కళ్యాణం కమనీయం - కనులారా కనరండి!

రామా కనవేమిరా రామా కనవేమిరా శ్రి రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమ గాత్రి ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా ...

కళ్యాణం చూతము రారండి..
[కళ్యాణ స్థలి: ఉత్తర అమెరికాలోని మిడ్ వెస్ట్ ప్రాంతం]

మధ్యన మన ఫొటోల కళ ముదిరి మనకి ఫొటోయిత్రి [ఈ మాట పేటెంట్ చేస్తున్నాను నా మిత్రురాలి పేరిట] అన్న బిరుదు, నిలయ చిత్రకళాయిత్రి [మళ్ళీ పేటెంట్] అనబడు పదవి దక్కాక నేను తీసిన ఫొటోలివి. ముందుగా, దాదాపుగా తొమ్మిదేళ్ళుగా చదువుతున్న రామాయణ పఠనం పూర్తయినాక జరిపించిన శ్రీరామ కళ్యాణం తాలూకువి [నిజంగా అలా అంత దగ్గరగా అన్నీ చూసి, దాదాపుగా నూట డెబ్భై ఫొటోలు తీయటం నా భాగ్యం]


రామాయణ పఠనం

చూచువారలకు చూడముచ్చటగా ....

పెళ్ళి సంబరం ఆరంభం
స్వామికి యజ్ఞోపవీతం
తదితర పూజాకార్యక్రమం

జీలకఱ్ఱ బెల్లం

మంగళసూత్రాలు
వరుడు

వధువు

తెర తీయగ రారా..
సూత్రపూజ


దీపదర్శనం
కళ్యాణం కమనీయం
అండా దండా ఇక నీవేనయ్యా రామయ్యా!
జానకిరాముడు

తలంబ్రాలు
పుష్పాలంకరణ
నృత్యసేవ
కానుకలు

మంగళహారతి
నైవేద్యం

ప్రసాదం

కళ్యాణం పరి సమాప్తి!

విందు

************************************************************

ఈ క్రిందనున్నవి ఒక కార్యాలయ వాస్తు పూజవి. ఇదీ చాలా విపులంగా జరిగినదే. కనుక చూసి తరించండి.



వేసట ఎరుగని విరహిత

కనులు విశాలమైన ద్వీపాలు దాచుకున్నాయేమో
రానున్నవారిని అక్కడే పట్టి బంధించాలని,
రాకలు ఎరుగని క్షణం, వీడ్కోలుతో పందెం వేస్తుందప్పుడే.
చూపులు స్వర్గచిత్రాన్ని అలుపెరుగక దిద్దుతున్నాయదేమో..
తెలిసిన పూలన్నీ తెలియని అత్తరు వత్తుగ అద్దినట్లు,
గతపు పుట తెరిచి తిరిగి చదివినట్లుగా...

పుప్పొళ్ల జాజర, జాజిపూల జాతర,
సవ్వళ్ల ఉవ్విళ్ళు, సరిగంచు మురిపాలు,
తెలవారితే కలల సందళ్ళు,
సందెవాలితే కనుల కలవరాలు.
కలిసున్నా దాహమే, ఎదురుచూపులోనా మోహమే..
విరహాన వేగేటి జీవితం, వేసట తెలియని పయనం.

********************************
"
కనులు విశాలమైన ద్వీపాలు దాచుకున్నాయేమో
రానున్నవారిని అక్కడే పట్టి బంధించాలని,
రాకలు ఎరుగని క్షణం, వీడ్కోలుతో పందెం వేస్తుందప్పుడే."

ఇవే ఈ కవిత రాయటానికి ఉద్యుక్తురాలిని చేసిన పంక్తులు, నిజానుభూతులు.

ఒక విధంగా పేలవమైన కవిత అనదగిన ఈ రచన ఇక్కడ పెట్టటంలో ఉద్దేశ్యం ఇది. మొదటి మూడు పంక్తులు ఒక విధమైన మానసిక స్థితిలో దాదాపు ఆర్నెల్ల క్రితం, ఫెబ్రువరి పదకుండున రాసినవి. ఏ కవికైనా వెలికి వచ్చేసిన భావనలు, ఒక పాఠకు/డు/రాలు/గా చదివితే అమూర్తంగానో, అపరిచితంగానో తోస్తే, అది వేర్వేరు ప్రయోజనాలని చూపినట్లు. ఇవాళ నేను ఆ కవితని పూర్తి చేయాలని చాలా విఫల, పేలవమైన ప్రయత్నం చేసినట్లే. ఆ ముందు మూడు పంక్తుల లోతుల్ని పలుచన చేసినట్లే... ఎందుకంటే ఇప్పుడా ఎమోషనల్ ప్లేన్ లోకి వెళ్లలేని వైఫల్యం.. సానబెట్టి రాయాల్సిన కవిత అయినా నా పరిమితి దాటి నేను న్యాయం చేకూర్చలేకపోయినదిది. కవిత ప్రక్రియ పట్ల అవగాహన కోసం నాకు నేను రాసుకున్న, చదివినవారిలో కొందరికైనా కాస్త ఉపయోగపడుతుందని ఈ అంగ వైకల్యం ఉన్న రచన ఇక్కడ పెట్టాను.

కవి హృదయం: భిన్న స్వర గానం?

ఓ సారి హృదయం లోకి తొంగిచూస్తే నా వైపు విసరబడ్డ పదాలివి. ప్రత్యేకానుభూతి జనిత ధాతువులివి. ఇక్కడితో ఆగలే/వ/ని ముందే తెలిసిన అనేక వచనాలివి. ఇంకా ఎలా మాల అల్లాలో, ఏ స్వరం కట్టాలో, ఎవరికా గానం వినిపించాలో తెలియదు. కనుక ఇది ఓ అసంపూర్తి కవిత. కానీ, ఇలా ఎదరపెడితే మరో ఎద గేయం వినపడదా అని.. కనుక ఈ తరుణాన ఈ పదబంధన మీ మదిలో కదిపిన భావం తక్షణం ఇక్కడ పెడ్దురూ..ఇది ఒంటరిగా మిగిలిపోయినా భిన్న స్వర గానాలు సంపాదించకపోయినా తప్పక ఓ "భిన్న స్వర గానమే" కదూ?



ఓ శీతువు ఉదయాన ఎగిరే పక్షి నిలబడి, కదిలే సరస్సు స్తంభించి, ఓ చిత్రమైన జగతిని నా కనులెదుట నిలిపితే నేను పదిలిపరుచునున్న ఈ చిత్రం వలేనే, ఈ పదాలూను.. ఎలా ఆకృతి తెచ్చుకున్నాయో, ఇలా విడివడి నామీద కాదు కాదు మన మీద పడ్డాయి. ఆ పక్షి బింబం మాదిరిగా మరొక్క కవి హృదయం ఇదే రూపు కనదా? హృదయానికి ఋతువేవిటి అది అనునిత్యం పదికాలాల్లో సంచరించగల నేర్పరి. బహు గడుసరి
.

*** *** *** *** *** *** *** *** *** ***

నిర్ణయాత్మక క్షణం
నిమ్మదించిన మానసం

నిట్టూర్పు వీడిన నిస్వరం

నివురు తొలిగిన రూపం

నిర్మాల్యం తీసిన గర్భాలయం


విభ్రమ గొలిపిన వాస్తవం

విశదమయిన పాఠం

వినిపించిన మౌనం

విరబూసిన కుసుమం

విశ్వాత్మలో లీనమైన అనురాగం

బంధాలకి బంధనం

నిశిరేయి చుక్కపాటుకి
కనుదోయిలో నిలుపుకున్న
చిత్రం చెరిగిపడింది

రెక్కతొడిగిన మానసం
తానెరుగని చిరునామాకి
లేఖ మోసుకెళ్ళింది

అందని దూరాన మూర్తికి
అక్షరాభిషేకమిస్తూ
ప్రియదర్శిని పరవశించింది

వేగుచుక్క వాకిట జార్చిన

పొగమంచు తెరవెనుక
తెలిసినరూపు పలకరింపుగా నవ్వింది

ఎంతెంత దూరం, ఎందుకింత దాహం,
ఎద లయకి వుంటుందా విరామం
ఎలా వేయాలీ బంధాలకి బంధనం

ఛీ నే, చాయిస్ ఈస్ యువర్స్ బట్..

వచనమనుకునో, వ్యాసమనుకునో వచ్చిన వారికి క్షమార్పణలు.. అలాగే చిన్న సాంకేతికలోపంతో ముందు పోస్ట్ డిలీట్ అవటంతో మళ్ళీ పెట్టాను.

Time holds the control of life, yet if one is strong, could sustain its tests, just said in a different way

*** *** *** *** *** *** *** ***
మనిషినేనా అని నొచ్చుకుంటే
కాలం మనసుని ఎరగా వేసి
గాయపు చేపల బుట్ట చేతికిస్తుంది

మనిషినోచ్ అని మిడిసిపడితే
కాలం సుడిలోకి విసిరి
ఎదురీతల పందాల్లో ఓడిస్తుంది

మనిషిని అని విశ్వసిస్తే
కాలం సూదిమొన గుచ్చి
వెన్నున్న వానపాముని చేస్తుంది

మనిషినే కాననుకుంటే
కాలం కసిగా తొక్కినా
ఎరుపునెత్తుటి బొద్దింకలా బతికేస్తాను

ఛీ నే, చాయిస్ ఈస్ యువర్స్ బట్..

కాలమా! బలమైన శత్రువుచేతిలో భంగపడ్ద
పరాజితుడు మహాబలుడు అవుతాడు.
నీవు నేర్పిన ఈ పాఠమే రేపటి నా విజయానికి నాంది.

*****************************
yikes, it sucks..ney not really the choice is absolutely yours..

ఈ రెండు చిత్రాలు నా లోగిలి ముంగిట సాయంత్రపు వేళలవి, సమయాలు ఒకటే కాలం తీరు వేరు. రోజులు వేరూను.

కావాలనుకుంటే నిన్నటి అందమైన జ్ఞాపకాన్ని,



రేపటి పీఢకలగా మార్చగల ధీశాలి కాలానికి ఎక్కుపెట్టి వదిలిన ఎన్నో ప్రశ్నల మాదిరి గానే



ఇది కాలానికి అంకితమిస్తున్న ఓ పరాజితహాసం!

ఉమ్మడి చరిత్రకారులు

మునిమాపులో ఈ గాలివాన ఊపిన మానస ఘోష

ఈ చిత్రం నా పెరటిలో తీసినది


*** యువతరానికి కొందరు ఆలుమగలు సెట్ చేస్తున్న బాడ్ ఎక్జాంపుల్ ఈ కవితకి ప్రేరణ



లెక్కతప్పిన చుక్కల రంగవల్లిలా
అసంబద్ద కలయిక కాబోలు,
తప్పక పురుడుపోసుకున్న అనుభూతి,
నిత్యం అర్థాకలితో నలిగే అనాథశిశువు,
పరవశాల పాలబువ్వ తెలియని పసికందు.

అసంపూర్తి కల అర్థరాత్రి గాలివానలా,
నిదురలేపి మరీ కలవరపెడుతుంది.
నిరీక్షణలన్నీ తెలవారి రాలిపడిన పారిజాతాలు,
నిట్టూర్పులన్నీ దిగుడుబావి పాకుడుమెట్లు.
ఇరువురూ ముక్తసరి మురిపాల ఆత్మవంచకులు

పణాలు, ఋణాలు, అరణాలు
అనుబంధాలకీ తప్పని బేరసారాలు.
అనుమతులు, బహుమతులు, దిగుమతులు
అనుభూతి తలవొగ్గిన లాంఛనాలు,
మనసారా విజేత, పరాజిత ఒకరి సగపాలు మరొకరు

కంటికి తోడు కావాలి

నేల చీకాకు పడేంత వాన,
వద్దంటే వెల్లువయ్యే కన్నీటివరదలా.
గడ్డి జిగట అడ్డం పడి,
ఎగురలేని తూనీగ గోల.
నానిన నేలలో ఏ జ్ఞాపకాల విత్తూ మొలవదేం?

కవాటాల మోతకే తల్లడిల్లే గుండె,
తలపుల ఉరుములకి తబ్బిబౌతుంది.
చీకటిలో వెర్రి మిణుగురు ఒళ్ళు కాల్చుకుని,
అపరిచితులకి దోవ చూపెడుతుంది.
కొత్తదారికి ఇంకా కన్ను, కాలు అలవడలేదేమోనని..

వెలుగు నవ్వు మోస్తున్న రంగురంగుల పువ్వు,
తూగి కొమ్మదాపున దాగుడుమూతలాడుతుంది.
గట్టు దాటలేని కొలను తలబద్దలయేలా ఊగి,
ఊగిసలాటల ఉయ్యాల తాళ్ళు తెంఫుకుంటోంది.
దృశ్యం కరిగేలోపు జ్ఞాపకాల సంకెల బిగించికట్టిపడేస్తుంది కన్ను.

*** *** *** *** *** *** *** *** *** *** ***
సరదాగా ఒక్కో కన్ను మార్చుకుందామన్న ఊహని రేపెత్తిన నేస్తానికి, నా కన్ను మూటగట్టిన ఈ పదాలు చూసి పారిపోతావో, నీ కంటి కలతో ఈ వేదన కడిగిపడేస్తావో మరి! ఏదేమైనా ఇక ఇది నీ సొంతం.
కవిత అంటే మరిచిపోయానా అని మీమాంసకి గురి చేసిన స్వీటీ గారికి, రాత్రంతా ఉరుముల మెరుపులతో వెక్కిరించిన వానకీ కృతజ్ఞతలు.


వ్యాఖ్యలు చదివే/రాయని అలవాటున్నవారికీ ఈ చక్కని కవిత పంచాలన్న "నా" నిస్స్వార్థ ఉదారతతో పంచుతున్న..
స్వాతి శ్రీపాద గారి స్పందన ఇది.

నాలో నేను

అదృశ్యంగా గాయాలు అశృవరదలై
తలదాచుకునే తావుకోసం
చూపుల గాలాల్తో శూన్యాన్ని తడుముతున్నవేళ
అప్పుడెప్పుడో అక్కడెక్కడో మెరక గుండెలో
పొడిపొడిగా అక్షరాలు వెదుక్కున్న ఆహ్వానం

పెదవులు ఇసుమంతైనా కంపించలేదు
చూపులు నడిపిన రాయబారాలు
ఆవంకనుండా ఈ వంకనుండా
అర్ధంకాని అయోమయం అమావాస్యలో
ఏమూలనైనా నెలవంక తొంగిచూడదా?

నాలోలోపల నాలుగువేల ప్రపంచాలను
ఆవిష్కరించుకున్న నాకు
ఎందుకీ వ్యర్ధపు వెదుకులాట
ద రూల్ ఈజ్ సింఫుల్
ఇచ్చుకున్నవారికి ఇచ్చుకున్నంత
తెచ్చుకున్నవారికి తెచ్చుకున్నంత

నాది ఇచ్చే హస్తమే కాని పుచ్చుకునే
లౌలిత్యంలేదు
ప్రేమైనా మరింకేదైనా
ఇట్నించి అటే కాని అట్నించిటుకాదు
గుప్పిళ్లకొద్దీ విసురుతున్నాను
అందుకునే తీరికలేదిక

భారత్ లో దక్షిణచిత్ర, ఉత్తర ఘోష - ఉత్తర అమెరికాలో ఆమిష్ మిత్ర

"My grandfather always says that's what books are for...to travel without moving an inch." The Namesake Jhumpa Lahiri

చిన్నప్పటి నుంచీ తెలియన జిజ్ఞాస, వేదన, శోధన నన్ను నడిపిస్తున్న స్ఫూర్తి. యాత్రల్లో అసలు స్థానానికన్నా స్థానికంగా మౌక్తిగంగా లభ్యమయ్యే సమాచారం, అక్కడి మనుషులు, ఆహారాలు, మరెన్నో తెలియని విషయాలు తెల్సుకుంటూ ప్రకృతికి మరింత ప్రేమికనౌతూ..

*** *** *** *** *** *** *** *** *** *** ***

నిజమే
... పుస్తకాల్లోని అక్షరాలతో, రచయిత మానసంతో సమంగానే, లేదా మనదైన ఊహతోనో పయనం సాగించగలిగితే దృశ్యాన్ని జ్ఞాపకాన్ని పదిలంగా నిక్షిప్తం చేసేయొచ్చు కానీ యాత్రల్లో మరేదో అనుభూతి ఉంది, ఆకర్షణ ఉంది. అలుపు ఉంది. ఆదమరుపు ఉంది. కనుకా అవీ తప్పవు...

వేసవి
సెలవలు. తెలిసినవారు కొందరు ఇండియాకి వెళ్తున్నారు. మా ప్రయాణం డిశంబర్ వరకూ లేదు, అసలు ఉందో లేదో నికరంగా తెలియదు. కానీ నాకు ప్లానింగ్ అలవాటు. ముందుగా కనీసం చూడాల్సిన ప్రదేశాలు, కలవాల్సిన వ్యక్తులు, తేదీలు మాత్రం ఉజ్జాయింపుగానైనా రాసుకుంటాను. ప్రవాస జీవితంలో గత పదహారేళ్ళలో ఐదుసార్లు వచ్చాను. ప్రతిసారీ ఏదో ఒక స్థలం సందర్శిస్తూనే ఉన్నాము. ఈసారి వచ్చినపుడు తప్పనిసరిగా ప్రత్యేక వ్యక్తిని [అమ్మా ఆశ చెప్పను, మీ ఊహకే వదిలేస్తున్నాను..] కలవాలి. :) ఆపై ప్రదేశం చూడాలా అని ఆలోచిస్తూ రెండేళ్ళనాటి ఫొటోలు తీసాను. అప్పుడనిపించింది. వివరాలు ఇచ్చి మరొకరి నుంచి మరికొన్ని వివరాలు సంపాదిస్తే పోలా అని. 2008 జాలై 15 నుంచి ఆగష్ట్ 14 వరకు సాగిన మా విసిట్ లో మూడు రోజులు ఇంటిపట్టున తర్వాత మూడురోజులు ఊర్లు పట్టి తిరగటం అదీ పరిస్థితి.


చెన్నైలో మొదటి మూడురోజులు, తిరుగు ప్రయాణంలో చివరి రెండు రోజులు మమ్మల్ని పదిలంగా తిప్పిన డ్రైవర్ శివ - ఇతనిగూర్చి, మరికొందరిని గూర్చి మరోటపాలో. నిమిషాల్లో నచ్చేసిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు.

మా మొదటి విడత విహారం - చెన్నై కి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న దక్షిణచిత్ర. పిల్లలకి నాలుగు దక్షిణ భారత రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, వృక్షాలు, రీతి రివాజులు అన్నీ ఒకచోట చూపెట్టగల ప్రదేశం. మనం అక్కడ గడిపే ఒక్క నిమిషం వృధా పోదు. అందుకు నాది హామీ. చరక సంహితం నేను క్షుణ్ణంగా చదవలేదు కానీ "యస్మిన్ దేషే తు జాతా తస్మిన్ తజ్జోషధం హితం" అనగా ఆసేతుహిమాచల పర్యంతం భారతదేశంలో ప్రజలు తమ తమ పరిసర ప్రాంతాల్లో పెరిగే మొక్కలని వైద్యానికి ఉపయోగించటం నేర్చుకున్నారని, ఓషధులు, మూలికలు రూపాన ప్రకృతి ఎన్ని సాంప్రదాయ వైద్యాలకి వినియోగపడే మొక్కలు, వృక్షాలు మనకి వరంగా ప్రసాదించిందో తెలుసుకున్నాను.

పూర్వకాలపు
గృహాల్లో పెరటి చెట్లు, ముందు వాకిలిలో కనపడే మొక్కలు, మరువం, తులసి ఇలా అన్నిటికీ ఎందుకు పెంచాలి అన్న సరైన వివరణ ఉంది. అవగాహన తో మరింత శ్రద్దగా పెంచగలుగుతాము. ఎన్నో కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉన్న దక్షిణచిత్ర లో అన్ని చెట్లూ పిల్లలకి పరిచయం చెయ్యొచ్చు. అలాగే మునుపటి గృహాల కట్టుబడి [ఉదా: చెట్టినాడ్ వారి గృహాలు, తాటాకు పాకలు, పెంకుటిళ్ళు], వివిధ సాంప్రదాయ రీతులు ప్రతిబింబించే దేవాలయాలు, చేతిపని వృత్తులు [కుమ్మరి, కమ్మరి, చేనేత.. మరెన్నో, పిల్లలనీ చేయనిస్తారు], ఇక పిల్లలకి మరీ కూతూహలం పుట్టించేట్లుగా ఉండేవివి - ముగ్గులు వేయించటం, గోరింటాకు పెట్టటం, తాటాకు బొమ్మలు, బుట్టలు అల్లటం గట్రా. ఇవేకాక ప్రతి ఇంటా సామాన్యంగా కనపడే గృహాలంకరణలు [ఇత్తడి కంచు రాగి మట్టి పాత్రలు], వ్యక్తులు [పురుషులు, స్త్రీలు, పిల్లల ప్రతిమలు] వివరాలు ఇస్తూ పట్టికలు.


ఇలాంటి చూడచక్కని విగ్రహాలు వివరాలు ఎన్నో

మాతో పాటు విహారయాత్రకొచ్చిన బడిపిల్లలందిరికీ అవకాశం ఇచ్చి వివిధ పాత్రలు చేయనిచ్చారు

మనమొక మ్యూజియం లో తిరుగుతున్నట్లు కాక వూర్లో వీధుల వెంబడి నడుస్తున్నట్లుగా చాలా తాజా అనుభూతి. ఒక్కటే నిరాశ. మరీ పేరాశ పడి, విమానం దిగీ దిగగానే అరపూట కూడా విశ్రాంతి తీసుకోకుండా పైగా వేడికి ఒళ్ళు అలవాటు పడకుండా వెళ్ళటంతో నేను కళ్ళు తిరిగి పడ్డాను. నాతో పాటే బాటరీ అయిపోయిన నా కామెరా కూడా మూలపడింది. కనుక నేను రెండొంతులు మాత్రం తిరిగాను, కామెరా మొదటి గంట వరకే అక్కరకొచ్చింది. మళ్ళీ వద్దాము అని మనసుకి సర్ది చెప్పుకున్నాను. అందరూ ఓసారైనా చూడాల్సిన స్థలం.

ఇదిగో
శివా తెగ గొణుగుడు. అంతా [ దగ్గరలోని ఏదో ఆలయం పేరు చెప్పాడు, మర్చిపోయాను] కోవెల చూస్తారు మీరేమో ఇలా అని. కానీ నాకు గణపతి తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణతో ముల్లోకాల్లో తిరిగిన పుణ్యం మూటగట్టుకున్నట్లు ఒక్క ప్రదేశంలోనే దేవాలయాలు, కోనేటి స్నానాలు, అట్లతద్ది ఊయలలు, ముంగిట ముగ్గుల మురిపాలు, నా బాల్యం, పరువపు ప్రాయపు తలపులు ఇలా ఎన్నో అనుభూతులు నెమరువేసుకున్నాను. అక్కడివారు, ఇక్కడి నుండి వెళ్ళేవారూ అంతా చూడాల్సిన స్థలమిది. మా స్నేహ/నా ఆరోప్రాణమని చెప్పానే అదే చక్కగా మూర మల్లెలు ముడిచి, కుడిచేతికి గోరింటాకు పెట్టుకుని, తను లెఫ్టీ కనుక చేత్తోనే ముగ్గులు వేసి తెగ తెగ ఫీలైపోతూ ఆనందంగా గడిపింది.

తాటాలు గిలక చేస్తూ..


ఆ కళాకారిణి వంటి మీద వివిధ ఆభరణాలనీ గూర్చీ తెలుసుకుంది మా స్నేహ

చార్మినార్ వద్ద లభ్యమయ్యే గాజులవంటి అద్దాల అమరిక ఉన్న వస్తువులు - మేము దాదాపుగా ఆ అంగడి మొత్తం కొనేసాం, ఇక్కడికి రవణా చేసేసాం!
మరి కొన్ని చిత్రాలు:


పడుగూ పేకల నడుమ అపురూపమైన నేత - చూడటానికి రెండు కళ్ళూ చాలవు

ఆలయప్రాంగణం

గృహాల లోపల అలంకరణ నమూనా


కోవెల ఎదుట ప్రతిమలు

నేను
అలా అలా తాబేలులా కాస్త ఆగి ఆగి చెట్ల నీడల్లో పాకి మొత్తానికి జెట్లాగ్ ని అదిమి తగురీతిన అస్వాదించేసాను.

ఇక్కడ
బస చేయండి, అలా వెళ్ళండి, ఇది తినండి, అది మానండి, కొనండి, కొట్టండి [మందు కాదు] అని మాత్రం నేను చెప్పను. ఎవరి ఇష్టాలు వారివి, పిండి కొద్దీ రొట్టె. మా వరకు పిల్లలకి అసౌకర్యం, అనారోగ్యం, ఆహారలోపం కలగకుండా చూసుకోవటం మొదటి ప్రిఫరెన్స్. అందుకే అంటురోగాలున్నాయని ఊదర కొడితే రెసిడెన్సీ లో దిగుతాం [ఎవరు తీసుకున్న గోతిలో వారు పడ్డట్లే] అబ్బా కాస్త సరైన పొంగలి, దోశ లాగిద్దాం అనుకుంటే శరవాణ భవన్ కి దగ్గరగా చూసుకుని అరుణా ఇంటర్నేషనల్లో సర్దుకుపోతాం [తాను మెచ్చింది గంగ మాదిరిగా]. అంచేత వివరాలు ఇవ్వలేను.

*** *** *** *** *** *** *** ***

ఇక రెండో విడత ఢిల్లీ, ఆగ్రా:

ముందుగా ఊసు చెప్పుకుని ఊరు మాట చెప్పుకుందాం. ఢిల్లీలోని స్నేహితురాలికని మా గోదావరి జిల్లా బెల్లం జిలేబి చక్కగా స్టీలు డబ్బాల్లో సర్ది షంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ తెచ్చాము బహు జాగ్రత్తగా. కాస్త అర్భకుడైన యువ/నా పంచప్రాణాలైన నా కొడుకు చేతికిచ్చి జాగ్రత్త నాన్న అన్నానో లేదో, "నువ్వొస్తానంటే నేనొద్దంటానా?" లో సంతోషినీ లా కార్ డ్రైవర్ చేతి నుంచి అందుకుని ట్రాలీలోకి పెట్టబోతూ వదిలేసాడు. అదికాస్తా "ఢామ్మని" శబ్దం చేస్తూ దొర్లూకుంటూ పోయిందా.. హాహాకారాలు చేస్తూ జనాలు పరుగులు. నిమిషానికి గానీ నాకు అర్థం కాలేదు. అదేదో ఉగ్రవాద చర్యంత ప్రభావాన్ని చూపిందని. ఇంతచేసిన డబ్బా మాత్రం లక్కసీలేసిన మాదిరిగా కూస్త కూడా తెరుచుకోలేదు. మా ఊరి జిలేబీ రాజధాని వరకు ఎగిరెళ్ళింది ఎంచక్కా..

బహుశా అక్కడ అందరూ చూసేవే ఇవి. లోటస్ మహల్, అక్షరధాం, కుతుబ్మినార్, రాజ్ ఘాట్, ఇండియా గేట్, తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ వగైరా వగైరా. టూరిస్ట్ యాత్రా బస్ వద్దని మేము రెంట్ చేసుకున్న వాహనం లో తిరిగాము. కనుక హడావుడి లేకుండా కావాల్సిన చోట కావాల్సినంత సమయం గడిపాము. సో అంతా చాకిరేవులు పెట్టి ఉతికి ఆరేసిన ఢిల్లీ ప్రాంతాల యాత్రల గూర్చి నేను పెద్దగా చెప్పేదేమీ లేదుగానీ ఎదురైన ఇబ్బందులు ఏకరువు పెడ్దామని ఉబలాటంగా ఉంది.

ఆస్ట్రేలియాలో
కాస్త ఫిజీ ఇండియన్స్ మూలాన హిందీ నోట్లో నలిగేది అప్పుడప్పుడూను. అమెరికా వచ్చాక వీధికో తెలుగువారు, సందుకో చంద్రముఖీను. ఇక మనకి వచ్చిన మూడు ముక్కల హిందీ మూటగట్టి అటక మీద పడేసా. ఇంతవరకు బానే ఉంది. ఆగ్రా ట్రిప్ కి ఎవరూ తోడులేరు. నేను, పిల్లలు, తెలుగే సరిగ్గా రాని మా బన్నక్క [విందంటే నన్ను ఉప్పు పాతర వేసేస్తుంది], డ్రైవర్ ఉదయాన్నే పోలోమని రోడ్డున పడ్డాం. ఢిల్లీ నుంచి దాదాపు నాలుగు గంటలు పైన ప్రయాణం.

నాకు
వసపిట్టకి పెద్దగా తేడా లేదు. నిజాయితీగా ఒప్పుకోవాలంటే నేనో పెద్ద L L B ని అంటే లొడలొడబుచ్చిని. పది నిమిషాలు పిల్లలతో కిస కిసలాడాక [కిలా కిలా నవ్వుతూ గుస గుస లాడటం అంటే కిస కిస అన్నమాట, వేటూరిగారి గసగసలా నవ్వులా (అవి సగ సగాల నవ్వులని ఎందరికి తెలుసండి?) ] నా కన్ను మౌనంగా రోడ్డునే చూస్తున్న డ్రైవర్ మీద పడింది. రాయేద్దామని "భాయ్ సాబ్, ఆప్ కైసా హై?" అన్నానా. తనేదో చెప్పాడు, ఇక నా జంకు వదిలిపోయి, ఎప్పుడెప్పుడివో వెదికేసి నా ఉత్తమ, రాష్ట్ర, భాషాప్రవీణ వగైరా హిందీ పాఠాలన్నీ నెమరేసి తెగ కబుర్లు చెప్పేసా [గ్రామర్ తనకీ రాదనుకుంటా, మొదటి రెండు పదాలతో నా ప్రశ్న అర్థమైపోయేది, నాకూ రాదు ;)].

ఆగ్రా చేరేసరికి నిద్రగా ఉంది. నేను పడుకుంటాను మీరు చూసి వచ్చేయండి బెహెన్ జీ అన్నాడు. ఇక చూడాలి నా పాట్లు. అంత నేషనల్ ఐకాన్ కట్టడం. అంతా తొక్కిడి, పద్దతి లేదు, ఎలా మన దగ్గర డబ్బు గుంజాలనే యావ ప్రతి వాడికీను. సరే వీరనారిలా/ఝాన్సీ లక్ష్మీభాయిలా సంతు ని వెంటేసుకుని లోపల చూసి, కాసేపు ఊహల్లో ఊరేగి, యువ జాలిగా "అమ్మా! నీకు వీలైతే తాజ్ మహల్ కట్టిస్తానే, నన్ను ఇంటికి జేర్చు" అని ఎర్రగా కందిన బుగ్గలతో [విపరీతమైన వేడి రోజున] , వాడిన కలువరేకులా దీనంగా అడిగాక కదిలి, సామాను జప్తు చేసిన చోట భద్రంగా మా వస్తువులు దొరకబుచ్చుకుని [వెళ్ళినవాళ్ళకి తెలుస్తుంది యుద్దం ఎలా ఉంటుందో, పైగా ఉద్యోగి చెయ్యి చాపి "ఆప్ కి మన్ పసంద్" అని బాహాటంగా లంచం అడిగాడు. నాకు "మన్ వికార్ బినా కుచి భీ నై" అని చెప్పి] బయట పడి, ఒకడి రొద పడలేక వాడు చూపిన దిక్కున దిక్కుమాలిన బట్టల షాప్ లోకి వెళ్ళాను.

లోగా చిన్నది ఒకటి అని ముందు వార్నింగ్, కంగారుగా అడిగితే ఇక్కడ ఉండవు కమోడ్ గట్రా అన్నాడు, ఇంతలో ఇది రెండుకి అని చిందులు. ఏదో ఒకటి అని వాడు చూపిన దిక్కున వెళ్తే [ పాట్లు ఇంతకు మునుపు సుజాత గారి బ్లాగులో చెప్పి ఉన్నాను] నీళ్ళు లేక, ఎన్నో ఏళ్ళ తరబడి కడగక ఉన్న లావెటరీ, ఇక నేను ఇంతకన్నా చెప్పలేను, నాకైతే ఏడుపొచ్చేసింది. పిల్లదానికి సరేసరి. ఫుడ్ త్రో చేసేసింది. అంత నా వేదనలోను మీకు నవ్వొచ్చే సీన్ ఇది. బయటకి పరిగెత్తుకొచ్చి జనాల్ని ఏదో అడగాలనుకుంటే "భాయియోం, బెహనోమ్.." అన్న అక్రోశమే కానీ ఒక్క ముక్కా హిందీ గుర్తుకి రాదే? చిల్లుపడ్డ ప్లాస్టిక్ బాగ్ లో, ఎయిర్ కూలర్ నుంచి కారుతున్న నీరు పట్టి అవి పూర్తిగా కారిపోయేలోగా P T ఉషలా పరిగెట్టి, పిల్లదాన్ని శుభ్రం చేసి, ఇక ఒక్క క్షణం కూడా ఆగకూడదని, విసిగిచ్చి పారేసిన బట్టల కొట్టువాడికో దణ్ణం, వాడు అంటగట్టిన చీరలకి పదివేలు సమర్పించుకుని [ఇంటి చేరాక వదినా వాళ్ళ పనమ్మాయి అవి చూసి నాకేసి చాలా విచిత్రంగా చూసింది, వాళ్ళిద్దరి గుసగుసకీ ఒళ్ళుమండింది] ఆగ్రా వదిలి ఫతేపూర్ సిక్రీకి వెళ్ళాం.

అక్కడా
అడుగడుగునా మోసమే. భాష తెలియదనా, స్త్రీని ఒక్కదాన్ననా, మా వాలకం చూసా - ఏదైనా కానీ పిల్లలు ఎంజాయ్ చేయలేదన్న అసంతృప్తి మిగిలిపోయింది. గైడ్స్ చెప్పే కట్టుకథలు నేను సరిదిద్దుతూ, ఈసారి కాస్త తెలివిగా మెసులుకుని వెనక్కి వచ్చాము. కానీ మూల్యం చెల్లించాను. పిల్లకి అప్పుడు పట్టుకున్న డయేరియా తాలూకు బాధలు ఒకదాని తర్వాత ఒకటి పదిరోజులుపీఢించాయి. పోనీండి అవన్నీ వదిలేద్దాం. ప్రయాణాలు, దార్లో గ్రామాలు, డాబా ఫుడ్స్ మాత్రం పిల్లలు కాస్త సరదాగానే గడిపారు. టూరిజం శాఖ వారు ఢిల్లీ దాటి ఆగ్రాలో, ఫతేపూర్ సిక్రీలో అసలు ప్రాంతాల్లో కాస్త సౌకర్యాలు ఏర్పరిస్తే బాగుణ్ణు. రానూ పోనూ మధ్యలో హైదరాబాద్ లో ఆగాం కానీ ఏమీ చూడలేదు. మావాళ్ళ ఇల్లు వదిలి కదిలితే ఒట్టు. నిద్ర అలసట అన్నీ అక్కడే తీర్చుకుని రైలెక్కి వూరికి ఛలో. ఇక టీసీలు, కూలీలు వీళ్ళూ నల్లులు, జలగలు. నిజమైన చె.నా లు. ఇదన్నమాట మా ఉత్తర [భారతయాత్రా] ఘోష.

ఒక లాభసాటి బేరం ఏమిటంటే అంతవరకు నేను PT ఉష నే గానీ, Pitooriila Tank [పితూరీల టాంక్ (నా చిన్నప్పటి నిక్ నేం)] ఉషని. ఢిల్లీ ప్రయాణంలోనే నిజమైన P T ఉషలా పరిణామం చెందాను. ఆస్ఫూర్తితోనే రెండేళ్ళ మారథాన్ పరిగెట్టాను. ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసినవాటిల్లో కాసిని ఈ టపా చివరన తగిలించాను.

ముచ్చటగా మూడో ప్రయాణం : మా గోదావరి ప్రాంతాల్లోకి - కోనసీమ, రాజమండ్రి, అమలాపురం .. పిల్లలు ఆనందంగా అయినవారి నడుమ గడిపి, సినిమాలు చూసి, ఆటలవీ ఆడి పాడి ఆనందంగా గడిపారు. అంతా రోసీ అంటే ఊరుకుంటామా అంటారా? కుటుంబ వ్యవహారాలు, విసుగుదలలు లేవని కాదు అవి అప్రస్తుతం.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇక ఉత్తర అమెరికా లో పదేళ్ళ సుమారు నివాసం కనుక అందరి మాదిరే మాకూ యాత్రానుభవాలు, విహారానుభూతులున్నాయి. పెద్ద పెద్ద స్థలాలు, ఆకర్షణలు అందరికీ తెలిసినవే. ఇంటర్నెట్ వలన పరదేశి సినిమాలో పాట "తణుకో అరకో కటకో లడకో చివరికి న్యూయార్కో ...మెదకో మాస్కో" ఎక్కడున్నా మాదిరి అంతా దృగ్గోచరమే. కానీ ఒక ఊరి సంగతి చెప్పాలని. మాకు దగ్గరగా ఉన్న ఆర్థర్ కి చాలా సార్లు వెళ్ళాను. ఇది ఆమిష్ వారు వసించే ప్రాంతం.

ఆమిష్ వారు హాలండ్ నుంచి వలస వచ్చినవారు. అచ్చంగా వందేళ్ల నాటి నుంచీ అదే జీవన విధానం. వారి సాంప్రదాయాలు పద్దతులు కాక మర్చిన వారు ఊరిలో ఉండరు. మన పల్లెటూరి రైతువారీ ఇళ్ల లోని పడికట్టు కనపడుతుంది. కోళ్ళు, గుర్రాలు, ఆవులు, పోనీ బళ్ళు, గుర్రపు బగ్గీలు, ఈమ్యూలు, ఇలా పెంపుడు జంతువులు. కూరగాయల పెంపకం, వ్యవసాయం. ఎక్కువగా వడ్రంగి వారు తారసపడతారు. ఇంకా రకరకాల కుటీర పరిశ్రమలు - బేకరీలు, జామ్స్ అవీను, తివాచీ నేతలు, కాండిల్స్, ఫాబ్రిక్ పెయింటింగ్, గట్రా.

ఇప్పటికీ వాళ్ళ ఇళ్ళలో పాదరక్షలు వాడరు, కరంట్ ఉండదు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోరు, స్త్రీలకి కాస్త దాపు, ఫొటోలు అనుమతించరు. నిజంగా అదో లోకం. మాకు పరిచయస్తులైన ఒక కుటుంబం వలన వాళ్ళ ఇళ్ళలోకి చొరవగా వెళ్ళి గదులన్నీ కలదిరిగేంత చనువు. మీకు దగ్గరలో ఉన్న ఆమిష్ పట్టణానికి వెళ్లటం మాత్రం మరవకండి. చాలా స్నేహశీలులు. వారిని కలవటం మరపురాని అనుభూతి. ఇదీ ఆమిష్ మిత్ర లాభం.

ఆమిష్ వారి పనితనపు గుర్తులు:

ఛుక్ ఛుక్ రైలెక్కి నా స్నేహమ్మ వూరెల్లే! ;)
ఇది ఫొటోలకి స్టాండ్! మనచేతిలో ఇలా ;)


బూర
అలాగే గ్రాండ్ ఆర్బర్. The Grand Arbor invites you to renew your connection with the healing power of the earth. Escape into the heart of 62 secluded acres of wooded forest. This 3 bedroom, 2.5 bath family vacation log cabin home is the perfect place to enjoy the simple pleasures in life. ఇక్కడ టీవీలు, సెల్స్, ఇంటర్నెట్ పనిచేయవు. అక్కడ కొండల ప్రాంతాలు అవీ చాలా బాగుంటాయి. నాకు ఎనభై ఏళ్ళ నాటి గుర్రపునాడా ఓ కొండని అధిరోహించిన సమయాన దొరికింది. ఏ బాటసారిదో. నాకు ప్రాప్తం.


దాదాపుగా ప్రతి ఒక్కరం బాల్యపు రోజుల్లోకి వెళ్ళి ఆడి పాడిన ఆ మేము పోయినేడు గడిపిన ఆనంద ఘడియలు మళ్ళీ నెమరేయాలని ఏడు కుటుంబాలవారం అంతా కలిసి మళ్ళీ వెళ్తున్నాము. ఎప్పటిలానే నా కంటికి కనపడేవి ఇవే. ఇక్కడ చూడండి.

*** *** *** *** *** *** *** ***

ఆస్ట్రేలియా నుంచి చదువుతున్నవారు, జిండాబైన్, మౌంట్ కొజియాస్కో వెళ్ళటం మానకండి. సిక్కిం, హిమాలయాలు చూసినంత ఆనందం. మనసు మరింత స్వఛ్ఛంగా, తాజా గా తయారవుతుంది. నా వద్ద డిజిటల్ పిక్స్ లేవు అక్కడివి కానీ అదో మైమరపుకి గురి చేసే ప్రకృతి అక్కడ కనపడుతుంది. అవి నచ్చాయి అని చెప్తే మరికొన్ని చెప్తాను.

*** *** *** *** *** *** *** ***
ఇంతదాకా చదివిన మిత్రులు.. ఈసారి నేను హైదరాబాద్ సమీపాన కాస్త ప్రకృతిని అస్వాదిస్తూ చూడగల స్థలాలు సూచించగలరా? అలాగే అమెరికాలో ఎక్కువ సందర్శకుల తాకిడి లేని ప్రశాంత ప్రదేశాలు చెప్పగలరా. ఆన్లైన్ లో వెదికే సమయం లేదు/స్వానుభవాలు ఇంకాస్త ఉపకరిస్తాయనీను.

ఇక
టపా ప్రకటన చూసి మళ్ళీ వచ్చినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలకి వేసవి సెలవులిక్కడ. అందుకే అమ్మానాన్నలకీ ఆటవిడుపు. నాకు టపా గిడుపు [తల్పం-గిల్పం తీరుగా!].

*** *** *** *** *** *** *** *** ***

కొన్ని చిత్రాలు ఢిల్లీ పరిసరాల్లోవి: అన్నీ నేను తీసినవే!

ఇండియా గేట్

కుతుబ్మినార్
కుతుబ్మినార్ పరిసరాలు
అలా-ఇ-మీనార్
ఈ సమాచారం ఇచ్చిన పొద్దు చదువరి గారికి కృతజ్ఞతలు
చెప్పండి చూద్దాం?

లోటస్ టెంపుల్ - ఇటుగా వస్తున్న ఆ నలుగురు తెలుగు వారు
హరేకృష్ణ గారికి "ఉత్తమ బ్లాగు చదువరి" బిరుదు ఇచ్చేసా! :)
అవునూ "ఉత్తమ ప్రేక్షక" నంది అవార్డ్ లేదేమి?


ఫతేపూర్ సిక్రీ
ఫతేపూర్ సిక్రీలోనే చక్కని ఆర్కిటెక్చర్ ఉన్న మరొక సముదాయం
Jama Masjid, Fatehpur Sikri, Agra

మరొక కోణం

ఫతేపూర్ సిక్రీలోని కళావైభవం

దివాన్ ఈ ఖాస్ అర్చిటెక్చర్

దివాన్ ఈ ఖాస్
తాజా తాజా కలలు కళ్ళకి కలిపే తాజ్

నిజానికి తాజ్ రాజపుత్రులు మొదలుపెట్టిన నిర్మాణమట అందుకే దాని ముందరి కొలనట - నిజమేనా?

*** *** టపా ప్రకటన మిస్సయినవారి సౌలభ్యం కొరకు ;)
ఇది ఎన్నప్పా
అని కూతూహలంగా ఉందా? కాస్త వేచి ఉండండి. అందాక .. ఏమి చేయము అంటే ఊహాగానాలు చేయండి! ;) ఆనక తీరిగ్గా చదివి పోల్చిచూడొచ్చు.. మరీ ఆత్రంగా ఉంటే గూగుల్ చేసి, యాహూ నాకు తెలిసిపోయిందోచ్ అని ఆనందపడండి...

పల్లెటూర్లలో సినిమా బండి వాడి కొత్త సినిమా ప్రకటన తాలూకు మాటల్లా లేవివి? :) మరి సిద్దంగా ఉన్నారా.. కాపీలు గట్రా తాగి రండి, సిటికెలో ఈ కథ మీ చెవిన పడేస్తా.. [సరదాగా ఇలా ఊరించాలనిపించీ..]