ఈ పచ్చని మణులలో ఏ కవితలు దాగెనో!


దారి పక్కను గడ్డి  సెజ్జను దాగి ఉండే బీదను, నిరుపేదను పూజకంటే వస్తిని,  ఏ మోజులేని చిన్నివిరిని,  ప్రభువు కొలువునదాసిని,  శ్రీపదములకు తివాసిని”  గడ్డి పూవు భాషని ఇంత బాగా చెప్పగలిగేది కృష్ణశాస్త్రి గారు ఒక్కరేనేమో! వసంతుని రాకడకి ఊరంతా వేడుగ్గా ఉంది.  ప్రతి ఇంటి ముంగిట, పెరట్లో ఉద్యానవనమంత శ్రద్దగా తీర్చి దిద్దేస్తున్నారు.  ఇకపై ఫోటోయిత్రుల మురిపాలుగా ప్రదర్శనలిస్తాయవి. కానీ, ఎవరికీ పట్టని ఆరుబయల్లో అసలు పసిమి పచ్చలు మెరుస్తున్నాయి.  ఆ గడ్డి మొక్కలు నేలంతా అలుముకు పోయి మట్టి కనపడకుండా పాకుతున్నాయి.  కణుపు కణుపుకీ ఆకులు, మొగ్గలు, ముద్దగానో, నక్షత్రాల్లానో – వాటికవే తీర్చి దిద్దుకుంటూ – స్వయంభువు వనదేవత బిడ్డలు.  

మొన్న నడకలో నిలదీసాయి.  నిన్నటి నడకలో,  హోరుగాలిలో, కుంభవృష్టికి సిద్దమౌతున్న క్యూమిలోనింబస్ మేఘాల కప్పు కిందన,  నా కామేరా కి అందాయి.  ఇన్నాళ్ళకి నా ప్రయత్నం సిద్దించింది. సరీగ్గా అటువంటి వేళల్లో ఆ అందాలు సంపాదించాలన్న కాంక్ష తీరింది.  ఇవన్నీ 2 గంటల  వ్యవధిలో 3 మైళ్ళ నడకలో తీసినవి, పైగా మా ఇంటి నుంచి కాలినడకన 5 నిమిషాలు పోగానే ఎదురౌతాయి.  

అవును మీ ఊహ నిజమే, పడమటి నేలమీద (to be precise, breathing on this land - the heart land, bread basket, corn belt, mid-west and my cozy den) మా ఆంధ్ర అన్నపూర్ణ/rice bowl of Andhra ని, కోనసీమ నికృష్ణా గోదారమ్మల్నీ మరి మరీ బెంగగా గుర్తుకు తెచ్చుకుంటూ "ఈ నల్లని రాళలో యే కన్నులు దాగెనోఈ బండల మాటున యే గుండెలు మ్రొగెనో..ఓఓ…”  అన్న కవిగారిననుకరిస్తూ నేను ఈ పచ్చని మణులలో ఏ కవితలు దాగెనోఈ పువ్వుల దాపున యే కలతలు వీడునో..ఓఓ...అని బాణీ కట్టాను. ;)

పచ్చిక బయల్లో తారాడదామని అటుగా అడుగేస్తేప్రేమ తడిలేక ఎండిపోయిన నా ఎడద నీ ఎదుట పరిచినప్పుడు నీవు జాలువార్చిన అనురాగ తుషారాల్లో నాలో వెల్లువైన లేత పచ్చిక చివుర్ల మమతావేశం మాదిరిగానే ఆ  గరికెలో ఓ చిత్రం! 


నేను ప్రకృతిలో వెదికే ప్రతి అందాన్ని నా భాష్యంగా చెప్తే,ఆ ప్రతి పదానా  పరవశంగా అదే ప్రకృతి ని దర్శిస్తూ, పలుకులుగా పరిమళించే కృష్ణ గీతిక నా బంగారు భావన కి అంకితం ఈ పచ్చిక పూలహారం. 

పది బొమ్మల పాత ఊసులు!

ఇవాళ సమయమంతా నా పాత ఫోటోలు అటూ ఇటూ సర్ది,  మరొక 2 గంటలు కొత్తవి తీసి ఇలాగ గడిపేసాను.  అందులోవే కొన్నిపంచుతూ - మరిన్ని ప్రశ్నలు సంధిస్తూ...

ఇక్కడ నేల, నీరు సాక్షిగా మిడిసిపడుతున్న జలపుష్పం చూసారా?  మీలో ఎవరికైనా దాని ఊసులు తెలుస్తాయా?

జలపుష్పం - జతపడిన జంట

2008 నుంచి నన్ను  ఎరిగినవారికి ఆ పైన ఉన్న బొమ్మ ఏమైనా గుర్తు చేసిందా?  అవును,  దాదాపు 25 మందిమి కలిసి 35 రచనలతో రాసిన  జలపుష్పాభిషేకం సంకలనానికి నాంది పలికిన నా రచన "ఎనిమిదో చేప" గీతం లో జంట వీళ్ళే.  యారన్ ని అడిగి పంచుతున్నానిది.   మా ఇంటి వెనుక చెరువులో జల పుష్పం అది.  మరి కొన్ని జలపుష్పాల వయ్యారం  ఇక్కడ.  అవి తినరు, అలా పట్టి ఇలా వేసేస్తారు.  అతను అలా నన్ను అడిగి వచ్చినవాడే.  ఇప్పటికీ ఈ బొమ్మ పిల్లలకి చేప ని చూపటానికో,  సరదా జ్ఞాపకానికో పనికొస్తుంది.

http://en.wikipedia.org/wiki/Adenium

10 రోజుల నిడివితో తీసిన ఈ పూలని చూసి, పేరు చెప్పండి.   అక్కడా ఇక్కడా వెదికి చీట్ చేయొద్దు. :)  చెప్పిన వారికి నా మొక్క ఇవ్వను కానీ పెంచటం నేర్పుతా! ;)

DESSERT ROSE

http://www.angelfire.com/hi/AdeniumsofHawaii/




చిక్కుడు తీగె,  కుదురు రెండున్నాయి ఇక్కడ

అబ్బో - చెప్పొచ్చారు కానీ,  ఆ గుత్తులు చూసి కణుపు చిక్కుడు అని చెప్పలేమా ఏమి!

చుక్కకూరపూత

ఇక్కడ సోరేల్ దొరికినా అది మన చుక్కకూర లా  తోచదు.;  అందుకని  తంటాలు పడి తేవాలీ  విత్తనాలు,    పాట్లు పది పెంచాలలాగే!

పొదీన పువ్వు
ఈ పూల పేర్లు,  క్రిందన ఉన్న ఆకు కూర చెప్పటం కాదు,  ఈ చలి దేశాన పెంచానని అచ్చెరువూ పడాలి.  అదే మీకు క్లూ...

బచ్చలి కుదురు

 ఇక మిగిలిన ఈ జతా చాలా దగ్గరవి.  చెప్తే మీకొక రెసిపి ఇస్తాను...
ముల్లంగి పూత
మా మొదటి ముల్లంగి దుంపలు

మామూలుగా ప్రతి ఏడు పెంచే వాటికి తోడుగా, కనీసం 2 రకాలు కొత్తవి కలుపుతా -  పోయినేడాది ఆ పై 6 కొత్తవి వచ్చాయి.    నాకు తోట పని అంటే ఉన్న ఇష్టం,  ఇంకా ఎవరెవరు ఏమి పెంచుతారో అన్న ఆసక్తి కలిపి ఇలా!  ఇక మీ మీ తోటల - పలుగు పారల కబుర్లు చెప్పినా సంతోషమే, చెప్పకపోయినా సంతోషమే.  నా తోట నాదేగా! ;)

చివరిగా వివిధ వేడుకల్లో మా పూల అమరిక:  ఒక్కోసారి అంతా పద్దతిగా పెంచి, ఇలా  త్రెంపటమా అనిపించినా, అస్తమానూ తోటలో తిరగలేను,  ఇలా నా చేరువగా ఉన్నాయన్న స్వార్థం!

డైనింగ్ టేబుల్ మీద సెంటర్ పీస్ గా


నా బతుకమ్మ ఏది ఇందులో?

రాండమ్ గా పేరిస్తే ఇలా

కాస్తంత పద్దతిగా చేరిస్తే ఇలా
పడతుల సిగలోకి సిద్దమవుతూ - బిక్కు బిక్కుమంటూ

ఓ పయనం లో ఆ నాలుగు, ఈ నలుగురు


“It is my right to be uncommon ...”  - Dean Alfrange ఆ మాటలు ఆయన అన్నది ఒక ఉద్దేశపూర్వకంగానే అయినా ఒక కార్యాన్ని, లక్ష్యాన్ని ఎంచుకునే ప్రతివారికీ వర్తిస్తుంది.  తెలుగు బడి పర్వం నా జీవితం లో మొదలు కావటానికి పూర్వాపరాలివి.  నాతో ఉండి నన్ను నడిపేది నా స్వంతమైన స్ఫూర్తి మాత్రమే.  ఇక్కడ చెప్పే నాలుగు విషయాలు,  నలుగురు వ్యక్తులు -  ఎంతో కృషి, కుతూహలం, శ్రద్ద,  పట్టుదల పెంచిన అంశాలు.  మరి కొంత మార్గదర్శకాలు.

20సం. క్రితం ప్రవాస జీవితంలోకి రానున్నానని తెలిసినపుడు ముందుగా వచ్చిన బెంగ – తెలుగు వారుంటారా? అంటే ఆంధ్రా నుంచి వెళ్ళినవారు అని కాదు.   తెలుగుదనం తెలిసిన తెలుగువారు.  తెలుగుదనాన్ని ప్రేమిస్తూ, గౌరవించేవారు.  ఉంటారా?  ఉండరా?  ఉంటే నాకు తెలుస్తారా?  నేను ఇలాగే ఉంటానా?  తెలుగుదనాన్ని నిలబెట్టుకుంటానా? ఈ భయం లోలోపల  పెరిగిపోతూ ఉండగానే సిడ్నీ వెళ్ళి పడ్డాను.   వెళ్ళిన వారం తెలిసిన ఒకరి ద్వారాగా ఈ ప్రైవేట్ చానల్స్ రాకమునుపు మనకి దూరదర్శన్ లో  వారానికొకమారు వచ్చే “చిత్రమాల” వంటిదే అక్కడ ఫీజీ ఇండియన్ కమ్యూనిటీ చొరవతో వచ్చే సినీగీతాల ప్రోగ్రామ్ ఉందని తెలిసి కాస్త ఊరట.   అలా ఒక నెల కి తెలుగు రేడియో కార్యక్రమం “తెలుగువాణి” ప్రతి శనివారం ఉదయం 2 గంటల పాటు ప్రసారమౌతుందని తెలిసింది.  అది లగాయతు పని ఉన్నా పక్కన పడేసో, లేదా ఉదయపు పని పూర్తి చేసుకుని బాసింపట్టు వేసుక్కూర్చుని రేడియోలోకి చెవి నొక్కి మరీ వినేదాన్ని.  పొత్తిళ్ళలో బిడ్డనుంచుకునీ కూడా వదిలేదాన్ని కాదు.  “ఈ వారం ప్రశ్న  అని అడిగేవారు, సరైన సమాధానమిచ్చినవారిలో ఒకరికి బహుమతి ఉండేది.  దానికి సమాధానం చెప్పేవరకు ఊపిరి బిగపట్టుకుని,  చెప్పాక బహుమతి  ఎవరికోనని మరింత బిగుసుకుని గడిపేదాన్ని.  







ఆ ప్రశ్నలు-సమాధానాలు వలన ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలిసాయి.  అలా గడుస్తున్న వారాంతాల్లో ఒక ఆదివారం ఒకరి ఇంట్లో నేను మాట్లాడే తెలుగు విని “పై వారం రేడియోలో వార్తలు చదువుతారా?” అని అడిగారు ఆ రోజే పరిచయమైన ఒక వ్యక్తి.  కాస్త మొహమాటంగానే ఒప్పుకున్నాను.  వివరాలు తర్వాత ఇస్తామన్నారు.  చదవటమేగా ననుకున్నాను నిజానికి.   గురువారం నాడు సాయంత్రం ఫోను,  ఫలానా వారిని అడిగి వార్తలు తెచ్చుకుని తెలుగులోకి అనువదించి శనివారం ఉదయం  7 గంటలకి రేడియో స్టేషన్ కు వచ్చేయండి అని.  గుండెల్లో రాయి పడిపోయింది.  సరే తప్పుతుందా మరి! ఆ ఫలానా వారు దిగుమతి చేసిన గత వారం రోజుల ఈనాడు తరహా ఆంగ్ల పత్రిక లోని వార్తలు ముందేసుకుని,  బేరీజులు వేసి,  తెలుగులోకి రాసి, కొన్ని తీసి,  కొన్ని మార్చి, దిద్ది,  మొత్తానికి శనివారం వార్తలు చదివేసాను.  నాకు అలా రేడియో స్టేషన్ లో చదవటం కొత్త.  ఆ అనుభవం నెమరువేసుకుంటుండగానే ఒక ముగ్గురు ఫోన్లు – 1) బాగా చదివారండి; తెలుగు బాగా వచ్చినట్టుందే!  2) ఏమ్మా క్రొత్తవారా?  ఇంతకు మునుపు వార్తలు చదివావా?  3) మానకండి, అపుడపుడూ చదవండి. – సారాంశాలతో.   ఆనాటితో మొదలైన ఉత్సాహమే రేడియో తో పాటుగా, అక్కడి పత్రిక తెలుగు వాహినికి కథలు, కవితలు పంపటం వంటి సరదాలకి,  సభల్లో మాట్లాడటానికి ముఖ్యంగా స్వర్గీయ రామారావు గారికి ఘననివాళి అర్పించటం వంటి కృతజ్ఞతాపూర్వక చర్యలకి,  వేడుకల్లో వ్యాఖ్యత గా వ్యవహరించటానికి మూలమైంది.  7సం.  గడిచిపోయాయలా.  ఈ ఏడేళ్లలో నాకు చాలా కాలం పాటు ఇంట్లో ఇంటర్నెట్ లేదుకనుక ఆన్‌లైన్‌లో మసలుకోవటం అనేది తక్కువ.  ఈవారం” అని వచ్చే ఒక ఆన్లైన్ పత్రిక మాత్రం తరుచూ చదివేదాన్ని.  

సరే, మళ్ళీ పాదాల్లో చక్రాలు తిరిగాయి.  తూర్పు దిక్కు దేశాన్నుంచి పడమటి తీరానికి తోయబడ్డాను.  మళ్ళీ కొత్త సీసాలో పాత సారాలా జీవితం దిద్దుకుంటుండగా 2005 ప్రాంతాల్లో  సంభవించిన ఒక వ్యక్తిగత విఘాతాన్ని తోసుకుని సాగటానికి ఎంచుకున్న మార్గం – సాహిత్యం.  2005-2008 నాటికి స్క్రీన్ మీద ఎక్కువసేపు చదవటం అలవాటు పడ్డా అవన్నీతెలుగేతర రచనలు, లేదా ఈనాడు,  ఆంధ్రభూమి,  వార్తా పత్రికల రచనలు .  ఆ క్రమంలో నా కంట పడింది  మాలతి గారి తూలిక – తెలుగు కథలకి ఆంగ్లానువాదాలు.  అభిమాని లేఖ గా మొదలైన ఆ అనుబంధం మరొక మలుపు కి కారణమైంది.   వదిలేసిన కొన్ని సాహితీ వ్యాపకాలు తలకెత్తుకునే మార్పు సంభవించింది.  ఆ ఆనందపు నావ లో సాగుతున్న నా దృష్టికి తేబడింది వీవెన్ గారి లేఖిని.  వీవెన్ గారికి ఎందరో ఋణపడి ఉన్నారు,  నేనూ ఒకరిని.  ఆ తెలుగులో రాయటం సాధ్యం అన్న హర్షాతిరేక గళం నిదానంగా నా కలం లోకి అక్షరాలుగా చొచ్చుకుని నిద్రాణా నుభూతులను,  నిజ జీవితా నుభవాలను “మరువం  తోటగా వెలికి తెచ్చాయి.   అలా 4సం. క్రితం బ్లాగులోక వాసినయ్యాను.   అప్పుడు తారసపడ్డ అద్భుతమైన బృహత్తర కార్యక్రమం “ఆంధ్రభారతి”.   తెలుగు చదువరులు అంతా చేతులెత్తి మొక్కి,  చేతులు కలిపి నడపాల్సిన యజ్ఞమది.  అక్కడి నిక్షిప్త నిధులను తొణకని ఆసక్తి తో  నిండుగా అనుభవిస్తుండగా,  నా మూషిక వాహన సంచారం (మౌస్ క్లిక్స్)  లో ప్రత్యక్షమైంది  కంటబడింది ఇదిగో  తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం - మీ కోసంఅంటూ మాగంటి వంశీ గారి వెబ్.   వత్తుగా పేర్చిన అల్మారాలో వెదుక్కునే వస్తువు అక్కడి ఏదో ఒక అరలో దొరుకుతుంది.  అప్పుడు మొదలైన అక్కడి సమాచార సందర్శనం ఈవేళ్టిదాకా బెణకలేదు.   నా తెలుగు తృష్ణ కి మూలమని చెప్పుకునే నాలుగూ ఇవి -  తూలిక,  లేఖిని,  ఆంధ్రభారతి,  మాగంటి వెబ్.   ఆ నాలుగు దిక్కుల నిలిచిన నడుమ అభ్యాసానికి కలిసిన వెబ్ పత్రికలు, ఇతరత్రా వనరులు మరి కొన్ని ఉదహరించితీరాలి -  సుజనరంజని,  పొద్దు,ఈమాట, కౌముది, పుస్తకం... "అక్షరచిత్రం, పదనృత్యం, అంతశ్చైతన్యం"  అంటూ సాగిన నా "మరువం"  బ్లాగు అనుభవాలు,  నాలోని కవికి తోడ్పడ్డ పరిచయాలు ఎంతో విలువైనవి,  కానీ, అవి ఈ పోస్ట్ పరిధికి రానివి.  అభిప్రాయాలూ, విమర్శలు పడుగుపేకల్లా నడిచేవి.  అయినా అవన్నీ మునుపట్లో సవివరంగా, సవినయంగా చెప్పేసినవే.  అంచేత ఎక్కువ వివరాలు ఇవ్వను.  అప్పుడు అందిన ఒక ఆశ్చర్యానందపు క్షణం -   ఇది.
  
ఇక ఆ నలుగురు వ్యక్తులెవరననేనా మీరడిగేది.  తొలుత మా హిందీ టీచర్ – సీతారత్నం గారు.  మాలోని అనాసక్తిని పారద్రోలి,ఆటపాటల్లా అధ్యయనం చేయించి, అలవోకగా భాష మీద పట్టు వచ్చేలా కృషి చేసిన గురువు.  సహనం,  శాంతం కలిపి అల్లిన వస్త్రం ఆవిడ మానసం.  

విద్యార్థి గా నా తర్వాతి దశలో “న గురో రధికం” అన్న భయ,భక్తి భావాన్ని,  ఒక విధమైన ఆరాధనతో కూడిన అభిమానాన్ని నాలో కలిగించివారు మా లలిత మేడం గారు.  అందరికీ హడలుపుట్టించే ఆవిడకి కళాశాలలో చేరిన మొదటి రోజు నుండి చేరువ కాగలిగాను.  ఆ చనువు ఇక్కడ మాటల్లో చెప్పలేనిది. ఒక విధమైన ఆకర్షణీయమైన నవ్వుతో, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే మాటతో ఆవిడ నేర్పిన విద్య, తీరు నేను మరువలేను.  ఈ ఇద్దరూ నన్ను చాలా ప్రభావితం చేసారు.   ఆధ్యాపక వృత్తిలోకే వెళ్ళాలన్న నా నిర్ణయాన్ని విధి బలీయత ఐటీ వైపుగా మళ్ళించి ఉండకపోతే ఎలాగ ఉండేదో? 

మూడవ వ్యక్తికి, నాకు  వారధి మా అత్తయ్య.  అత్తయ్య స్నేహితురాలైన ఖజానా గారు తన పిల్లల్ని పెంచుతూ,  మిగిలిన పిల్లల్ని ప్రోత్సాహిస్తూ, ఆర్థిక సహకారం అందిస్తూ, విద్యా బుద్దులనే గాక, సంస్కారయుతమైన నడవడిక, సభ్యత తో కూడిన జీవిక అలవరచటంలో,  స్నేహహస్తాన్ని అందించటంలో ఎలా ముందుంటారు, చురుగ్గా పలు కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు... ఇత్యాది విషయాలు తెలిసాక,  ఆమె ఆ ఎదిగే పిల్లల పట్ల ఎంత కీలకమైన పాత్ర  వహిస్తున్నారో అవగాహన కి వచ్చాక నాలోనూ ఆసక్తి రగిలింది.   

3సం. క్రితం తెలుగు బడి మొదలుపెట్టాను.   ఒక ఏడాది పాటు అన్నీ బడి బ్లాగులో లాగ్ చేశాను కానీ ఆ అవసరం కనపడక ఆపాను.  ముచ్చటగా మూడో ప్రయత్నమైన ఈ బ్లాగు - ఇతరత్రా బడులు, సంబంధిత  విషయాలు అవీ కూడబెట్టాలని ఆలోచనతో - బాలానందం మాదిరిగా మొదలుపెట్టాను. 

చివరిగా తారసపడ్డ నాలుగవ వ్యక్తిని గూర్చి నాలుగు మాటలిక్కడ.  పైన ముగ్గుర్నీ వ్యక్తిగతం, ముఖతహాః ఎరుగున్నాను.  ఈ వ్యక్తిని నేను కలవనేలేదింకా.  కలవగలననీ అనుకోవట్లేదు.  చాలా చిత్రంగా నీకు తెలిసినది ఎంత/ఏమిటి?అని ప్రశ్నిస్తున్నట్టు వచ్చిన వారు శ్రీ జలసూత్రం విక్రమార్క (జవిక్) శాస్త్రి గారు; జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారికి బంధువులు.  వాదిస్తూనే ఆయన లోని భాషాపటిమకి అచ్చెరువు పడేదాన్ని.  తెలుగు మళ్ళీ 'ఓనమాలు' మొదలుకుని చదివి రావాలి అన్నంతగా నాలో పట్టుదల పెంచినవారు.  “గురువు గారు, మీరు ఎవరోగానీ నాకు మంచి స్ఫూర్తినిచ్చారు. చండామార్కుల వారి వలెనో, సాందీపుని మాదిరో కాస్త నాకు మీవద్ద శిష్యరికం చేసే అవకాశం ఇస్తారా? నిజానికి మీ ప్రశ్నల్లనిటికీ ఒకటే జవాబు. నాలో మీరు చూసిన లోపాలు నాకు అర్థమయ్యే రీతిలో చెప్పండి, మీ నిర్వచనానికి తగిన శైలి, భావం, భాష, స్థాయి నేర్పండి. ఈ వంతు మీరు తీసుకుంటానంటే అపుడు చెప్పండి. మీ సవాళ్ళు స్వీకరించి నేను సాధన చేస్తాను. మీకివన్నీ అనవసరం అనుకుంటే ముమ్మారు నాకు సమాధానం ఇచ్చివుండేవారు కాదని నాకనిపిస్తోంది. దక్షిణగా మా తాత ముత్తాతల మాదిరి కావిళ్ళలో నూకల్లో కలిపి కాసులీయను, రూకల బస్తాలు పంపను. నా తర్వాతి తరానికి భాష, శైలి నేర్పుతాను.  అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను.

మీరు అడిగిన వంతు నేను తప్పక తీసుకుంటాను. కాపోతే చండామార్కుల వంతూ కాదూ, సాందీపుని వంతూ కాదు, "కవిగండరగండ దుష్కవి కాలభైరవుండ" వంతు మాత్రమే. అమ్మాయిగారండీ - నేను వ్రాసింది అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం నిరూపించారు కాబట్టి, అత్తెసరులోని గంజి లోపలికి ఇంకింది కాబట్టీ ఎప్పటిలానే దయ్యపు వ్రాతలే వ్రాస్తాను. విధి విధానాలు మార్చుకోను. మార్చుకోలేను. సరళంగా చెపితే చివరికి పరుషంగా తేలుతుంది. అందుకు! మీ నోట్లో నుంచి ఊడిపడ్డ దక్షిణ మాత్రం అడిగి మరీ తీసుకుంటాను. గుర్తు చేస్తాను. మాట తప్పితే ఎన్నటికీ మర్చిపోను. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మాట ఎలా తప్పారన్న విషయం ఈ గండభేరుండ దయ్యానికి తెలుస్తూనే వుంటుంది. కాబట్టి పారాహుషార్!

ఇప్పుడు చివరిగా మీకో ప్రశ్న - పుటకి ముప్ఫైయ్యారు పంక్తులు, పంక్తికి 45 అక్షరాల చొప్పున రాస్తూ ఉంటే 100 పేజీల పుస్తకం వ్రాయటానికి ఎన్ని గంటలు పడుతుంది ? మీ చుట్టాల్లో (బ్లాగ్ చుట్టాల్లో - ప్రత్యేకించి ఈ చుట్టరికం టపా చుట్టాల్లో) వినేవారి చెవులు ఊర్లో చెరువులో పౌర్ణానికి దీపాల్తో వదిలే దొప్పలు అవటం మూలాన్నూ, చూసే కళ్ళు కత్తిపీట కత్తికి చివర వుండే వంకీలుగా కనపడుతుండటం మూలాన్నూ కొద్దిగా కష్టమే అయినా కావిడిబద్ద తిరగేసి వెన్నుపూస విరక్కొట్టేట్టుగా ఆలోచించి చెప్పండి. “  అని సవాల్ విసిరారు. 
   
ఆ పరిచయం ఉత్తర ప్రత్యుత్తరాలుగా పరిణమించాక వారు ఇచ్చిన అభిప్రాయాలూ,వివరణలూ నాకు చాలానే దోహదం చేసాయి.  అపుడపుడే ఇంకా సాహిత్యపరంగా,  భాషాపరంగా ఏదో చెయ్యాలి అని కలుగుతున్న ఉత్తేజం వారి అభిమాన పూరిత వాక్కులతో మరింత ఉద్దీపితం అయ్యేది.   అయినా ఆ సవాల్ నాకు జవాబు దొరకని ప్రశ్న గానే మిగిలిందిప్పటికీను.  మీలో ఎవరికైనా తెలిస్తే నలుగురికీ పంచండి.

అదండి నా “ఆ నలుగురు”  కథ.

ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహిస్తూ, మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని ఉద్దీపితం చేసే సర్వేశ్వరుని కరుణతో తెలుగుబడి మొదలు పెట్టాను.  విద్యాకైరవానికి కౌముదైన త్రిలోకజనని సరస్వతి కటాక్షం మీపై ఎప్పుడూ ఉంటుంది అన్నారు స్నేహితులు.  సొంత అనుభవాలు, సొంత  అనుభూతులు, సొంత కష్టాలు/సుఖాలు, సొంత ఆత్మకథలు స్థాయి దాటి, పోనీ, వాటితో పాటుగా సార్వజనీనమైన సారస్వతం వైపు దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని మనసుకి తోచిన అనుభవాలు ఇప్పటి కార్యక్రమాలకి పురిగొల్పాయి. రేపు మరి కొన్ని... అంచేతను ఇది సశేషం.

దశావతార మూర్తుల పైన ఈ పాట తెలిసినవారున్నారా?

కంటి నిండా కాటుక పెట్టవే ఓ యమ్మ నన్ను కల్కావతారమనవే
బొజ్జ నిండా బువ్వ పెట్టవే ఓ యమ్మ నన్ను బుద్దావతారమనవే…”

ప్చ్..ఏమిటో ఈ మామ్మలు, అమ్మలు ఇలా అలా కూనిరాగాలు తీస్తూ లాలించి పెంచేసారు.  బిడ్డలకీ నేర్పాలన్న ఊసే మరిచారు. ఆ పై పాట పూర్తిగా తెలిసినవారున్నారా?  వివరాలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి. 

> పోస్ట్ రాసి,  పనిలో పనిగా వెదుకుళ్ళాటలో పడ్డాను.  మొత్తానికి దొరికింది.  నిజానికి పైన సాహిత్యం కాస్త తప్పుగానే రాశాను.  పాట సాహిత్యం నాకు మాగంటి వంశీ గారి సైట్ లో దొరికింది. మునుపు అక్కడ బాలసాహిత్యం లో వెదికి లేదనుకున్నాను. సెకండ్ పాస్ లో దొరికింది. http://maganti.org/newgen/lalitasangitam.html కి వెళ్ళి (మిగిలిన పాటలూ చూస్తారని ఇది ఇచ్చాను), "దశావతార" బాక్స్ మీద నొక్కితే పాట లింక్, http://maganti.org/lalitasangitam/lalita28.pdf లో పాట ఉంది. <

ఎప్పట్లానే ఎడం బ్రెయిను కుడిదాన్ని కలేసుకొని మరీ గనులు తవ్వినట్లు తోడిపారేస్తుంటే వెలికి వస్తున్న తదితర వివరాలు... 

గీతలో శ్లోకం నానమ్మ చెప్పినా గానీ,నా వరకు కూచిపూడి నృత్య సాంప్రదాయపు రీతిలో అత్యంత ప్రీతితో నర్తించిన దశావతారాలు  - మేము నర్తించిన రోజులకి ఫోటోలే అపురూపం, కనుక శోభానాయుడు గారిని అరువడిగానిది. :) - తర్వాతే ఎక్కువ అవగాహన వచ్చింది.   తదుపరి దేవాలయం చిత్రం లోని  “మాధవుడె ఎత్తినాడు పది అవతారాలు”  అంటూ సాగే దశావతారాల పాట లో అవతారాల విశిష్టత/వర్ణన చాలా నచ్చింది.  ఇంతకు మునుపు వినని వారు,  తప్పనిసరిగా విని తీరాలి.

ఇక్కడ కలిపిన కవిత నేను 01/31/2009 నాడు రాసుకున్నది.  విశేషాదరణ వచ్చింది సహజంగానే.   సర్వేశ్వరుని లీల ఎవరికైనా ఆనందమేగా!

దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల

అమ్మా నాన్నల అనురాగసంగమంలో, ఆవేశమధనంలో ఉద్భవించిన పవిత్రసింధువువి.
అమ్మ గర్భమే ఆనంద కడలిగ దేవదుంధుబులు మ్రోగగ అరుదెంచిన దశావతారానివి.
జననీ జఠరే శయనమంటూ అమ్మపంచిన గోరువెచ్చని పాన్పుపై పవళించిన వటపత్రశాయివి.
అమ్మమ్మా, నానమ్మా, అంటూ తిరిగిన ఓ అమ్మాయిని ఏకంగా అమ్మని చేసిన శుభారంభానివి.

ఆరు నెలల గడవకమునుపే అటునిటు ఈదులాడుతూ,
గిలిగింతలిడుతూ, చిరుపాపవై చిత్రాలు చేసిన మత్స్యావతారానివి.

నెలలునిండి నడకకే అలిసిన అమ్మకి ఇసుమంత వెసులునీయని ఆకతాయివి.
చేతుల, కాళ్ళ చిరు తాపులతో, చిన్ని శిరస్సుతో నా లోకాన ఉద్భవించిన కూర్మావతారానివి.

అమ్మ స్తన్యమిచ్చిన తొలి క్షీరమారగించి ఆ వేవేలానుభూతి లోకాలు తిరిగిరాను,
నీతొ నన్ను తీసుకుపోయి, పుడమంత నా సంతసాన్ని నీవే మోసిన వరాహావతారానివి.

నిండు మూడైన లేని నెలపాపవే, అయితేనేం, ఎంత సుధీర్ఘ సాధకుడివైనావు,
నీకు రాని చేష్టేదైనా నిలువునా చీల్చి, బోర్లడి, దొర్లాడి, పారాడిన నరసింహావతారానివి.

బుడి బుడి అడుగుల నీ చిరునడకకి నే మడుగులొత్తుతూ, ఎండవానల నిను కాపాడుతూ,
నెమ్మదించని నీ ఉత్సాహాన్ని ఉల్లాసంగా చూస్తూ, తలపోసితి నీవొక వామానావతారానివని.

మారాముల వేళ, గిల్లికజ్జాల వేళ, పంతమాడువేళ, కేళీ వినోదాలా,
ఆదమరువక, వెనుకడుగువేయక అరివీర భయంకురడవైన పరశురామావాతారానివి.

అభ్యసించిన విద్యలెల్ల నీకనుక్షణం తోడుండగ, నీకబ్బిన సంస్కారం తావినద్దగ,
ఎల్లలులేని విశ్వాన నిత్యం కీర్తిజీవన పారాయణం చేస్తూ భాసిల్లిన శ్రీరామావతారానివి.

యుక్తవయసుకి వచ్చావంటే నీవే కాదా నా నెచ్చెలివని మేళమాడిన కొంటెవాడివి.
చిలిపి నీ కళ్ళ ఏ చిన్నదుందోనని నన్ను కూతూహలపరిచిన కృష్ణావతారానివి.

నిర్వాణం చెందిన వేళ నిన్ను తెలుసుకుంటినమ్మా, నన్నెంత తీర్చావో, నీవెంత తల్లడిల్లావో,
పగలు, రేయి, కాలాతీతంగా, మనం మారదాం ఇక నేను నీకు ముందుటానన్న బుద్దావతారానివి.

రేపేమి ఆపత్తు రానుందో, ఈ మాపేమి విపత్తు దాగునుందో, నాకిక సత్తువలేదీ శోధన చేయను,
వేదననిక నే తలవను, వెతలనిక స్వీకరించను, వాటన్నిటినీ ఖండించగ నీవే నాకు కలికావతారానివి.

***********************************************
చివరిగా ఓ మాట:

యధా యధా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్తానం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

నా పిల్లల వలన జీవితంలో నాకు కలిగిన అనుభవాలు, అనుభూతులు కొన్ని, కలగనున్నాయని నమ్మకం కలిగిస్తున్న మరి కొన్ని స్ఫూర్తిగా వ్రాసినా, ఈ వర్ణన ప్రతి భాథ్యత గల బిడ్డకీ చెందుతుంది. అటువంటి మంచి వ్యక్తిని తీర్చిదిద్దిన ప్రతి అమ్మా, నాన్నకి ఈ కవితతో వందనం.


***********************************************

ఈ కవితకి అప్పట్లో వచ్చిన అనేక స్పందన ల్లోని ఒక పద్యం:

|| మానవ జీవితంబనెడు మాన్య విశేష విచిత్ర చిత్రమే
కానగ దివ్యమైనదని, కాల పథాన దశావతారముల్-
మీనము, కూర్మమాదులును మేళవమై నర జన్మమందునే
లీనమునౌచు తోచునని లీలగ చెప్పిన మీకు వందనాల్!

- డా. ఆచార్య ఫణీంద్ర

చిన్న పిల్లల గీతాల్లో దొరికిన పాట:


మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరాహావతారం
నట్టింట నాయత్త నరసింహావతారం
వాసిగల బొట్టెల్లు వామనావతారం
పరమగురుదేవ పరశురామావతారం
రక్షించు రామయ్య రామావతారం
బంటైన బంధువులు బలభద్రావతారం
బుద్దితో మాచిట్టి బుద్దావతారం
కలివిడితో మాయన్న కలికావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి
చిట్టి నా కన్నోడ శ్రీకృష్ణావతారం

ఇన్నీ  చెప్పాక ఇదీ మరవకూడదు.  మన బ్లాగుల్లోని మంచి చిత్రకారుడు “లీలామోహనం  బ్లాగరి శ్రీ చిలమకూరు విజయమోహన్  గారు.  వారి లేఖిని జార్చిన ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి.  ఇదొక మచ్చుక.  మిగిలిన అవతారాలు ఉన్నాయి ఆయన చిత్రలేఖా సృష్టిలో – ఈ లింక్ కి గల ముందు వెనుక నెలల్లోని లింక్స్ వెదికి చూడండి. 

సరే మరి ఇన్నీ చదివేశారు,  అడిగిన పాట తెలియకపోయినా తెలిసిన మాట కలిపి వెళ్ళండి.