పోతున్న అంతగా బలమైన పనులకి అలవడని చేతులతో, దాదాపుగా ముద్దకట్టుకుపోతున్న స్థితిలో, "ఓ రంగయో..పూల రంగయో" వంటి పాటలు "చెల్లియో చెల్లకో.." వంటి పద్యాలు నాన్నగారిని అనుకరిస్తూ పాడుతూ మరి నా పూర్తి జాగృత, స్పృహ వదిలి మనస్సు జాయింట్స్ నెప్పి, రక్తం గడ్డ కట్టే తిమ్మిరులని దాటుకుని చేతులకి శక్తి ని పంప్ చెయ్యాలి కదా!- నా త్రవ్వకాలు కొనసాగించా. 

అదేదో లంకె బిందెలు తవ్వితే కలిగే అనుభవం లా నా టూల్ కి అడ్డమొస్తూ గట్టిగా ఏదో తగిలే సరికి బలమంతా పెట్టి మట్టి తిరగబడేలా పెళ్లగించి చూద్దును కదా! "యురేకా, బింగో, వామ్మో, హైలెస్సా" అన్ని భాషల్లో శ్రామిక ఆశ్చర్యం, కృషీవలుల విజయహాసం, పరిశోధనల ఫలితపు సమయాలు నాలో ప్రాణం పోసుకున్నాయి. స్నేహ పరిగెత్తుకుని వచ్చింది. ఆ మునిమాపు వేళలో అలా ఒకటొకటిగా బయటకు తీస్తూ 'అమ్మా! మన్నించు, భుక్తి కొరకు భక్తి తో చేసే పని' అని నేల తల్లికి మొక్కుతూ పోగేసినవి దాదాపుగా 10 పెద్ద దుంపలు, ఐదారు చిన్నవి. మిగిలిన తీగె ఆకులు జాగ్రత్తగా బాగ్ లో దాచాను, కమ్యూనిటీ కలక్షన్ వారికి ఇవ్వటానికి (కంపాస్ట్ చేస్తారు) ఇక నిద్రపోతే ఒట్టు ఆ రాత్రంతా.. నాన్నగారు, అన్నయ్య కి ఫోన్లు, లోకల్ కాల్స్, వాటిని రకరకాలుగా కిచెన్ ఐలెండ్ మీద పేర్చి, ఫోటోస్ తీసుకుని, నాలుగు నాకు ఉంచుకుని తెలిసినవారికి వెళ్లి ఇచ్చి, మర్నాడు జాన్ దగ్గరకి పరిగెత్తుకుని వెళ్లి చెప్పాను. "ఓ! నిజమా" అని తాను అరిచిన ఆ అరుపుకి మిగిలిన నలుగురూ లగెత్తుకు వచ్చారు. ఇక ఒక హరికథ లా మొదలెట్టి, బుర్రకథకి మార్పిడి చేసి, పాడిందే పాట లా ఒక వారం పాటుగా నేను ఆ దుంపల సాగు ఎలా చేసాను, నాకు అత్యంత అధికమైన ఆ దిగుబడి ఎలా సాధ్యం అయింది అనే అంశం మీద మా అధ్యయనం సాగింది. సంగతి ఏమిటంటే వాళ్లెవరి తీగెలకీ పూత తప్పా దుంప రాలేదు. జాన్ వాళ్ళ అబ్బాయి/అమ్మాయి కాకపొతే భార్యో ముందుగా పెకిలించి తీసేసరికి లేత దుంపలు ఓ నాలుగు మాత్రం వచ్చాయి.

కనుక నేను మరొకమారు కాలర్ ఎగరేసి కనుబొమ్మలు కూడా కలిపి కళ్ళతో నవ్వుతూ కలకాలమని కోయిల లా పాడుతూ ఒక పక్షం వరకు చిలకడ దుంపల వంటకాలు చేసి (లావయ్యాను అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే) సగం చిక్కిపోయా పిల్లదానికి తినిపించి.. చూస్తూ చూస్తూ నేను తినలేక. (ఎంతైనా తొలి పంట అప్పుడు కాస్త తల్లితనపు తత్తరపాటు వస్తుంది). ఒక దుంప మాత్రం నెల పైనే అట్టిపెట్టాను. ఎందుకంటే Thanksgiving పండుగ అనాది సాంప్రదాయాన్ని అనుసరించి ఈ దుంపలు, మొక్కజొన్న వంటలు తప్పనిసరి. 

ఇవాళ అమెరికా అంతా అన్ని జాతీయులు దాదాపుగా ప్రతి పిల్లాపాప సంతోషంగా గడుపుకునే ఈ పండుగకి ఒక విశేషం ఉంది. మన సంక్రాంతి మాదిరిగా పంట ఇంటికి వచ్చాక సంబరంగా, తిరునాళ్ళగా జరిపేవారుట.. ప్రతి ఇంటా సమృద్ధిగా పాడిపంటలు ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపుతూ. అలా Native People జరుపుకునే ప్రాచీన వ్యవసాయ సాంప్రదాయ వేడుకలోకి స్పానిష్ వారి రాకతో కొంత మార్పు, చివరిగా 1621 లో Mayflower నౌక ఐరోపా/ఇంగ్లండ్ నుంచి బయల్దేరాక- సముద్ర పయనం లో ఎన్నో ఇక్కట్లు పాలయి, రోగాలతో ఎందరో చనిపోయి- చాలా మందిని కోల్పోయి మిగిలిన కాందిశీకులు విచ్చేసినప్పుడు స్థానికులు వారికి ఎదురేగి విందు భోజనం పెట్టటంతో ఆ విందులు, వినోదాలు కలగలిసి మరింత చారిత్రిక ప్రాముఖ్య కలగలుపుకుని నేటికీ పాత కొత్తల మేళవింపుతో సాగుంతోంది. ఈమధ్య చివరిగా 2014 లో నేను 90 సంవత్సరాల వృద్ధులతో గడిపాను, వారిలో ఒకరు హిట్లర్ సమకాలీనులైన తాత మామ్మల అనుభవాలతో ఒక నవల రచించిన పోలిష్ రచయిత్రి.

నేను దుంపలు కాల్చి తినటం, ఉడకబెట్టి తినటం కాకుండా కాక పులుసు, వేపుడు, మా వైపు కాజాలో మడతల నడుమ ఉడికించిన దుంపల పేస్ట్ రాయటం, సిడ్నీలో శ్రీలంక తమిళుల వలన పాయసం, ఇక్కడ sweet potato casserole, sweet potato fries and mashed sweet potatoes చేస్తూ ఉంటాను.

(సమస్త జగతికి, సకల జీవకోటికి కృతజ్ఞత తెలుపుతూ నా పాట, కవిత జతపరుస్తున్నాను.)
మీ అందరికీ Thanksgiving సందర్భంగా నా నెనర్లు! మీ మాటలకి మప్పిదాలు.
-1-
పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూచేను?
మా పెరటితోటలో చిలకడ పూచేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను

కాచేనమ్మ కాచేనమ్మ
ఏమి కాచేను?
మీ ఇంటి ముందరి గులాబీ కాయ కాచేనూ...
కాదు కాదు కానే కాదు
నీలాకాశాన వెన్నెల కాచేను

పండేనమ్మ పండేనమ్మ
ఏమి పండేను?
మా అత్తగారి బీరపాదుకి పండు పండేనూ...
కాదు కాదు కానే కాదు
నేను కన్న కలలు పండేనూ

-2-
దేహమే శిలువగా మోసుకుంటూ, లేదా
దేహపు గదిలో బందీ అయిన ఆత్మగా
విశ్వపు ఒడికై ఆర్తి చెందుతూ
విడుదల కొరకై వేచి ఉంటాను

గోడల్ని ఒరుసుకు మొలిచిన రావిఆకులు
కదులుతాయి, కంటి చూపుని కదుపుతాయి
నీటిలో పడ్డ కిరణాల పరావర్తనమో, వక్రీభవనమో
మెరుపు నీడలై కనులెదుట నిలుస్తాయి
వార్తాహరులు వచ్చిపోతున్నట్లే ఉంటుంది

కమ్ముకుని కట్టిపడేసిన భయపు కౌగిలి లో
ఊపిరి అందని ఉక్కిరిబిక్కిరి లో
దిగంతపు దిశ గా, ఏవేవో ఆనవాళ్ళ వెంట
చివరి మజిలీ కి తరలిపోతుంటాను

గాలి ఊయలులు సేద తీరుస్తాయి
కెరటాల వీవెనలు కుదుటపరుస్తాయి
ప్రకృతిలో మనుషులు, మనుషుల్లో ప్రకృతి
పలుకరిస్తాయి, గృహానికి చేరిన భావన ఇస్తాయి
ఇవన్నీ నిండిన లోకపు వాకిలి లో నిలిచి,

కృతజ్ఞతల తోరణాలు కట్టిపోతాను.