దయార్ద్ర దృక్కు

అంతదాకా జరిగిన ఘటనలు మర్చిపోయాను
నిజానికి గుర్తుండేవేవీ జరగనూ లేదీ రోజు.

ఆ చిన్ని కళ్ళ కాంతికి-
మా నడుమ దూరమే
నీడగా నా మీద వాలినట్టుగా ఉంది
అలవాటైన అలవోకడతో అమ్మ భుజమెక్కి
నాకోసమో ఆత్మీయ కరచాలనం అందిస్తూ...

'బుజ్జితల్లి' అవును అచ్చంగా అదొక 'బుజ్జితల్లి'
బారలు జాపిన నా చేతుల్లో ఆ బుజ్జాయి
అనుకోకుండా ఆకాశం లోకి చూసాను
ఏ దేవతా పుష్పం రాలిపడిందోనని అబ్బరంగా

బుల్లి పాదాల కేళికి పరవశించి
ఉయ్యాల పరుపుగా మారిపోవాలని ఊహ కలిగింది
గుప్పిళ్ళు కూరిన నోట సొంగ, చొల్లుమాటలు
ఒకదాని వెంట ఒకటి, చెప్పలేని హాయి
అందినంతవరకు అద్దుకున్నాను అత్తరులా
పాపాయ్ బట్టలు పదే పదే తడుముకున్నాను
ఎందుకో తెలియదు, అమ్మ స్పర్శలానే ఉందనిపించింది

"బుజ్జితల్లి" నా పిలుపు నీకు నచ్చినట్లేనా,
నా మాటలన్నీ అర్థమైనట్లు నిక్కి చూస్తున్నావు?
రవ్వంత కాలం నా బతుకున మెసిలిన ఆత్మబంధువా
నీ నవ్వుల లోకాన నన్ను నిలిపిన బుజ్జితల్లీ
ఆపుడపుడూ ఇలా పలకరించిపోవే
ఈ రూపున కాకపోయినా, ఇంకొక చిన్నారిగా...

నిజానికి నీ కళ్ళు నాకు పరిచయమే
ఆ కళ్ల లోని దయ కొరకే అన్వేషిస్తాను
నిరంతరం తపిస్తాను
ఇంతకు మించి ఒకరికొకరం ఏమీ చెప్పుకోవద్దు
ఈ రేయికి తలుచుకోను ఇపుడు నీ జ్ఞాపకం ఉంది నాకు.

(మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు, కానీ ఆదరం గా ఆదమరిపించిన ఆ చంటిపాప మిగిల్చిన అనుభూతికి కృతజ్ఞతగా.)

వింటున్నావా?

పున్నాగ బూరలు ఊదుతూ,
పారిజాతం రాలిపడుతూ
పరిమళం పంచిపెడుతున్నాయి-
ఆవరణ అంతా మేని పులకింతలే.

చిటారు కొమ్మన సీమచింత,
కావేసిన మావిడి పంట
నోరూరిస్తున్నాయి-
చావిడి నిండా చాపిన చేతులే.

గోడ మీదుగా లావాదేవీలు
ఇటు ముంజెలు అటుగా,
అటు మొగ్గలు ఇటుగా మారకం.

ఒప్పులకుప్ప, తొక్కుడుబిళ్ళ
ఆడనంటే చెల్లదక్కడ,
పూలజడ చెదిరితే ఒప్పుకోరిక్కడ
తేలని లెక్కల్లో తెగని ఆరాటం.

మొన్నటి ఊసులు
నిన్నటి ఆశలు
నేటి కలలు
ఏదైతేనేమి
మనుగడకి ఊపిరులు కాదా!?

కంటి కాంతులకి కొదవ లేదు:
మెరుపులు మసకేస్తే
మెరుగులు పెట్టటమే
మాగన్ను కునుకులో జోగటమే, బతుకంతా ఇకపై...

మరలు తిప్పుకుంటూ మళ్ళి పోను,
మమతలెరుగని యాంత్రికత లోకి.
ఎదురీత బారల్లో ఎద నిండా తృష్ణ పీల్చుకుంటా-
వస్తావా మరి నాతో చెయ్యీ చెయ్యీ కలిపి?

వికిరణం

"నాకేమీ ఆకారాలు కనిపించలే"దన్న స్వరం లో వారింపు
"ఇప్పుడూ సవ్వళ్ళు వినిపించలేదు" ఖండింపుకి చూపు జోడి
చివరి ప్రయత్నం "అలానూ అనిపించలేదు మరి" గా మిగిలిపోయాక
ఇక గుప్పిళ్ళు విప్పాలనిపించ లేదు, 
గుండె చప్పుడు కూడా...
అక్షరాలని విభజించి 
అణుశక్తి వెలికి తీయాలంటే 
మరో ఇంద్రియం అవసరం
ఈ అసంఖ్యాక మెదళ్ళు 
ఎప్పటికీ అపరిచితమే, 
నేనొక మబ్బుకమ్మిన ఆకాశం కావచ్చు
ఆ వాస్తవ చిత్రం లో 

బావిలో కడలి హోరు, 
దేహం లో పాకే అలజడి.
గోడలకి తలబాదుకునే యోచనల అలికిడి లో-
కెరటాల మీద నీడలు తేలుతూ, 
నన్నో నిన్నో ఆకృతిగా మలుస్తుంటే
నిశ్శబ్దం రాకున్నా బాగుంది, 
ఏదో అనిపిస్తే ఇంకాస్త బాగుంది
ఆగని ఆరాటాలకి భాష్యం చెప్పాలని 
నియమం లేదు - మన నడుమ...
ఈ అసంకల్పిత ఆనందానికి ఎప్పటికీ వాహికనే, 
నీవొక చల్లని కిరణసమూహం అవుతుంటావు 
ఆశలు పొడచూపితే.

అంతే అంతకన్నా ఏమీ లేదు కూడా...

చిన్నప్పుడు చదివిన బళ్ళోకి నడుచుకుంటూ వెళ్లి
తరగతి గదిలో ఏదో ఒక బెంచీలో కూలబడి- 
అంతవరకూ ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోయిన మనసుతో, 
ఖాళీగా ఉన్న ఆ పరిసరాలని పోలిన తీరుతో రవ్వంత సేపు, 
కలదిరుగుతూ అసెంబ్లీ సమయానికి ముందు, 
ఆటల బెల్లు మోగాకా  
కోలాహలంగా ఉండే బడి ఆవరణ వంటి మదితో 
కాస్తంతసేపూ గడిపినట్లుగా ఉంది- 
6 ఏళ్ళు గడిచిన ఈ బ్లాగు 
తొలినాళ్ళ నుంచి ఈనాటి వరకు 
అనుభవాలు తలపోసుకుంటుంటే...
పాత బడి మధురిమ
ఎప్పటికీ పాతబడదు.

నాటుకునేందుకొక నేల

గతి తప్పని కిరణాలు, తొలకరి జల్లులు కురిసిపోయాయి, 
మెత్తగా నలుగుతూ, గోరు వెచ్చని ఆవిరి కక్కుతూ మట్టినేల
వరుసలలో అంకురిస్తున్న మొలకల, అలవికానంతగా పాకిన పచ్చికల పసిరివాసనలతో.
లోలోనా దుఃఖ భూమి, దుగ్ధ విత్తులు చెల్లాచెదురుగా మొలకెత్తుతూ.
చతికిలపడి మన్ను మీదకి మోము వాల్చుకుని "అమ్మా" అన్నంతలో
గుప్పెడు గాలి బరువుగా గుండెలోకి, చప్పుడు లేని చీకటి రేఖలు దేహమంతా ఆవరిస్తూ.
మళ్ళీ వాన కురుస్తుంది కళ్ళనుంచి, పచ్చికలు ఒళ్ళు సాగదీసి చూస్తుంటే...
వేయి పంటలు వేవేల హస్తాలకి అందించిన నేల, మరిన్ని మార్లు దుక్కిపోట్లకు సిద్ధమౌతూ-
ఈ మట్టి మీద ఎందరి ఆనంద విషాదాలకి వీలునామాలు రాసిఉన్నాయో!
ఒక్కొక్క దారపు పోగు తెగుతున్న చప్పుడు నా నుంచి నాకు ప్రసారమౌతూ
ముళ్ళు విడివడిన మనసు పచ్చని పైరులా, తేలికపడ్డ పిడికెడు నిశ్వాసగా
నిటారుగా నిలుచుని అడుగులు వేస్తుంటే నీటిబుడగల నవ్వులతో "పోయి రమ్మంటూ" నా మట్టితల్లి.


మబ్బులు విడివడి...

అక్కడక్కడా పిల్లకాలువలు కట్టుకుని
భూమిలోకి ఇనకనని మొరాయిస్తున్నాయి వానచినుకులు.
నిన్నలేని కొత్త కాలనీలను చూసి వలస పక్షులు
వింతపడుతూనే నిమ్మళం గా ఒళ్ళు కడుక్కుంటున్నాయి.
ఎప్పుడూ ఉన్న చెట్లు, ఇప్పుడిప్పుడే విచ్చుకున్న పూలు
ఆకాశం నుంచి ఆరాటం గా దిగుతున్న నీటి మబ్బులకి
వసతి ఏర్పాట్లలో హడావుడిగా మాట్లాడేసుకుంటున్నాయి.
కిటికీచట్రాలు అడ్డం పడి ఆగిన ఆ కాసిని నీటిబొట్లు
బాధన్నది ఎరుగనట్లే జారుడుబండ ఆడుకుంటున్నాయి.
వానంటేనే ఆహ్లాదం, వానొస్తే చెప్పలేనంత ఆనందం ఎప్పటికీను...

అక్షరాలు

అవి ఒక్కోసారి ఒక్కోమాదిరిగా అగుపిస్తాయి సుమా! ఒక్కోసారి మాటకి అందవు, మరోసారి మనసుని నిలవనీయవు. ఓ మారు తోటకి నీళ్ళు పెడుతూ, ఓ మొక్క వెంట కళ్ళు పాకిస్తే, మూడురకాలుగా జారిపడ్డాయి.

.. ఆకుల జారుడుబండల మీద కేరింతలు కొట్టే నీటిబొట్టు గుసగుసలు తుమ్మెద రెక్కలకి బదిలీ అవుతున్నాయి. 

.. కొమ్మల మీద పాకే చీమలు వంతెన నిర్మాణకూలీల్లా ఎంత క్రమశిక్షణగా మెలుగుతున్నాయో, మరా పోకడ మదిలో మెదిలే ఆలోచనలకి రాదేమి? రద్దీలో బస్సో, రైలో ఎక్కే జనాల తొక్కిసలాటకి పోటీ వస్తాయెప్పుడూను. 

.. పూలకుంచెలతో కళ్ళ కాన్వాసు మీద ఊహల కందని లోకాతీతమైన చిత్తరువులు తీర్చిదిద్దుతున్నదెవరో! ఆ రెమ్మల చేతుల్లో రవివర్మ ఆవహించినట్టుగా లేదూ!!!

ఋతురాగం

తెలవారకనే కిటికీ అద్దాలకి
వెలుగు శీలలు కొట్టుకుంటూ, నీడల పటాలు వేలాడదీస్తూ
ఇక్కడేదో అలుముకుంటుంది తెల్లని తేటదనంతో.
మెల్లగా మంచు బిందువుల మచ్చలు కలిసిపోతున్నాయి.
కనపడినంత మేరా
లేతాకు ఉయ్యాలలో, విచ్చీవిచ్చని మొగ్గలలో
వసంతవిలాసం కవ్విస్తుంది వయ్యారంగా.
కొత్తగా-ఎద కనులకి,మది కలానికి- అందనిదేదో అవుతూనే ఉంటుంది.

వన్నెచిన్నెలు



                                 

నైమిత్తిక జీవిత ఆనవాళ్ళ వెంట నిలవని క్షణాల బతుకురణ సారథ్యం లోనూ
మనసు భాష్యాలకి కొదవ లేదంటే కంటి ఆవరణకీ అవధి ఉండదు- 
ఉరుకుల పరుగుల్లో ఒకింత మన వైపుగా దృక్కులు సారించే ఉడుత కావచ్చు, 
కొమ్మలంచున తాళం వేస్తూ శ్రుతిలయలు తప్పని గీతాలాలపించే పిట్టా కావచ్చు
'జీవన సౌందర్య రసావిష్కరణకు ఆరో ఇంద్రియం మరేదీ కాదు హృదయమే'నని చెప్పేందుకు!!! 

ఎందుకో మరిలా

అపుడపుడు మనసు ముసురేసుకుంటుంది 
మాటల చినుకులు రాల్చి తెరిపిన పడుతుంది
తెప్పరిల్లిన ఘడియల్లోకి పొద్దు వాలుతుంది 
నిదుర ముసుగులోకి మెల్లగా ఒదిగిపోతుంది 
పెదవులపై నవ్వుల నెలవంక మెరుస్తుంది 
కలలకు కారణాలు వెదక వద్దంటుంది...