పాతికేళ్ళకి పూర్వం మన దేశం వదిలేప్పుడు కందిపప్పు, చింతపండు దొరకవని చెరో అరకేజీ మూట గట్టి, ఆవకాయ, ధనియాల కారం జాగ్రత్తగా సర్ది, వడియాలు మర్చిపోకుండా చూసుకుని, కాస్త స్నానానికి పెసర సున్నిపిండి, చంటాడికి తినటానికి మినపసున్ని పెట్టెలో పెట్టాక దీర్ఘంగా నిశ్వసించా..మూణ్ణెల్లు ఎవరూ తెలియరు, కొద్దీ కొద్దిగా పరిచయాలు, స్థానిక రేడియోలో- గురువారం రాత్రి ఇండియా నుంచి వచ్చే వార్తలు కాపీ చేసుకుని, శుక్రవారం అనువదించి, శనివారం పొద్దున్న తాజా వి అంటూ- వార్తలు తెలుగులో చదవటం కి నన్ను ఎన్నుకున్నారు (మరి కొందరితో సహా) అలా పెరిగిన పరిచయాలు, నా స్వభావంకి సరిపడుతూ ఏర్పడిన స్నేహాలు..ఆపై ఎవరో భోజనం కి రమ్మని పిలుపు! కాస్త గా ఉన్న బెంగ వారింట్లో బెండకాయ వేపుడు ఉన్న మూకుడు చూడగానే వెక్కివెక్కి ఏడ్పుగా (ఎన్నాళ్ళు నానమ్మ, అమ్మానాన్న, పుట్టినూరు, ఇల్లు వదిలి ఉన్నది లేదు) మారింది. అప్పుడే వచ్చిన ఒక పెద్దవారు (1960ల ప్రవాసులు) దగ్గరకి తీసుకుని అనునయిస్తూ ఒక అర మూర మల్లెలు ఇచ్చారు. ఏడ్చే పిల్లకి తాయిలం ఇచ్చినట్లైంది.. జాగ్రత్తగా తలా తిప్పకుండా తాజాగా ఉంచుకుని (నందిగామ లో ఖాన్ అంకుల్ గారి ఆంటీ పట్టుపూల మొగ్గలు, మల్లెలు కలిపి కుట్టే పూలజడని ఎంత భద్రంగా రెండు రోజులు చెదరకుండా ఉంచుకునేదాన్నో అలాగ) ఇంటికి వచ్చాక పదిలంగా ఫ్రీజర్ లో పెట్టాను. అవి దాదాపు మూడు సంవత్సరాలు వచ్చిన అందరికీ చూపేదాన్ని. ఆవిడ/విమల ఆంటీ ఎంత సంతోషించేవారో 'ఎందరికో ఇచ్చాను, ఎంత ఇదిగా చెప్తున్నావమ్మా!' అంటూ. ఆ కృతజ్ఞత జీవనంలో కలిపి ఉంచడం మా ఇంటి పెద్దలు నేర్పినది.
సరే! ఇక నేనూ పెద్ద డెక్ తోట వేసేసా. సాయంత్రాలు యువ (నా బిడ్డడు) కి అన్నం తినిపించడం, ఆ మొగ్గల లెక్కలతో పాఠాలు నేర్పటం అన్నీ సాగేవి (చివరిగా నిద్రకూడా అక్కడే నా ఒళ్ళో).. తర్వాత బిడ్డ పుట్టేనాటికి నాన్నగారు అమ్మ వచ్చారు సూడిదలు తీసుకుని. నాన్నగారు సెంచరీలు కొట్టే కిక్రెటర్స్ ని చూసి చప్పట్లు కొట్టినట్లుగా, ఆ మొగ్గలు కోసుకుంటూ "వంద..రెండు వందలు.. 'ఉషడు! ఇవాళ 3 కి చేరేట్లున్నాయి, సీతాయ్! దారం అందుకో' మూడు వందలు..... ఊ!!!" అంటూ తెచ్చిన మొగ్గలు అమ్మ దండ కట్టి యువతో ఇరుగు పొరుగు శ్రీలంక వారికి పంపేవారు. అలా అలా నా చెట్టుకి 'సీతమ్మ వాకిట చిరుమల్లె చెట్టు చిరుమల్లె చెట్టేమొ చితుక పూసింది'ఖ్యాతి వచ్చింది. నన్ను పెట్టుకోనీయలేదు, అలా ఒక రెండేళ్లు నా తలలో పూలు లేవు (పిల్లకి మంచిది కాదని) ఒత్తైన జుట్టుతో పుట్టిన స్నేహకి ఎలా తెలిసిందో, పూలు పెట్టుకుంటే ముద్దుగా ఉంటానని, ఎంచక్కా పెట్టించుకునేది కృష్ణుడి జడ వేయించుకుని..ఇంటి నిండా పిల్లదాని పటాలు మురిపెపు సిరులొలుకుతూ పరిమళభరిత జ్ఞాపకాలుగా విరిసేవి.
రొట్టగా పెరగకుండా ఆకులు దూయటానికి, మారాకు వేసాక మొగ్గలు చూసి మురవటానికి, కోయటానికి సాయం వచ్చేది నిండా రెండేళ్లు లేనప్పుడే...
మహా మృత్యుంజయ మంత్రం జపిస్తూనే పూలు సేకరించుకుని నాన్నగారు పూజలోకి వెళ్ళే సమయానికి వంట పూర్తి అయిపోతుంది. ఒకానొక సమయాన ఆ మంత్రార్ధము తెలియజెప్పారు..అమ్మ ఎక్కువగా దోసకాయ పప్పు లో కూరగాయగా (తర్వాత టమాట, ఆకుకూర, మామిడికాయ ఇలా...) వేసేవారు. ఇంటి తోట పాదుల్లో దోసకాయ వతనుగా ఉండేది. ఇంకా ఎన్ని కూరల్లో తిన్నా ఇష్టమే!
హనుమంతరాజు అంకుల్ నాన్నగారి డిపార్ట్మెంట్ లో తనకి రిపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఆయన మీద నాకు కోపం వచ్చేసింది, ఒక్కసారిగా కాదు సుమా! అంచలంచెలుగా.. దోసగింజల పొడి ఆరోగ్యానికి మంచిదని దోసకారం తెచ్చిఇచ్చారు (సాంబారు కారం లో వేపి పొడిచేసిన గింజలు కలపటమే అట). నోటికి సహించదు, తినకపోతే చీవాట్లు. భోజనం లో ఆ పొడి తిన్న రోజు అంకుల్ కనపడితే పళ్ళు నూరుకుని, మొహం తిప్పుకునైనా సరే, బలవంతంగా తింటూనే ఉన్నా దోసకాయ పట్ల విముఖత కలిగించారని కినుక వచ్చేది.
తర్వాత హాస్టల్ జీవితం, దోసకాయ అరుదుగా దొరికేది. తిరిగి ఇష్టం వచ్చి పడింది. నా చేతివంటలో దోసకాయ వండే రకాలు మరిన్ని పెరిగాయి. రెండు దశాబ్దాలకి పూర్వం ప్రవాసం వెళ్ళాల్సి వచ్చింది. ఇక, ఆ కూరగాయ దొరికేది కాదు, దోసావకాయ హైదరాబాద్ ప్రాంతీయులు తెచ్చుకుని రెండు ముక్కలు ఇస్తే అదే మహద్భాగ్యం..ఇంతలో పిల్లలకీ అత్యంత ప్రీతికరంగా మారే కొద్దీ ఇండియన్ షాప్ ఆయన తెచ్చిన నాలుగు పౌండ్స్ లో రెండు దొరకబుచ్చుకుని బయటకి రావటం మొదటాట సినిమాకి రిలీజ్ అయిన తొలిరోజు కొన్నంత పనిలా అయేది.
తెలిసినవారు పెంచేవారు, పంచేవారు..వాపిరిగొట్టులా తను ‘ఈ పిందె నీది,’ అని చూపాక అటుగా సాయంత్రపు నడకకి వెళ్ళినప్పుడు ఆరాగా చూసుకోవడం ఎప్పుడు పండుగా మారుతుందా “ఉర్వారుకమివ బంధనాత్” పండిన దోసపండు తనంతట తానుగా ఎలా ఐతే పాదు నుండి విడివడుతుందో చూడాలని...
ఒక ఏడాది మామూలుగా మే నెల మడి సిద్దం చేసి, అమెరికన్ నర్సరీ లో దొరికే కొన్ని రకాల నారు మొక్కలు నాటి, కొన్ని విత్తనాలు నేలలో గుచ్చాను. వారానికి వచ్చిన తీగ పాకటం మొదలయాక తెలియలేదు; అయినా నిండుగా పచ్చగా ఉందని ఎరువు, నీరు ఇస్తూ పసుపుపచ్చని పూవు పూయగానే ఇంకాస్త పదిలంగా చూసుకుని పిందె పడగానే దగ్గరగా గమనిస్తే “ఓ వావ్!” లోపల నుంచి ఆనంద జలధార ఉరికి ఉరికి..ఆ పాదుకి కాసినవి మరేవో కాదు దోసకాయలు. బహుశా ఒక గింజ ఎలానో కలిసి వచ్చి నాటుకుపోయింది. దోసకాయంత దొంగోడు (కుందేలు పిల్ల) కూడా రాకుండా తీగెల తడికె కట్టి సాధించాను, నా చేతి పెంపకం లో నేను సైతం కొన్ని. వండిన కూర ఒకరికి, రెండు కాయలు నచ్చినవారికి, నూరిన పచ్చడి నలుగురికి, దాచుకున్న ఫోటోలు మీ అందరికీ. మా మిడ్వెస్ట్ లో దోసకాయలు, సొరకాయలు, పొట్ల కాయలు, కాకర పాదులు పెంచేవారు మోతుబరులు. కనుక నేను ఒక సన్నకారు రైతుని కావటానికి ఈ దోసకాయ దోహదం చేసింది. హనుమంతరాజు అంకుల్ ఆదర్శం; తొక్క, గింజతో సహా ఆరోగ్యానికి పీచు పదార్ధం తో పాటుగా ఎన్నో పోషక విలువలున్న దోసకాయ నా పిల్లలు వదలకుండా తింటారు కూడా!!!
ప్రముఖ కవి శ్రీ నాయని సుబ్బారావు "జన్మభూమి" కావ్యంలో నవ్వుల శోభ వర్ణన; నాయిక హాసం 'పూత కొత్తిమిర చేను' లాగానూ నాయకుడు పగలబడి నవ్వటం పండిన బూరుగు కాయలు పెటిల్లు పెటిల్లుమని పేలినట్లు గానూ ఉన్నదట ("మా నాన్నగారు" పుస్తకం నుంచి ఆయన కుమార్తె నాయని కృష్ణకుమారి మాటల్లో)
***** ఎక్కడకి వెళ్లి మొదలు పెట్టాలీ గతానుభూతుల కదంబంలో ముక్కలు త్రుంచి, పరిమళం పీల్చుకోమని ఇక్కడి కొన్ని పచ్చదనపుప్రియ మనస్సు కొమ్మలకి (రాత్రి కట్టిన పూలమాల కొంచం తెల్లారి తలలో తురమటానికి పదిలం చేసినట్లుగా) తగిలించటానికి!? పూర్తిచేసిన పాలకప్పు అమ్మ చేతికి ఇచ్చి, నాన్నగారి చెయ్యి పట్టుకునో, వెనకమాల అడుగేస్తూ (వెక్కిరిస్తూ, అంటే ఆ రోజు తోటపని చెయ్యటం ఇష్టం లేదన్నమాట) పెరటి తోట వైపు వెళ్తుంటే సీతమామ్మ (నానమ్మ) ఓ వెదురుసజ్జెలో మందారాలు, పారిజాతాలు పేర్చుకుని ఇంట్లోకి వస్తుంటుంది..లేదా, మా వెనుగ్గా ఓ 2-3 గుప్పిళ్ళ ధనియాలు తెస్తూ వస్తారు. తన చేతిలో చివరి గింజలు ఓ చెంచాడు సుమారు నా *నోటికి*; తతిమావి నేలలోకి వెళ్ళటానికి... (*) ఆ మాత్రం లంచం లేనిదే మనం ఎందుకు మాట వింటాము, నిండా పదేళ్ళు లేని వయస్సులో!? చిన్న మడి కడతారు నాన్నగారు, ఆకుకూరల పక్కగా కొత్తిమీర విత్తటానికి, కాస్త తడిగా గుల్ల చేసిన నేల సిద్దం చేస్తుండగా.. నా హవాయి చెప్పు ఒకటి కడిగి, వరండా గచ్చు మీద ఆ ధనియాలు పోసి చేతికి తొడిగిన చెప్పుతో గట్టిగా నొక్కి బద్దలు చేస్తా నేను. బబుల్ గం కన్నా మేలైన ఆ గింజల సారం పీల్చుతూ, పరపరా నవులుతూ మామ్మ, నేను మడి వైపు దారితీస్తాము. ఒక అంగుళం కన్నా లోతుకి వెళ్ళకుండా విత్తనాలు జల్లి, ముగ్గురం చెరొక పురిషెడు నీళ్ళు చిలకరించి, ఆ పక్కనే సిద్దమైన మడి నుంచి నాలుగు మొక్కలు తీసుకుని (చారులో పోపుకి) ఇంట్లోకి వస్తాము. నేను కాన్వర్స్ షూస్ తో కాన్వెంట్ కి, నాన్నగారి జీప్ తనని తీసుకుని ఆఫీస్ కి కదిలేప్పుడు, “ఎంచక్కా నువ్వు మీ నాన్న లా చదువుకుని జీప్ లో తిరగాలి,” అని సీతమ్మామ్మ దీవిస్తుంది. అమ్మ నవ్వుతూ కొత్తిమీర పూలు ఉంటె గిల్లినవి నా చేత పోసి, రెమ్మలు కాస్త శుభ్రం చేసుకుని వంటగది వైపు వెళ్తారు. ఆ పూల ఘుమఘుమ పీల్చుకుంటూ, వంటగదిలో ఇంకేమైనా రుచుల జాడ ఉందేమోనని ముక్కులు ఎగపీల్చుతూ అన్నయ్య తన బడికి తను సాగుతాడు. -2- ఎంత ప్రయత్నించినా ఇండియన్ స్టోర్ లో ధనియాలు మొలకెత్తలేదు. అమెరికన్ గ్రోసర్స్ దగ్గర “సిలాన్త్రో” గా కొత్తిమీర కట్ట ఉంటుంది, లేదా పొడి దొరుకుతుంది. ఒక మెక్సికన్ కొట్టులో దొరికిన ధనియాల పొట్లం నుంచి చేసిన ప్రయత్నంతో లెక్కకి పది మొలకలు వచ్చాయి. డెక్ మీద తిరుగుతూ ఆ ఫోటో తీస్తుంటే, నిద్ర లేచి వచ్చి “అమ్మా! ఇది “ధనియా పత్తా” కదా? I know Hindi,” అంటూ నా చిన్నారి కూతురు బడాయి పోతూ ఉంది!!!
"భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయటకు పెట్టి మొదట వచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది కృతజ్ఞతతో " - గుంటూరు శేషేంద్ర శర్మ
తోట పనిలో ఉండే తాదాత్మ్యత అనుభవంలోకి వచ్చిన వారికి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. నా వరకు జీవితంలో ఒక భాగం తోటపని. "నా పాతిక సంవత్సరాల శోధనలో దొరకని ప్రశాంతత తోటపనిలోనే లభ్యమైంది." అన్న ఒక సన్యాసిని మాటలు చదివాక నా నమ్మకం మరింత దృఢపడింది. నిజానికి ఇది ఆరాధనా లేక అభిరుచా అన్నది నేను చెప్పలేను..నేపధ్య సంగీతం మాదిరి నానమ్మ నాతో కలిసి చేసిన తోటపని జ్ఞాపకాలో, నాన్నగారు చదివించిన పుస్తకాల తాలూకు ఘడియలనో కలుపుతాను. నేను పేరుకి/ పేరు/కు/న్న కవిని కాను, నా చుట్టూ ఆవరణ లో ఆహ్లాదం, ఆనందం కావాలి..నాకు బ్రతుకే పెట్టుబడిగా కవి జీవనం కావాలి!!!
"ఉష మరువం గారి ' మొక్కల పెంపకంలో అనుభవాలు-అనుభూతులు ' రేపు ఉదయం.." అంటూ తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ముందుగా చెప్పారు కానీ నిజానికి ఇవి తోటపనిలో కిటుకులు, మెళకువలు నేర్పేవి కావు. నా ఎత్తుగడలోనే అది అర్థం అయి ఉండాలి. వీటి నుంచి మరొకరికి నాలో తోటమాలి గోచరించినా, వారిలో వనారాధన ఉద్భవించినా సార్థకత ఉంటుందని నమ్ముతూ... బీజం నుంచి అంకురం వచ్చినంత సులువుగా ప్రేరణ నుంచి ఆచరణ రాదనీ తెలుసు, అయినా అసాధ్యం కాదు.
నాబోటి జానపద గీత/ ఆలాపనగా తోచే తత్త్వాల ప్రియులకు, ప్రేమలో పడ్డాక ఎన్ని పాటలని, సాకులని చాటుచేసుకుని పెద్దవారి కంట పడకుండా ప్రణయకలాపాలు సాగించాలి!? ;) నాకు భలే నచ్చింది ఈ పాట; సందర్భం పాతదే కానీ పాట లో కవి చూపిన చమత్కారం మాత్రం భళారే!!! అటు కావలి కాసే తండ్రిని గూర్చి గోడదూకనున్న ప్రియునికి హెచ్చరిక చేయటం కొరకు పాడినా, ఇటు ఆ కారణం ఎరుగని తండ్రికి బ్రహ్మంగారి వేదాంతతత్త్వం లా వినిపిస్తుంది.. ఆ గీత సాహిత్యంతో పాటుగా అప్పుడు ఆ తండ్రీకూతుళ్ళ నడుమ సంభాషణ మీకోసం. వినాలంటే యూట్యూబ్ లో ఉంది. మునుపు ఈ సాహిత్యం టైపినవారి version లో కొన్ని అచ్చుతప్పులున్నందున నేనే విని రాసుకున్నాను.
ప: వస్తావు పోతావు నాకోసం వచ్చి కూర్చున్నాడు నీకోసం యముడు వచ్చి కూర్చున్నాడు నీకోసం చ1: పొరపాటుపడి చేత దొరికిపొయ్యావంటే నా బంగారు చేపా..ఆ.. డొక్క చీరుస్తాడు డోలు కట్టిస్తాడు చ2: నిక్కి నిక్కి పైకి చూసేవు తళుకు బెళుకు చూసి మురిసేవు కదలలేడని పిచ్చికలలు కన్నావంటే.. |2| ముక్కముక్కలు చేసి తిక్క వదిలిస్తాడు -2- తండ్రి: అమ్మాయ్! ఇదేదో బ్రహ్మం గారి వేదాంత తత్త్వం లా ఉందమ్మా అమ్మాయి: అవున్నాన్నా చేపకు ఎరకు సంవాదం, ఒక జానపద కవి వేదాంత సారాన్ని కురిపించాడు ***** చిత్రం: మునిపల్లెరాజు రాసిన ‘పూజారి’ నవల ఆధారంగా రూపొందించబడిన "పూజాఫలం" రాజశ్రీ, రేలంగి పొట్టి ప్రసాద్‌లపై చిత్రీకరించిన ఈ గీత రచన కొసరాజు, గానం: బి.వసంత, సంగీతం: సాలూరు రాజేశ్వరరావు సినిమా అనుసరణ చేసి సంభాషణలు రాసినవారు డి.వి.నరసరాజు