చిలకడ పూవు, గులాబీ కాయ, బీర పండు లేవన్నవారికి సవాల్!

పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూసేను?
మా పెరటితోటలో చిలకడ పూసేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను

కాచేనమ్మ కాచేనమ్మ
ఏమి కాసేను?
మీ ఇంటి ముందరి గులాబీ కాయ కాచేనూ...
కాదు కాదు కానే కాదు
నీలాకాశాన వెన్నెల కాచేను
పండేనమ్మ పండేనమ్మ
ఏమి పండేను?
మా అత్తగారి బీరపాదుకి పండు పండేనూ...
కాదు కాదు కానే కాదు
నేను కన్న కలలు పండేనూ

*****

ఇదేమిటి దుంపకి పూవు, పూవుకి కాయ, కాయకి పండు కలిపి సవాలేమిటీ అంటారా. మరివి చూడండి.


పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూసేను?
మా పెరటితోటలో చిలకడ పూసేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను

ఇది నిజంగా చిలకడ దుంప తీగె - పూవు

కాచేనమ్మ కాచేనమ్మ
ఏమి కాసేను?
మీ ఇంటి ముందరి గులాబీ కాయ కాచేనూ...
కాదు కాదు కానే కాదు
నీలాకాశాన వెన్నెల కాచేను

ఈ రకం గులాబీ పూల కన్నా కాయలు టీ తయారీకి ఎక్కువ వాడకం

పండేనమ్మ పండేనమ్మ
ఏమి పండేను?
మా అత్తగారి బీరపాదుకి పండు పండేనూ...
కాదు కాదు కానే కాదు
నేను కన్న కలలు పండేనూ


ఎవరేమన్నా ఇదే నా బీర పండు ;)
కాదన్నవారు తెచ్చి చూపండి!
వెదికి తెచ్చినవారికి వేయి వరహాలు





సుమారుగా రాత్రి పదిన్నర సమయం లో కిటికీ లోంచి ఆకర్షించి మరీ నా కామేరాకీ పట్టుపడిందీ శ్వేత చిలుక!

*****
ఇక, చిత్రానికి కథ - మొన్న పిల్లకాయలతో పాటలు పాడిస్తే, మా బుల్లి మేఘన పాడిన పాట ఇది.

జామ చెట్టుకి జామ కాయలు
ఈత చెట్టుకి ఈత కాయలు
చింత చెట్టుకీ చింత కాయలు
మల్లె చెట్టుకీ..
కాయలుండవు కాయలుండవు
పువ్వులుండునూ.. పువ్వులుండునూ..

సహాయం: వేసిందే ఒక గంతు విరిగిందే ఒక కాలు?

బాల సాహిత్య మిత్రులకి, ఒక అభ్యర్థన. నేను నా బడి పిల్లలకి జాతీయములు + తెలుగు కథలు (ముఖ్యంగా పంచతంత్రం, చందమామ కథలు, నేను కూర్చే కథలు) కలిపి నేర్పే ప్రక్రియలో ఉన్నాను. ప్రధానంగా నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని కాదు, ప్రవృత్తి రీత్యా పిల్లలకి మంచి నేస్తాన్ని అయినదాన్నే మాత్రమే! వారిలో కుతూహలం, ఆసక్తి కలగాలి, నేర్చినవి గుర్తుండాలి - అది నా గురి.


తొలి ప్రయత్నం - "వేసిందే ఒక గంతు, విరిగిందే ఒక కాలు" అన్న జాతీయం. వికిపీడియా నుంచి "అనుభవ రాహిత్యం. శాస్త్ర బద్ధంగా కాక ఏదో వచ్చీరానట్టు చేయటం.అరకొరగా పని చేశానని అనిపించటం, " వివరణ కాక నాకు ఈనాడు వారి సోదాహరణలు దొరికాయి. ఇక తగిన పంచతంత్రం కథ వెదకాలి. ఎవరికైనా తెలిస్తే చెప్తే నా కష్టాన్ని పంచుకున్న పుణ్యం దక్కుతుంది మీకు.


ఇవికాక, మీకు తోచిన స్వంత కథ/విశేషం పంచుకుంటే సంతోషం. నేను కట్టే కథ మీతో త్వరలో పంచుకుంటాను.

ముగ్గురు స్నేహితుల కథ!

ఒక ఊరిలో ఓ మిరప కాయ, ఓ ఉల్లిపాయ, ఓ మంచుముక్క ముగ్గురూ మంచి స్నేహితులట. కావాలంటే 'అనగనగా' అని కలిపి చదువుకోండి.

ఒకనాడు ఆ ముగ్గురు ఈతకి వెళ్ళగా, నీళ్ళలో మునిగి మంచుముక్క కరిగిపోయిందట. ఆ ఘటన కి విలపిస్తూ వస్తున్న మిగిలిన ఇద్దరినీ ఒక బజ్జీ బండి బూచాడు వెంటాడి, ఆ మిరప కాయని పిండి లో ముంచి, నూనెలో వేపి హత్య చేశాడట.

విల విల్లాడి, వల వలా ఏడుస్తూ ఉల్లిపాయ దేముని సన్నిధిని చేరి "నా మిత్రులిరువురి కొరకూ నేను విలపించాను. నా కోసమెవరు ఏడుస్తారు,స్వామీ?" అని అడుగగా ఆ స్వామి "ఉల్లీ, ఇక నుంచీ నిన్ను నీ సంతతిని చంపినవారే ఏడ్చేదరు," అని వరమిచ్చాడట.

విజ్ఞానం: ఉల్లిపాయ కోస్తే కళ్ళనీళ్ళు ఎందుకు వస్తాయి?

నీతి: అన్ని కథలు నీతికథలు కావు. అన్ని కథల్లో కథ ఉండనట్టే, సత్యమూ ఉండదు. కానీ సరదా ఉంటుంది. బాల్యావస్థ లో మెసిలే ప్రతివారికీ అది కావాలి.

నచ్చినవారు ఒక స్మైలీ, నచ్చనివారు తమ స్వంత కథ వ్రాసి వెళ్ళమని రచయిత మనవి. :)

***

ఈ కథ కి మూలం మా టీచర్లే - కామేశ్వరి, సావిత్రి గార్లు. ఒక విషయానికి ముందిలా తేలికపాటి పిల్లల్లో ఆసక్తి రేపే అంశం ఎత్తుగడగా మొదలెట్టి క్రమంగా అసలు పాఠ్యాంశం బోధించేవారు. నేనీ కథ చెప్పి పిల్లలు నవ్వి, కాస్త కులాసాగా ఉన్నాక, అసలు తెలుగు లో చర్చ మొదలు పెట్టాననుకోండి. ఒకటొకటిగా అంశాల్లోకి వెళ్తాము. (జీవించటం) స్నేహితులు ఎలా ఉండాలి? అసలు మన ప్రయత్నమెంత ఉండాలి? దైవాన్ని ఎందుకు గురిగా పెట్టుకోవాలి? (సైన్స్) మంచు ఎందుకు నీళ్ళలో కరుగుతుంది? ఉల్లిపాయలో ఏ రసాయనం అలా కంటికి నీళ్ళని రప్పిస్తుంది? (వంట) పచ్చిమిరప బజ్జీ ఎలా చేస్తారు?ఇవి వాళ్ళకి కొత్త గా తెలుగుబడి నేర్పేవి కాకపోయినా తెలుగు మాట, సేత వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నేర్చుకోవటానికి బెట్టుచూపకుండానే నేర్చేసుకుంటారు.

ఉగాది: ఏమిటి, ఎందుకు, ఎలా...


పిల్లలకి విషయం గురించి అయినా ముందుగా "ఏమిటి, ఎందుకు, ఎలా" అంశాలు ఆకళింపుకు రానిదే అది బుల్లి బుర్రల్లో నిలవదు కనుక నా బడి పిల్లలకి నా శక్తానుసారం చెప్పాను. వారిలో జిజ్ఞాసకి ఎంత చెప్పినా ఇంకాస్త చెప్పొచ్చును అనిపిస్తుంది. ఈ పోస్ట్ చదివినవారెవరైనా ఇంకేమైనా సమాచారం ఇవ్వగలిగితే మా అందరికీ ఆనందం. ముఖ్యంగా పిల్లలకి అనువైన పాటలో, పద్యాలో వంటివి.

నేను చదివినంతలో యేటి పోస్టుల్లో కుమార స్వామి గారు వ్రాసిన

శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు

పిల్లలకి బోధనకి బాగుంది. ముఖ్యంగా వారి చేతివ్రాతలో ఉన్న ప్రతి కనుకా ప్రింట్ తీసుకుని దాచుకున్నా అదొక ఆనందం.

ఇక నా వంతుగా నాదే మునుపటి పాట (చాలా మందికి తెలిసినదే) వారికి నేర్పి నేనూ పాడుకున్నాను.

ఉగాది వచ్చింది, పండుగ వచ్చింది!

ఉగాది వచ్చింది, పండుగ వచ్చింది
ఉగాది పండుగ వచ్చింది, వస్తూ వేడుక తెచ్చింది ||ప||

ఉగాది పచ్చడికి రుచులు ఆరంట,
ప్రతి ఏడాదికీ ఋతువులు ఆరేనంటా.
ఆరు రుచులు, ఋతువులు కాదా ఎంతో విభిన్నం!
ప్రతి వీక్షణం తెలుపునది ప్రత్యక్షసాక్షిగా? ||చ||

మాఇంట ఎప్పటికి మమతలు వెల్లువంట,
ప్రతి ఎదకీ మధురిమలు కోకొల్లలంటా.
మా మమతలు, మధురిమలు కావా ఎంతో అపురూపం!
ప్రతి క్షణం అందించునవి ప్రభవించేజ్యోతిగా ||చ||


ఉగాది రాబోవు కాలాలలో మీకు, మీ కుటుంబ సపరివారానికీ సుఖ సంతోషానంద భరితమై మీ జీవితాలలో ఆహ్లాదాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ.

బాలానందం - బ్రహ్మానందం

మరువం - ఎవరం మరవగలం? ఆ చిన్నప్పటి ఆటపాటలు. పాలబువ్వ కూరేస్తూ అమ్మ పాడిన పాటలు. చిన్న మావయ్యో, పెద్దత్తో ఆడించిన ఆటలు. ఆటల తగవులు. తప్పుకొక మొట్టికాయ తో తాతయ్యో/నాన్నారో అలవాటు చేసిన దినపత్రికల పఠనం, పద్యాల వల్లింపు. పాఠశాల ఊసులు. గోడకుర్చీ వేసిన బిక్కమొహాలు. అమ్మమ్మ చేతి వంటలు. పండుగ వేడుకలు. కొత్త బట్టల మురిపాలు. ఆకతాయి అల్లరులు. వచ్చీ రాని ఎక్కాలు. వెక్కిళ్ళతో ఎకసెక్కాలు.

అసలు తెలుగు నేర్చుకున్నదలాగే కాదూ? ఆ తర్వాతేగా అయ్యోర్లు, పంతుళ్ళు...పుస్తకాలు...అవధానాలు, అష్టపదులు. ;)

సరే ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ అంటే మరందుకే - తెలుగు నేర్పేందుకు. సాంప్రదాయం, సంస్కృతి గూర్చి నేర్చినవీ, నేర్పాల్సినవీ తిరగదోడుకుని, మీచేత అక్షంతలు వగైరాలతో పాటుగా మరిన్ని పాఠాలు రాబట్టుకునేందుకు.

మా మరో బాలానందానికి స్వాగతం.

మా తెలుగుబడి మొదలై రెండేళ్ళు కావస్తుంది. నా తెలుగుబడి పిల్లలకి ప్రోత్సాహంగాను, విషయ సమాచారాలు ప్రోగు చేయటానికిను, మా జన్యా విద్యా సేవా సంస్థ విశేషాలు - ఇలా కలగూరగంప కబుర్లకి ఒక వేదిక అవసరపడింది. అందుమూలాన ఈ బ్లాగు మొదలుపెట్టాను.

నా బుడతలిరిగో...అమ్మో, అల్లరి పిడుగులు సుమా!





పాఠాలతో పాటుగా ఆటలు యమజోరుగా ఆడేస్తూ...





మాతో పాటుగా మా ఆటపాటలు, పాఠశాల కళలు మీవీ అనుకుని వస్తూ ఉండండి. కబుర్లు విన్నా, చెప్పినా మీ ఇష్టం.

బాలానందం బ్రహ్మానందం
భాషాభిమానం గడ్డపెరుగన్నం
బ్లాగరుచందం పూసమిఠాయిపొట్లం
ఆడేవారూ రారండోయ్
చూసేవారూ రారండోయ్
రాసేవారూ రారండోయ్