బాలానందం - బ్రహ్మానందం

మరువం - ఎవరం మరవగలం? ఆ చిన్నప్పటి ఆటపాటలు. పాలబువ్వ కూరేస్తూ అమ్మ పాడిన పాటలు. చిన్న మావయ్యో, పెద్దత్తో ఆడించిన ఆటలు. ఆటల తగవులు. తప్పుకొక మొట్టికాయ తో తాతయ్యో/నాన్నారో అలవాటు చేసిన దినపత్రికల పఠనం, పద్యాల వల్లింపు. పాఠశాల ఊసులు. గోడకుర్చీ వేసిన బిక్కమొహాలు. అమ్మమ్మ చేతి వంటలు. పండుగ వేడుకలు. కొత్త బట్టల మురిపాలు. ఆకతాయి అల్లరులు. వచ్చీ రాని ఎక్కాలు. వెక్కిళ్ళతో ఎకసెక్కాలు.

అసలు తెలుగు నేర్చుకున్నదలాగే కాదూ? ఆ తర్వాతేగా అయ్యోర్లు, పంతుళ్ళు...పుస్తకాలు...అవధానాలు, అష్టపదులు. ;)

సరే ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ అంటే మరందుకే - తెలుగు నేర్పేందుకు. సాంప్రదాయం, సంస్కృతి గూర్చి నేర్చినవీ, నేర్పాల్సినవీ తిరగదోడుకుని, మీచేత అక్షంతలు వగైరాలతో పాటుగా మరిన్ని పాఠాలు రాబట్టుకునేందుకు.

మా మరో బాలానందానికి స్వాగతం.

మా తెలుగుబడి మొదలై రెండేళ్ళు కావస్తుంది. నా తెలుగుబడి పిల్లలకి ప్రోత్సాహంగాను, విషయ సమాచారాలు ప్రోగు చేయటానికిను, మా జన్యా విద్యా సేవా సంస్థ విశేషాలు - ఇలా కలగూరగంప కబుర్లకి ఒక వేదిక అవసరపడింది. అందుమూలాన ఈ బ్లాగు మొదలుపెట్టాను.

నా బుడతలిరిగో...అమ్మో, అల్లరి పిడుగులు సుమా!





పాఠాలతో పాటుగా ఆటలు యమజోరుగా ఆడేస్తూ...





మాతో పాటుగా మా ఆటపాటలు, పాఠశాల కళలు మీవీ అనుకుని వస్తూ ఉండండి. కబుర్లు విన్నా, చెప్పినా మీ ఇష్టం.

బాలానందం బ్రహ్మానందం
భాషాభిమానం గడ్డపెరుగన్నం
బ్లాగరుచందం పూసమిఠాయిపొట్లం
ఆడేవారూ రారండోయ్
చూసేవారూ రారండోయ్
రాసేవారూ రారండోయ్