కొన్ని దుఃఖాలు
నీలో కొన్ని మరణాంతర యానాలకి
సాగరాలై సంగమిస్తాయి
మరి కొన్ని పూలు
నీలో ఎన్నో భవ/భావన అగాధాలలో
ఎగిరే మిణుగురులై ఎదురౌతాయి.
ఒక నిష్క్రమణ నిర్దయగా
కన్నీటి కడలిలో ముంచెత్తుతూ
నడుమ నడుమ తన తాలూకు కొత్త పరిమళపు గాలులలో సేదతీరమని వీలునామా వదిలి పోతుంది...
ఎన్నో వేల పూలలో
ఆచూకీలు వెదుక్కున్నప్పుడు
ఎరుకకి వస్తుంది జ్ఞాపకాలు అలా పూలగా
రూపప్రక్రియకి లోనయ్యే
ఘటనలు మటుకు గాయపూరితమేననీ,
ఎన్నో పూల చెట్లు మొక్కలు నీ కనుమరుగయ్యాయని,
నీలో ఒకానొక కడలి కూడ ఉప్పుదేరి
బరువైన స్ఫటికలుగా మారిందని,
మరొకటీ గ్రహణకి వస్తుంది-
కొత్త కడలి పాత కడలికి మరుజన్మనిస్తుంది,
ఒక్కొక్క శోకం
మరిచామన్న వాటిని పూడిక తీసి పారేలా తీస్తాయని.
దుఃఖాలు పూలు ఒక జత అని-
రెంటికీ నీలో ప్రేమ మాత్రమే ధాతువని...