ఓ ఇంటి ఉగాది సందడి

ఫాన్ ఆపేసి, రేడియో సౌండ్ పెంచేసి, "పిల్లలూ లెగాలిక" నూనె రాసుకున్న ఒళ్ళు, తల తో నాన్న రూపం కళ్ళు నులుముకుంటూ తెరుచుకున్న మసక చూపుకి ముందుగా అందేది. అటుగానో ఇటుగానో తలకి పెట్టుకున్న పిడపతో, ముఖానికి రాసుకున్న పసుపు వన్నెలో కుంకుమ తడితో హడావుడిగా తిరుగుతూ అమ్మ (మరి పులిహోర, బొబ్బట్లు, గారెలు, ఆవళ్ళు, పరమాన్నం...వగైరా చెయ్యొద్దూ ఒక్క చేత్తో), పెరట్లో మామ్మ (నానమ్మ) పూలమాలలు అల్లుతూ ఉండాలి తప్పనిసరిగా! ఇక తప్పక లేస్తామా, పెద్ద శిక్ష! దంతధావనం అవగానే ఎప్పుడూ "ఎత్తిన గ్లాసు దింపకుండా తాగాలి" అని వత్తిడి పెడ్తూ నాన్న ఇచ్చే వేడిపాలు దొరకవు సరి కదా, నాన్న గారే వంటికి శుభ్రంగా నూనె పట్టిస్తారు, అరగంట నానాక, తలస్నానాలు, ఉగాది పచ్చడి సన్నాహాలకి మనం సాకులు చెప్పకుండా సిద్దపడాలి (ఆకలి పేగుల సంగీతం వింటూ)! నరసింహులో, నాన్నో, నేనో వేప చెట్టు కి ఎగబాకే వానరజాతి వారసులం...క్రిందన పరిచిన తెల్లటి దుప్పటి తో మామ్మ, ఆమె కి తోడుగా అన్నయ్య, చెల్లి అపుడపుడూ అక్క...రాల్చిన పూలని ఒడుపుగా దూసి, నెమిచి, నూకలంత రేకుల వేప పూవు ఒక గిద్ద తయారు చేసేంత వరకు ఎవరూ మాట్లాడకూడదు; మామ్మ ఆర్డర్!

ఓ పక్కన పులిహోర పులుసు కలేస్తూ, గారెలు వేపుతూ, పూర్ణం పాకం పడుతూ, పాలు కాస్తూ (వంటగదిలో గాస్ స్టవ్, ఊకుండల పొయ్యి, నూతన్ స్టవ్ అన్నీ వెలుగుతూ ఉంటాయి వెలుపల ఉన్న కట్టెల పొయ్యితో పాటుగా, పక్కగా రవ్వలు చిమ్ముతున్న బాయిలర్ వెలుగు సాక్షిగా) అమ్మ చాలా నేర్పుగా కొత్త చింతపండు రసం తీసి, బెల్లం కోరి, కారం, ఉప్పు కలిపి ఆ గిన్నె ఇటు జరపగానే, "అమ్మా మామిడికాయ టెంక నాదేగా!?" నా ఆత్రం, "ఇపుడు జీడి కాయలు, ఒక కాయ నీకు దాచాలే," అమ్మ ఓదార్పు. మామ్మ వేప పూవు, చిదుముల్లా తరిగిన పుల్ల మామిడి ముక్కలు, కాసిని అరటిపళ్ళ ముక్కలు కలిపి నాన్న కి ఆ గిన్నె ఇస్తారు... కుటుంబం అంతా కలిసి పూజ చేసుకుని, ఒక్కొక్కరు ఒక వెండి గ్లాసుడు పచ్చడి తాగి (నిజానికి రకరకాల ముఖకవళికలు కావాలంటే మా ఇంటికి రండి కామెరా తో) ఇక వంట గదిలోకి వాపుగా చూపులు. వరసపెట్టి పిండి వంటల తిళ్ళు, మళ్ళీ ఉగాది పచ్చడి తాగటం, నాన్నకి మాత్రమే అర్థం అవుతూ తలూపే పంచాంగ శ్రవణం మనమూ వింటున్నట్లు నటించడం- సాయంత్రానికి మళ్ళీ మంచాల మీదకి చేరే వరకు భుక్తాయాసం! నవ్వులు, అరుపులు, తోపుళ్ళు, మూతి విరుపులు (అన్నీ తినే సరుకుల సమరం లోనే)... 

కొసమెరుపు: నా గ్లాసులో వేపపూవు నెమ్మదిగా దేవి మామ్మ గ్లాసులో పడేయటం, ఆమె నుంచి మామిడి ముక్కలు కొట్టేయటం, అమ్మ పక్కన చేరి పూలదండ అంతా నాదేనని మారం చెయ్యటం, నాన్న గారి పక్కన చేరి నాలుగు పద్యాలు అప్పజెప్పి డబ్బులు దండుకోవటం నా వంతు! బహుశా అందుకేనేమో ఇన్ని చేదు అనుభవాలు ఒక్కసారిగా తింటూ, కోయలేని పూలు పూయిస్తూ, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అప్పజెప్పి సొమ్ము గడిస్తూ- ఉగాది వేసిన బాటలో సాగుతూ ఇలా...

అందరికీ మరొక కొత్త ఉగాది వేడుక కి శుభాకాంక్షలు!

ప్రస్థానభేరి

పదాల కట్టలు పదిలంగా-
నారుమళ్ళలో ఊడ్పులంత శ్రద్ధగా
విడదీసి భావాల మళ్ళలో గుచ్చుతావు.

"తెగి రక్తమోడే వేలిని అదిమిపట్టినట్లుగానే, 
ఇలాగే,
ఈ గాయపడిన లోపలి మనిషిని ఒడిసిపట్టగలిగితే

అన్నపు పొంగు మీద జల్లిమూకుడు మూసి,
కుండలో మెతుకు పోకుండా 
ఒడుపుగా గంజివార్చినట్లు,

వెల్లువౌతున్న వేదనకి మరొక మనసు మూత ఉంటే,
బండబారకుండా
కోలుకునేలా బాసట గా నిలిస్తే బాగుంటుంది"

మెదడు కి మాట అప్పగిస్తే 
పెదాల గట్లు దాటి జారే పలుకులవి.
వెలుపలి పొరల్లో మనిషితనం ఇంతే!
యాంత్రికత లో అబ్బిన వస్తుగుణం ఇదే కదు?!

గుండె కి గుట్టు నేర్పగలిగితే- 
నిన్ను నువ్వు వినటం,
ఊరడించడం సాధించగలిగితే...

నీవే ప్రకృతి అవుతావు
లయమౌతూ, సృజించబడతావు

శ్రుతి చేసుకుని జీవనగానం పాడుతావు
నీలోని వేవేల విధులలో నిమగ్నమౌతావు

బాగుం/టుం/ది ఊహ, కానీ

చెదిరి బద్దలైన గుండెని,
బెదిరి చిన్నాభిన్నమైన 'నేను' లనీ
వెదికి తీసుకురావాలి

గాలికి, నీటికీ నడుమ నిష్పత్తిలా,
నేలకి, నింగికి మధ్య ముడిలా
నియమాలు నేర్పుకోవాలి,
నిలిచి ఉండటం అలవరచుకోవాలి.

కూడలి కి చేరితే ఎపుడూ ఇంతే-
దారీతెన్నూ తెలీనట్లే, 
నాలుగు దిక్కులూ పిలుస్తున్నా...

యంత్రఖచిత వనాల్లో
అనాధగా అలమటించనా?

నిరంతర వాహిని లో
సింధువునై తరించనా?

పిపాసతో బ్రతుకు స్వరాలు
సర్పాల్లా బుసకొడుతున్నాయి

సరళమైన రచన రాసుకోవాలి
నేను జీవించాలి
ఒక 'నేను' జీవచ్ఛవమైతే
పది 'నేను' ల కాంక్షతో రగలాలి

బతుకు యాగానికి 'నేను' సమిధనవ్వాలి

ఇంతకీ 'నేను' /మిగిలి/ఉన్నానా,
ఉన్నానన్న భ్రమలో ఉన్నానా!? 
అంతిమ ప్రస్థానం వరకు యింతేనా,
చివరకు మిగిలేది యిదేనా...

27/03/14

ప్రవాస పునాదులు

"ప్రవాసం" అంటే అనాధారిత ప్రతిపాదనలు,
తుడవలేని అపోహలే కొన్ని మెదడు కొలతల్లో-

పాదమిడిన ఉత్తర క్షణమే
పట్టుపానుపుల పవళింపులని
పాలరాతి మేడల నివాసమని
ఎడతెరిపిలేక కురిసే కాసులని
కడగండ్లు చొరని కాపురాలని:

సగ జీవితం గడిపిన దేశాంతర వాసపు
కథ కాని కథ- అనుభవాలే ఆత్మకథలు కాదా?
నిరుద్యోగ భత్యపుయాచన తో మొదలైన యాత్ర ఇది!
తొలినాళ్ళలో, తబ్బిబ్బయ్యే మనసుతో
తడబడే ఉఛ్చారణతో, తెలియని భయాలతో
కట్టుబొట్టు లో అమిరీఅమరని అసౌకర్యంలో
తెగిపడిన జ్ఞాపకాల చిట్టాలివి

యాంత్రిక వనాలలో మంద విడిన మేకలా
నోరెండిన పసి బిడ్డని చంకనేసుకుని
గుక్కెడు నీటికి అర్రులు చాస్తే
"Dollar a bottle" అంటూ దాహపు వెల కట్టిన నేలలో
నెర్రెలు విచ్చిన మానవత్వాన్ని పరిచయం చేసుకున్నాను

అర్థరాత్రి నిద్రకొరిగిన ప్రపంచంలో
నిర్జనమైన రైలుస్టేషనులో, చేతిలో సొమ్మున్నా
చిల్లర ఇవ్వ/లే/ని యంత్రపర నిబంధనతో
ఎటూ తోచని విధిలో, అపరిచితుని వెదుక్కుని
"do you have 2 dollars" అన్నదానికి
అర్థాంతరం ఉన్నదని, అది యాచకుల ఊతపదమని
దినపత్రిక వెనుగ్గా వినవచ్చిన విసుగు,
ఎగిరొచ్చిపడిన డాలరు కాసుతో నిర్విచేష్టురాలినయ్యాను

అమ్మ ఉత్తరమో, ఉద్యోగ ప్రకటనలో రావాలని
అర్రులు చాస్తే, పేపరు కట్టలు వేలు వస్తాయి:
మెయిల్ బాక్సుల్లో కొత్త ఉత్పత్తుల వార్తలు,
ఊరి వారి వేడుకల వార్తలు మోస్తూ.
'ఇంతంత కాగితపు అచ్చువేత కి ఎక్కడిదయ్యా సొమ్ము?'
"Junk Mail" అని చెత్తకుప్పల్లోకి విసిరిపడే శ్రమ నష్టం బేరీజు వేసాను

అందుకే ఎవరు వీసా వచ్చిందని వార్త పంపినా
రెండుమాటలతో కార్డుముక్క రాసిపడేసేదాన్ని అప్పట్లో,
డాలర్ పైన పోస్టల్ స్టాంప్ అతికించి మరీ!
"నీళ్ళు కొనుక్కోవాలి రా అబ్బీ,
చిల్లర మార్చుకుని వెంట ఉంచుకోవాలి సుమీ!!!" అంటో
"నీ చిరునామాకి ఎక్కువగా వచ్చి చేరేది నీకక్కరలేని వార్తలేనని" కలుపుతూ-

(1994 అనుభవాల నుంచి)

కవుల చేవ

అయం బన్ధురయం నేతి గణనా క్షుద్రచేతసామ్।
ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్।।

"అల్పమైన ఆలోచనలు కలవాళ్లకి వీడు చుట్టం వీడు చుట్టం కాదు అన్న పట్టింపులు ఉంటాయి. అదే గొప్ప నడువడి కలవారికి ప్రపంచమంతా తన కుటుంబమే," అని ప్రపంచకవులను ఉద్దేశ్యించి ఒక వ్యాసకర్త అభిప్రాయం. కవి ప్రపంచబంధువు

అలాగే All that is best in the great poets of all countries is not what is national in them, but what is universal" - Henry Wadsworth Longfellow

స్వాప్నిక జగత్తు కాదది,
గడచిన ఘనచరిత్ర కానే కాదు.
సంపూర్తి కానున్న చిత్రమది.
సృష్ట్యాది నుండి సాగిన గానమది.
రానున్న మహత్తర భావి అది,
మానవీయ మధుర కావ్యమది.

తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ
నలుదిక్కుల నడుమ పృధ్వి ఒక్కటే.
వేలు, వేవేలు, లెక్కలేనన్ని, పాలపుంతల
పలుచుక్కల నడుమ ఆకాశం ఒక్కటే.
భాష, వేషం, రంగు, రూపు
భిన్నస్వరాల ఏకీభావం ఒక్కటే.

యుద్దభీతి, కీర్తికాంక్ష, స్వార్థభక్తి, కుటిలనీతి
పెకలించిన జాతి అది.
శాంతి, సమత, మమత, ఆత్మీయత
విలసిల్లిన రీతి అది.
తరులు, గిరులు, నదులు, మైదానాలు
సాంత్వన చెందిన ప్రకృతి అది.

కదలాలి కలాలు, పాదాలు కలిసికట్టుగా
మానవత్వమే సాధనగా, కవిత్వ పథాన
రావాలి నవతరం కొత్త పుంతలు తొక్కుతూ
సాహిత్య ప్రపంచం కావాలి వసుధైవకుటుంబకం

21/03/14

యుగాల పర్యంతం విస్తరించే క్షణం లో...

జీవితపు సుసంపన్నతని దోచుకోగలిగేది కవులే-

అనేకానేక కొమ్మలుగా విస్తరించినా
వరదకి తోడుగా ఈదురుగాలి దండెత్తి వస్తే
ఒక్కొక్క కొమ్మా కంపిస్తూ వేర్వేరు దిశల్లో ఒరిగితే
మేను జలదరించేలా భూమిని చీల్చుతూ
వేళ్ళు వెలికి వచ్చి, అల్లాడుతూ
ఆచూకీ దొరకని మూలకి కనుమరుగై పోతుంది
అనేకానేక తరాలుగా విస్తరించిన ఓ వృక్షం
నీలోనూ విస్తరిస్తుంది మరొక శాఖగా వేదన

తీరాన్ని తాకకుండానే విరిగిన అల, లేదూ,
ఒడ్డు న తునిగిపడి ఉన్న ఎండ్రగబ్బ కావచ్చు
కడలి లో ఊగిసలాడే నావ లా నిన్ను మార్చేందుకు

తరతరాల వంశచరిత్ర ఆ గోడల్లో నిక్షిప్తమై-
పునాది రాళ్ళలో పగుళ్ళుగా మారటం చూస్తావు-
తట్టలలోకి మార్పిడి జరిగిన భవంతి తో అంతమై
చదునుచేసిన నేల లో
కొత్త కథ కి శంకుస్థాపన జరుగుతుంది
నీలోకి పాదుకున్న విత్తు రక్తపుమడిలో నానుతూ
ముళ్ళ తీగ గా, బలురక్కసి పొద గా మారుతుంది

భారాన్ని దించుకోడానికి వెచ్చని ఒడి, లేదూ,
వణికే నీ అరచేతిని బిగించి పట్టుకున్న హస్తమో కావచ్చు
భూమిని తొలుచుకు పొయే తుట్టపురుగు గా నిన్ను మార్చేందుకు

మూటగట్టిన అనుభవాలు నీటిబుడగలై నీలో తేలుతుంటాయి,
గాలివాటు బతుకుల తాకిడికి పగిలి పదాలుగా జారుతూ.

చిల్లుపడ్డ బొక్కెన లోకి కుళాయి నుంచే కారే నీటి బొట్లుగా
నీలోంచి నిరంతరం నీలోకి తరగని తడి కంటి ధారలుగా...

ఉషస్సులో ఉనికి లేని సంభవాలు నిశివేళ కి చోటుచేసుకుంటూ-
క్రౌంచ మిథునం తల తెగిపడి కసాయి కడుపులో కావ్యమైనట్లు
పురుగులు మెసిలే పుట్టలో పదాలుగా పురుడు పోసుకున్నట్లు-
అహర్నిశలూ నీలో కాంతి పుంజాలు ప్రజ్వలిస్తూ
నీ వాచక సరోవరాల్లో ప్రకృతి పద్మమై పరవశిస్తూ...

జీవితపు సుసంపన్నతని నిజంగా దోచుకోగలిగేది కవులే,
జీవితపు నగ్నత్వాన్ని దాచగలిగేదీ కవులే-

అదెలాగ అన/లే/వు- ఎందుకంటే అదంతే!

పెల్లుబుకిన డొల్లతనం తో ఎన్నో మెదళ్ళు వివస్త్రలై ఎదురౌతాయి
అనాఛ్ఛాదిత భావనలు నీ మది ప్రాంగణం లో వివశ నృత్యం చేస్తాయి

నగ్నత్వాన్ని కప్పుకున్న నగ్నత్వమై,
అందులో అంతర్లీనమైన ఆత్మ వికసన ఛాయ లో దాగిపోతావు

జీవితపు నగ్నత్వాన్ని నిజంగా దాచగలిగేది కవులే-

కనుగొంటే నీవూ, నేనూ, ఎవరెవరో
ఒక్కొక్క క్షణం లో ఉద్భవించే కవులం
అనుకోని ఉత్పాతం లో అలమటించేవారం
రెక్కమాను మీద రవ్వంత సేపు ఆగిన స్వేఛ్చా విహంగాలం!

07/03/2014

ఉనికి

దగ్ధ వృక్ష శిలాజాలు
వజ్రకాంతులుగా విముక్తి పొందుతాయి
స్తబ్ద దిగుళ్ళు విడిచి
మెరుపుకలలు పలుకరిస్తాయి

ఉరిమే మబ్బును చూసి
కప్పపిల్ల కిలకిలా నవ్వుతుంది
విఘాతాల విధ్వంసం కసిరితే
ఆశ ధిలాసాగా విచ్చుతుంది

పువ్వు విప్పారినపుడు
చిరుగాలి మేను జాజర జడిలో జలదరిస్తుంది
మనసు పొంగినపుడు
అనుభూతి పరవశంగా పరిమళిస్తుంది

భూమ్యాకాశ గతుల్లో, ఋతు సంక్రమణముల తాకిడితో
ప్రకృతి నిరంతర ప్రవాహం
స్థితిగతుల్లో జీవనం, మౌక్తిక సృజనలో
మునిగితేలే సాగరం

19/03/14

ఒద్దిక

రోజూవారీ ఘటన:
ప్రవహిస్తూ కాలం, ప్రసరిస్తూ పొద్దుటెండ
బాటపట్టి నేను-కిటికీలోకి పట్టిపట్టి చూస్తూ-
సాదరంగా నవ్వే పాపాయి కోసం

చిన్ని కళ్ళలో
ఒకింత విస్మయం, రవ్వంత కుతూహలం
ఆ ప్రపంచంలోకి ఆహ్వానం

ఇద్దరికీ తీరిక చిక్కితే
నిన్నటి నుంచి నేటిలోకి
పలకమాగిన పలుకరింపులు
చిట్టిపొట్టి మాటల రుచి చెప్పరానంత!

అంతలోనే బిక్కమొగం అందుకునే ఆరున్నొక్కటి
బిత్తరి నా చూపులిక బాట వెంట బిరబిరలు,
పరుగందుకోలేని పాదాలతో

అమ్మవొడి చేరగానే మొలకెత్తే గారాబం, రసవత్తరం
కిటికీ అద్దానికి అతుక్కున్న చిన్నారి హస్తకమలం...

తుమ్మెదలుగా మారిన నా పాదాలిక అక్కడక్కడే తిరుగాడతాయి.

(మార్చి, 2014 "కౌముది" లో ప్రచురించబడింది)

పాణిబంధం

కిటికీ అవతల కొమ్మల్లో విశ్రాంతి తీసుకుంటున్న నీరెండ
కిటికీ గట్టు మీది కుండీలో మొక్క నీడ గది మధ్యన
నా వ్యాహ్యాళికి సమయం,
చివరి గుక్క తేనీరు, చేతిలోని దినపత్రిక నెమ్మదిగా జారవిడిచి,
గుమ్మం దాటటానికి ఉద్యుక్తుడనయ్యాను…

“మర్చిపోయారా?” మందలింపులో చిరుకోపం
చలవ కళ్ళజోడు చేతికిచ్చిన స్పర్శలో ‘అమ్మ’దనం
పది, పాతిక, వంద... అడుగులు లెక్క పట్టుకోవటం అదో వెర్రి హాయి
దోవపక్కన వేప చెట్టుకి ఏడాది పొడుగునా ఏదో ఒక పని
సర్వకాల సర్వావస్థల్లోనూ అది ఏదో ఒకటి రాలుస్తూనే వుంటుంది.
ఆకులూ, పూతా, కాయలూ, పిచ్చుక గూళ్ళ పూచికపుల్లలూ...

ఇక, ఇక్కడ ఎదురవ్వాలి ఆ ఇద్దరూ,
పచ్చ గళ్ళదో, ఎర్ర అంచున్నదో, ఓ నేత చీరలో నవ్వు మోముతో ఆవిడ,
బట్ట కట్టటంలో బద్దకాన్ని దాయలేక ఆ పెద్దాయన
నాకెప్పుడూ సమాధానం లేని ప్రశ్నే, “ఏమి ముచ్చటించుకుంటుంటారు?”
గుక్కతిప్పు కోనన్ని ఊసుల్లో మునిగితేలు తుంటారెపుడూ...

ఒక్కరోజూ పలకరింపు నవ్వు మానదా సిరి మొగము
అవును ఏరి కనపడరేమీ?
చేతి గడియారం నా సమయపాలన తప్పలేదన్నది.
ఒకటి, రెండు, అరవై రోజులు వాళ్ళు కనపడక
అరవై ఒకటో సాయంత్రము నడకలో నా అడుగుల లెక్క వేస్తున్నాను
ఎదురెండకి చేయి అడ్డం పెట్టుకుని పెద్దాయన నా ముందు నడుస్తున్నాడు
వెనగ్గా సాగిన నీడ ఆయన నీరసపు నడక లో వంకర్లు పోతూంది...

వేప పూవొకటి నా చెవి మీదుగా నేలకి రాలిపడింది
తెలియకుండానే తల ఎత్తి చూసాను
ఊగుతున్న రెమ్మకి, రేకల్లేని తొడిమ ఒకటి వేలాడబడి ఉంది
పెద్దాయన్ని దాటుకుని వచ్చేసా
“ఆవిడ ఎక్కడ?” మనసు నన్ను నిలదీస్తుంది
వెనుదిరిగి ఇంటి ముఖం పట్టాను
ఇపుడు నాకెదురుగా పెద్దాయన
ఏదో మార్పు, వడిలిన ముఖం, వణుకుతున్న చేతులు,
ఒక్కడూ గొణుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు నన్ను దాటుకుని
ఒక్కసారిగా నా వెన్ను అదిరింది, విదిలిస్తున్నా ప్రశ్నలు ముసురుతున్నాయి
భయం, బెంగ వంతులు వేసుకుని నా గుండెని నొక్కుతున్నాయి
ఇంటి కి చేరే సరికి నా కోసం ఆరాట పడే మనిషి ఉండాలి ఎప్పుడూ...

మంచినీళ్ళ గ్లాసు చేతికిస్తూ ఆరాలు తీసే తోడు ఉండాలి. ఉంటుందా?
ఒంటరితనం కొక్కానికి చిక్కుకోబోయేది తనా, నేనా?
కాలం వేసే కొత్త మేకప్పుకి సిద్దపడేది ఎవరు మా ఇద్దరిలో

(2012 నాటి ఈ వచనానికి 'పూర్ణా...పూర్ణా అంటూ మా చిన్న అమ్మమ్మ వెనుక తిరిగి ఆమె మరణం వెంబడే తనూ ఈ లోకాన్ని వీడిన మా కొవ్వూరు తాతగారు, తను ప్రేమగా "సీతాయ్ సీతాయ్" అని మురుసుకున్న మా అమ్మ భౌతికం గా దూరమైనా ఒక దశాబ్దం గా ఒంటరి యాతన పడుతున్న నాన్నగారు ప్రేరణగా రాసాను...క్రౌంచ మిధున వారసులు ఎందరెందరో కదా!?)

06/03/2014

అనుసంధానం

ఆ విముక్తాకాశతలాన విలాసంగా
విహరించే విహంగం
మదిలో అసూయ గుప్పిస్తోంది
అప్రయత్నంగా రెక్కగూడు తడుముకున్నాను
ఎక్కడో అగాథపు లోతుల్లో మొండి పర్వతం
ఇబ్బందిగా కదులుతూనే ఉంటుంది
ఊహల్లో ఎగిరే నాకింత అత్యాశ కలిగితే,
గతించిన యుగాల్లో సుఖించిన రెక్కజోరు
కడలి హోరులా ఊపుతూనే ఉండాలిగా

ఈ విశాలభూతలాన విస్తారంగా
పరుచుకున్న వనం
ఎదలో అనుభూతిని రగిలిస్తోంది
అనుకోకుండా కళ్ళు మూసుకున్నాను
ఇక్కడే ఎక్కడో శాపవిముక్తి పొందని నిస్త్రాణ దేహమొకటి
స్థాన భ్రంశం కోసమని ఆరాటపడుతుందేమో
కలలకే అబ్బురపడే నేను,
భ్రమణ కాంక్షకి లోనైతే
కామరూప విద్యల కలదిరిగిన విలాసాలు
శ్వాస నిశ్వాసలుగా ఆయువిస్తున్నాయేమో

అనుభవానికి రాని ఆరాటాలు ఆగవెందుకో
ఆనవాళ్ళ మాయతివాచీ మీద పయనాలు చేస్తుంటాయి
నిదురలోనూ మూత పడని మనసు,
మూస్తున్న కళ్ళలో పక్క వేసుకుంటుంది
కుతూహలపు కేరింతలతో
వింత ప్రదర్శనలు చూసి వస్తుంది

11/03/14

అనుకోని ఘటన

దీపాలు ఆర్పుతూ వస్తుంటావు
నిన్ను అనుసరిస్తూ చీకటి పాదాలు

ఇంకాస్త తెల్లగా వెక్కిరిస్తుంది
వీధివాకిట్లో సందె ముగ్గు

సర్దని పక్క మీద మడతల్లో
చీకటి వానపాముల్లా కదులుతుంటుంది,
నిన్ను అలుముకుంటూ చిక్కని గుబులు.

మిగిలిన ఆ చిరుదీపపు నీలి కాంతి
లావాలా నీ గదిలోకి ప్రవహిస్తుంది

ఎక్కడా ఆధారాలు వదలని మార్పు ఇక్కడే దాగివుంది

ఎప్పటిమాదిరే అద్దం వైపు చూసుకుంటావు
నీలాంబరం జాడలు మాయమౌతున్నాయివాళ
నిన్న పగిలిన అద్దపు ముక్కల్లో నెత్తుటి ప్రతిరూపం
చీకటి చాటున నీ మరుపుకి కట్టిన రుసుం

ఆర్తనాదాలు ఇక్కడ ప్రతిధ్వనించవు
సౌండ్ ప్రూఫ్ గుండె మార్పిడీ జరిగింది మధ్యనే-
ఇకిప్పుడు, ఆ నిర్జన వాడల్లో వసివాడిన పూదోటలు,
నిర్దయ జాడల్లో చిన్నబోయిన నీ కనుపాపలు

12/03/14

పగులు వారిన అద్దం

నేలకి తగిలిన కవుకు దెబ్బలు
పూలని విసిరికొట్టిన కొమ్మలకి
కనపడవేమో

నీడలు నల్లనెత్తుటి చారికలని
గుర్తుకు తెస్తున్నాయి

ఖాళీ పడక్కుర్చీ నిట్టూర్పులు
మనసు ఒలకబోసి వెళ్ళిన మనిషికి
వినపడవేమో

నలిగిన మెత్తలు
మురిగిన కన్నీటిని మోస్తున్నాయి

దూరమైపోతున్న నిన్నమొన్నలు
రెప్పల గంటలు కొట్టి
రేపుని ఆహ్వానించే కంటికి తెలియవేమో

గతం హడావుడిగా అరలు
సర్దుకుంటుంది

బీరువా తలుపు తీయగానే
చేజారిపడే తాళాల గుత్తిలా
ఈ ఒక్కసారికీ నిశ్శబ్దం గళ్ళుమంటే బావుణ్ణు

పగులు వారిన అద్దం ఉంటేనే
తెలియని ప్రతిబింబాలు గోచరిస్తాయి

17/03/14

సంవత్సరః

సమాస్త్వాగ్న ఋతవో వర్థయంతు
'సమాః' - అంటే సంవత్సరాలు. 'ఋతువులతో కూడినది' అనే అర్థంలో 'సమాః' అనే అర్థాన్ని వాడుతారు. 'చక్కని సమగ్ర గతి కలిగిన కాలాన్ని 'సంవత్సరం' అంటారు. కాలగమనం, ఆ గమనంలో ఋతువుల పరివర్తన- శుభాన్నీ, సుఖాన్నీ, ఙ్ఞానాన్నీ కలిగించాలని ఆకాంక్ష.
సచ సంవత్సరః సమ్యగ్వసంతస్మిన్ మాసాదయః
దేనిలో మాసాదులు చక్కగా నివసిస్తాయో అది సంవత్సరం.
సంవసంతి ఋతవోస్మిన్ సంవత్సరః
అనగా దేనియందు అన్ని ఋతువులూ వసిస్తాయో అది సంవత్సరం.
ఇయర్తీతి ఋతుః
ఋతం అంటే చలనం, కదిలిపోయేది ఋతువు.
యుగంభవేత్‌ వత్సర పంచకేన యుగాని తు ద్వాదశ వర్ష షష్ఠ్యాం
ప్రభవాది మొదలైన 60 సంవత్సరాలలో ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగం. మొత్తం గా 12 యుగాలు ఉన్నాయి.
యుగంలోని సంవత్సరాలు:
సంవత్సరోసి, పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి
అంటే ప్రతి యుగంలోని ఐదు సంవత్సరాలను వరుసగా సంవత్సరము, పరివత్సరము, ఇదా వత్సరము, ఇదు వత్సరము, ఇద్వత్సరము అనే పేర్లతో పిలుస్తారు.
అంటే సంవత్సరం పేరే సంవత్సరం  బాగుంది కదూ!
06/03/14

కురవక కుసుమం – మరువక పత్రం

“ఆంజన గంధీమ్ సురభీమ్ బహ్వన్నమ్ ఆకృషి ఫలామ్
ప్రా అహమ్ మృగానామ్ మాతరమ్ అరణ్యానీమ్ ఆశంశిషామ్”

(అంజనగంధి, సౌరభం వ్యాపింపజేసేది, పుష్కలంగా ఆహారం ప్రసాదించేది, కృషిచేయకనే ఫలమిచ్చే శక్తిగలిగినది, మృగాలకు తల్లి అయిన అరణ్యాని దేవికి మ్రొక్కుతున్నాను)

అప్రయత్నంగా మునుపు చదివిన “వనవాసి” నవలలో ప్రస్తావనకి వచ్చిన - ఋగ్వేదంలోని అరణ్య దేవతని గురించిన – స్తోత్రం నా హృదయమండలాన ప్రతిధ్వనించింది. అందుకు కారణం; వినాయక వ్రత కథ లోని నైమిశారణ్య వర్ణన. ఆ కానన దర్శనం నాలోని ప్రకృతారాధకురాలికి మృష్టాన్నభోజనం అనే చెప్పాలి.

“శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టిని శ్రేష్టమగు ఈ భరతఖండమున నుత్తరభాగమునందు ఆర్యావర్తమను పుణ్యభూమి యొప్పుచుండు. అందు కల్హార కేదార కరవీర జాజి విరజాజి జపా పాటలీ కేతకీ నాగ పున్నాగ మల్లికా మతల్లికా కుంద కురవక మందార చంపక చాంపేయా ద్యనేక పుష్పరాజి విరాజితమును, సాల రసాల తాలహింతాల తమాల తక్కోల చూత పూగ వకుళ అశోక కపిత్థాశ్వత్థప్లక్ష కాద్యనేక వృక్ష శోభితంబును, హంస కారండవ చక్రవాక జలకుక్కుట కోకిలాద్యనేక పక్షికృత కోలాహల నివాహంబును, నిర్మల ప్రవాహ రమణీయ సరోవరయుక్తంబును, ప్రాణాయామ ప్రత్యాహార ధాన్యధారణ సమాధ్యష్టాంగ యోగా నిష్ఠాగరిష్ఠ హరి హర పూజా మకరంద పానానంద తుందిల హృదయారవింద మౌనివర్య దివ్యాశ్రమ విలసితంబునగు నైమిశారణ్యంబు వెలయుచుండు.”

చదువుతుండగానే “వనవాసి” నవలలో పరిచయమైన లవటులియా అడవి లోని సరస్వతీ హ్రదం, కుశీనది,పూల్కియా, నాఢా, మోహన్పురా మహారణ్యాల దివ్య సౌందర్య కాంతులు ఒక్కసారిగా పునర్దర్శనమిచ్చాయి.

ఈ మధ్యనే అలవడిన కావ్యపఠనాలు మరిన్ని జాడల్ని అప్పజెప్పాయి. ఉదాహరణకి 'సంగీత రహస్య కళానిధి' బిరుదాంకితుడైన రామరాజభూషణుని “వసుచరిత్రము” నుంచి వసంత ఋతు ప్రభని, ప్రభావాన్ని కళ్ళకు కట్టించే ఈ పద్యాలు.

సీ:// లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికా భంగ దోఃప్రసంగ
మలసానిల విలోల దళసా సవ రసాల ఫలసాదర శుకాల వన విశాల
మలినీగరు దనీక మలినీకృత ధునీ కమలినీ సుఖిత కోక కుల వధూక
మతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంత

తే.గీ.// మకృత కామోద కురవకా వికుల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠ కులకంఠ కాకలీ వి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు

అలాగే గజేంద్ర మోక్షము కథలో ఘోరాటవి పద్యము, గద్యము గా వర్ణించబడింది. నాకు యధావిధిగా అడవిని గురించిన దర్శనాలు గగుర్పాటుని కలుగజేశాయి.

వచనము:
అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బరరీ వకుళ వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర బారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర బసంతనమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నిపహాలంకృతంబును, మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మ్హోద్యాన శుక పిక నికర నిశిత సముంచిత చంచూపుట నిర్దళిత శాభిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్రప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, గనక మయ సలిల కాసార కాంచన కుముదకహ్లార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జకుక్కుట చక్రవాక బక బలాక కోయప్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీబూత భూనభోంతరాళంబును దుహినకరకాంత మరకత కమలరాగ వజ్రవైదూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కధౌత మయూనేక శిఖరతట దరీవిహరమాణ విద్యాధరవిబుధ సిద్ద చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండబేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలాపృక వరాహ మహిషమర్కట మ్హోరగ మార్జాలాది నిఖిల మృగనాధ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు న ప్పర్వత సమీపంబునందు.

మరి కాస్త ఆసక్తి పుట్టి అక్కడా ఇక్కడా వెదికితే

“వన్యధాస్యంబులు ముడియలం గావళ్ళం బెట్టించు
కొని కదలి కదలికా, చందన, స్యంద్న, మరువకా, గురు, కురవకా
శోక పూగ పున్నాగ, భూర్జ, ఖర్జూర…”
అంటూ శకుంతల కి పెట్టిన సారె తాలూకు వివరాలు పలుకరించాయి.

నిజానికి ఈ పద విందులు పుష్కలంగా అందించే మన సాహిత్య మనే పర్వతపాదాన నాకీ అలౌకిక ఆనందం ప్రాప్తించిందేమో! రానున్న నాళ్ళలో మరిన్ని భాగ్యాలు కలుగుతాయేమో.

ఈ వర్ణనలు నాకు పూర్తిగా పదం పదం గా అవగతమయ్యాయా అన్నది కాదు ప్రశ్న, అలా చదువుతూ పోతుంటే, భాషతో పనిలేని ఒక అనుభూతి కలుగుతుంది. ఆ వనాల్లోకి వెళ్ళి రాగలిగాను. ఆ కాలాల కమనీయతని చూస్తున్నాను.

మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఎన్నోసార్లు ఆఘ్రాణించిన మరువక పత్ర మధురిమ మనసుని ఊపేసింది. ఒక్కసారైనా కురవక కుసుమాన్ని చూడాలనిపించింది. కనీసం చూసినవారిని చూడాలనిపించింది. రక్తపలాశ వృక్ష ఛాయల్లో చరించాలని ఉంది. చక్రవాకాన్ని వెక్కిరించాలని ఉంది.

నాలాంటివారు చెప్పే ఊసేదన్నా ఉంటే వినాలనీ ఉంది.

02/25/2014

మేలుకున్నాక కలలు వచ్చే వేళలివి!

విశ్వం వేణువై మోవికి తాకితే
హృదయం ఆలపించే గానానికి
నిదుర రానని మొరాయిస్తే

వాగుల్లోకి జారిపడిన వెన్నెలలు
హొయలొలికించే రాతి శిలలు
పున్నాగ బూరలూదే తుమ్మెదలు
సొబగులీనే కడిమి పూలు

భాష్యాలు పంపినట్లు కలగన్నానని

గుమ్మపాల పొదుగులో తువ్వాయిలు
అమ్మవొడి ఊయలలో పాపాయిలు
ధ్వజ స్తంభపు మేడలో పావురాయిలు
ఏటి గట్లు ఎక్కి దిగుతూ బొమ్మడాయలు

స్వరాలు కట్టాయనీ కలగన్నానని

ఈ ఉదయపు ఘడియల్లో నీతో చెప్పబోతే
నీ నవ్వులో ముడిచిన నా విశ్వపు ఆనవాళ్ళతో ఎదురౌతావేమి,
చెదరని కలతో నీ ఒడిలో నిదురపుచ్చుతూ!?

11/02/2014

సృష్టి విలాసంలో శింబి

రథసప్తమి సందర్భంగా చిక్కుడుతీగెలు, కాయలు జ్ఞప్తికి వచ్చాయి..అలా అలా ఈ చిరు వ్యాసం ఉనికి సంతరించుకుంది.

"చిక్కుడు గింజకు తన పాదు ఎక్కడో తనకే తెలియదు" అని సామెత గా చెప్పుకున్నా, బహుశా చిక్కుడుపాదుకీ తన సృష్టి ఉద్దేశ్యము తెలియదేమో!? ఇలానే పలు దర్శనాల్లో మునిగితేలిన వారి వివరణ ఇలా ఉంది-

ఒక చిక్కుడుతీగను సృష్టించేటప్పుడు భగవంతుడు తన శాకంబరి తత్వముగా వ్రేళ్ళు కాండము పత్రములు గా విభజించి, ఆ భాగాలకి ఒక్కో స్వభావము- అంటే వేర్లలో నీరు, ఆహారాల గ్రహణశక్తి, కాండ భాగముల ద్వారా ప్రసరణశక్తి, పత్రభాగముల ద్వారా ప్రాకృతిక శక్తుల గ్రహణశక్తి- నిచ్చి తద్వారా ఎన్నో శక్తులనిచ్చి తదనంతరము నిక్షేపించిన శక్తులను ఆహార పదార్ధములుగా తయారుచేయడమే, ఆ సృజన కి మూలమట.

"శింబి" అంటే చిక్కుడుతీగ. ఋతులక్షణ వశమున నశించే చిరు ప్రాణి కానీ ఉన్నంతకాలం 'కార్తీకమాసంలో కదురంత వున్నాను, మాఘమాసంలో నా మహిమ చూపుతాను' అంటూ చిక్కుడుకాయలు, గింజలు చేసి ఇచ్చిపోతుంది కదా!

కనుకా

"జగము సృజించినదెవడో వాడే
జనులను సృజియించే
ఆకలినిచ్చినదెవడో వాడే అన్నము సృజియించే..."

కానీ

"కనులకు దోచి చేతికందని ఎండమావులున్నై
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవీ కొన్ని"

మరి

"సృష్టిచేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే
పలుకునొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనులనొసగినది దేవుడైన మరి అంధులనేల సుజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే"

మనిషి కి కూడా మనసు, బుద్ధి, వివేచన లక్షణాలు ఇచ్చి, ఆంతరంగ ప్రేరేపణలూ కల్పించి, వాటి వశమున సృష్టి పరమార్థమును సాధించుటకు నిరంతరకృషి జరుపుతూనే వున్నాడు. కలడా? లేడా? అనిగాక ఒక చిన్న తీగెలో కనిపించిన సృష్టి తత్త్వాన్ని జీర్ణించుకుని,

"బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం"

కూడా జీర్ణించుకుని, "బదులు కోసమై వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం!" అన్న ఒక్క సూత్రాన్ని పాటిస్తే చాలు! నిజంగానే మాఘ మాసం లో తన మహిమ చూపింది ఈ చిరు తీగె.

(గమనిక: ఇందులో ప్రస్తావించిన సామెత, వివరణ, గీతం వంటివి వివిధ వనరుల నుంచి తీసుకున్నాను. కనుక, నా దర్శనమని మీకేది అనిపించిందో దాన్నుంచి మీరు/చదువరులు స్వీకరించతగినది యేదేని ఉంటే తీసుకొనండి.)

07/02/2014

జగత్తే మందిరమైతే...

"శిథిలాలయమ్ములో శివుడు లేడోయి
ప్రాంగణమ్మున గంట పలుకలేదోయి
దివ్యశంఖము గొంతు తెరవలేదోయి
పూజారి గుడినుండి పోవలేదోయి!
చిత్ర చిత్రపు పూలు చైత్రమాసపు పూలు
ఊరూర, ఇంటింట ఊరకే పూచేయి
శిథిలాలయమ్ములో శిలకెదురుగా కనుకు
పూజారి కొకటేని పువ్వు లేదోయి
వాడ వాడల వాడె, జాడలన్నిట వాడె
వీడు వీడునవాడె, వీటి ముంగిటవాడె
శిథిలాలయమ్ములో శిలకెదురుగా కనుకు
పూజారి వానికై పొంచియున్నాడోయి" - దేవులపల్లి

ఈ అక్షర వీవెన గాయపడ్డ బాధకి సపర్యలు చేస్తుంది. తేరుకున్న బాధ (అసలీ వేదన మూలాలు కూడా ఇంకా తెలీని జీవితం) గుండెని ఆపుడపుడూ గుచ్చుతూనే ఉంది. నీరవ నిశీధిలో నక్షత్ర ఖచిత ఆకాశం దివ్య లోకాల ఆనవాళ్ళకి పెట్టిన దీపావళి లా ఉంది. ఎక్కడిదో దిగంతాల రాగాలు మోస్తూ ఓ గాలి వీచిక... నాలోని రాగద్వేషాల కచ్చేరి నిరంతర గీతం లా శ్వాసనిశ్వాసలంత లయతో సాగూతూనే ఉంది.

కానీ, అనుకోని ఒక అరుదైన ఓ వేకువ ఘడియలో వేదనా సాగరాల్లోకి విసిరిపడ్డ కన్నీటిచుక్క, సత్యాన్వేషణ చిప్పలో పడింది, ముక్తాఫలమై దీప్తి చెందింది. ఒకదాని వెంట మరొకటి చేరుతూ ముక్తాఫలాలు అనుభవపు తీగలోకి ఆవళి గా అమిరాయి. మౌక్తిక పరావర్తనం లో గూడుకట్టిన విషాదం ఎదిగిపోయింది, ఎదిగిన గిరి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్షణపు ప్రశాంతత శాశ్వతం కానీయి. మానవీయ బంధాలకి అర్రులు చాచి బంధనాలలో బందీ అవుతున్న శాపాన్నుంచి నన్ను విముక్తిచేయి.

ఇపుడు నేను ముత్యాల మాల పట్టుకుని ఉన్నాను. ఈ జపం లో ఒక్కొక్క వేదన పఠిస్తూ దరికి రానున్న సచ్చిదానంద స్థితికి మనసులో కైమోడుస్తున్నాను. స్వామీ, నన్ను జవాబీయని లోకానికి ఒక ప్రశ్నలా సంధించకు. సమాధానపడ్డ ప్రాణి గా నడిపించు. వేసట గురుతెరగక సాగాల్సిన బాటసారినన్న నిశ్చయాన నన్ను నిలుపు... ఈ ఆత్మలోని భావన:

జీవితాన్ని నిశీధిగా ఎంచి, కలల మినుకులకి, రాలిపడే శకలాల పోలు ఆనందాలకి అర్రులు చాచి, బధిరుడినై, బాధితుడినై, బంధితుడినై రసావేశ మానసాన వేగితిని, శుష్క యోచనల చిక్కితి. భగ్న పుఠల పీఠిక సమస్తం నలిగిన ప్రేమాన్వేషణలేనాయే. నిర్మాల్యము తొలిగిన మానసం కఠినశిలాసదృశ్యమాయే. స్వస్థానపు జాడలు వెదుకుతు అలిసితి, అంతఃకరణ లో అనంత సౌందర్యపు ఆనవాళ్ళు కంటి, మహానంద బ్రహ్మము కలదని విశ్వసించితి. శ్వాసనిశ్వాస లయలో నిజ స్పృహ కలిగి చరింతునికపై, హృదయ పర్ణశాల లో ఆశ్రమ వాసినై తపము చేసెద అను నిత్యం.

శూన్యంలో మౌనాన్ని నేను
మౌనంలో రాగాన్ని నేను
రాగంలో భాష్యాన్ని నేను
భాష్యంలో భావాన్ని నేను
భావంలో జీవాన్ని నేను
జీవంలో పూర్ణాన్ని నేను
నేనన్న అహాన్ని వీడిన బ్రహ్మ

నిత్యసత్యమై వెలిగేలా చేయి-

18/03/14

సంవేదము

మనో శిబిరాల ద్వారాలు మూసివేయబడ్డాయి,
శరణార్థులని శివారుల్లో నిలిపివేస్తూ.
వైపరీత్యాలు వస్తూ పోతున్నాయి
ఊహలు వరసలు తీరి వేచి ఉన్నాయి...

రెప్పలు పెరికివేసిన కన్నుల్లో 
నిదురకీ నీడ లేదు, కలకీ తావు లేదు. 
నెత్తురోడుతూ చిద్రమైన హృదయ దేహం పై
లెక్కలేనన్ని జవాబు లేని ప్రశ్నల కోతలు-

గాయాల్లోంచి స్రవిస్తున్నరసిపై 
ముసురుతున్న క్షణాలని తోలుకుంటూ
ఉబికేజీవం గతగీతమా? భావి గళమా? 
స్వరపేటిక తెగిపడేలా ఆక్రందనలు--

రెక్కలు అమ్మకానికి ఉన్నాయి
గుర్రాలు ఎగరనున్నాయి. 
నేలకొరిగిన సీతాకోకచిలుకకి 
సవారీ సిద్దం చేయబడింది.

03/12/14

విలీనం

చప్పుళ్ళకి అందనంత దూరాన సాగిపోయి, సవ్వళ్ళ సన్నిధిలో బిరబిరా పరుగిడాలని ఉంది...

బలవంతుల పదఘట్టనల రక్తచరిత్ర నరాల్లో పరుగులు తీసినట్లుగా గుర్రపు డెక్కల లయ భీతి కలిగిస్తుంది. అంతలోనే తథాగతుని నిష్క్రమణ లో మౌనసాక్షి ఆ ఆశ్వపూర్వీకుడే అనిపిస్తూను.

పావురపు రెక్కల రెపరెప - ఇంకా వేగుల సందేశాలు మోస్తున్నాయేమోనని సందేహం లోకి నెడుతుంటే, అల్లంత దూరాన పక్షి సమూహం మబ్బు పుంతల వరకు మనసుని ఎగురవేసుకుపోతుంది.

చెవులు పోగేసే చప్పుళ్ళకి మనసు చేసే ఈ సవ్వళ్ళ అనుసంధానం నిరంతరం నిర్మించబడే శబ్ద కట్టడమేమో!?

ఈ సడి లేకపోతే మరేదో అలజడి...

చూరు నుంచి కారే చివరి చుక్క వరకు వాననీటి తిరణాలు ఊరంతా సందడి చేస్తుంటే, వండ్రంగి పిట్ట చెక్కుడు లయలతో మనో వీణియ పై నిక్వాణ ఘలంఘల మ్రోగుతుంటే-

నిదురలో నవ్వే పాపాయి,
బెదురుతో పరుగిడే తువ్వాయి,
మరుగుల్లో పాడే కొక్కిరాయి,
గొంతు చించుకునే కీచురాయి...

సవ్వడి లో మౌనంగా మౌనం లోకి జారిపోతూ ఏ వాఙ్మయం లోకీ ఒదగని రచనలు చేసుకుంటూ కదలని నక్షత్రాలకి కదిలే ఆకులతో జత కలుపుతాను; నాలోని పాటని సృష్టి గీతిలో విలీనం చేస్తుంటాను.

నిశ్శబ్ద ఘడియలు వస్తూనే ఉన్నాయి- గచ్చునేల మీద పగిలే గాజుబొమ్మలా గుండె ముక్కలుగా మారినపుడు- జ్ఞాపకాల రొదకి నివ్వెరపడుతూ.

అందుకే, నాలోకి శబ్దాల జడివాన కురవాలి. ఎద కనుమలలో పిట్ట పాటల పిడుగులు పడాలి. నిదురలోకి, నిర్ణిద్ర గానంలోకి గొంతెత్తే జీవన గళం కావాలి. కనురెప్పల హోరులో సీతాకోకచిలుక రెక్కల ధ్వని కలవాలి...

03/11/14

హృదయ గోచరం

విదిలించిన సిరా చుక్కలు,
కాగితానికి అద్దిన అక్షరాలు,
మాటల్లేని నిశ్శబ్ద క్షణాలు,
పదాల్లో పలికిన స్వరాలు,
సిరిగంధపుతావి వెదజల్లుతూ
మనసుకి పట్టిన ఆనందాలు.

కల్పనాత్మక ప్రపంచాలు,
ఊహాతీత సంభవాలు,
దోచుకున్న పంక్తులు,
రూపుదిద్దుకున్న భావనలు,
స్వకీయార్థంతో పరవశాలుగా
పరావర్తిస్తున్న పఠనాలు.
 
జీవితాన సాహిత్యం,
జీవభరిత మాధుర్యం,
వాంఛితాల మోహనం,
వాసితరగని లాలిత్యం,
చమత్కృత సాలోచనల్లో
శాశ్వత చరితాబీజాలు.

09/03/14

జీవిస్తున్నాను

మొన్న విరబూసి ఉన్న రెండు మందార చెట్లు నరికేసారు...ఒక్కసారిగా నిస్సత్తువ...కొమ్మల శకలాలై అలా చెత్తతొట్లో పడున్న ఆ విగత జీవులు మనిషి దౌష్ట్యాన్ని ఎత్తి చూపినట్లుగా..వాటి కన్నీరే నిన్నటి రేయిలో మంచు ఉత్పాతమో, నేలబారునా పాకుతున్న వాన నీరేమో అన్నట్లుగా...

నన్ను నడిచేబొమ్మగా మార్చే ఆ తరుణాలన్నీ ఎందుకిలా నాకే ఎదురౌతాయి?

ప్రకృతికి ఎన్ని ఊడిగాలు చేస్తే ఆమె పంచే సహనాన్ని అనుభవించగల అర్హత పొందగలమనిపిస్తుంది. నేను ఆశాంతపరిచే ఈ ఘటనల దాపున చరించే చంచల చిత్తురాలినే...ఇంకా చెప్పాలంటే ఈ కళ్ళు నాకు నేనే కన్నప్ప లా పెరుక్కుని పాడేయాలనిపించేంత బాధని ఇవ్వటానికే నాతో వచ్చాయేమో...నిలబడుతున్న గుండె మళ్లీ కూలబడింది...

మొక్క తల్లులు, మోడు జీవులు! నన్ను మన్నించండి. తెగ నరికిన కొమ్మల్లో చివురిస్తూ, ఎండి విరిగిన మోడులో మొలకనౌతూ మీలానే నేనూ మనుషుల్లో వృక్షజాతి(జీవి)ని. ఈ జనారణ్యాలలో ఇమడలేని మనిషిని - నాకు కావాల్సిన వనాలు మదిలో పెంచుకునే ఊహాజీవిని. అందుకే ఈ జీవి,

ఎగిరివచ్చే ఙాపకాలు జీర్ణించుకుని
జీవితానుభవాన్ని గూడుగా అల్లుతూ
తన వలలో తానే చిక్కుకున్న సాలీడు గా,
కదలిక మలిగి బావురుమంటుంది

జీవనానుభూతుల రంగులు కలిపి
ఎగిసిపడే ఆనందభాష్పాలు రంగరించి
గూటి గోడమీద సీతాకోకచిలుకగా సృజన చేసి
రెక్కలొస్తే నేలని కొలిచే బొమ్మని తలిచి అబ్బురపడుతుంది

ఈ మనుషులు కొమ్మని నరికినంత సులువు గానే జాతి ని నిర్మూలిస్తారు, శాఖల్లో రాలుతున్న "నువ్వు", "నేను" మాదిరి జీవులని ఉపేక్షిస్తారు. అపుడూ ఇలానే నిస్సహాయం గా ముక్కలౌతాను.

సత్యం శివం సుందరం- సత్యపు ఆధారం లేని సౌందర్యం నిలవలేదు...మనుగడలో సత్య సంధత ఏది? శుభకరమైన ఘడియలు ఏవి? సుందరమైన లోగిలి ఏది? మనసుకి గూడు లేదే? అల్లాడుతూ అలమటిస్తూ శోక నివారణ దొరకని బతుకు కట్టుగొయ్య చుట్టూ చక్ర భ్రమణం ఎన్నాళ్ళు? ఏ చరిత్ర ని నేను సృజన చేస్తున్నాను? మృత్యువు వచ్చి పిలిచే చివరి ఉద్విగ్న క్షణాల్లో, పేజీలు తిప్పి వెనక్కి చదువుకుంటే సంతృప్తినిచ్చేదేది? ఈ జీవించటమే నిత్య సత్యం అని అంతా అంటారే మరి! ఇదే జీవితం సార్థకమే అనిపింపజేస్తుందేమో. అదే దాని పరమార్థమేమో. అందరికీ స్వయం సమృద్ధమనిపించే సత్యాల మూలాలు తరచి చూసి వేదన పడటం నాకు తప్పదా?

అవును, ఇదేమిటీ చిత్రం? మొన్నటి వేదనలో ఇన్నేళ్ళ స్వగతం గడిచిందా! చిత్రంగా మొడు చివురించింది...కొత్త పూల నవ్వుతో జీవితాదర్శాన్ని గుర్తు చేస్తుంది...అవునికపై, నేనూ జీవించాలి, లేదు లేదు జీవిస్తున్నాను, జీవిస్తూనే ఉంటాను-

(మోడువారిన జీవితం చివురిస్తున్న ఆనందహేలలో, ఆమని కోలాహలాలు మదిని మురిపిస్తున్నవేళ...మనసు ఇది)

08/03/14

విస్మయం

నగర సంకీర్తన ల్లో మునిగితేలే గాలీరోజు
హుంకారాల భీకర స్వరాలాలపిస్తూ,
బీభత్స ప్రకృతిలో భయావహ ప్రతిధ్వనులు
వడగళ్ళు, బెదిరిన గుండె సవ్వళ్ళుగా,
ఉదయాన్నే ఉత్పాతమొకటి ముంచుకొచ్చింది

సాగరాలు మాయారూపాన సంచరిస్తున్నట్లు,
అలకొక అస్త్రం ధరించి కలహిస్తున్నట్లు,
పగటి కొమ్మల్లో చీకటి పూలు వేవేలుగా విచ్చుకుని,
మింటి గూటి మెరుపులు మిణుగురులై విహరిస్తూ
ఊహాతీత కదనరంగమొకటి సృష్టి చేయబడింది

ఆకులు రాలిపోయిన కొమ్మల్లో అలజడిగా 
వాలిపోతున్న పిట్టల గావుకేకలతో,
బెదురుగొడ్డు బిడ్డల వెక్కిళ్ళతో, చిందులతో,
విఫలమౌతున్న సాంకేతిక పరికరాల స్తబ్దత లో,
రోజు చిత్రానికి కొత్త నేపధ్యగానం రచించాను.

నిర్బంధం

నా నివాసపు తలుపులు తీసే ఉన్నా
నిశివేళల్లోనే నాకు పూర్తి విడుదల
బంధితుల గది తాళం తీసుకుని
కోట గోడ వరకు వస్తాను

వెలుపలి కందకం లో
మొసలి ఆవలింతలు,
పహారా కాస్తున్న
సైనికుల పాదధ్వనులు
వినవస్తాయి
కాగడాల వెలుగుల్లో నీడలు
గుబులు పుట్టిస్తాయి

ఘడియలు జరిగిపోతాయి
చీకటి తెర తొలిగేలోగా
త్వరపడి నా నెలవుకి మళ్ళుతాను
పగలంతా బంధితులు
ఆరుబయట తిరుగుతారు

స్వచ్చంద ఖైదీనై
సంకెళ్ళు బిగించుకుంటూ ఉంటాను నేను
ఇంతకీ ఏమిటంటే ఈ రాజ్యం
నా దేహమే

మనసు కోటలో
మగ్గుతున్న బందీలు
నా కలలు

వాస్తవాధీనరేఖ దాటలేని
ఆత్మ ని నేను
రోజుకొక తిరుగుబాటు విఫలమై
చరిత్రగా మిగులుతుంది

తరతరాలుగా చర్వితచర్వణమే!

గుమ్మానికి కట్టేసినట్లు, కాళ్ళు గడపకి ఆన్చి,

వీధి వాకిలినే పరకాయిస్తూ,
పెరటి గోడ వెనుక కదలికలు పసిగడుతూ,
పరాగ్గా పిడికెడు మేత జారవిడుస్తూ
కెక్కిరింపులకి తేరుకుంటూ,
నువ్వు చూసేది-
మెడకి కట్టిన గంటల మోతతో
చెంగున వచ్చే తువ్వాయి కోసమా?
మువ్వల పట్టీలు కదలకుండా
దొంగలా నక్కి నక్కి వచ్చి
నీ కొంగులో దూరే చిన్నారి కోసమా?
వెన్నవాసన వీడని నీ అరచేయి
రుమాలుగా పసి బుగ్గల మీద అరిగిపోయినా,
కోడెదూడ దూకుడుకి విరిగిపడిన
పందిరి గుంజలు పాతుతున్నా
చెరగనిది నీ చిరునవ్వేగా?

మామిడిపూతకి అతుక్కుపోయే తేనెటీగల్లా
నీ చేతి కొత్తావకాయ ముద్దకి మూతులు తెరిచే పిల్లలు,
పరవాణ్ణం సెగలకి ముక్కులు ఎగబీల్చే పెద్దలు

ఇంతకీ ఎక్కడుంటావు నువ్వు?

వెనకటి తరాల ఆరల్లో
అలమరలో దాచిన పుస్తకాల్లో
పుల్లేటికుర్రు జరీచీర ఆనవాళ్ళలో
మట్టిగాజుల సవ్వళ్ళలో
మజ్జిగపులుసు తాళింపు లో
పండగ సందట్లో, పరధ్యాసలో
ఎప్పుడైనా ముడుచుకుని పడుకోవాలంటే
వెచ్చని ఒడి దొరకని క్షణాల్లో
ఏమో ఇంకా లెక్కకి అందని కారణాల్లో
ఇంటింటా ఒక చరిత్ర గా
అమ్మగా, అమ్మమ్మగా, నానమ్మగా,
ఈ అమ్మల గన్న అమ్మగా
నాలో అమ్మని కనుగొన్న అమ్మతనంగా

నిద్రలో లేపే కలగా, కలలోకి వచ్చే మెలుకువ గా
ఏదో ఆలాపనలో ఎవరో ఒకరికి తోడౌతూ
'నా వాళ్లు' అనుకున్న తడవుగా వస్తావు కదు?

నువ్వు వచ్చాక ఇక నేనెక్కడ మిగులుతాను!

సోయగానా శోకమే...

పున్నాగపూలు వర్షిస్తున్నట్లు
తెలిమంచు- 

వెలుపలి దృశ్యానికి,
లోలోపలి చిత్రానికి
రాకపోకల్లో కనురెప్పల రెపరెపలు 

కన్ను కి దాహం ఉండదా?

విరిసీ విరియని తమ్మిలో
చిక్కుకున్న తుమ్మెదలా
తీరని మోహావేశపు చింతతో నా చూపు

పట్టుకుచ్చులు పేర్చినట్లు
పేరిన మంచు-

గగనవాడల శిశిరాన్ని,
దేహంలో శైత్యాన్ని
నమోదు చేసుకుంటూ ఉఛ్వాస నిశ్వాసలు

హృదయాన ఉప్పెన రాకూడదా?

మునిమాపు వేళల్లో
ఆ సంద్రాన పడవలా
తీరాన వెలిగే దీపపు కాంతికై నా వగపు

ఒట్టేసి విన్నవించుకోనా?

మరణమొక్కటే మనలను విడతీసే ఒక క్రియ ఐతే,
అది కూడా మన మధ్యన విఫలమవుతుందని, 
నల్లని చీకటినీడల చల్లనిశ్వాసల ఆయువు మీద ఒట్టేసి,
సగర్వంగా, క్లుప్తంగా చెప్పి సరిపుచ్చుతున్నా

ఎందుకంటే,

క్షణానికి క్షణానికి నడుమ నీ జ్ఞాపకమొకటి,
గతంతో కలబడి, విజేతగా నిలబడి,
నిశిరేయిలో నక్షత్రంలా,
నా చీకటి కలలకి రంగులద్దుతుందని,

స్వగతానికి నిట్టూర్పుకీ వశమయిన తలపొకటి,
ఎడబాటు కొరడా ఝుళిపిస్తే,
అమ్మ చేతి స్పర్శలా లేతాకు మెత్తని నీ నవ్వొకటి
ఎదమీద అద్దుకున్నట్లుగా ఉన్నదని,

భయాల్లో, బెంగపడే వైనాల్లో, తెలియని దిగుల్లో,
తబ్బిబ్బయ్యే ప్రతి కలత, 
ఉదయాన్ని చేరి మరుగయ్యే రాత్రివోలె, 
నీ లాలనలో, సముదాయింపులో కరిగిపోక తప్పదని...

ఇన్ని చెప్పేకన్నా, 

ఆ ఒక్క "పర్యాయ పాదం" చాలని,
మురిసిన మనసు ముందుగా ఆ ఊసే విప్పేసింది.