వేసట

అలిసిన పాదం మలుపుకొక పదపు ఊపిరి విడుస్తూ
పొదలు, ఎద సొదలు ఒక్కటై విరబూస్తూ
సిరల్లో ఉరకలెత్తే ఆశ పూల నీడలై తేలుతూ
వనమాలీ! నీ జాడకై ప్రకృతినై, పరవశమై సోలిపోయాను, దరికి రావూ!?
పాట కడతావో, పదాలు పాదాలు స్పర్శించిపోతావో...
వెలుగునీడల వేళ, వెన్నెల మరిగిన పూట,
అడుగులు తడబడిన నడకల
అలికిడి మరిచిన అడవి దారుల
ఆకలి దప్పులు వీడిన పగటిలో, కలత చెదరని మనసుతో
నదులుగా, నది వరదల దిగులుగా, పొగులుతూ పొంగుతూ చివరికిలా కృంగుతూ

వేచేటి వేళ

విరియబూస్తూన్న వేళ
పెనుగాలి దాడి చేసింది
ఏ తావున మలిగిపోతాయో నలిగి వాకిట పడి ఉన్న ఈ రేకులు!
కలలు, పూలు కలిసి రాలిపోతున్నాయి
నిన్నటి తావి ఒకటి గుండెలో తలదాచుకుంది,
నిదురని తొలిచే మెలకువలో తన పిలుపు నిలిచినట్లు.
ఆకులు కొమ్మని హత్తుకున్నట్లు తలపులు-
మరొక ఆమనికై తోటలా
తన రాకకై విధి వంకా, వీధి దిక్కుగా ప్రతి క్షణమూ ప్రతీక్షణము...

సుమ'మయ'సభ

 మొగ్గకొక ముగ్ధగా, ఆ తనువెల్ల తడిమితే పులకించి పూలు పూసినట్లుగా లేదూ!
కొమ్మకొక నారి సంధించి ధనువు నెవరు ఎత్తినారో, మధువు చిందించే నవ్వుల నారిగా మారి మాయచేసెనో? చెంతచేర రమ్మనెనో...

వ్యాఖ్యల హారం!


1 చిగురాకు నిచ్చెనలెక్కి చెలియ చూపు నిను చేరేనోయీ, ఓ సఖా
2 పక్షి: నేను సైతం చివురాకునై కొమ్మన ఊగుతా
ఆకులు: మేము సైతం రెక్కలు గట్టుకు రివ్వున ఎగురుతాము
3 వియతికెన్ని ఊహలో _ పత్ర మంజూషాన్ని గాంధర్వంగా మలిచెయ్యాలని...!
4 కాలమో పిల్లనగ్రోవి _ శిశిరాన్ని దాటేస్తూ వసంతాన్ని పల్లవిస్తూ...!
5 మావి చిగురు తినకున్న - పిట్ట కూత కూసింది
6 కోయిల మదిలో చిగురించే చిరు ఆశ, బదులిచ్చే చెలి చేరునని
7 కులుకుల చిలుకు తన్మయియై చిగురుదళముల పరిచి నిలిచినదెవరి కోసమో!
8 చిరుజల్లులే చిగురాకులుగా మారి వేసిన లతల అలలలో కలగా కలిసిపోతూ తోటలో మెరిసిన ఈ మౌన శకుంతం ఆలాపిస్తున్న గీతమేమిటో
9 చిగుర్లుగా పేర్చుకుంటోంది కోకిల గానాన్ని. పొందికైన రాగం.
10 చిగురించే తోటలోకి కోకిలొకటి వచ్చిందీ
11 రేపటి కోసం ఇవ్వల్టి ఎదురుచూపు! 'waiting'
12 చిగురంత ఆశ తో... ఆకాశమంత ఎదురు చూపుతో.. నీకై వేచి వున్నా.. సఖీ..! 
# మొదటి 2 వ్యాఖ్యలు నావి, తతిమావి స్నేహితులు పంచినవి 

విస్మయం

తెలతెల్లని ఉదయపు సనసన్నని వాన-
ఆదమరిచి గాలి, తానూ నిలిచి చూసిన వేళ
పులకింతలు

సు జాతి పూలలా విప్పుకుని
తనువునా, తరువునా నిలవనంటున్నాయి.
పక్కకు తప్పుకు పోనీయని

పొన్న పూలలా
పలుకరింతలు పట్టి లాగుతున్నాయి
అప్పటికప్పుడు విప్పుకునే

పద్మాల్లా
పలవరింతలేవో ఎదని తొలుచుకువస్తున్నాయి
పట్టువదలని కలలేవో

కలవరింతల కదంబాలు అల్లుతుంటే,
పట్టలేనితనమొకటి వేటాడి

తనువుని విప్పిపోసిన పూల పొట్లం చేసి వదిలింది.
చింత, పరికింత

పసరు కట్టని చిగురు ఆకుల్లో దాగున్నాయేమో!?
పండుటాకు రాసులలో

నిరాశలు నేల ఒడిలోకి జారిపోయాయా...
పుటము లో మిగిలిన తావిలా

మనమున వీడని మోహమే ఇప్పుడిక!

యశస్వి "రెండుమాటలు", కవితత్వాల సంకలనం నుంచి...

Park Full of People...

నిర్జన వాడల్లో వాడని వసంతం పొంగుకొస్తుంది...
చిట్టి చిలుకలు పరుగులు పెడుతున్నాయి
గడ్డి పరుపులు మీద దొర్లాడుతున్నాయి
మాటలు చిగురు వేసి మనుషులు ఎదుగుతున్నారు
నవ్వులు విచ్చుకుని గుభాళిస్తున్నాయి!

at last it is Spring Magic !!!

మౌనగీతం

పచ్చిక మైదానపు తనువు మీదుగా పలుచని కాంతి వలువ
పశ్చిమ కనుమలోకి జారిపోతూన్న సాయం వేళ,
నీడ వెంట నీడగా గాలితెరలు తరలిపోతున్నవేళ...
నెలవంక అంచున జిగి, శ్యామాంబరం జతకడతాయో,
వాగువంకల దాపున పిట్టలు, కీచురాళ్ళు జతులాడుతాయో!?
దేహం మేఘావృతం అవుతుంది, ఒంటరి వాన వెల్లువౌతుంది.

ఒక తూరుపు వెచ్చని తొలి తాకిడి
ముసుగు కప్పుతున్న నీహారికనూ, తడికళ్ళనూ
తనలోకి తీసుకునే వేళవరకు తీరని దిగులే మౌనగీతమౌతుంది