ప్రకంపనలు

ఆకు వంపులో, గోడ మూల లో పొటమరిస్తున్న చీకటి,
కుంపటి సెగలో, ఊదొత్తుల పొగలో పట్టులేని వేడిమి,
గుప్పిళ్ళలో మూసివుంచిన వణుకు, భయం.
దేహంలో పాకుతున్న ఒంటరితనం...

గృహమంతా పరుచుకున్న కాగితాలు,
కాగితాల్లో ఇమడలేని భావనలు.
పరిసరాల్లో నాచువాసన,
పాకుడుపట్టిన జ్ఞాపకాలు. 

చీకటిలో గుడ్లు మిటకరిస్తున్న బల్లి
రెక్కలలిసిన కీటకం దిశగా పాకుతుంది.
గుండె మంట పదునెక్కింది,
కాలిపోయిన కల కవురు వాసన వేస్తుంది.

లోపలి గొంతుకి, వెలుపలి కన్నుకి భాష్యం ఒకటే
వినాళగ్రంథి కలగలిపి, విడగొట్టి విదిల్చిన ప్రేలాపనలో... 
దివారాత్రాలకి చెందని చీకటివెలుగుల్లో
కొట్టుకుంటున్న కవాటాల వ్యర్థ చరితలివి.

ఒక వీడ్కోలు లో

రైలు తప్పదన్నట్టుగా కసిరి కూత విసిరింది,
వాన చినుకుల బరువుకి ఒళ్ళు కదలనందేమో!
గాలిహోరుని చీల్చుతూ చక్రాలు,
చెరుకు తోటలో పిల్లల పరుగుల్ని జ్ఞప్తికి తెస్తూ.

చిననాటి ఊసొకటి నవ్వుని వెంటేసుకువచ్చింది-
అమ్మమ్మ వూరిలో ఆగని రైలుబండికి
అమ్మ ఎర్రచీర చూపి ఆపుదామన్న ఆన్నయ్య మాట,
ఎప్పటికీ మరవలేని మాగాయి ఊట.

అదేమిటో మనసిక్కడ ఆగదే, ఏళ్ళ వెనక్కి పరుగిడుతూ?
పట్టాల దాపున పొంచిన ఆకతాయితనం,
రైలెళ్లిపోయాక పిన్నీసుల వెదుకలాటలో రణం,
ఎన్నిపదులు ముగిసినా మరుగున పడని జ్ఞాపకం. 

బోసినోటి నారాయణ తాత పాడే పదాల్లా
గణ గణా గానాలు చేసిన గంటలిక ఉండవట.
మా ఊర్లో ఇక అనౌన్సర్ శషభిషలు వినక తప్పదట
రద్దీలో, ఎక్కిదిగే తిప్పల్లో ఇదొకటా గోల!

"చుక్ చుక్ రైలు" వెళ్ళిపోయింది-
చురుకైన యంత్రాలు కట్టి కొత్త రైలొచ్చింది,
దాని కూత మాత్రం పాత గాయాన్ని కెలుకుతుంది.
తెలవారకనే వచ్చే రైలేదైనా "దెయ్యాల బండి" ఆనాడు,
పొద్దుగూకులూ పరుగుల్లో మనమే దెయ్యాలమిప్పుడు.

కిటికీకి కట్టేసిన నా కళ్ళలో వానతడి వేడిగా ఉంది
కదిలిన రైలుతో కదిపిన తన పాదాలు జారతాయేమో?
పక్కవారి పలకరింపుతో తప్పని ముక్తసరి.
గండి పడిన ఏరులా తన ఒడిలోకి దూకాలనుంది,
నా స్వగతాలు వినని రైలు కదిలిపోయింది...
దూరాలు రగిల్చే తలపుల్ని మోస్తూ నేనూ వెళ్ళిపోయాను.
అగరు వాసనలు మోసే గాలిలా తను మాత్రం మిగల్లేదూ?

(ప్రతి ప్రయాణం లో ఆత్మీయుల ఎదుర్కోలు ఆహ్లాదమే, కానీ ఎవరో ఒక ఆప్తుల వీడ్కోలు మాత్రం మరణయాతన/మరవలేని ఖేదమూను)

జాబు

మరేం లేదు, నిన్న ఉత్తరం లో 
నిట్టూర్పు తో  నీకున్న చింతలేవో తెలిపావు,
స్పర్శ గ్రాహకం కా/లే/ని 
- మేఘావృత ఆకాశమో,  ప్రభంజనమో-
ప్రత్యక్ష విషయాలను గూర్చి రవ్వంత విచారం తో.

నా చీ/కా/కులని కాస్త తేలిగ్గా నిశ్వసిస్తూ,
ఈ జవాబు రాస్తున్నానోయ్, స్నేహితుడా!
అహ్: ఇప్పటికి ఆశలు ఇవి - రేపో మాపో
కలతలు గా,  నలతలు గా మారనూ మారొచ్చు-

ద్రాక్ష సారాయిలో ఈదాలని ఉంటుంది,
స్వేదాన్నీ, కన్నీటినీ కల్తీ చేస్తూ.
తెల్లని వస్త్రానికి కాటుక మరకతో
చిరిగినా చెరగని అద్దకం వెయ్యాలని కూడా!

అసలు సంగతి ఏమిటంటే నీది అమాయకత్వం
నీ కళ్ళలో గూడుకట్టిన మేఘాలు గమనించవు
నీ హృదయం లో చెలరేగే ప్రచండమైన వేదనలో
చిగురుటాకులా వణికే దేహాన్నీ పట్టించుకోవు

మరి నా విషయం చెప్పాలంటే అసంబద్ధం  
విషాదాన్ని కడగగలనా? 
దశమ రసం కనిపెట్టగలనా?
అస్పష్టమైన సంగతి విశదీకరిస్తే మాత్రం
తెలుపు నుంచి నలుపు విడదీయగలనా?

ఆ వానలో/కి/ ఈ వాన

ఒక్కగానొక్క చినుకు తడికై నోరు తెరిచి నిల్చున్న నాపై, 
నా నాలికపై, దాహం నింపగా, ఆర్తి తీర్చగా, 
వందలు వేలుగా రాలిన చుక్కల - తొలి తొలకరి జల్లుని పోలిన- 
నిన్నటి వానతడి లో ఓ సంబరం వెలిసింది- తొలిసారి తేట పలుకరింతగా

చిక్కని చీకట్లలో, చిరుకాంతుల చుక్కల మెరుపులో
నాతో పోటీ పడుతూ కదలని కొమ్మల్లో
కరిగి జారిపడుతున్న మేఘపు జడిలో
కమ్మని ధారలో కలిసి మెసిలి నాలోని కన్నీటి వానా వెలిసింది..

నేనో సగం, తానో సగం!

చదివిన కథల చెదురుమదురు జల్లుల్లో
ఎదలో చెల్లాచెదురుగ సొదలు.
మునిమాపులో మొలకెత్తిన గుబులు
నడిరేయికి ఊడలమర్రి. 
నీడనీడ్చుకుంటూ,  నిన్నటి కలని స్మరిస్తూ
అనుకోని జాగారం.
వెనమాటుగా ఆవరించిన వెచ్చదనం
చెప్పకనే చెప్పేటి సమాధానం,
మౌనభాష్యాల నుడికారం.
చెదరని మమతల మిథున భాగ్యం. 

మనిషి పుట్టుకలోనూ ఒంటరే చావులోనూ ఒంటరే అయినా కూడా, నడుమ ఇంకొకరుంటే చాలు, బతుకు వృత్తం పూర్తయిపోతుంది. బాధలయినా వేదనలయినా సంతోషాలయినా ఉత్సాహాలయినా ఆ వృత్తంలోనే, ఆ యిద్దరి మధ్యే. అదృష్టవంతులకే ఈ మిథున భాగ్యం సమకూరుతుందేమో.

"మరువం" కవితాసంకలనం పై కవిసంగమం లో వచ్చిన సమీక్ష!

సంపుటి పేరు:- "మరువం" రాసిన కవయిత్రి:-" మరువం ఉష'   
పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి

"ఆమె కవిత్వ పరిమళం నిజంగా మరువమే !"

"నిన్న వాన వెలిసి పోయిందనే బెంగ,నేడు వాన కురుస్తుందని కలత,మదికి ఇదో సరదా-ఎండ బాధ వద్దనో,చలి బారిన పడననో ఒక దాని వెంట ఒకటి యోచనా సుడులు వృథా అలజడులు"-అని ఒక జీవన శకలాన్ని చిత్రిక పట్టిన కవయిత్రి ఉష."పగలు రేయి పునరావృతాలు,ఋతువుల రాకపోకలుమారే వర్ణాలు,నడుమ చీకు చింతల నిత్య జీవిత పారాయణాలు"-కాల స్వభావంతో జీవితాన్ని ముడివెట్టిన కవయిత్రి ఉష గారు.'నీవు కేంద్ర బిందువు నన్నావు,నీ చుట్టూ ఓ అనంత వృత్తం నను గీసుక రమ్మన్నావు,ఇక్కడే నేను కొత్త పాఠం నీకు చెబుతున్నాను,వింటావా?"-అని విధాతకే పాఠం చెప్ప ప్రయత్నిస్తున్న కవయిత్రి ఉష గారు.

తనలో తానొక ప్రకృతి పరవశత్వపు పరిధి గీసుకొని,తాను పొందిఉందిన ఆ వివశత్వపు అనుభూతిని పాఠకుల హౄదిలోకి వొంపగల అభివ్యక్తి ఈ కవయిత్రిలో అగుపిస్తుంది.అపార భావుకత,అందుకు తగ్గ పద సంపద ఈవిడలో వుంది.కాల్పనిక,భావ కవితా దోరణుల మిళితం ఈమె కవిత్వం.

ఈ కవయిత్రి తన కవితా ఖండికలకు వుంచే శీర్షికలు కొన్ని ఎంతో భావుకతను అద్దుకొని పాఠకున్ని తన వైపుకు తిప్పుకొంటాయి."వలపుల వాన చినుకు","మంచు పూల పేరంటం","ఈ సిగ లెక్కెక్కడ తప్పిండొచ్చబ్బా!",-ఇలాంటి పద్యాల శీర్షికలు ఎన్నో ఉష గారి పద్యం పదునున్కు కొలమానాలుగా నిలుస్తాయి.వర్షం అందర్ని అలరించినా కొందరే దాన్ని కవిత్వం చేయగలుగుతారు.వేరు వేరు కవులు తీసుకుండే వస్తువు ఒకటే అయినా వారి మార్గాల భేదాలను బట్టి వేరు వేరు కవితలు తయారవుతాయి.వాన చినుక్కీ,నేల మంటికీ వుండే వొక చిక్కని బంధాన్ని మరువం ఉష గారు క్లిష్టత లేని పదాల ప్రయోగంతో వొక అసాధరణ వూహను నిర్మించారు."మా వూరి మబ్బుకి మమతలెక్కువనుకుంటా"-అని మొదలయ్యే ఈ కవితలో మేఘాన్ని కరి మబ్బుగా చెప్పటం సాధరణమే అయినా వెను వెంటనే "కరి వేరు మొగ్గలా మెరిసి అని అనటంలోనే వొక వైచిత్రినీ కవయిత్రి మెరిపిస్తుంది."ఉన్నది వూరుకోకుండా మెరుపు లేఖలు రువ్వే ఆ మబ్బు ఉరిమురిమి తుళ్ళిపడేలా తుంటరి పనులు చేస్తుందని"-ఉన్న రంగులు చాలక వింత వన్నెలతో వరుసలు కడుతుందని ఈ కవయిత్రి మబ్బుకి మానుష్త్వ రూప ఆరోపణ చేస్తుంది.ఇలా కవిత్వం చేయటం కృష్ణ శాస్త్రి లాంటి పూర్వ కవుల పఠనం వల్లా లాభించే విద్య అని తెలుస్తుంది.

ఈ కవయిత్రి రాసిన వాక్యాలు సాధారణంగా సాదా సీదాగా కనిపిస్తాయి కాని లోతుగా ఆలోచిస్తే ఈన్ కవయిత్రి ఒక గాఢమైన,లోతైనా భావాన్ని నిగూఢంగా వ్యక్తం చేస్తాయి."కన్నె తూరుపు వెచ్చందనాల కావిళ్ళు గడప గడపకు పంచి, పడమర కాంత కౌగిళ్ళలోకి పరుగులు తీసి సూరీడు"- అని కవయిత్రి అనే ఈ వాక్యాల్లో సూర్యోదయాన్ని,సూర్యాస్తమయాన్ని కవయిత్రి ఆవిష్కరించినట్లు అర్థం చేసుకోవచ్చు
ఈ కవిత్వ పంక్తులు సాధారణ వాక్యాల్ల అనిపిస్తాయి ఆని తూర్పు అనే కన్య వెచ్చని కావిళ్ళని వూర్లోని ప్రతివారికి అందిచ్చి పడమటి దిక్కు అనే వనిత కవ్వింత కౌగిళ్ళలోకి పరుగులతో చేరుకున్నాడు సూర్యుడు అనే వొక అద్భుత డృశ్యాన్ని కవిత్వహృదయంతో కవిహృదయం అనే ఖండికలో దృశ్యం చేస్తుంది.రేయింబవళ్ళలో రేయి వర్ణన ఎక్కువ సందర్భాల్లో కవయిత్రి చేయడం ప్రకృతిలో రాత్రి కి గల ప్రత్యేకతమో ననిఅనిపిస్తుంది.గోగణాలు ఇళ్ళకు చేరుకొనే సమయాల్ని,ఎగిరి ఎగిరి అలసిన రెక్కలతో గూటికి చేరుకొనే సాయం వేళల్నీ కవయిత్రి పేర్కొంటూ అవి అమ్మవొడికి ఆనవాళ్ళై నిత్యజీవన రేయింబవళ్ళుగా చివరికి జంటహృదయాల తుంటరి సరాగాలై పరశింప చేస్తాయని కవయిత్రి వూహనిమరింత పరిమళభరితం చేస్తుంది.

"అసంపూర్తి కల అర్థరాత్రి గాలివానలా నిదురలేపి మరీ కలవర పెడుతుంది"-అని అంటున్న ఉష గారు నిరీక్షణల్నీ తెలవారి రాలిపడిన పారిజాతాల్లా,నిట్టూర్పుల్ని దిగుడుబావి పాకుడు మెట్లలా పోలుస్తూ అర్ధాకలితో నలుగుతున్న అనాథ శిశువుని,పాల బువ్వ తెలియని పసికందైనవాన్ని"ఇరువురూ ముక్తసరి మురిపాల ఆత్మవంచకులు"-అనుభూతికి తలవొగ్గిన కారణంగా ముగ్గులేస్తున్నప్పుడూ లెక్క తప్పిన చుక్కల్లా వొక అసంబద్ద కలయికలా రూపు దిద్దుకొన్నారని ఈవిడ ఎంతో లోతైన భావాన్ని మాములు వాక్యాల్లా చెప్పి,తన నేర్పుని ప్రదర్శించింది.ఈ ప్రపంచంలో ఏ వ్యవస్త వున్నా కవులకు వస్తువు కొఱత వుండనే వుండదు అది మనుషులతోనే వుంటుంది కాబట్టి.అనాది కాలం నుంచి కవుల అనుభూతిలో అభివ్యక్తమయ్యే వస్తువు ప్రేమే.స్త్రీ పురుష సంబంధాలు వున్నంత కాలం ప్రేమకు సంబంధించిన సాహిత్యం వుండక మానదు.అభ్యుదయ,విప్లవ కవులని అనుకున్న వాళ్ళు కూడా కొండకచో ప్రేమను అద్భుతంగా చెప్పారు.అట్లాంటి కవిత్వాలు పఠితల ఆదరణను పొందాయి. ఈ కవయిత్రి కూడా కాల్పనిక,భావ కవిత్వ ధోరణిలో కవిత్వ నిర్మాణం చేయటం మూలానేమో ప్రేమను కవిత్వం చేసింది."నీవు పరచిన అంప శయ్య మీద నేను/నీ ఙ్ఞాపకాల బాణపు గాయాలతో ఎంతకూ రాని సంక్రమణానినికై/ఇన్ని యుగాల ఎదురు చూపులో"-ఇలాంటి కవిత్వపు శకలాలు "ప్రేమ సహస్ర నామాలతో" అలరిస్తాయి ఈ సంపుటిలో.

కవయిత్రి ఉష గారు సహజ ప్రియాలైనా ప్రాకృతిక అంశాలను కవిత్వంగా మార్చటమే కాదు స్త్రీ సహజ ఇష్టాలైనా ముగ్గులు,పువ్వులు,గోరింటా మున్నగు వాటిని తన ప్రతిభా పరుసవేదితో పసిడి పాదాల పరిమళ మరువపు కవిత్వం చేయటమే కాదు వాటిలో వొకానొక కూడా దుఃఖాన్ని పోస్తుంది.ముగ్గు పిండి అమ్మే స్త్రీని వెన్నెల వేకువలు తెలియని వెఱ్ఱిదానిలా,రేయింబవళ్ళు రాజుకున్న ఆకలి మంటగా నిలబెడుతుంది."నా చేతి చిత్రాలు మా ముంగిలి వైనాలు/పూల గొబ్బిళ్ళ అలరారు రంగవల్లులు/వారందరికీ తెగ మురిపాలు/మరి నీవి కాదా సగపాలు"-అంటూ ముగ్గు పిండి అమ్మిన ఆవిడకు కూడా ఆ రంగవల్లులు తెచ్చే శోభలో,ఇచ్చే ఆనందంలో సగభాగం చెందుతుందని అనటం చిత్రంగా అనిపించినా న్యాయసమ్మతమేననే భావనని కవయిత్రి కలిగిస్తుంది. భావ చిత్రాలను రూపు కట్టించటంలో ఈమెకి మంచి నేర్పు వుంది.అతి తక్కువ పదాల పేర్పుతో చాల ఆశ్చర్యాన్ని కలిగించే నైపుణ్య నిరూపణ చేస్తుంది."చేపల చెఱువు మీద నాచు/అచ్చంగా పంట పైరు పచ్చ"ఊహించుకోవాల్సిందే.
జీవితాన్వేషణ చేయటం, ఆ అన్వేషణ నుండి ప్రకృతి శక్తుల ద్వారా పాఠాలు నేర్చుకోవటం కొందరు కవులు చేస్తుంటారు.ఈ అంశం కూడా ఉష గారిలో పుష్కలంగా వుంది.ఈ లక్షణాన్ని "బహుదూరపు బాటసారి'-అనే కవితలో పొందుపరిచింది."ఈ తరుణాన వెను తిరిగి చూస్తే వేవేల క్రోసుల నా జీవిత బాట"అని మొదలయ్యే కవితలో"అచటచట బాట ప్రక్కగా నా లక్ష్యసిద్దిని నిలిపిన గిరులు/నిరాశలో కృంగిన లోయలు,వెలికి తెచ్చిన ఆశయాల నిచ్చెనలు'ఇలా సాగిన కవితలో ప్రకృతి వొక వికాస పాఠమైన వైనాన్ని కవయిత్రి విపులీకరించటమే కాదు "నా త్రోవ తుది వరకు అలుపెరుగని"అన్వేషణ స్ఫురింపచేస్తుంది. ఈ కవయిత్రి భావన శక్తి కూడా అపారమని చెప్పకుండా వుండలేనితనం సంపుటి చదివింతరువాత ఆవరించింది."గోడ మీది నీడలు"-అనే కవితలో 'దృశ్యానికీ,అదృశ్యానికీనడుమ విన్యాసం.../సర్పంలా సాగిన నీడ/గోడ మూలలో పడగ విప్పింది/చీకటికీ దీపానికి మధ్య సమరం/ నీడ రూపు మార్చింది/నేల బారున తాబేలు ఈ మారు/మోడో అడుగుకీ కృంగి/దేహపు అరలోకీ మటు మాయం"-ఈ మాటల్లో దృశ్యానికీ,అదృశ్యానికీ మధ్య గల తేడాను నీడల్నీ సారూప్యం చేసి వొక అసాధరణ వూహను నిర్మించింది ఈవిడ.
కాలాన్ని తవ్వితే కలల ఇందనం వూరుతుందనికలలు రావటం వల్లనే రాత్రులు కరగిపోతున్నాయని కలని కొనటానికి నిద్రని ఖర్చు చేయాలనే వూహించని భావ ప్రవాహాల్నీ మన ముందు ప్రవహింప చేస్తుంది.
కలం నింపిన కల్లం-అనే ఖండికలో చెలిమిని మానవ జీవిత మాగాణిలోని పైరు పంటలతో ఉపమిస్తూ పల్లె సౌభాగ్య చిత్రాన్ని గీసి "సారం తరగని మాగాణి సంక్రాంతి మన చెలిమి"-అని అంటుంది ఈమే."దృశ్యం కరిగేలోపు ఙ్ఞాపకాల సంకెల్లతో బిగించి కట్టి పడేసేది కన్ను'.ఆ కన్ను ను కవిత్వం చేసిన ఖండిక అనుభూతి వులితో చెక్కిన నిర్మాణ శిల్పంతో మనల్ని కట్టి పడేస్తుంది."నేల చీకాకు పడేంత వాన"-అనే ఒక్క పాదమే వర్ష భీభత్స దృశ్యాన్ని చిత్రిక పడుతుంది.మనుషుల మధ్య మమతలన్ని ఇగిరిపోతున్న సందర్భాన్ని "గోడ గుండె పగిలింది "-అనే కవితలో నిరూపిస్తుంది.

ఆవిడ రాసిన"అరచేతి గీత నిలువున చీల్చితే/నుదుటి రాత మారుననే పేరాశ"-లాంటి వాక్యాలు సమాజ మూఢనమ్మకాల్ని చీలుస్తాయి.ఆకాశంలోని వాతావరణాన్ని ఎంత సౌందర్యంగా వర్ణిస్తుందో చూడండి."మంచుపూలపేరంటం"-అనే కవితలో.కిందున్న నేల రాణికేనా ఇన్ని సంబరాలు అని ఆకాశరాజు ఈర్ష్య పడ్డాడని చెబుతూ" మబ్బు ముగ్గులేసి/మంచు పూలు చల్లి/చుక్కల గొబ్బిళ్లు పెట్టి'-సంక్రాంతి పర్వ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది."గంప అక్కడుంటే గుప్పేడేనా నాకు మల్లె మొగ్గలు"-అని ఆరంభమయ్యే కవిత"ఈ సిగ లెక్కెక్కడ తప్పుతుందబ్బా"-అనే కవితలో గడిచిపోయిన పోల్చుకొంటూ తన జడ తో పెనవేసుకొన్నా ఆత్మీయబంధాన్ని నెమరు వేసుకొంటూ,"దాని జడ జానెడు/నాది బారెడు"అంటూ తన జడ నిండు గోదారేనని ఉపమించుకొంటూ,విరజాజి కుదురు కూడా తన జడ ముందు తలవంచక తప్పదని కవయిత్రి వొక పురా స్మృతి లోకి తీసికెళుతుంది.జడ స్త్రీ సహజ సౌందర్య వస్తువే అయినా ఈ కవితలో ఉషగారు అంత అందంగా చెప్పి తన ప్రత్యెకతను చాటుకొన్నారు.

పిచ్చుక పైన రాసిన కవిత వొక అద్భుత కవిత ఖండిక.అరుణగారు పిచ్చుకను :పిట్టా నువ్వు ఈ లోకంలో పట్టవు"అని అంటే మరువం ఉష 'మళ్ళి ఇంత కాలానికీ ఈచలి దేశంలో ఆకురాలు కాలంలో భలేగా కనిపించావే"-అని మురిసిపోతుంది."నువ్వొక్కతివే వచ్చావేమోనని పలకరిస్తే"అని పిచ్చుకతో చేసే సంభాషణ పఠితల హృదిలోకి గుచ్చుకొని ఙ్ఞాపకాల సలపరం రేపుతుంది.

ఈ 'మరువం'-సంపుటిలో కొన్ని కవితలు హృది తడిపేవి కాకపోయిన "తూర్పార బోసిన గింజలు" కొన్ని చదువరులకు గొప్ప అనుభూతిని మిగిలిస్తాయి. వలపు వాన చినుకును మంచు పూల పేరటం కు పిలిచి గాలి లేఖ రాసి రమ్మని,జీవితం సౌందర్య రాహిత్యం కాదని చెబుతూ ఈ జాడలు తన కవితలో వున్నాయంటున్న కవయిత్రి ఉష గారు. ఒడి ఇచ్చిన అమ్మ వెళ్ళిపోయినా,బొడ్డు కోసిన బాపనమ్మ అటే మళ్ళినా,అడుగులకు చేయూత నిచ్చినతాతయ్య,బువ్వ పెట్టిన అమ్మమ్మ..ఇలా అందరు వెళ్ళిపోయారని తన ఙ్ఞాపకాలని మన ఙ్ఞాపకాలుగా మార్చింది.అంటే తన అనుభూతుల్ని పాఠకుల అనుభూతులుగా చేయ గలిగిందంటే ఆమె మంచి కవయిత్రి అని నేను అనటం.అందుకు ఆమెను అభినంద్స్తున్నా.ఈమె కవిత్వాన్ని కపిల రామ్ కుమార్ గారు మరువం దవనం అని వ్యాఖ్యానిస్తే ఆవిడ మరువం,దవనం వాసనలు ఒకచోట పొసగవనే ఉద్దేశ్యంతోనేమో మరువం ఒక్కటే చాలు అన్నట్లు ఙ్ఞాపకం.ఈవిడను కోరుతున్నా మరువం తో పాటి దవనం కూడా కవిత్వం చేసీ కవిత్వ కాంత జడలో వొక అలంకారం చేయమని.

హోరు

స్థల కాలాల్లో దూరంగానైనా సమాంతర ప్రపంచమేదో ఉండే ఉంటుంది.

అద్దంలో చందమామతో ఆగని రాముడు, మేఘాల పీచుమిఠాయి కావాలని మారాములు చేస్తుంటే, శాస్త్రజ్ఞుడొకడు శుక్రగ్రహపు ధూళిని నిశితంగా పరికిస్తున్నాడు. 

చందమామ విచ్చి నవ్విన క్షణాల్లో మరెక్కడో పగటినిద్ర మనసు పలక మీద తీరని కలని తిరిగి దిద్దుకుంటుంది.

ఇరుకు నగరాల్లో చినుకుల నేల సాంగత్యం లేని ఒంటరివాన విసుగ్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లోకి ఇంకిపోతుంటే ఆవలి పక్కన కొండ అంచున నది, ఎగువ ప్రవాహమై శిఖరాన్ని చేరలేక, విరహాన ఆవిరై,  చినుకై సాయుజ్యం పొందుతుంది.   

సృష్ట్యాది నుంచి రాధాకృష్ణుల రసవంత గాథ అనురాగ జలధి. నల్లకలువ కళ్ళలో చెంగల్వమాల మెరుపు. ఇదిగో ఓ జంట హృదయాల వేణుగానం — ఆమె పీల్చిన గాలి కణం ఊపిరితిత్తులలో రసాయనిక చర్య పొంది మళ్ళీ ఎప్పటికో మరలా అతని ఊపిరితిత్తుల్లో జొరబడే క్షణాలుంటాయా? ఉంటే, అవి అతనికి తెలుస్తాయా? అతను చూసిన నక్షత్రాన్నే, అతను చూసిన క్షణంలోనే, ఆమె చూస్తుందా? అలా జరిగితే దానికి మినుకుమినుకుల్లో ఏమన్నా ద్యుతి పెరుగుతుందా? ప్రేమ బారిన పడ్డవాళ్లింతే. ఆమె కౌగిట ఆతని గుస గుస "విశ్వమొకటి వుధ్భవించిన క్షణాన మనతో ప్రచోదితమవుతున్నాయనుకున్న మానవ లక్షణాలు.... అనురాగం, విరహం వంటి వున్నతానందాలను ప్రేరేపించగల భావ పరంపర మొదలయ్యాయి, ఆ భావాలతోటే నీ వునికీ ఆరంభమయ్యిందేమో అందుకే ఆది నుంచి నువ్వు నాకు ఎరుకే. నన్ను నాకు మిగలనీయని ఈ అనుభూతికి పదే పదే కారణమయ్యే నువ్వు నా జీవితానికి వరం" – రాధామాధవీయం.  అక్కడో తరం క్రౌంచ వారసత్వ శాపభారాన్ని వేదనతో మోస్తుంది.  సమకూరని మిథున భాగ్యం అందని ద్రాక్షలా ఊరిస్తుంటే అర్థవృత్తంలా అంతా బయటికికనపడిపోతూ, తమని తాము కప్పుకోలేక,  విప్పుకోలేక, కాపు లేని అనాథ గాయంలా ముసిరే ఈగల బారిన పడుతుంది. 

నిన్నటి మొన్నటి చిన్నతనాల కుట్టిన పున్నాగ పూల జడల వాసన ఇంకా పూర్తి గా మనసు లో నిండనే లేదు, విరబుసే కాలాలకు కాలాతీతమయ్యిందని కబురొచ్చింది. నిరుడు కురిసిన కన్నీటి సముద్రాల ఉప్పెన పోటు ఉధృతి ఇంకా తగ్గనే లేదు, మేట వేసిన దిగులు దిబ్బల మధ్య గా రాత్రి కురిసిన వెన్నెల మరక మెరుస్తూ గూడు నుంచి జారిన చిన్నారి చిలుక కళ్ళలో మెరుపులు నింపుతోంది.  ఆనంద విషాద రహిత స్వర్గ సీమల్లో అప్సర కాంతలు నాట్యమాడుతున్నారు.

'ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో నిదురించు జహాపనా. నిదురించు జహాపనా.. ' — ఈ కల్పనలకు, యమున రాగాలకు అసలు అర్ధం తెలిపే బేగం యే గానాలు ఆలపించిందో?  వైభవాల నడుమ అపూర్వ ఆదరణ పొందిందో,ఆదరణలోనే రగిలే నిరాశల చెరసాలలో మునిగిందో. స్వయంప్రకాశకమైన మణిపూస నవ్వుతో వెలిగిందో, ప్రాణం లేని రాళ్ళ మధ్య ఒక పాషాణమై తళ తళ లు మెరిపించిందో. ఏమో ఆమె మనస్సులో ఎన్ని అగ్ని పర్వతాలే రగిలేయో, అందమే ఆలంబనగా అదే జీవనాధారంగా ఆనందపడుతూ బతికేసిందో.  వాకిట ముగ్గుతో ఇంటి శోభని వెళ్ళడించే గృహమొకటి  ఊసుల పూసల పల్లకిలో మమతని మోస్తూ ఉంది.  ఆలుమగలు — మగని బుగ్గన మిగిలిన తన కుంకుమ గురుతు చూసి ఫక్కున నవ్వుతూ మల్లియకి అసూయ పుట్టించే మగువకి ఆతని మనసే ధామం.  ఆ క్షణమే శాశ్వతం.  జ్ఞాపకార్దదశ అక్కడ జనించదు.

ఈ హోరు ఏమిటి.  ఈ అంతర్ముఖ బాహ్యస్పృహల ఆర్బాటం – దర్శనాల ఆరాటాల కలబోత ఎందుకు.  ప్రాణం లేని ఈ అక్షరాలని మమకారం తో స్వీకరించే ఓ మనసు కోసమేనా?  ఊహాప్రపంచాలు రూపమియ్యమని మూగగా అడుగుతున్నాయి.  నిజానికి ఇది సంబరమేమో.  సంతృప్తనిశ్వాసల్ని విడువగల అవలోకన భాష్యమేమో.  తీక్షణమైన హోరు — కావాలి, దహించాలి.  అనుభూతి రవ్వల గనిగా బతుకు మారాలి.

"తత్ త్వం అసి"

This Poem is originally written by Ravi Yelamanchili.  As I liked the content a lot and desired to share the essence in telugu to my blog readers, I attempted this translation. All credits hence must be given to Ravi.)

వినిపిస్తున్నదంతా - వింతగా
బుద్దికి ఏమీ తోచదు

మా ఊరి కొబ్బరిచెట్టులా కాదు,
ఈ గర్విష్టి ఓక్ చెట్లు 
ఋతువులోనూ మేను వంచి
నేలను చుంబించవు

నాకు ఈ చలిరోజులు అస్సలు నచ్చవు 
వాయు మావయ్య బడి అయ్యాక 
ఉప్పు చెరువు దగ్గరకి వాహ్యాళికి తీసుకువెళ్ళడు
మొద్దుబారి ముడతలుపడిన వేళ్ళతో నా నల్లని జుట్టుని నిమరడు

కనీసం బ్రహ్మ నాలుగు ముఖాల్లో ఆవలింత వస్తే
ఏమి జరుగుతుందో అన్న కట్టుకథ కూడా వినిపించడు

మానసికనిపుణులు మావయ్యకి పట్టిన జబ్బుకి
ఋతు ప్రభావాన కలిగే కలత అని పేరు పెట్టారని అమ్మ చెప్తుంది

అందుకేనేమో ఆ వసారా లో చెక్కమెట్ల మీద కూర్చుని
మంచు వంక తదేకంగా చూస్తుంటాడు-

గడ్దిమీద, చలికి ముద్దకట్టిన నేల తోనూ
"తత్ త్వం అసి", "తత్ త్వం అసి" అంటూ
ఒక పెద్దమనిషి తరహా కరచాలనం చేసినట్లుండే
తన చుక్కలలేడి కాలిగిట్టల శబ్దం కోసమే
నిరీక్షిస్తూ.

ఒక చిరు అనువాద ప్రయత్నం: 
~~~~~~~~~~~~~~~~~~~~
(అమెరికాలోనే పుట్టి పెరిగి, 15 ఏళ్ళ ప్రాయంలో నా స్నేహితురాలి కొడుకు, రవి తన పాఠశాల కవితల పోటీలో ప్రధమ స్థానం గెల్చుకున్న కవిత ఇది. కొన్ని స్థానిక పత్రికలలో ప్రచురితమైంది. నాకు అనువాదాలలో ప్రవేశం బహుస్వల్పం. కానీ, ఈ ఏడాదిగా ఎన్నోసార్లు చదివి ప్రయత్నించాను. ఇవేళ్టికి కాస్త మరొకరికి పంచే స్థాయికి తేగలిగాను అనుకుంటూ, ఆ చిరంజీవి ప్రజ్ఞ ని నేను ప్రదర్శిస్తూ-)

Ravi | “That Thou Art”
---------------------------

Everything hear – is strange.
Sense makes nothing: 

unlike our coconut trees in the village, 
these arrogant oaks don’t arch their trunks
and kiss the ground even when 
the monsoon arrives.

I hate these winter days the most:
Uncle Vayu doesn’t 
walk me to the salt lake after school, 
run his calloused and wrinkled hands
through my black hair, 

or even tell me that silly story
about what will be left after
the four heads of Brahma 
have begun yawning.

Amma says that the psychologists
diagnosed Uncle Vayu
with a type of depression called 
Seasonal Affective Disorder.

Maybe that’s
why he sits outside 
on the wooden porch steps 
and stares at the snow– 

just waiting to hear his 
spotted deer’s hooves
make the sound 
“Tat Tvam Asi,” “Tat Tvam Asi”
against the grass, frozen stiff, 
like a gentleman’s handshake. 

శుక్రవారం

Forough Farrokhzad Farsi కవితానువాదం

సందడిలేని శుక్రవారం
బావురుమంటున్న శుక్రవారం
ఇరుకైన పాతసందుల్లా వ్యాకులపెట్టే శుక్రవారం
నలతపడ్డ సోమరి తలపుల శుక్రవారం 
చీదరపెట్టే వంకరటింకర కొనసాగింపుల శుక్రవారం
అపేక్షించని శుక్రవారం
అణకువ కలిగిన శుక్రవారం

ఖాళీ గృహం
ఏకాంతగృహం
పడుచుదనపు తాకిడికి తాళం పెట్టిన ఇల్లు
సూర్యుని కల్పనలు, చీకట్లు ఒదిగిన ఇల్లు 
ఒంటరితనం, శకునం, డోలాయమానాల లోగిలి
తెరలు, పుస్తకాలు, బీరువాలు, పఠాల లోగిలి

అహ్, నా జీవితమెలా నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగుతుంది,
లోతుగా పారే ప్రవాహంలా 
అటువంటి పాడుబెట్టిన నిశ్శబ్ద శుక్రవారాల ఆత్మగుండా
అటువంటి ఉత్సాహరహిత ఖాళీ గృహపు హృదయంగుండా
అహ్, నా జీవితమెలా నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగుతుంది

Friday | originally translated from Farsi to English by Ahmad Karimi-Hakkak

Quiet Friday 
deserted Friday 
Friday saddening like old alleys 
Friday of lazy ailing thoughts 
Friday of noisome sinuous stretches 
Friday of no anticipation 
Friday of submission.

Empty house 
lonesome house 
house locked against the onslaught of youth 
house of darkness and fantasies of the sun 
house of loneliness, augury and indecision 
house of curtains, books, cupboards, picture.

Ah, how my life flowed silent and serene 
like a deep-running stream 
through the heart of such silent, deserted Fridays 
through the heart of such empty cheerless houses 
ah, how my life flowed silent and serene.

ఈమె నాకు చాలా నచ్చే కవి (కవయిత్రి అనటం నాకు నచ్చదు కనుక). ఎక్కడో గుండెల్లో ఒక నాడి, నాళం ఆమెది నాదీ ఒకటేననిపించేంత సామ్యం ఉంది మాకు.

07/02/2014

పుష్యమి సాగర్ గారి 'కవితా సారం': మరువం ఉష కవిత చేతి సంచి!

చిన్నతనం లో నాన్న బయిటకు వెళ్ళినప్పుడు మోసుకు వచ్చిన చేతి సంచి ఎన్ని అనుభూతులను మోసుకు వచ్చిందో లెక్కపెట్టుకోలేము. ఉష గారి ఈ కవిత లో చాల వరకు అనుభూతులను మళ్ళీ తిరిగి తోడుకుంటున్నారు. ఎంతో మంది కి తమ నాన్న గారి చేతి సంచి తో అనుబంధం ఉండొచ్చు.

ఒక సంచి చుట్టూ కథా వస్తువు ని తీసుకొని అల్లిన కవిత లో చాలా చోట్ల భావోద్వేగం అక్షరాల్లో వొదిగిపొతయి , కొన్ని చోట్ల బాల్యం తాలూకు ఆనందాలను తోడూకుంటున్నట్టు గా వుంటది.

//జిలేబి, పకోడీ గుట్టు విప్పిన ఘుమఘుమలు// అవును చిన్నప్పుడు నాన్న ఇంటికి రాగానే..ఏమి తెచ్చారు మాకు అంటూ పిల్లల హడావిడి ఇప్పటికి మననం చేసుకుంటాం.

చలనం లేని వస్తువు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది మన జన జీవితం లో, అన్ని వస్తువు లాగానే చేతి సంచి కూడా, కాని ప్రతి దినం మన తో నే వుంటూ అనుకణం కావాల్సిన అవసరాలను అది వెచ్చాలు అయిన , పండుగ లలో కావాల్సిన సరుకు అయిన ఇది వుండాల్సిందే. అంటే మానసికం గా అది ఒక స్నేహితుని లా పని చేస్తుంది ఏమో .కదా..!!

పుట్టుక నుంచి మొదలు ప్రతి దానికి సంచి లేకపోతె ఇబ్బందే, పిల్లల దగ్గరనుంచి పెద్ద వారి దాక సంచి ఎన్ని వాహకాలు మోసుకుపోతున్నదే . ఇదోక అనంతమైన సంసార కదా చరితం కదా.

//సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,//
కొత్త పద ప్రయోగాన్ని ఉపయోగించటం బాగుంది.ఉదా: "ఊసుల బోషాణం", "మోసుకొచ్చిన పరాచికాలు."

కవిత ముగింపు లో ... అక్షయ పాత్ర లా ఎంత తీసిన తరగని అనుభవాలను, అనుభూతులను గుండె కు హత్తుకోవచ్చు నిజమే కదా..ఒక నేస్తం లా మన వెంట వుండే సంచి ని వదులుకోగలమా..లేదు 

//సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,//శతకోటి గాథలు తీసినా తేలికపడని చేతిసంచీ.//

ఉష గారి కవిత ను చదివాకా.జీవితమే ఓ సంచి అనిపించింది. చిన్న కవిత అయిన ఎంతో బాగా చెప్పారు ...వారు మరిన్ని మంచి కవితలని రాయగలరని ఆశిస్తూ ...
సెలవు.
*****
- చేతి సంచి-
 
మూరెడు జాజులు, చిట్టిచేమంతి దండలు,
తామరాకు పాన్పు మీద నాగావళులు..
జిలేబి, పకోడీ గుట్టు విప్పిన ఘుమఘుమలు,
సందెగాలి మోసుకొచ్చిన పరాచికాలు..
ఊరుసద్దుమణిగాక పుట్టే ఊసుల భోషాణం,
కొత్త మురిపాల జోరుకి సాక్ష్యం చేతిసంచీ.

దినసరి వెచ్చాలు, పండుగ సరంజామాలు
ఉయ్యాల తాళ్ళు, గిలక్కాయల మోతలు
పలకా బలపాలు, పుస్తకాలు, పూస మిఠాయిలు
కాలిపట్టీలు, పరికిణీలు, పెళ్ళి శుభలేఖలు
సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,
శతకోటి గాథలు తీసినా తేలికపడని చేతిసంచీ.

***ఎప్పటికీ నాన్న చేతి సంచీ మోసిన జ్ఞాపకాలు మధురమే! అసలు జీవితమే ఓ చేతి సంచి.
(02/16/2014)

చేతి సంచీ

నాన్న చేతి సంచీ నా చేతి కొచ్చింది
నిండా మోస్తున్న జ్ఞాపకాల బరువు
ఒకటొకటిగా, విడివిడిగా, మూకుమ్మడిగా
నాతో ముడిపడున్నవేవో లెక్కగడుతూంటే-

మూరెడు జాజులు, చిట్టిచేమంతి దండలు,
తామరాకు పాన్పు మీద నాగావళులు..
జిలేబి, పకోడీ గుట్టు విప్పిన ఘుమఘుమలు,
సందెగాలి మోసుకొచ్చిన పరాచికాలు..
ఊరుసద్దుమణిగాక పుట్టే ఊసుల భోషాణం,
కొత్త మురిపాల జోరుకి సాక్ష్యం చేతిసంచీ.

దినసరి వెచ్చాలు, పండుగ సరంజామాలు
ఉయ్యాల తాళ్ళు, గిలక్కాయల మోతలు.. 
పలకా బలపాలు, పుస్తకాలు, పూస మిఠాయిలు
కాలిపట్టీలు, పరికిణీలు, పెళ్ళి శుభలేఖలు..
సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,
శతకోటి గాథలు తీసినా తేలికపడని చేతిసంచీ.

నిజానికి నాన్న జీవితం ఆ చేతి సంచి
నా గుండెగూటి లో తనని ఇంకాస్త సర్దుకోవటానికి. 
ఒకరిగా, నాన్న బిడ్డగా,  నాన్నని దాటే పోటీదారుగా
సంచీ మోసుకుంటూ బ్రతుకు వీధిలోకి అడుగు పెట్టాను. 

ఇటులేలనో!?

నన్నిలా నివురు ఊదిన నిప్పులా ఏలనే కాలుస్తావు ఎన్నెలా
సెప్పుకుంటే సోదిలా... సెప్పకుంటే గుండె గండిపడి తొణికేలా

కొమ్మ కొమ్మనా కమ్ముకున్న నీడల ఎందుకో రాలినపూల వెల్లువ
మిన్నకుంటే మత్తులా...కలలో వస్తే నిన్నామొన్నల ఊసుల కలవరింతల్లా

బతుకున ముసిరిన ఉప్పెనలా ఎవరివే కోయిలా
వెన్నంటి నీవుంటే...వేయి జనమల వరదపోటు ఉన్నపళాన తాకినట్టలా

ముంగిట దిద్దిన రంగుల రంగవల్లిలా ఎందువలన ఈ బాసల అల్లిక
జతపడిన ఆశలచిత్రం లా... జతగా పడిన అడుగుల అందమైన ముద్రలా

హంసగీతి

లోయ గోడలు బీటలు పడ్డాయి
పైనుండి జారే పిలుపుకి ప్రతిధ్వని కొదవైంది

ఏ పిట్ట నోటికూడు విత్తులుగా నేలపాలైందో
వేళ్ళాడుతున్న వెర్రి చెట్ల జాతరల్లే ఉంది
కిక్కిరిసిన వేర్లు గోడ మీద బల్లుల్లా పాకుతున్నాయి

వెన్నెల పిల్లలు కొందరక్కడ దాగుడు మూతలాడుతున్నారు
చీకటి చేతులకి అందకుండా పరుగులు తీస్తున్నారు

గుట్టుచప్పుడు కాకుండా ఆవాసం ఉన్న సరస్సు
లోయలో అలలు ఉగ్గబట్టుకుని ఉంది

ఇన్నాళ్ళకి హంస గీతి ఒకటి పైకి ఎగిసింది
ఉలికిపడ్డ సరస్సులో వెన్నెల ఊయలూగింది

చెదిరిపడ్డ ఆకుల పక్క మీద చిందిన చివరి కూత
ఏనాటి అనుబంధం కొరకు ఎదురుచూపు సాగుతుందో
మరణాన్ని సైతం పారద్రోలుతూ మిన్నంటిన చరమ గీతం

హర్షోన్మత్త విషాదమే రాగంగా కట్టిన ఆ బాణీలో 
సంద్రాలు సైతం కంటనీరు పెడుతున్నాయి

(Cygnus olor,Swan Song ని గూర్చి చదివినపుడు ఎపుడు నిగూఢంగా దాగిందో ఈ ఊహ, అక్షరాలలో నిదురలేచిందిలా!)

06/02/2014

స్తంభించ/లే/ని ఘటనలు

వాకిలి వద్ద వేచిన నీకు ఎవరూ కనపడరు
అభ్యాగతుల స్వరాలు వినవస్తుంటాయి
విస్తరిలో ముడిచిన జీవితం గుర్తుకొస్తుంది
ఆస్వాదించని రుచుల జాడలే ఆ సవ్వడులు

సమూహాలు చురుగ్గా కదులుతూ ఉంటాయి
నిదురించే నీలోకి ఎవరో పయనిస్తారు
వాడిపోయిన చిత్రాలకు వర్ణాలు అద్దుతారు
నిషేధించిన కలల్ని నీవెప్పటికీ అడ్డుకోలేవు

ఆలోచనల కుబుసాలు విడుస్తావు
నాగరిక పొరలూ విప్పుకుంటావు 
లజ్జాభారపు మూటలు విసిరేస్తావు
ఆశల కొలనులో నగ్నంగా విహరిస్తావు

మెత్తగా ఆవరించే మెలుకువనీ ఆపలేవు 
ఇప్పుడు మరింతగా ముడుచుకుంటావు
లోగిలి ద్వారాలన్నీ మూసివేస్తావు
వాస్తవాధీన రేఖ వద్ద చొరబాటుకీ ప్రయత్నిస్తావు

నిదురలో, కలలో, జాగృతిలో, వేదనలో
నీ ప్రపంచం నీకెపుడూ ఒక రంగశాల
నీవెరుగని నిన్ను నువ్వు ఆవిష్కరిస్తావు
లేదా, అవతరించే మరో నిన్ను చూస్తుంటావు

* అభ్యాగతుడు : భోజనమప్పుడు వచ్చిన అతిథి

01/02/2014

మేలుకున్నాక కలలు వచ్చే వేళలివి!

విశ్వం వేణువై మోవికి తాకితే
హృదయం ఆలపించే గానానికి
నిదుర రానని మొరాయిస్తే

వాగుల్లోకి జారిపడిన వెన్నెలలు
హొయలొలికించే రాతి శిలలు
పున్నాగ బూరలూదే తుమ్మెదలు
సొబగులీనే కడిమి పూలు

భాష్యాలు పంపినట్లు కలగన్నానని

గుమ్మపాల పొదుగులో తువ్వాయిలు
అమ్మవొడి ఊయలలో పాపాయిలు
ధ్వజ స్తంభపు మేడలో పావురాయిలు
ఏటి గట్లు ఎక్కి దిగుతూ బొమ్మడాయలు

స్వరాలు కట్టాయనీ కలగన్నానని

ఈ ఉదయపు ఘడియల్లో నీతో చెప్పబోతే
నీ నవ్వులో ముడిచిన నా విశ్వపు ఆనవాళ్ళతో ఎదురౌతావేమి,
చెదరని కలతో నీ ఒడిలో నిదురపుచ్చుతూ!?

తోడై వస్తావా సహోద్యోగి గా?

"కవిత్వం అంటే?" నాకు నేనే వేసుకున్న ప్రశ్నని మోసుకుంటూనే, 
పదిలంగా నా 'కవితాసంకలనం' ఒకటి నీకు పోస్టులో పంపుదామని...

"Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?"

నిర్లిప్తం గా సమాధానం కొరకు వేచిన చెవులతో 
ఇన్నేళ్ళగా ఎన్నో-నవ్వు అద్దకాలతో- ముతకబారిన ముఖాలు,
ఉద్యోగాలు: డాలర్లలో/డాలర్ల కోసం, ఇంద్రియాలు వేలం వేసుకుని 

క్రిమి ఇబ్బంది గా కదులుతోంది లోలోపల: 
గూటి గోడలు ఎక్కుతూ జారిపడుతూ, గుండెజిగటలో కూరుకుపోతూ 

పగిలిపోగల ఆ ఒక్క గుండె చేజార్చుకున్నాను, అక్కరలేని జవాబు

నీరుగారిన ఆశలు, ప్రణాలికలు మనసులో-
దేహం లోపలా వెలుపలా ప్రవహిస్తున్న చీమూ నెత్తురు
బతుకుని ఒరుసుకుని సాగే లజ్జా, బిడియాలు - ఏ జలతత్వం తెలపాలి?

నువ్వు, నేను, తను నిజానికి ఈ మర్త్యలోకం, కదిలే జీవం 
ఏదో ఒకనాటికి Perishable
మరణ సంహిత ఇదే/ను/గా/!? 

విపత్తు ని పొట్లాల్లో చుట్టి విసిరేయగలిగితే,
విశ్వం పట్టటానికి అంతే లోతైన గొయ్యి తవ్వాలి, 

ఇదే, ఈ నానాజాతులకి నాబోటి జీవి తలపెట్టగల 
Potentially Hazardous యోచన

"Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?"

మళ్ళీ అదే నవ్వుతో, విసుగు ధ్వనిస్తూ అదే ప్రశ్న- తెప్పరిల్లాను
కానీ, I grinned back, sort of smiled...
చెప్పగల/అంగీకరించబడే మాట మెత్తగా అప్పజెప్పి

కొత్త సమాధానం కొరకు వెదుకులాట
ఈమారు నాలోని నాకు నేను వేసుకున్న ఇంకొక ప్రశ్న

పువ్వుల్లో ఏదో ఉంటుంది, పసిపాప నవ్వల్లే - ఏమిటది?
పసిపాప కన్నుల్లో దాగి ఉంటుంది వెన్నెలల్లే
సున్నితం గా, లేతగా-

లేత గాలిలో, నీరెండలో కోమలత్వం ఉన్నట్లే

అవన్నీ fragile beings, ఖచ్చితం గా విలువైనవీను

కాలం ఎంత చిక్కగా ప్రవహిస్తుంది, 
ఎన్నిటిని దాటుకుని ఎడతెరిపిలేకుండా...

ప్రశ్న వెనుక ముసురుతూ ఇంకొన్ని మరికొన్ని ఇంకెన్నో! 

అశాశ్వతం కి నిర్వచనం: ఏది? 
ఇదొక్కటీ శాశ్వతం గా దొరికితే బావుణ్ణు
కలవటం, విడిపోవటం, పోగొట్టుకోవటం, నిరీక్షించటం
నిరంతరం దేనికొరకో నశించిపోయే ఉద్వేగాలు
ఊరించే విష ఫలాలు, ఆ ఒక్క బలహీనతనీ
బలం గా చేధిస్తే - 
ఆకాశం దాచుకున్న nonperishable,
సముద్రం పొదివిపట్టిన perpetual శాంతి నిత్య సత్యమై పోదూ!?

యంత్రాలు, యాంత్రిక వైనాలు, ప్రాపంచిక పోకడలు
వీటికన్నా Potentially Hazardous వస్తువులేవి
సముదాయాలు, సమూహాలు గా అవే బండశిలలు- 
మర మనిషి గా మారిన నువ్వు, నేను, మనమంతా!

ఇకిప్పుడు చెప్పు, 

నీ నుంచి, నా నుంచి, మనల్ని కాపాడుకునే వృత్తిని చేపడదామా
మనమిద్దరం ఈ చిన్ని లోకాన్ని రక్షిద్దామా?

"Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?"

విశ్వాల తనిఖీ చేస్తూ - సృష్టి కోసమొక తపాలా వ్యవస్థ కనిపెడుతూ - 
మరణించే వరకు ఓ మహత్తర కార్యం నెరవేరుస్తూ...

కవిత్వమంటే జవాబు అవసరం లేని బతుకు సాగిస్తూ-

లోలోపల పగుళ్ళ సవ్వళ్ళు వినవస్తున్నాయా?
రంగు రంగు రెక్కల సీతాకోకచిలుక నీకు త్రోవ చూపుతూ-

05/02/2014

తరుచుగా

దేహమే శిలువగా మోసుకుంటూ, లేదా
దేహపు గదిలో బందీ అయిన ఆత్మగా
విశ్వపు ఒడికై ఆర్తి చెందుతూ
విడుదల కొరకై వేచి ఉంటాను

గోడల్ని ఒరుసుకు మొలిచిన రావిఆకులు 
కదులుతాయి, కంటి చూపుని కదుపుతాయి 
నీటిలో పడ్డ కిరణాల పరావర్తనమో, వక్రీభవనమో
మెరుపు నీడలై కనులెదుట నిలుస్తాయి
వార్తాహరులు వచ్చిపోతున్నట్లే ఉంటుంది

కమ్ముకుని కట్టిపడేసిన భయపు కౌగిలి లో 
ఊపిరి అందని ఉక్కిరిబిక్కిరి లో
దిగంతపు దిశ గా, ఏవేవో ఆనవాళ్ళ వెంట 
చివరి మజిలీ కి తరలిపోతుంటాను

గాలి ఊయలులు సేద తీరుస్తాయి
కెరటాల వీవెనలు కుదుటపరుస్తాయి
ప్రకృతిలో మనుషులు, మనుషుల్లో ప్రకృతి
పలుకరిస్తాయి, గృహానికి చేరిన భావన ఇస్తాయి
ఇవన్నీ నిండిన లోకపు వాకిలి లో నిలిచి, 

కృతజ్ఞతల తోరణాలు కట్టిపోతాను