[శతటపోత్సవ వేళ..] మహా శ్వేతం, రంగుల ఆవిష్కారమా!

సప్త వర్ణాల మిళితం శ్వేతం
నలుపు అన్ని వర్ణాల సమ్మేళనం
తెలుపు నవ్వితే రంగులన్నీ తేటతెల్లం
నలుపు వొలికితే వర్ణాలన్నీ మటుమాయం

ఆది పరాశక్తి మేని వన్నె శ్వేతం
విశ్వశాంతికి చిహ్నం శ్వేత పతాకం
సంకీర్ణ వర్ణాల మేఘం రువ్వు శ్వేతకాంతి
శాంతికి, శక్తికి మూలం శ్వేతక్రాంతి

పసిపాప నవ్వు శ్వేతం ఆ కంటి నీరు నీలం
చెంగల్వ తెలుపు చిన్ని కృష్ణయ్య నలుపు
సీతమ్మోరి పూబంతి తెలుపు, చేత బట్టిన రామయ్య నలుపు
ఆ వన్నె ఈ వన్నె నడుమ నడిచేది జీవితం

మల్లీ జాజి తెలుపు, జగమంతా మరులు గొలుపు
మంచి మనసు తెలుపు, తన మాటది గెలుపు
తెలుపు దాచిన రంగులు, నలుపు దోచిన రంగులు
వెలికి తెచ్చేటి రంగుల కలలు నిత్య జీవితానికి శ్వాసనిశ్వాసలు

హరివిల్లు - 5 : దొంగలు వేసిన హరివిల్లు

[నా సాహితీ మిత్రులు "అర్జునుడి బాణాలు" ప్రదీప్ సంకల్పించిన "సప్తకవితల సంకలనం" లో చదువరుల మనసు రంజింపచేయగ ఇది చివరగా ఎక్కుబెట్టిన హరివిల్లు.]

చీరల దొంగ చెట్టు దాపు చాలదని
విను వీధిన పరుగిడాట.
వాన మబ్బు ఫక్కుమని నవ్వే,
అది చూసి సూరీడు తొంగి చూసే.
కినుక పడ్డ చిన్ని కన్నయ్య
సప్తవర్ణ వస్త్రాలు విసిరిపారవైచే
ఆ వంక మొదలు ఆ వంక వరకు
రంగుల హరివిల్లు విరిసే

ఆకతాయి అబ్బాయి మనువాడిన మరదలి
మోముగిల్లి మంచె మీదకు మళ్ళిస్తే,
మావికొమ్మలు పచ్చనాకు పందిళ్ళు వేసే
తంగేడు పసుపు నలుగు పెట్టే
తమలపాకు సిగ్గెరుపుకు సవాలై నిలిచే
పాలపిట్ట రెక్కల వీవెన విసిరే
నీలి మబ్బు చిన్నబోయి ఊదా కలనేసిన కాషాయం కట్టుకునే
ఆ చెలిమిలో వలపుల వానవిల్లు బింబించే

హరివిల్లు - ౩ : భువిలో దాగినదేమో?

[నా సాహితీ మిత్రులు "అర్జునుడి బాణాలు" ప్రదీప్ సంకల్పించిన "సప్తకవితల సంకలనం" కొరకు ఈ చిరు కానుక. చదువరులకు ఎవరు తలపుకొస్తారా అని మాత్రం కాస్త కుతూహలంగావుంది! ]

ఏడేడు సంద్రాల తప్పటడుగేసి ఎదిగినాం
సంద్రాల పడవల్ల తప్ప తాగి సిందేసినాం
ఎన్నెల్లో చేపలల్లే వలపు సయ్యాటలాడినాం
పొద్దు చూసి నీలి మబ్బు కళ్ళాపి జల్లినాం

పుట్టి గిట్టినాక అంతా నాకు అతిధులే
ఒడ్డూబారు కొలవను ఆరడుల గొయ్యి తీస్తాను
కాదు కూడదంటే చితిమంట పేర్చేస్తాను
శవవేడుక సంబరాల ఎర్రెర్రని నెగడు పెట్టేస్తాను

పైరు నాకు బహు పసందు, పంట కూడ మంచి విందు
పచ్చ కామెర్ల రోగికన్నా నేను నయం
పచ్చనాకే పట్టుకుంటా, విడవకుండా స్వాహా చేస్తా
పచ్చ గొంగళని ఛీత్కరించినా నాకన్నా ఎవరు హెచ్చు?

రాళ్ళలో రప్పల్లో కాపురముంటా
మనిషి జాతికి వెరచి పారిపోతా
వెంటాడితే మటుకు ఎదురొస్తా
తోకతోనే శాస్తిచేస్తా పసుపువన్నె నా విషం అద్ది

పూలన్నీ సువాసనిస్తాయా, మాలో ఒకరం బైరాగి కామా?
నా వన్నెలు చూసి మల్లెలు సిగ్గుపడవా!
నా సోయగాన మరువం మౌనం వహించదా?
పేరులోనే రంగు దాచిన కనకాంబరం నేను కానా!

మాగాణి గట్టున రావి వేపకి పెళ్ళంట
రాగాలు పలుకగ నాకు పిలుపంట
వూరేగి తూరేగి వెర్రెక్కి పాడంగ
నా పాలపిట్ట వన్నె పులకించెనంట

వంగతోట కాడ ముల్లని మావ గోటికి నా వంత
మనసుపడి మనువాడిన వాడికి నేనె కానా వంట
కూరా నారా లేనివాడికీ నేకానా కారు చౌక
వూదా రంగు వెదకనేల నే నెదురుగ వుండ?

హరివిల్లిలా దేవలోకం విడిచి భువిని దాగదా పలు రూపాలై?

దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా.

ముందు మాట: ఇవి దేముడితో నా సంభాషణలు. నాకు వ/నచ్చిన రీతిలోనే నేను వెళ్తాను. మీ దారికి నను రమ్మని పిలవకండి.
**********************************
ఇదేమిటని నివ్వెరపోకు

జరగలేదెపుడూనని తప్పుకోకు
వున్నావాని కొందరన్నారు
వేడుక చూస్తునావాని కొందరడిగారు
బ్రతుకు ప్రశ్న చేసి పంపావీ లోకానికి
నిను ప్రశ్నిస్తూనే ముగిస్తా కడకి

తేటతెల్లనైన నా మనసు నీకు కనరాలేదు,
నల్ల బంగారాల నగలకి లోబడిపోయావా?
గుండెగుడిచేసి ఆ లయలో నిను లయం చేసినా
గర్భగుడుల్లోనే బందీనౌతానంటావేం?
ముక్తి చాలని వేడినా రిక్త హస్తాలే నావి,
అరిషడ్వర్గాలు ఇంకా పెంచుతున్నావేం?

మనసనే నీ శత్రువు నాకుంది,
ఆ ఒక్కటీ అంతం చేసేయ్.
రక్కసి వూహా రాజ్యమేలుతుంది,
ఆ సంహారమూ కానిచ్చేయ్.
నన్ను శిధిలం చేయమని నా ప్రార్ధన,
కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా.

ఆ నాన్న కూతురు!!!

నాన్న చెప్పిన పాఠం నిత్య పారాయణం,
తిథి వారాలు ఎంచని ప్రతి పనిలో అదే కొలువు.
ఆ పాఠం స్వయంకృషి.

నాన్న నేర్పిన పాట నా నోట పలికింది,

కోటి గళాలై శతకోటి స్వరాలై.
ఆ భావం ఆశయసాధన.

నాన్న వేసిన బాట నాకు చెప్పింది,
పోటి పడినా వోటమి ఎదురైనా ఆగకని.
ఆ మార్గం స్థిరసంకల్పం.

నాన్న అనుభవం ఆస్తిలో నా వాటా,
ఆటుపోటు తప్పని బ్రతుకున అదే ఆలంబన.
ఆ ధనం స్వాభిమానం.

నాన్న చెప్పిన మాట జేగంట,
గుడి కాని గుడి నా గుండెలో గణగణ.
ఆ రాగం అనురాగం.

నాన్న చూపనిదేదీ నాకు అపరిచితం.
అస్థిత్వం విసిరిన సవాలుకి నా జవాబు,
ఆ నాన్న కూతురు నేనంటేనే నాకు ఇష్టం.

శతకాలు వల్లెవేయించి, పద్యాలు బట్టీపట్టించి..

చదువే లోకంగా చదివించిన ఘనవిద్యలెల్లా…
తిరగరాసి మరోమారు మననం చేయించె నిత్యజీవితం

వైద్యునికొరకు అప్పిచ్చువాడిని వెదికాను
అప్పుతీర్చలేక వూర్లు పట్టి ఏర్లు దాటి పరుగిడాను

మేడిపండు సమాజం పొట్టవిప్ప లోటుపాట్ల పురుగులు
లోపమెంచి చిచ్చుపెట్ట లోకులే పలుగాకులని కన్నాను

శతకాలు శతకోటి నేర్చి నీతిచంద్రికలు ప్రీతిగా వినుకుని
పన్నాగాలు పన్నేటి గోముఖవ్యాఘ్రాలను చూసి భీతిల్లా

తల్లితండ్రులందు దయలేని పుత్రులు దేశప్రగతికి వారసులు
తోబుట్టువుల మోసగించు దగాకోర్లు దండనాథులు

సదా ఈ తారుమారుల్లో సతమతమైన నా మానసం
తెలుసుకున్నదొక్కటే పాఠం - జీవితమే గురువు జీవించను నేర్పగ

వినరా అని నేనెవరినీ అడుగను, కనరా అని చాటి చెప్పను
నేర్వని పాఠాలు సాధనచేయ మనిషికో తీరుగ మారును

చిన్నారి పొన్నారి నా చిట్టి అమ్మలు!!!

పాదులో దాగి పచ్చగా విచ్చిన గుమ్మడిపువ్వల్లే,
పక్కలో ఒదిగి అరమూతల నవ్వింది నా చిన్నితల్లి.
అవ్వాయి తువ్వాయి గెంతులేసే లేగదూడకిమల్లే,
ఆదమరిచి ఆడిపాడింది నా బంగరుతల్లి.

అమ్మ పనికి పోతుంటే,
తోడు నేనంటు మారాముపోయింది.
నాన్న వూరుకి వెళ్తుంటే,
వెంట నేనంటు గారాలుపోయింది.

సరిగమల పాఠాలు ముదమార నేర్వమంటే,
ఆరున్నొక్క రాగాలు ఆలపించింది విపంచి.
తకధిమి నాట్యాలు ఆనంద తాండవమాడమంటే,
మువ్వకొక్క మూతివిరుపుగ చిందులేసింది తరంగిణి.

ఓనమాలు దిద్దుతూనే,
వేయి పలుకులు అమ్మకి పంచింది.
పాలబువ్వ తిననన్న గారాబు బుల్లి,
ముద్ద కలిపి అమ్మ నోటికిచ్చింది.

ఆరిందా తానని అన్నకి ఎదురు తిరిగింది
అమ్మ చిరునామా పేరు మార్చి రాయమంది
చిట్టి పొట్టి చిన్నారి ననుమించి ఎదగనుంది..
చెప్పుకుపోతే వేవేలు, నా చిన్నితల్లికి జేజేలు!! 

నీవు లేని వేళల నా లోకమిది

నిదుర నన్నొదిలిపోయింది కలలిక కననన్నానని
పోతే పోనీ మనసులోని నిన్ను చూస్తూ రేయిగడిపేస్తాను

ఇంకొంచం తీరిక చిక్కితే నిన్నలోకి చూసుకుంటాను
చదువుకోను నీ జ్ఞాపకాల రచనలున్నాయి

లేనిపోని కినుకలు నేర్పుతుందని గుండెకి గడియపెట్టేసాను
అపోహలు వెదికి నను నిలవనీయవని వూహలకీ సెలవిచ్చేసాను

గుప్పిట విప్పాలని లేదు, నీ వేలిముద్ర దాచానందులో
ముంగురులు ముద్దాడుకున్నాను నీ జాడలున్నాయని

కొనగోర్లు నీ మునిపంటి పదునుకని పదిలపరిచాను
ఇంకేమిచెప్పాలన్నా నునుసిగ్గు కమ్మేస్తుంది

పులకింతల పారిజాతాలు పక్కగా పరిచాను
మధురిమల మరువాలు జతగా కలిపాను

చెలిమి గంధాలు అద్దుకుని, వలపు చిలకులు చుట్టుకుని
నీ ఆలింగనంతో చాలించే విరహవ్రతం మళ్ళీ పట్టాను

[నా మనోవిహారంలో తామసి తాండవమాడుతున్న నెలవుల్లో సంచరించినపుడు తారసపడ్డ వూహ]

పల్లె పగలబడి నవ్వింది

పల్లె పగలబడి నవ్వింది
పాలపిట్ట అరుపల్లేవుంది

చేపల చెరువు మీద నాచు
అచ్చంగా పంటపైరు పచ్చ

పాడి గేదె పాలు పట్నాలకి అరువు
గాడి పొయ్యి వూక దండుగ ఖర్చు

కూలీనాలీ బ్రతుకుల్లో అర్థాకలి పేగరుపులు
కాసీకాయని తోటల్లో కంకర దిగుబళ్ళు

గుడి పూజారి గోడు కంఠ శోష
నడిబజారుల్లో నక్కల వూళ

సన్నకారు రైతు ఇంటి ఆలుమగలు
కొత్తసీసాలో పాతసారాలా రాళ్ళు మోయు కూలీలు

పలకా బలపం పట్టని అన్నాచెళ్ళెళ్ళు
కలవారింట వంటింటి కుందేళ్ళు

బ్రతకనేర్చిన పంతుళ్ళ పసలేని పాఠాలు
గడప దాటిన క్షణం మరిచేటి పిలగాళ్ళు

పల్లె వలసలు పట్టణానికి, పట్టణవాసం పరదేశానికి.
దేశానికి పట్టుకొమ్మ పల్లె ఏడ్వలేక వెక్కెక్కి నవ్వింది!

జలరక్కసి వేవేల వ్రక్కలైతే...

రాముడు తరిమాడో, కృష్ణునికి వెరచిందో
యుగంతాలు ఆ దిగంతాల్లో దాగునుందో
జలరక్కసి ఆకాశమంతా పరుచుకునుందేమో
అమాశకి పున్నమికీ వెన్నువిరుచుకులేస్తుందేమో

పిడుగుల పెడబొబ్బలు పుడమి అదిరేలా పెడుతోంది
బాహుమూలాలు తెగిపడేలా తెగ వంపులు తిరుగుతోంది
మెరుపు కాంతులు తన మేనంతా వణికిస్తున్నాయి
శాపమేమో వేవేల వ్రక్కలై వానచినుకులై రాలిపడింది

చెరువు మురికి కడుక్కుని తేటపడింది
దాని మీద తేలేటి తామర తెప్పరిల్లి నవ్వింది
లోనున్న చేపలు రంగులరాట్నం తిరుగుతున్నాయి
ఒడ్డునున్న కొంగ వుండుండి వాటితో చెడుగుడాడుతోంది

రక్కసి కాయంపడ్డ సముద్రం వులిక్కిపడింది
జరాసంధుని వోలే తిరిగి జీవంపోసుకుంది
రాకాసి మళ్ళీ జనించింది, నింగికెగసి నక్కింది
నిదురపోనుందో? తిరిగి నేల జారనుందో? ఎవరికి ఎరుక!

గీతకి అటువైపు ఏముంది?

అనుకున్నది జరిగినపుడు
అన్నీ మంచి తరుణములే, కాని నాడో?

అడియాస తీతువై
అపశకునం మోసుకొస్తుంది

ఎడబాటు రాచపుండై
మరణశాసనం చేతికిస్తుంది

కంటికి నీరు కరువై
రక్తాశృవులు అరువడుగుతుంది

స్వప్నగీతం కర్ణకఠోరమై
అపశృతుల్లో లయమైపోతుంది

ఓదార్పు ఎండమావై
బ్రతుకు రాజీనామా కోరుతుంది

అపనమ్మిక వూబిలో
అంతిమశ్వాస అనివార్యమౌతుంది

అస్థిత్వం అచేతనై
శిధిలమై మృతకళేబరమౌతుంది

ఇన్ని భయానక దృశ్యాలు కాంచాక
ఇక ఏమి మిగులుతుంది?

గోడ గుండె పగిలింది!

అనగనగా కోట బురుజు వంటి గోడ,
దాని వెనుక ఏడంతస్థుల మేడ.
ఓ ప్రక్క గుబురైన కొమ్మల గోరింట చెట్టు,
కొమ్మల్లో ఓ బంగారు పిచ్చుక గూడు.

మేడలో మనుషుల నడుమ మరిన్ని గోడలు,
పైకి తేలని ఆ లోగుట్లు కాపుకాయను అగచాట్లు.
గూటిలో పక్షుల నడుమ పుల్లా పుడకలు,
పైకి ఎగిరే ఆ పిట్టలు అవనిపై అవధూతలు.

ఆషాఢాన పది చేతులా లేలేత రెమ్మల ఆకాకు దూసి,
ఆఖరుకి కొమ్మనీ విరిచి గూడు చెదరవేసె ఆ మనుషులు.
మనువాడినా మనసులు కలవని మాట మరిచి,
పండిన చేయి చూసి మురిసేటి పడతులు, చెంత ఉపపతులు.

గూడు మళ్ళీ కట్టాయి అంతరాలు లేని ఆ జంట పక్షులు.
గోడ మీద వాలి ఆదమరిచి చేసాయి కిలకిల రావాలు.
పక్షిరీతి మనలేని మనుషుల నడుమ పెరిగే గోడలు,
చెదరని చెలిమిలో గూడు పేర్చుకునే ఆ పక్షులు.

ఇపుడు వాళ్ళు మరమనుషులు, మమతలెరుగని ముష్కరులు.
తారతమ్యాలు గోడలు దాటి వూళ్ళకి చేరాయి.
కొమ్మలు ఇక వేయలేనని విరిగింది మోడైన గోరింట,
బీటలిచ్చిన గుండె పగిలి నేల వాలింది గోడ.

[
అవధూతలు: నేను, నాది అన్న భావముగాని, గౌరవా గౌరవాలన్న తేడాగాని ఉండనివారు అవధూతలు. అవధూత తన నడవడిక ద్వార జ్ఞానస్వరూపాన్ని చూపిస్తారు.
Upapati – Married but in love with another woman.]

ఏరువాక పున్నమికి రైతన్నలకి నా వందనం!

నాడు:

ఏరువాక పున్నమికి వెండిమబ్బు దారబ్బంతి
చిక్కులేని పోగులు పుడమికి జారవిడుచువేళ,
ఏటిగట్టున ఎంకిని తలదన్నే పూబంతి
దుక్కిదున్నగ పోతున్న మావకి ఎదురువస్తూ,
సాలుకోమారు సాగించే సంబరం కృషి పౌర్ణమి!

అగరుధూప పరిమళాల నాగళ్ళు.
పసుపు రాసిన కొమ్ముల ఎడ్లు.
ఇత్తడి డేగిసాలో వూరించే పొంగళ్ళు.
పల్లె సందు సందున సందళ్ళు.
వతనుతప్పని తొలకరిజల్లు తృళ్ళింతలు.

నేడు:

ఇరుకుబాటలో ఇరుసులేని బండిలో మరో కృషీవలుడు,
కాలినడకన ఎదురువస్తూ, ఏరువాకని తలపోస్తూ నేను.
చెంత సోయాచిక్కుడు, మొక్కజొన్న విత్తుల మూటలు,
ఐదుమాసాల్లో అవి పండించును బంగారు పంటలు.
ప్రక్కన విరగకాసే యాపిలు పళ్ళతోటలు, బళ్ళునిండే గుమ్మళ్ళు.

ఆదిమానవుని మనుగడ వ్యవసాయ సంస్కృతి,
అధునికమానవునికీ సేద్యం ఓ వృత్తి.
పొలం, హలం, కండబలం, ధాన్యం రైతు ధనం.
ఆతను సాగించు స్వేదయాగం భావితరానికొసగు ఫలం.
తరతరాల చరిత మూలధనమైన ఆతనికి నా వందనం!

బహుదూరపు బాటసారి

ఈ తరుణాన వెనుదిరిగి చూస్తే వేవేల క్రోసుల నా జీవితబాట,
తృప్తిసౌధం చేరగ నేను పరుచుకుని నడిచొచ్చిన రహదారి.
గతుకులున్నాయి, అతుకులున్నాయి, అయిననూ పొందికైన అమరిక.
అరమరికలేక అంటిపెట్టుకున్న ఆత్మీయులే అట మైలురాళ్ళు.

అచటచట బాట ప్రక్కగా నా లక్ష్యసిద్ధి నిలిపిన గిరులు,
నిరాశలో కృంగిన లోయలు, వెలికి తెచ్చిన ఆశయాల నిచ్చెనలు.
నవ్వుల క్షణాలు విత్తులుగా నాటిన తరులు, పూల వనాలు,
నడుమ వేదన ఘడియలే తాకవలని ముళ్ళజెముడు పొదలు.

బడలిక వున్నా, దప్పికగొన్నా కొంత పరుగూ తప్పలేదు.
పరుగాపి విశ్రమించిన ఏ మజిలీ నాది కాలేదు, నిలవనీయలేదు.
ఇరుప్రక్కా, వెనుకా ముందూ పయనించే సహచరులు కోకొల్లలు.
ఎవరి దారి వారిదే, వేగమెంచ ఎవరి గీటురాయీ నాది కాదులే!

ముందువైపు చూపుసారిస్తే ఎందుకో వేగంగా సాగాలన్న అత్రుత.
కలల కల్లోల సాగరాలు, వెతల అగ్ని పర్వతాలు కనుమరుగైనాయి.
సాఫల్య మైదానాలు, కైవల్య పచ్చిక బయళ్ళు వూరిస్తున్నాయి.
నా త్రోవ తుది వరకు నేను అలుపెరుగని బహుదూరపు బాటసారినే!!!

నాకు నేనే పరాయిని

ఎందరున్నా ఒక్క నీవు చాలనిపించావు.
ఎక్కడున్నా అక్కడ నీవే అగుపించావు.
నా వెరపులో, వంటరివేదనలో తోడై వెలికివచ్చావు.
నా గెలుపులో, ఆనందఝురిలో నీడై నింగికెగసావు.

తిమిరానికి తావీయకని నచ్చచెప్పి,
నాలోని కాంతి నీవే కబళించుకుపోయావు.
శిశిరానికి నెలవీయకని హెచ్చరించి,
నా వసంతాన్ని నీవే దోచుకుపోయావు.

చింత నీ చెంత చేరనీయకని బుజ్జగించి,
నాలో నమ్మకం నీరుగార్చే వంచన నీవేచేసావు.
శాంతి నీవెంటే వుండనీమని బ్రతిమాలి,
నా వైరి నీవై సంధిలేని సమరం చేసావు.

ఎంత వింత, ఇంతా చేసి మౌనముద్ర వేస్తివి.
మాటలెన్ని నేర్చినా నీ ఎదుట నన్నో మూగదాన్ని చేస్తివి.
వూసుల ముసురు నన్ను ముప్పిరిగొన్నా నీవు అచేతనవయ్యావు.
నను వీడవు, నాకు తోడవవు, తగునా నా లోపలి మనిషి?