ప్రదర్శన

తల్లివేరు, తాము విడివడిన కొమ్మారెమ్మల జాడ తెలియని ఆకులు
ఎన్ని ప్రదక్షిణాలు చేస్తూ వెదుకులాటలో!  చీరికలు, మచ్చలు, చీకిన ఈనెలు...
వానధారలో అమ్మదనం కురిసినట్లు-
ఆకులలో మెరుపు వచ్చింది,  నిశ్చలంగా నేలలోకి ఒదిగిపోయాయి

విచ్చుకున్న రేకుల్లో వన్నెకొక వయ్యారాలతో గాలికి ఊగిన పూలు
ఎన్నలేని బింకపు చేతల విరగబాటులో! తుమ్మెదలు, తూనీగలు, చుట్టూ గిరికీలు...
కిరణమాలి సెగదనం కమ్మినట్లు-
సెకనులో వర్ణాలు మాయమైనట్లు, సూర్యకాంతి బింబిస్తూ కొమ్మలోకి ఒదిగిపోయాయి

ఎండావానల ఇంద్రజాలం ఇలాతలం లో ఎందరికి మేలుకొలుపు!? 

జుగల్‌బందీ

చిందులు వేసే ఆకొకటి సీతాకోక చిలుక రెక్కల్లో చిక్కుకుపోయింది
బిత్తరపోయిన గోరువంక చిర్రున ఎగిరిపోయింది. 
చీకట్లు వీడకుండానే తిష్టవేసిన చిక్కటివాన పగటిరేడుకి దారి కాచినట్లుంది,
చిమ్నీ చుట్టూ దీపపు పురుగుల మాదిరిగా నిప్పుగూడు తెరకి గాలులు   

చిత్రమైన కచ్చేరీ:
డెక్ మీద డప్పుల్లా వాన జల్లులు,  
గట్టర్ పైపు వేణువులో నీటి ధారలు
తోచిన ఆటపాటలలో కూరుకుపోతూ పిల్లమూకలు

విచిత్రమైన మౌనం: 
నానిన పూరేకులు కురుస్తున్నాయి కుంపట్ల మట్టిలోకి; తోడుగా,
దొరికిన ధాన్యాలు పోగేసుకుని ఉడుతలు, పిచ్చుకలు
చెదిరిన మొక్కలు సర్దుకుంటూ తోటమాలులు

తెరిచిన కనుల్లో గుండె ని నింపుకుని తేరిపారా చూస్తే,
విరించి కదలాడినా, కృతులు నడయాడినా తనువూ తరిస్తుంది.
తరువుల దాపున ఆకాశ పందిరిలో తడినేల మీద
విరులు పిలిచినా, మొగులు కురిసినా మనసూ మయూరమౌతుంది.

శీతకారు గమనాన

ఓరుగాలి, జడివాన జతపడిన విలయ తాండవం:
కోటానుకోట్ల పత్రాలు ఏరులై, ఏటి నడుమ మేటలై
చీకటి దాగలేని తోపుల్లో,  పిట్టలు విడిచిన మోడుల్లో
అనేకానేక కిరణశలాకలు ఆకులై, ఆకులపొదిలో పూలగుత్తులై
దుఃఖపాటు ఘడియలు ఉన్నపళంగా వచ్చిపడ్డట్టు, 
ఓదార్చే హృదయాలు చరాలున  చేరువైనట్లు 
ప్రకృతి ఉగ్గబట్టిన ఊసుకి వార్థక్యము యుగాంతం వరకు రాదు. 

సాచిన కొమ్మలతో వారిస్తూ "ఉన్నదొక్కటే వసంతానికి ప్రతీక్ష" ఎవరి స్వరమో!?

నేలపొరలో వత్తిగిల్లుతూ విత్తనమొకటి "అంకురమై వస్తా,"నన్నట్లే   

మేల్కొలుపు లోలోపల ఊహలకి, ఊహకందని ఊర్పులకి.

లెక్కకందని భాష్పధారలు ఏరులై, ఏటి నడుమ గుండాలై
తడారని కనులు, తడారిన ధమనులు తెరిపిన పడతాయి
చిగురు తొడిగిన మనిషి పచ్చని వృక్షమై నీడనిస్తే
మొలకల మేనిలో రంగుపూల ఉనికి పెల్లుబుకుతుంది
చిట్టచివరికి జీవనం- గమ్యం చేరిన గమనం- ప్రకృతిపరం
వరమూ అవుతుంది, వేళ్ళూనిన నమ్మికతో విశ్వాత్మ ని దర్శిస్తే.

(తానా పత్రిక నవంబర్ 2015 సంచిక లో ప్రచురితం)

http://patrika.tana.org/november2015/#p=38

సుమసందేశాల...

కథ చెపుతాను 'ఊ..' కొడతారా మరి, ఊహల పల్లకిలో ఊరేగుతారా!?
అనగనగా ఓ గూడు లేని వాడు- బుజ్జిగాడు- చూసినాడు ఒక చిన్నారిని.
బుట్టలో పూలగుట్ట పెట్టుకుని పడినాడు క్రీగంటనైనా చూడని చిగురుటాకుబోడి వెంట
'అకటా! వీడిక సుమసందేశాల పాలబడినాడ'ని నవ్వెనట చెట్టూ పుట్టల పూచేటి పూలన్నీ పులకించి.
(Dt of clicks: 10/07/15 9:12 - 9:15am)









తరు తన్మయం

వెలుగు రేఖలు విప్పుతూ వస్తున్న ఉదయభానుని పలకరించాలని ఉంటుంది-

కొమ్మని పట్టుకుని వేలాడే నిన్నటి జాజులు, మొన్నటి కరవీరలు
పరుచుకున్న పారిజాతాలు, రేకులు తెరుచుకుని తామరలు
వికసిస్తున్న మందారాలు, వేళకాని వేళకే సిద్ధంగా ఉన్న నిత్యమల్లెలు
గిన్నెమల్లి, పొన్న పూలు, కాశీరత్నాలు ...పూచేటి పూలు పిలుస్తుంటాయి

మెలకువ, మరకువ వంతులేసుకుని నా నుంచి నన్ను విడదీస్తాయి

మల్లెలు మధ్యాహ్నానికే వనాలు వీడిపోతాయి 
రాధామనోహరాలు రాత్రీపగలు ఎరుగవు 
కనకాంబరాలు, వాడాంబరాలు, నీలాంబరాలు నిలువరిస్తాయి 
సందె పొద్దు వరకు గాలుల వెంటా, చూపుల నిండా పరిమళాలు, రంగులే రంగులు

రజనీకాంతుని రాకకి సన్నాహాలు మొదలౌతాయి

కలువకి కంగారు మరీ ఎక్కువ కొలను నిండా ఒరుసుకుని...
సంపెంగ గంధాలు చిలుకరిస్తూ గాలులు
మైమరపు మలాము అద్దుతూ ఎన్నెన్నో జాజరలు, నిదురలోకి జారిపోతూ నేను 
వెలుగు ముడుచుకోదని నా రెప్పలే మూసుకున్నానని తలపోస్తాను, చీకటి గుండెలో చిత్రాలు కంటాను

నేనొక తరువునై నర్తిస్తాను- రెమ్మకొక రంగుగా, వన్నెకొక పూవుగా, నాలోకి నేను వికసిస్తాను- ఆనందోదయాన పునః ప్రభవిస్తాను..నేలని వాటేసుకుని పులకిస్తాను.