సినీ గీతాల నుంచి ఓ జానపదం!

నడియేటిపై నడుచు పడవలా నా పడుచు గుడికాడ బావికే నీటికొస్తాది

అడుగుదామంటేను అసలు సంగతి యేమో తడబడి నానోట వెడలి రాదోమాట ||న||

కడగంటి సూపులు కడవలోనించి, కడియాల సడిలోన ఎడద దాపుంచి
విడిజారు ముడిలోన విరిదండ ముడిచి, విడివడని పెదవిపై ముసిముసిగా నగుచు ||న||


(చిత్రం: జయసింహ, రచన: సముద్రాల జూనియర్, స్వరరచన: టి.వి.రాజు,  గానం: పిఠాపురం నాగేశ్వరరావు)

* వింటూ రాసాను...విడిగా యేదైనా సినీ గీతాల/సాహితీ ప్రచురణలో/జానపద సాహిత్య సంకలనం లో ఉంటాయా?! తెలియదు, అటువంటివి లభ్యమైతే చెప్పండి.

జానపదసాహిత్యం: తెలిసిన పాట!

జాలమేలా జాలరోడా, కూడి రారా పడవరేడా

హైలో హైలో హైలేస్స హవ్వారే ॥2॥

ఏడేడు సంద్రాలు మాకు పుట్టిళ్ళు
హైలేస్స ॥3॥
సంద్రాన పడవలు మాకు నట్టిళ్ళు
హైలేస్స ॥3॥

గంగమ్మ తల్లిరో జేజేలు కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే


జంకు గొంకు లేక పడవ సాగాలి
దూరదూర తీరాలు చేరాలి
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే

గంగమ్మ తల్లిరో టెంకాయ కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే

"కృష్ణప్రేమ" పేరిట పాటలపై మంచి మాటల బ్లాగు!

అక్షరాలుగా వెలికి వస్తూ లేదా వెలికితీస్తూ ఆలోచనల్లోకి, ఆసక్తిలోకి ఇనికిపోతారు కొందరు; వారిలో కొందరు సమకాలీనులే! ఆ కొందర్ని మన జీవితకాలంలో కలుసుకునేసరికి జ్ఞాపకమే చిరునామా గా మిగిల్చిపోతారు... ఈ మధ్య ఏకధాటిగా కనీసం రెండు నెలలుగా చదువుతూ ఉన్న బ్లాగు, డా. తాతిరాజు వేణుగోపాల్ గారిది. 3 వారాల తర్వాత గమనించాను, ఆయన "ఈ పూటకి నా మాట" అనే టాగ్ లైన్ తో రాసినవి నేను చదివేనాటికి "మునుపటి నా మాట" గా మారిపోయాయని. చదవటం మానలేదు కానీ ఆయన చివరి పోస్ట్ చదివినప్పటి నా మనస్థితికి చాలా విచలితనయ్యాను, తిరిగి సంభాళించుకుని హాయిగా కబుర్లతో సాగిపోయే ఆయన టపాలు చాలావరకు పూర్తి చేసాను.

కనుక "కృష్ణప్రేమ" అంటే మనకందరికీ మరో విద్యాలయం సినిమా అని చెప్తూ, సినిమా పాటల కవులని చిక్కగా పరిచయం చేసిన వారి కమ్మని రుచి గల ఆ తెలుగు పట్ల మక్కువ...ఆయన చాలా పఠనం, అధ్యయనం చేసి పరిశీలనతో కూడిన అంశాలతో రాసినవి భలే చదివిస్తాయి; దేవులపల్లి పక్షాన ఉంటాను కనుక ఆయన్ని గూర్చిన వీరి మాట:-

ఫాల్గుణ కృష్ణపక్షం అంటే కూడ సద్గుణ కృష్ణ(శాస్త్రీయ) పక్షమే!


Captive: నా కవిత "బందీ" కి ఆంగ్లానువాదం!

- by NS Murthy
In the relentless rain of moonlight
The stars occasionally seem balls of hail …
I run after falling meteors
With the swiftness of childhood …
I have already melted enough hails
And cooled off comets and meteorites!
A rainbow opens up on the sky, but
Within, a firmament snuggles smugly
Some more colourful dreams try to hang about
Unsuccessfully… but the canticle endures….

New moon looks not gloomy
When you think of the crescent in the offing
When you are sure of the full moon,
You are not conscious of the dawn or nightfall.
Between, when you balance your Blues and Brights
You reconcile and find there is no room for angst.

Yet, neither the bleak veils cease,
Nor buds of darkness blossom
Night long, as restlessness endures
And an unremitting anxiety seizes
I patiently twine the frills of light
And billow the fires of sleep
Becoming a shadow among shadows
Like the screen behind chiaroscuro
Lying alone incarcerated to redeem a dream.


(https://teluguanuvaadaalu.wordpress.com/2015/11/10/captive-usha-rani-telugu-indian/ )

*****
బందీ 
-----
ఆగక కురిసే వెన్నెల్లో అప్పుడప్పుడు తారలు వడగళ్ళు అవుతాయి
రాలిపడే ఉల్కల వెంట బాల్యపు నేర్పుతో వెళ్తాను- ఇప్పటికే ఎన్ని వడగళ్ళు కరిగించాను
ఉల్కల, తోకచుక్కలను చల్లార్చాను!?
ఇకిక్కడ వానవిల్లు విరిసింది, లోలోపల ఒక పందిరి నింగిలా ఒంగి
ఇంకాస్త పరుచుకుని రంగుల కలలు, అతుక్కుని, అతికీ అతకక 
అయినా నిరంతరం గా సాగే గానమై!

అందుకే
నెలబాలుడు వస్తాడనుకున్న పిమ్మట అమాస బాధించదు
పున్నమి రానుంది అనేకున్నాక వేకువ రాకపోకలు పట్టవు
నడుమ కృష్ణపక్షపు పూర్వపక్ష కాంతులలో అవే నీలాలు
ఉన్నవి రానివి లెక్కేసుకున్నాక వేదన మనసున నిలవదు...


అయినా...
మసక తెరలు తొలగవు; చీకటి మొగ్గలూ విచ్చుకోవు
రేయంతా యాష్టగా వేసట యెరుగని ఆత్రుతగా 
వెలుగు కొసలు ముడివేస్తూ- నిదుర నిప్పులు ఊదుతూ-
నీడల్లో నీడగా, కదలాడే గోడగా ఇదిగో ఇక్కడే బందీగా విరిసే ఓ కల కోసం...

ప్రకృతి ప్రకటన: చెట్లు, వాతావరణం విడదీయలేని బంధం!




ఈ కాండపు బెరడు లోలోపల ఇంతటి పచ్చదనం, వసంత శోభ దాగున్నాయన్న సత్యం వెల్లడి కావడానికి వాతావరణ పరీక్షలు ఎన్ని తట్టుకోవాలి కదా ఈ వృక్షపు వేళ్ళు!?  బలపడుతున్న మనసు పైకి ఎంత మొద్దుగా తోచినా వికసించే తరుణాన ఆ స్ఫూర్తి కూడా తన తాత్త్విక పునాది నుంచే వెల్లడైనట్లు-

విత్తుల పొత్తు విస్ఫోటం

విత్తులు వెదజల్లటమనే ప్రక్రియతో ఆకట్టుకునే ఈ పూవు పేరు డాండలయన్... గాలిగుమ్మటపు తీరుతో ఎగిసిపోతూ ఈ విత్తనాలు ఎటెటో సాగుతాయి, ఒక మెత్తని గోరువెచ్చని తడి నేల వెదుక్కుని దాగిపోతాయి, వసంతం వేళకి మొలకెత్తి పసిడి వన్నెల పూలతో మైమరిపిస్తాయి...ఎప్పుడు మొగ్గ తొడిగాయో నివ్వెరపోయిన నన్ను చూసి రవ్వంత పరిహాసం కలిపిన పరిచితమైన చనువుతో పిలిచాయి ఓ నెల క్రితం  రంగులే పేరుగా రేకలుతోనే రూపురేఖలైన విరులు ఎన్నెన్నో, అందులో త్వరపడి మరుజన్మకి 'మాయ' దారి పరుచుకుంటూ-   



ఎం.నారాయణ శర్మ గారి 'ఈనాటి కవిత' వ్యాఖ్యానం: శీతగానం

కవిత్వం కావాలి కవిత్వం అనుకుంటుంటాం..కాని కవిత్వమంటే..అనే ప్రశ్న చాలా సార్లు..వస్తుంది..ఒక్కో మార్గంలో ఒక్కో రకంగా నిర్వచించు కుంటారు.ఇవన్నీ సరైనవని ఎలా చెప్పలేమో సరికాదనివాదించడానికీ అంతే అవకాశంలేదు.

కవిత్వం కళాతాత్వికభావనలు కనిపించి ఒకసాధారణ దృశ్యాన్ని ప్రతిమగా మహొన్నతంగా అందించాలని కళాతాత్వికులభిప్రాయపడతారు.దృశ్యాన్ని ఆమూర్తంగా కళావ్యాఖ్యానాలు నిలబెడతాయి.ఇందుకు ప్రతీకలు,భావచిత్రాలు ఎక్కువ ఉపయోగపడతాయి.

భావచిత్రం అంటే కనిపించే దృశ్యాన్ని అంతే కళాత్మకంగా వర్ణించడం.దీనికి కవి అందులోని సౌందర్యమూలాలని విడదీసుకుని అనుభవించగలగాలి.మొత్తం వాతావరణంలోని ప్రధాన క్షేత్రాలని తీసుకుని వర్ణించాలి.అలా ఎన్నుకునే అంశాలు కవిచూసిన వాతావరణాన్ని ,దాని సౌందర్యాన్ని ప్రదర్శించగలగాలి.తాననుభవించినదాన్ని అంతే సౌందర్యంగా పాఠకులకు చేర్చాలి.

మరువం ఉష శీతాకాలంలోని ఉదయంలో కనిపించే వాతవరణమ్నించి రెండుదృశ్యాలను,రెండు శబ్దాలను చేదుకుని కళాత్మకంగా ఆదృశ్యాలను వ్యాఖ్యానించి కవిత్వం చేసారు,ఉదయంలోని రాలుతున్న మంచు,కొద్దిగా రంగు రంగుల్లో విస్తరిస్తున్న వెలుగురేఖలు...ఆసమయంలో ఎగురుతున్న పక్షుల రెక్కలచప్పుడు,కదులుతున్న కొమ్మలచప్పుడు ఈవాతవరణాన్ని చిత్రించిన కవిత ఇది.

"మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు...
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే"

"లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ"

"ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను. "

మంచుని మడతవిప్పిన చీర-గా .తొలి కిరణాలని ఇంద్రధనుస్సులో ముంచితీసిన కుంచెగీతలు-గా చెప్పారు..అట్లే శబ్దాలని రెక్కల హోరులా ,ప్రకృతి నట్టువాంగంలా ఉందని అన్నారు.

ఇందులో మంచినిర్మాణంకూడా ఉంది.మొదటివి రెండు దృశ్యాన్ని ప్రకటిస్తే మూడవవాక్యం తన అనుభవాన్ని చెప్పింది.ఇందులోని రెండవభాగంలో లోనూ ఈనిర్మాణం ఉంది కాని ఇందులో శ్రవణానుభవాన్ని ప్రకటించారు.
కాళిదాసు-"ఉద్గాస్యతామిచ్చతి కిన్నెరాణాం తానప్రదాయిత్వమివోపగంతుం"అన్నాడు.-హిమాలయాలలో వీచేపిల్లగాలుల సవ్వడి కిన్నెరలగానానికి కోరస్ లా ఉందని భావం..ప్రకృతితో స్నేహం చేస్తేనే ఇలాంటి అల్లికలు సాధ్యమేమో.-స్నేహమంటే 
చూడటం,వినటం,స్పర్శించటం,దాని గురించి మాట్లాడటమని దానికోసం మనసు ఆరాటపడటమని నీతిశాస్త్రం చెప్పింది.

"దర్శనే స్పర్శనేవాపి శ్రవణేభాషనేపివా
యత్రద్రవత్యంతరంగః సస్నేహ ఇతి కథ్యతే"

ఆస్నేహంలోంచి మంచి భావచిత్రాన్ని కవితగా అందించినందుకు ఉష గారికి అభినందనలు

*****
-శీతగానం-

మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు... 
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే

లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ 

ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను.  
(28/12/2013)

Best of Nature's Craft!





(Canon Powershot SD600 - Jan 2010, My village and land, India)

ఆకు తెప్పలపై  గాలి కెరటాల మీద సోకు పోతున్న సీతాకోక నైతే-  ఎంతో బాగుంటుంది...  

The beauty lies in the camouflage of the leaf and petal... The winds cut the leaf edges and the shades of grass from underneath forms waves and they match with the pattern on the wings.  The best craft and art of Nature!

"బీటల్లం భోజ్యం": అనగనగా అమ్మల కథకొక కొసమెరుపు!


కథలోకి కంటిచూపు తిప్పేలోగా పంచుకోవాలని ఓ- అప్పుడప్పుడు ఆలోచనల్లోకి వచ్చే- ప్రశ్న: కౌసల్య పెట్టకపోయినా కైకేయి ఉందిగా రామబాలకునికి తినిపించన్, యశోద కూరిపెట్టినా తస్కరించి మరింత లాగించన్ కన్నయ్య కి వెన్నతో పెట్టిన విద్య, వకుళమాత పెళ్లిసందడితో సరిపెట్టింది, అంతా మంచి అమ్మలు.  కాకపోతే, కైకసి ఎంచక్కా పూజలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ కనిపిస్తుంది అంటే ఆమెకు కలిగిన నలుగురూ, రావణ, కుంభకర్ణ, విభీషణు, శూర్పణఖలు తిండిపేచీ ఎరుగని బంగారుబిడ్డలా?
 

పోతే, నాకు సస్పెన్స్ కథ నచ్చదు కనుక- ఇందులో నీతి యేమంటే అమ్మైనా నాన్నైనా ప్రతిఘటన, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఎటువంటి మినహాయింపులు ఉండవు, జరిగేది ఒకటే!  

ఇక కథ అంశం పాతదే.  ఈ అమ్మల జీవితం లో ఆవేదన వండింది తినని, అసలు అన్నమే తిననని, ఆకలి లేదంటూనే నానా చెత్త లాగించే పిల్లకాయలతో మొదలై, వాళ్ళు ఆకతాయిలు మాత్రమే కాక ఆటకాయలు కూడా అయినట్లయితే, వారి ఎదుగుదలలో భాగం గా అమ్మకి ఎదురుపాఠాలు నేర్పి పెంపకం ఒక ఎదురీత గా మార్చినప్పుడు ఆక్రోశం గా మారుతుంది. అదే కాలక్రమేణా క్రోధం, క్రౌర్యం ఇత్యాది అష్ట రసాలలో అధిక శాతం రసాలు పీల్చుకున్న మమకారం తగ్గి కారం ఎక్కువై ప్రతీకారం గా మారుతుంది. అనగా, అష్ట నాట్యరసములు శాంతము తోడు చేసుకుని నవరసాలుగా ప్రసిద్ది కనుక అష్ట మాతృ రసములు కూడా శాంతము తో ముగుస్తాయి, అంచేత ఇవి కూడా తొమ్మిదే లెక్కకి.

పిల్లదానితో నా పాట్లు నోము కథల్లోకి ఎక్కాలి- పాక పూజ ఒకటి ముందుగా కనిపెట్టబడి జన ప్రాచుర్యం పొందాలి కనుక ఇక ఆ పనికి నడుం బిగిస్తాను. మీకీపాటికి అర్థమై పోయుండాలి అసలిక్కడ కథ లేదని. మళ్ళీ కథకాని ఈ కథ లోకి...ఎలా వండినా యేమి వండినా కేవలం వికారం అనే ఉద్వేగం తో నాకు "ఇంకా బాగా పెంచాలి, లాలనగా చెప్పుకుని- నాన్నగారు నాకు అలవాటు చేసినట్లే- దీనికీ మన వంటలు వంటబట్టేలా చెయ్యాలి," అనే ఉషారు నాలో పుట్టించటం దానికే చెల్లింది. నేనూ దాదాపు 20సం. వయసు వరకు తిండి దగ్గర పేచీలతో కాల్చుకుతిన్నాను కనుక నాకూ నా పితృదేవతల శాపవశాత్తు ఇవన్నీ సంభవిస్తున్నాయని కూడా నమ్మేదాన్ని. అసలా శాపవిముక్తి కి మార్గం అడగలేదని కూడా గుర్తులేకపోయింది. అదీకాక, శ్రీలంక తమిళుల ఇంట పెరిగి కాస్త, అమెరికన్ చైల్డ్ కేర్ లో ఉండి కాస్త దానికి అదొక రకమైన మిళిత వంటల మక్కువ పెరిగింది. చచ్చీచెడి పప్పు, కూర, చారు, పెరుగు పాట పాడి పాడీ (ఆకేసి ఆం పెట్టి పప్పేసి... విన్నారుగా?!) ఆ 4 తిని అరాయించుకోవటం నేర్పేసరికి దానికి 7 ఏళ్ళు రావటం, వంట చెయ్యాలన్న ఆశయం కలగటం తో నా పాట్లు మొదలయ్యాయి. 

ఇటాలియన్ అలవాటు చేసుకునే సరికి, కొరియన్, అది దాటేసరికి ఈస్ట్ యూరోపియన్ అక్కడ నుంచి ఒక్క అంగలో సౌత్ అమెరికన్ ఇలా అది మొత్తం ప్రపంచ వంటల వేదిక గా నా వంటగదిని మార్చేసాక ఎక్కడో యేదో పరిణామం సంభవించి అది అచ్చంగా ఇండియన్ కిచెన్ కి మారిపోయింది. భలే భలే అని బాంగ్రా, డాండియా ఆడేలోపే కథక్, కథాకళి బాణీల్లోకి తోసేసి పలానా కూరగాయ పలానాగా వండితే తింటాను అనే విప్లవం లేవదీసింది. ఇక నా సహనంకి కాలం చెల్లిపోయింది. మరి యేమి చేసానయా అనంటే ...

.. గ్రీన్స్ మంచివి అని ఒప్పించి ఒక్కసారే 4-6 పచ్చ పచ్చాని కూరలు వండేసి దానికి నచ్చిన ఆ ఒక్క రకం పే...ద్ద గిన్నెలో చూపి మిగతావి మధ్య మధ్య ముద్దల్లో నొక్కేసి దాని నోట్లోకి కుక్కేయటం (ఖచ్చితంగా నేనే తినిపిస్తా ఆ పూట) అంటే బెండ, బీర, సొర, పొట్ల, జుకినీ, బీన్స్, కాకర, స్పినాచ్ గట్రా
.. తనంత తనే తిన్నప్పుడు మెత్తగా నూరేసిన హెర్బ్స్ , స్పైసెస్ గ్రేవీలోకి కలిపేసి ఎలాగోలా కమ్మని రుచి రప్పించి కోరి కూరుకుని తినేలా మాయ చెయ్యడం- ఈ రకం గా ముల్లంగి, కాబేజీ, బ్రస్సెల్ స్ప్రౌట్స్ ముద్దల్లోకి ముద్దుగా చేరిపోతాయి
.. ఖచ్చితం గా ఈ లిస్ట్ లోవి వండినప్పుడు ఇవాళ రణం తప్పదు అనుకున్నప్పుడు ఉదయం నుంచి భోజనం అయ్యేదాక మౌనవ్రతం లేదా తీక్షణ దృక్కుల ముద్ర వేసుకుని తిన్న కంచాలు సింక్ లోకి చేరాక శాంతం పులుముకోవటం


అటువంటి ఒక రణభరిత వంటకం ఇది: 'బంగాళ భౌ భౌ' అని శ్రీలక్ష్మి "చంటబ్బాయ్" సినిమాలో భయపెట్టినట్లు కాదు కానీ దీనికి "బీటల్లం భోజ్యం" అని పేరు పెట్టా; చెయ్యడం మీ చేతి బలాన్ని బట్టి ఉంటుంది- పోపు కమ్మగా వేసుకుని, ఘాటుకి తగ్గ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాట ముక్కలు ఐదారు నిమిషాల ఎడం లో వేసి మగ్గ పెట్టి, ఉప్పు పసుపు గట్రా వేసుకుని, బీట్ రూట్ పేస్ట్ (అప్పుడే రుబ్బాలి) వేసి దగ్గరగా ఉడకనిచ్చి, జీలకర్ర ధనియాల పొడి కూడా రంగరించి, అప్పుడు అస్సలు రుచికి ఆదరువు అయిన మామిడిఅల్లం ఎంచక్కా కోరుకుని ఎంచక్కా పైపైన చల్లి 2 నిమిషాలు ఉడకబెట్టి, తురిమిన కొత్తిమీర, కుంకుడు గింజంత వెన్న వేసి, మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచి ఆపాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అర్థం అయిందా చెయ్యి ఎన్ని రకాలుగా తిప్పాలో? ఇలా చేసిన ఈ కమ్మటి భోజ్యం వేడి వేడి బ్రౌన్ రైస్ లేదా గోధుమ రొట్టెలకి భలే జతపడుతుంది. 

ఇలా నేర్చుకున్న పెంచుడుతనం ఏకలవ్య విద్య కనుక ఎవరెవరి పిల్లలని బట్టి వారే ప్రతీకారం తో సాధించాలి, మధ్య మధ్యలో తోసుకువచ్చే అమ్మతనాన్ని ప్రతిఘటిస్తూ! కథ ఇక ?? కి, మనమిక మరొక వంటలోకి...

కాసుల ప్రతాప రెడ్డి గారి 'కవిస్వరం' లో : "లోపలి చూపు"

ఆత్మను పిడికిట పట్టుకుని లోలోతుల్లోకి పయనిస్తూ అనుభవాలను, అనుభూతులను నెమరేసుకుంటూ సాగిన కవిత ఉష రాసిన లోపలి చూపు. ఆత్మానుభూతిని అల్పక్షరాల్లో వ్యక్తీకరించి పాఠకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుందీ కవిత. ఇల్లు కేవలం ఓ భౌతిక రూపం కాదనే ఎరుకను కలగజేస్తుంది. ఇంటి చుట్టూ, ఇంట్లోనూ మన జీవితం పరుచుకుని ఉంటుంది. జీవన యానంలో ముందుకు నడిచిన తర్వాత గతంలోని పలు విషయాలు, సంఘటనలు గుర్తుకు వచ్చినప్పుడు పొందే అనుభూతిని కేవలం భౌతిక విషయంగా కాకుండా లోలోతుల్లోని ఆత్మ తండ్లాటగా ఆమె ఈ కవితను తీర్చిదిద్దారు. ఇల్లును దర్శించడానికి ఆమె ఆత్మ కిటికీ తెరిచి లోలోనికి ప్రయాణించారు. మెదడు తోట అయినప్పుడు ఆలోచనలు విత్తనాలవుతాయి. ఆ విత్తనాలు మళ్లీ తోటలో కొత్త మొక్కలై వ్యాపిస్తాయి. ఇలా జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. భౌతిక ప్రపంచంలోంచి ఆత్మలోకంలోకి ప్రయాణం చేసిన ఈ కవిత పాఠకుడికి జీవితం పట్ల నిర్మమకార స్థితిని కలగజేస్తుంది. ఈ నిర్మమకారం మనిషిని ఈర్ష్యాద్వేషాలకు, రాగానురాగాలకు దూరం చేసి లోకాన్ని ఉన్నదున్నట్లుగా చూసే తత్వాన్ని మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని వస్తుగతంగా దర్శించే చూపును ఇస్తుంది. కవిత మొత్తంగా మానవ జీవితంలోని సారాన్ని అందిస్తుంది. - కాసుల ప్రతాప రెడ్డి

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-
చావిట్లో ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ
అలవోకగా మనసు తలుపు తెరిచి గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ
మరిన్ని గోచరమౌతూ
కలగా ముగిసినవో కథలై మిగిలినవో కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds" కావచ్చు...
అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...

*****

-లోపలి చూపు-

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-

చావిట్లో 
ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో 
చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో
వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు
వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ 

అలవోకగా మనసు తలుపు తెరిచి
గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ మరిన్ని గోచరమౌతూ

కలగా ముగిసినవో
కథలై మిగిలినవో
కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds"

కావచ్చు...

అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...
(09/05/2014)

ఎవరిదీ స్వర్గం

సూర్యుడు చంద్రుడు వస్తూ పోతూ, చెట్లు గాలులు ఆడుతూ, పిట్టలు పిల్లలు పాడుతూ, పువ్వులు ఆకులు నవ్వుతూ కనిపిస్తారు/వినిపిస్తారు-  మబ్బులు ఎగురుతూ వానలు వెదుకుతూ వస్తాయి... మరిక ఎవరో 'ఇదిగో దేవకన్నెల నాట్యాలు , గంధర్వ గానాలు, యక్షినీ మాయలు, కిన్నెర కింపురుష హొయలు, ఆకస గంగలు,' అని ఒక స్వర్గాన్ని ఎందుకు వివరించాలి, నా నిర్వచనం నాకు అందాక!? నేను నా స్వర్గపు ద్వారాలు, ఎల్లలు దాటుకుని  ప్రాపంచిక పోకడల నరకం వైపు తొంగి చూడను; చూసినా ఫర్వాలేదు అక్కడ కొన్ని సాహిత్యాలు, సంగీతాలు, సుందరవనాలు  స్వర్గం ఖాళీ లేదని అద్దెకి ఉంటున్నాయి, వాటితో సావాసం చేసేస్తా! 

Heart of Nature!


చిగురాకు ఎదిగినట్లే ప్రేమ ఎదగాలని, పచ్చని వనమై జగతి మురవాలని కాబోలు!

ప్రతికృతి

దోబూచులలో దోగాడే నీడలు జాడని పట్టిచ్చాయి-
మోము దాచినవాని మోవి దాగినా, పిల్లనగ్రోవి సాటిమొక్క లో ఒదిగినట్లుగా.
ఆకులే నెమలీకలుగా అమిరినట్లు వనమాలి రూపు నవ్యతని కూర్చుకున్నట్లు
మదిలో మధురమైన ఊహ ఒకటి మరలి మరలి వచ్చేది అందుకేనా!?