దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల?

అమ్మ గర్భమే ఆనంద కడలిగ దేవదుంధుబులు మ్రోగగ అరుదెంచి..
జననీ జఠరే శయనమంటూ అమ్మపంచిన గోరువెచ్చని పాన్పుపై పవళించిన వటపత్రశాయివి
ఆరు నెలల గడవకమునుపే అటునిటు ఈదులాడుతూ,
గిలిగింతలిడుతూ, చిరుపాపవై చిత్రాలు చేసిన మత్స్యావతారానివి
 
నెలలునిండి నడకకే అలిసిన అమ్మకి ఇసుమంత వెసులునీయని ఆకతాయివి
చేతుల, కాళ్ళ చిరు తాపులతో, చిన్ని శిరస్సుతో నా లోకాన ఉద్భవించిన కూర్మావతారానివి
 
అమ్మ స్తన్యమిచ్చిన తొలి క్షీరమారగించి ఆ వేవేలానుభూతి లోకాలు తిరిగిరాను,
నీతొ నన్ను తీసుకుపోయి, పుడమంత నా సంతసాన్ని నీవే మోసిన వరాహావతారానివి
 
నిండు మూడైన లేని నెలపాపవే, అయితేనేం, ఎంత సుధీర్ఘ సాధకుడివైనావు,
నీకు రాని చేష్టేదైనా నిలువునా చీల్చి, బోర్లడి, దొర్లాడి, పారాడిన నరసింహావతారానివి
 
బుడి బుడి అడుగుల నీ చిరునడకకి నే మడుగులొత్తుతూ, ఎండవానల నిను కాపాడుతూ,
నెమ్మదించని నీ ఉత్సాహాన్ని ఉల్లాసంగా చూస్తూ, తలపోసితి నీవొక వామానావతారానివని
 
మారాముల వేళ, గిల్లికజ్జాల వేళ, పంతమాడువేళ, కేళీ వినోదాలా,
ఆదమరువక, వెనుకడుగువేయక అరివీర భయంకురడవైన పరశురామావాతారానివి

అభ్యసించిన విద్యలెల్ల నీకనుక్షణం తోడుండగ, నీకబ్బిన సంస్కారం తావినద్దగ,
ఎల్లలులేని విశ్వాన నిత్యం కీర్తిజీవన పారాయణం చేస్తూ భాసిల్లిన శ్రీరామావతారానివి
యుక్తవయసుకి వచ్చావంటే 'నీవే కాదా నా నెచ్చెలివని మేళమాడిన' కొంటెవాడివి
చిలిపి నీ కళ్ళ ఏ చిన్నదుందోనని నన్ను కూతూహలపరిచిన కృష్ణావతారానివి
'నిర్వాణం చెందిన వేళ నిన్ను తెలుసుకుంటినమ్మా, నన్నెంత తీర్చావో, నీవెంత తల్లడిల్లావో,
పగలు, రేయి, కాలాతీతంగా, మనం మారదాం ఇక నేను నీకు ముందుటాన'న్న బుద్దావతారానివి
రేపేమి ఆపత్తు రానుందో, ఈ మాపేమి విపత్తు దాగునుందో, నాకిక సత్తువలేదీ శోధన చేయను,
వేదననిక నే తలవను, వెతలనిక స్వీకరించను, వాటన్నిటినీ ఖండించగ నీవే నాకు కలికావతారానివి
ఓ మాట:

యధా యధా హి ధర్మస్య గ్లానిర్భవతి భరత
అభ్యుత్తనం అధర్మస్య ఆదాత్మానాం స్రుజమ్యహం
పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్క్రతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

నా పిల్లల వలన జీవితంలో నాకు కలిగిన అనుభవాలు, అనుభూతులు కొన్ని, కలగనున్నాయని నమ్మకం కలిగిస్తున్న మరి కొన్ని స్ఫూర్తిగా వ్రాసినా, ఈ వర్ణన ప్రతి భాద్యత గల బిడ్డకీ చెందుతుంది. అటువంటి మంచి వ్యక్తిని తీర్చిదిద్దిన ప్రతి అమ్మా, నాన్నకి ఈ కవితతో వందనం.

నా నిరీక్షణ త్రుంపగ రావా, ప్రియా?

ప్రియా, నా కంటి నీటి వరద నిన్ను ముంచకూడదని కనులు మూసి ఒక మనవి.

కాలపు కొమ్మల్లో చివురించే క్షణాలు,

వాడి రాలిన క్షణాల్నిచూసి వెక్కిరిస్తే,
నేలవాలినవి నవ్వుకుంటాయేమో,
ఆ పచ్చదనం రెప్పపాటేనని.

ఆశల గుబురు పొదలు,
వాటి చిక్కని చివురుకొమ్మలూ,

ఆ కొమ్మల వూగే చిగురుటాకుల
కవ్వింపే జీవితానికి కాదా వూపిరి?

నేల చేరిన నిరాశా, నిట్టూర్పుల
క్షణాల్ని తాము
చేరమంటూ
సేదతీరుస్తాయి,
వూరడిస్తాయి,
వూరిస్తాయి.


గుండెగూటిలో చేరిన తీపిక్షణాలు
కదలి వస్తున్న క్షణం
,
వున్నపాటుగా తమది కావాలంటూ
తపించి సంబరపెడతాయి.

ఎన్ని విధాలు
ఈ చిన్ని క్షణాల గమనాలు నేస్తం?

కంటి రెప్పల కన్నీటి క్షణాలు
తామూ మిగలమంటూ జారిపోతాయి.


పెదవి చాటు పద క్షణాలంతే
ఇట్టే పరుగిడిపోతాయి.

ఇన్నిటా గుప్పిట పట్టినన్ని
స్ఫటిక క్షణాలు దాచిపెట్టాను.

నీకు పంచి
నీ ప్రేమని వాటన్నిటా బింబించాలనీ,

నా ఎదురుచూపుల
నిదుర కనులకి
నెమ్మది అందించాలనీను.


కాలం మరో మారు చివురించక మునుపే నా నిరీక్షణ త్రుంపగ రావా, ప్రియా?

స్ఫూర్తి: పృధ్వీ గారి http://pruthviart.blogspot.com/2009/01/blog-post_28.html

అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట...

అదుపన్నది ఎరుగనే, అలసటకి తావీయనే, నీవడిగిన తడవే
మనమనుకున్న తావున నే వేచుండలేదా, నీ "అభిసారిక"నై?

నీపై అలిగానేమోనని నా మది నాపై కినుకవహించి,
నాపై నేనే అలిగానేమోనని తనపై తనకు దిగులు జనించి,
నడుమ తనపై జాలిలేదాని తనువు మదిపై నిందలువేసి,
ఈ అన్నిటినీ చిన్ని గుండె ఇలా వొంటరిగా గమనించేసి,
తనువు, మనసు, ఆ హృదయం కలిసిన నేను నిలిచానిట "కలహాంతరిక"నై.

మునుపే చెప్పాగా, రెప్పల గోడల వెనుక జాలువారుతున్న,
జలధారల ఇక నిన్నభిషేకించాలని లేదని.
నా గుండెకోట లోని వేల గదుల్లో,
ఎక్కడో ఒకచోట నీ కంటపడకుండా దాగిపోవాలనుందనీ.
నీ చేతల పులకించిన ఆనేనే ఇపుడు నిక్కచ్చిగా "ఖండిత"నే

యేనాడు వీడావీ చేయి, హొయలు ఒక పరి, వగలు తదుపరి,
అన్నీ కలిసి కలల కావేరినై, దిగుళ్ళ ద్రిగ్గుళ్ళే దీన దేవేరినై
నిస్పృహలో స్పృహ తప్పిన నిండు గోదారినై,
చుక్కాని జారిన నట్టేటి నావంటి వయ్యారినై,
రేయి గుబుళ్ళలో తనువు త్రుళ్ళింతలో తుంటరినై,
తమకమద్దే వేకువల్లో తల్లడిల్లే ఒంటరినై,
లేతప్రాయంపు "ప్రోషితపథిక"నైతిని కాదా?

ఎంత చిత్రం లోకాలనేలేటి రాజునీవైతే,
సరసాల నిన్నోలలాడించి, నీకు రారాజ్ఞి నేనైతి.
వింత కాదేటిదని అంతా మేళమాడితే,
సరాగాల గారాలొలికిన "స్వాధీనపథిక"ను కాదేటీ?

నిత్యం నీ తడిపొడి తలపులతో తనువునలంకరించుకొని,
రహస్యం దాచలేని గుండె చేసే గడబిడనే గంధంగా రాసుకుని,
కార్యం నెరవేర్చుకుని కన్నుగీటిన నిన్నే కాటుకగా అద్దుకుని,
ఆలస్యం చేయక రారమ్మని వేడుతూ నీ "వాసవసజ్జిక"నైతి.

నీ తనువుపై కరిగి, నీ ప్రతిమగా తిరిగి రూపు దిద్దుకుందామని
నా మెత్తదనం నువ్వద్దిన ముద్దుతోనే నీకు తెలుపుదామని
ముకుళించిన నా చేతుల్లో నీ రూపు ముద్రించుకుందామని
నా ఎదలో నిను బందీ చేసి నీకు నేవశమౌదామని
వేచివున్నానిట నీ "విరహొత్కంఠిత"నై.

నేతాళలేనీ విప్రలంబని విన్నవించితి కాదే వేయిమార్లు,
వేగిరపడి, వేదనపడి, వేళపాళయని యోచించక,
విరహాన నను ముంచకని వేడుకుంటిని కానా వేయినూర్లు,
మరి యేలనయా ఈ జాగు, వీడు చేరనేలేదు నీ "విప్రలబ్ద"కై?

ఇన్ని పోలికలు చెప్పి, అన్నీ ఒక నేనేననీ అదీ నీ కొరకేనని చెప్పనా మరోమారు? ఆ అవసరంలేదిక దరిచేర దారిపట్టానంటావా?
గుండె గనుల్లో బొగ్గంటి బాధల్ని, ముగ్గు రాళ్ళుచేసి దంచుదామంటే, రవ్వ పొడుల్లా కవిత వెలుగులు రువ్వుతున్నాయి!

Reference:

The Nayika Bhava

The shastras have classified the basic mental status of woman, the Nayika, into Eight divisions, called Ashtanayika bhavas. These divisions portray the heroine in different situations, express different feelings, sentiments & reactions.

The Ashtanayika bhava are

Abhisarika - She is the one who boldly goes out to meet her lover.
Kalahantarika – She is the one who is repenting her hastiness in quarreling with her lover, which has resulted in their separation.
Khandita – She is the one who is angry with her lover for causing her disappointment.
Proshitapathika – She is the one who is suffering and missing her beloved who is away on a long journey.
Swadheenapathika – She is the one who is proud of her husband’s or beloved’s love and loyalty.
Vasakasajjika - She is the one who is preparing for the arrival of her beloved, by decorating herself and her surroundings to provide a pleasant welcome for her lover.
Virahotkantita – She is the one who is separated from her lover and is yearning for reunion.
Vipralabda – She is the one who is disappointed that her lover has not turned up at the tryst as he promised.

vipralambha: The highest perfection of 'adhirudha' affection in conjugal love involve
meeting (madana) and separation (mohana). In the ecstasy of madana,
meeting, there is kissing, and in the ecstasy of mohana, separation,
there is a symptom of separation, and there is also a symptom called
transcendental insanity. The ecstasy exhibited before the lover and
beloved meet, the ecstasy experienced between them after meeting,
the state of mind experienced by not meeting, and the state of mind
experienced after meeting fearing separation are called vipralambha

శృంగార సూరీడు!


రేయి శృంగార శ్రీనివాసా అంటూ పాడిందో ఏమో ఛాయ!
ఏం ముదమార నాపైన గీతమొకటి కట్టవేమని అలిగినాడేమో ఆదిత్య?
ఏమైందో నాకైతే అసలు సంగతి అంతంత మాత్రమే ఎరుక,
ఏకంగా నాకేదో కైత వ్రాసిమ్మని విన్నపాలంపిన రవి సాక్షిగా.

ఎందుకంత ఎర్రగా ఇంటి బయటి కొస్తావ్?
మళ్ళీ ఎర్రెర్రని మోముతో ఇంటి దారిపడ్తావ్?
అంత వలపు చిలకలు అందిస్తదా ఏంటి నీ ఇష్టసఖి?
లేదూ ఆ పని నీదేనంటదా మరి?
ఈ పొద్దు మాత్రం ఎదో అయినట్లే వుందేం?
తమరిదా ఆ అలక, తమరి రాయంచదా నిజానికి?
సగం మొఖం చాటేస్తూ,
అటూఇటూ
పోతున్న నల్లమబ్బుల్లో పక్కలేస్తూ,

ఏం చేస్తున్నావేం?
ఎరుపు ఆకసానికిచ్చి, మెరుపు నేలనేస్తానికి పంచి,
నీవు
మాత్రం దాటేస్తునావ్

నా కన్నెక్కుఫెట్టిన గురినుంచి.
రేయేదో ప్రియభామిని వగచిందా తాను నలుపనీ,
నీవు చెప్పలేనన్ని వన్నెలున్న విలుకాడివనీ?
వేళకొక రంగు బాణాలు వేలకొద్దీ కిరణాలుగా
ఎక్కుపెట్టకనే
వదుల్తావుగా?

వేగిరపడి ఒక్క క్షణమైనా ఆగక లిప్తపాటుగా
రోజులూర్లూ
ఆవలీలగా దాటేస్తావ్ కాదూ?

మరీ పొద్దు ఆ నడకేది, ఉదయకాంతులేవి?
లేలేత ఎండబాకులేవి? సంధికొచ్చినట్లా చూపులేంటి?
ఏంటేంటి మళ్ళీ చెప్పు, ఇంకాస్త అర్థమయ్యేలా
మరికొన్ని
మాటలు కలిపి చెప్పు?

రేయి చీకట్లొ నీ సరస రాగరంజితమైన
నీ
నెచ్చెలి మోము నీకు కనరాలేదని,

వేయి బాసలిచ్చి, వేవేల కానుకలంపి,
వప్పించావన్నమాట ఆ పొద్దే మళ్ళీ నీ వాంఛతీర్చను!
అందుకలా నలుపులద్దుకుని,
నాకు గుట్టు తెలియనీయక అలా పడకింటి దారి పట్టావా?
అమ్మో, భాస్కరా, ఎంత తుంటరివి,
కాదేంటి మరి నీవూనొక శృంగార సూరీడువి?

*** ఒకమాట: ఉదయాన్నే సూర్యోదయం చూస్తూ ఒక 10ని. గడపటం అలవాటు. నిన్న సగం సగం మబ్బుల్లో దాగి, ఈ రోజు అసలు మొఖం చాటేసిన తనని చూసి వచ్చిన చిలిపి వూహిది. జీవితంలో శృంగారం అన్నది ఎంత సున్నితమైనదో, మీరంతా ఈ కవిత లోని భావాన్ని అంతే మధురంగా ఆస్వాదించాలని మనవి!

అద్దంలో నా బొమ్మ నవ్వుతుంది! ఎందుకబ్బా?

పుట్టానో లేదో, నాకేవో పోలికలు లెక్కగట్టి,
లేనివన్నీ వరసబెట్టి వ్రాసిపెట్టి,
వున్నవీ లేనివి వంకరలంటగట్టి,
వూర్లో వారంతా ఒక పేరుపెట్టి వదిలిపెట్టారు.

అక్కడితో అయిందా, ఆ పేరు పలికిందెవరు?
పోలికలు పెట్టినట్లే పేర్లూ ఓ పదహారు పెట్టేసారు.
ఒక్కరంటే ఒక్కరైనా నా పేరు పలికారా?
నాన్నగారి కూతురు, నానిగారి కోడలు, ఇవి నా పేర్లలోకొన్నే.

అదేంటని అడిగానని ఇదేం విడ్డూరమోనన్నారు.
పోలోమంటూ వాడ వాడా నా పేరు చెప్పుకున్నారు.
అడిగినోడికి అడగనోడికి పిలిచిమరీ దండోరా వేసారు.
ఇంతకీ నేనడిగింది "మీకు నా పేరు తెలియదా" అనే కదా?

ఇంతోటి పనికే అంత బాగా నా పేరు మ్రోగిందేం?
ఈ ప్రశ్నకి మాత్రం జవాబెవరీయరేం?
ఇదేంటి అద్దంలో నా బొమ్మ ఇటురా అంటుంది?
"ఈ లోకంతీరింతే తల్లీ అడిగినోళ్ళంతా పేరుగలవాళ్ళే" అని నవ్వుతుందీ?

ఈ గీతానికి నువ్వే పేరుపెట్టు - ప్రేమని మాత్రం వద్దు, అది కరిగిపోతుంది ...

పేరులేని ఈ జీవనపుష్పం సౌరభాలు గాలిలో కరిగిపోయే క్షణాల,
నీవొక పిల్లతిమ్మెరవై తననలుముకున్నావ్,
ముకుళించే వేళ తిరిగి బొడ్డుమల్లి మొగ్గైంది.
మరుసారి వికసిస్తే తన సౌరభాన్నంతా నీలోనే కలపాలని కాబోలు.


రేపటి వేకువనే వస్తావని, తన రేకు రేకు నీవే విరియిస్తావని,
రానున్న పొద్దుని నేచెప్పేవరకాగమని బుజ్జగించి,
పోతున్న మాపుతో మైత్రిచేసి సగం రేయిలో నిలిపేసి నీకై వేచివున్నా.
శీతల పవనమై, మబ్బురెక్కలతో వేగిరం వస్తావు కదూ, నా నేస్తం?


గుండె కతలన్నీ గుట్టుగా, గుసగుసగా చెప్పలేనని,
కలంనడిగి నీలి అక్షరాలు తెచ్చా.

చిర్నవ్వు రేకులన్నీ నీపై చల్లలేనని, చిరుగాలి తెరలుతెచ్చా.
నిన్ను హాయిగా మురిపించి, అదిలించి, నెమ్మదించలేనని,
చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుకనుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి,
నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?


జీవితపు యెలమావి తోటలో తిరిగి స్నేహపుచిగురింపు.
ఆ చివురు సుతారంగా కొరికిన కాలపుకోయిల గళంవిప్పిన,
కమ్మని జీవన గీతమై, మన ప్రేమ సంగీతసరస సమ్మేళనంలో,
తన్మయ స్వరాలు, తనివితీరని రావాలు రువ్వే ఆ తరుణం,
నిత్యం శాశ్వతం చేద్దామా? ఈ ఆమనినే నిండుజీవితం కొనసాగిద్దామా?

చివరకు మిగిలేదేది?

నీకు నిఘంటువు భాషే కానీ,
నిజ జీవిత బాసలసలు తెలియవని,
మరో సారి నేను తెలుసుకున్నాను.

నేర్పుగా నాకేదో తెలియచెప్పానని,
నువు మురుసుకున్నావనీ తెలుసుకున్నాను.
నీకేమీ ఇకపై నేర్పించవద్దనే వూరుకున్నాను.

ఎగిసే కెరటం విరిగే తీరతదని కదూ చెప్పావ్?
ఇదీ ఎక్కడో విన్నమాటే, కొత్తేమీ అనిపించలేదు.
నువు వల్లెవేసిన పదంతో పోల్చుంటావ్ నా బాధకదే సరని.

మరి, అదేదోపాటలో మాటే, "పడిలేచే కడలి తరంగం,"
తెలియదా నీకిది, అవసరమైతే ఆ అలే సునామీ కాగలదనీ,
ఏడు వూర్లు అమాంతం ముంచివేయగలదనీన్నూ?

వూసులు ఐసుక్రీములు కరిగిపోకతప్పవనీ,
కదూ చమత్కరించావ్ నీదైన హాస్యతీరులో?
ఆశలకీ అలాగే ఇంకేదో పోలికచెప్తావ్. ఆవిరో, నివురోనని,

మరెపుడు, అసలు జీవితమే ఇంకా త్వరగా కరిగిపోతుందనీ,
రాదు జారిపోతున్న ఏ అవకాశం తిరిగి నీ చేతికనీ,
కాలాన్ని క్షణక్షణంగా ముక్కచేస్తే చివరకు మిగిలేదేదీలేదనీన్నీ తెలుసుకుంటావ్?

మావూర్లో అవతరించిన పిచ్చుకపై ...

అవును నాకర్థమైపోయిందిలే,
నువ్వొచ్చింది మావూర్నుంచేనని,

నీ బుల్లి ముక్కు, బుజ్జి బుజ్జి రెక్కలే
నాకు గుర్తులు.

నువ్వొక్కత్తివే వచ్చావేమని పలకరిస్తే,
అవును అలా ఎగిరిపోతావేం
రెక్కలు నీకేవున్నాయని టెక్కా ఏంటి?


ఎందుకంటే కాలం నను మార్చిందో,
కాలంతో నేనే మారానో కానీ
,
గమనించలేదేమోనని సరిపెట్టుకుందామన్నా,
మనసాగక నీ ముందుకొచ్చినా తప్పుకునేపోయావ్.
అంటే నువ్వు నన్ను గుర్తు పట్టలేదన్నమాట!

వుండు ఇంకొక ప్రయత్నం చేయనీ,
అద్దంలో నిన్ను చూసుకుని,

పొడిచి పొడిచి ముక్కంతా ఎర్రన చేసుకున్నావని,
గుర్తుందా
? నువ్వు రెక్కలతో ఎగిరితే,
నేను కాళ్ళతో ఎగిరెగిరి చివరికి నినుపట్టి
,
అల్లంత దూరాన వదిలివస్తే,
నాకన్నా ముందే తిరిగొచ్చి వెక్కిరించావ్.


పండక్కి పట్టూలంగా వేసుకుని,
పారాణి అద్దుకుని,

కాళ్ళగజ్జెలు పెట్టుకుని, పూలు కోసుకోను,
బూరియ్య గారి మల్లె తోటకొస్తే,
పందిరిగుంజలతో,

నీ వాళ్ళనేసుకుని స్తంభాలాటలాడుకుంటూ
మరోసారి వెక్కిరించావ్.


అమ్మమ్మ కాకమ్మ పిచికమ్మాంటూ కథలేవో చెప్తుంటే,
అక్కడక్కడే తిరుగాడుతూ
కామాక్షక్క విసిరిన నూకలన్నీ ఏరేరి తిన్నావ్.

రామన్న తాత పొలంలో నువ్వేనంటగా
పురుగులేరి పంట కాపాడింది,

ఇంకొన్ని విన్నవన్నీ మళ్ళీ నిన్ను
అడిగి తెలుసుకుందామంటే
అదిగో అలాగే వెక్కిరించావ్.


నేవెళ్ళిపోయినా నువ్వక్కడే వుండిపోయావ్,
మరి నీకు అవలేదేమో నాకులా పెళ్ళి.

వేసవికొచ్చినా, ఉగాదికొచ్చినా
కనిపిస్తూనేవున్నవుగా చాన్నాళ్ళు.

వేణు చెప్పాడు విన్నావేంటే అక్కా!
పిచ్చికలు చచ్చిపోయాయంటాని
,
ఎంత బాధేసిందో, ఎందుకని అడిగితే
తలో మాటా చెప్పారు,

పురుగుమందుల ప్రభావమన్నారు,
అయినా నువ్వుండగా అవెందుకని
వాళ్ళనెక్కిరించకపోయావ్?


మళ్ళీ ఇంతకాలానికి ఈ చలి దేశంలో,
ఆకు రాలు కాలంలో,

భలేగా కనిపించావే,
బోలెడంత సంబరమైపోయింది.

వెంట పదిమందినేసుకొచ్చావ్,
నాలా వలస వచ్చేసావేంటి?

హమ్మయా గురుతుకొచ్చేసానేంటి,
ఎప్పటిలానే వెక్కిరిస్తున్నావ్?

నీకివన్నీ తెలుసని, నాకెందుకు తెలియదు?

దృశ్యాదృశ్య వెలుగులోని జ్ఞాపకాల నీడల్లోకి,
వ్యక్తావ్యక్త వూహల్లోని తలపుల వాకిల్లోకి,
భావాభావ వెన్నెలలోని అంధకార గుహల్లోకి,
క్షణభంగుర మనుగడగా అందరాని లోయల్లోకి,
అనామకంగా, అదృశ్యంగా,
అనూహ్యంగా, ఆవేదనగా,
జాలువారుతున్న నా జీవితం, ఇక నాకేం సొంతం?

చెప్పాలనుకున్నది అవ్యక్తమై,
చేయాలనుకున్నది అనూహ్యమై,
చెందాలనుకున్నది అతీతమై,
చూపాలనుకున్నది అదృశ్యమై,
చివరికంతా శూన్యమై, నేనొక అనామికనై,
నాదంటూ కానిదాన్నే నాదని భ్రమిస్తూ,
భ్రమరమై, భ్రాంతి చుట్టూ భ్రమణం చేస్తూ,
సమరమై, ఓటమినే వరిస్తూ,
దీనంతకీ నాకు నేనే సాక్షినెందుకయ్యాననుకుంటూ,
ఛీ ఛీ నాదీ ఒక బ్రతుకేనా అనుకుంటూ,
అసలదీ నాదేనాననుకుంటూ,
నిజమే నాదేదీ కాదు, నాకేమీ లేదనుకుంటూ,
ఆఖరుకి ఈ నిర్లిప్తతా నాదికాదన్న నిజం నిజాయితీగా స్వీకరిస్తూ,
నన్నింత నాశనంచేసిన నా మనసుని ద్వేషిస్తూ,
నా మరణాన్ని ధ్యానిస్తూ, నా ప్రశ్నలకదొకటే బదులని,
నాకు నేనే మరణ శాసనమేసుకుంటూ,
నా మరణ వాంగ్మూల్యం నేనే పఠిస్తూ,
ఇదిగో అడుగుతున్నానిక నిన్ను, నీకు కావాల్సిందిదే కాదా?

నా మీద కాదు నీ చూపు, నా మనసు మీదే,
ఎందుకంటే నాకు సరైన ప్రత్యర్థి అదేనని నీకు ముందే తెల్సు.
దాన్ని చేతబడితే అదే నాకు చేయగలదు చేతబడనీ నీకు తెలుసు.
మరి నీకివన్నీ తెలుసని, నాకెందుకు తెలియదు?
ఇదొక్కటీ నీకు తెలిసుంటే నాకు చెప్పగలవా?
ఇవ్వటానికి నాకింకేం మిగలలేదు, నీకువతనైన వెల కట్టిచ్చేందుకు.

పొద్దు సంపాదకీయానికి కృతజ్ఞతలు, ధన్యవాదములు

పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో నా బ్లాగు లో నే రాసుకున్న "శీర్షిక పెట్టాలని లేదు" టపాకు స్థానం కల్పించిన చదువరి గారికీ, పొద్దు సంపాదకీయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు.

http://poddu.net/?p=1576 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో

స్వగతాలు స్వ గతాలు:

౨. శీర్షిక పెట్టాలని లేదు శీర్షికతో వచ్చిన ఈ కవితా స్వగతం చూడండి.

"శీర్షిక పెట్టాలని లేదు" చూడాలంటే ఇక్కడకి వెళ్ళండి http://maruvam.blogspot.com/2008/12/blog-post_18.html

త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే స్వర్గమొకటి కట్టేద్దామా?

నేనొక వూరు వెళ్ళాలంటే, ఒక్కత్తినే వెళ్తాను.
ఆ వూరి మొగల్లోనే వుంటుందో పొలిమేర, కొత్తగా చెప్పేదేముందిక?
వూరిలోకి దారి, వూరి నడుమ వూడల మఱ్ఱి,
వీధిలో కుక్కలు, వీధి చివర నీరు రాని నల్లాలు.

అటూ ఇటూ పక్కా ఇళ్ళు, వాకిళ్ళల్లో నలిగిన పక్కలు.
బట్ట కరువైన బిడ్డలు, ఒళ్ళు బరువైన పెద్దమనుషులు.
వుంటుందేమో ఓ బడి కొండొకచో, పక్కవూర్నుండొచ్చే పంతులుతో.
దవాఖానా ఏదని అడిగితే, డాక్టరు గారి అడ్రస్సే ఇస్తారంతా.

పలకా బలపం ఎరుగని ప్రతి పెద్దోడి చేతిలో వుండేవుంటుంది ఏదో ఒక సెల్లు.
మునుపటి మంగలి ఇళ్ళు పట్టి తిరిగితే, ఇపుడంతా ఇళ్ళు పట్టక తిరిగేవారే.
తాత వైద్యానికి లేని తీరిక తక్కిన చోద్యాలకి మాత్రం లెక్కలేదిక.
నా అనుమతికి ఆగక నను తడిమే కుర్రకళ్ళూ, నన్నడిగి దోచే నేర్పరులు.

ఇంకేంచెప్పను ఈ లెక్కకురాని కొండ గుర్తులు?
అయినా నేనే కాదు కళ్ళూ, కాళ్ళూ వున్నవారెవరైనా చెఫ్ఫేవివే.
కావాలంటే మీరూ వెళ్ళండి, నేనింకా వెళ్ళిరాని మరో వూరు.
అకడంతా ఇలానే వుండకపోతే అపుడు పంపండి నాకో ఇ-మెయిలు

ఎపుడో విన్నామే విశ్వామిత్రుని త్రిశంకు స్వర్గం?
ఈవూళ్ళేం తక్కువ కాదు ఇవన్నీ కలియుగ త్రిశంకునరకాలు,
మన నాయకులంతా దాదా గిరిచేసొచ్చిన విశ్వామిత్రులు.
ఇపుడేంచేద్దాం మనిద్దరం? కొత్తూరు వెదుకుదామా ? మనమే వొకూరు కొత్తగా కడదామా?

ఇది నీ కోసం కురిసిన హేమంత చందనం!

ఇపుడిపుడే అరుదెంచే శీతువులో,
విడివడని చినుకుతెరై జాలువారే హిమతుషారం,
రవి రాకకి పట్టింది ప్రత్యూష రథం,
జల్లుగా కురిపింది హేమంత చందనం.

ఇరు మేఘాల చిరుసందడిలో చినుకుల జడి,
మేరు ఘర్జనల అలజడిలో మెరుపుల వరవడి,
సరి సరి రాగాల నెత్తావి గుస గుసల గుంభన సడి,
విరి తరుల వయ్యారి వూపుల పొంగారు పుప్పొడి,
గోధూళి వేళ, పున్నమి రాత్రుల జాలువారు,
తెమ్మెరలు, వెన్నెల వెలుగులు వెరసి వెల్లువైన పుత్తడి జాడలు,
కావా నీకు నా రాయబారం, మొసితెస్తూ నా ప్రేమ సంబారం.

స్మృతుల అక్షయం నుండి తొణికే, క్షణపు బిందువులన్నీ ఏరి,
జీవనసాగరతీర భావరేణువుల తళుకులద్ది,
గుండె ఆళువలో గుత్తంగా చేర్చి, ఓ రూపునిస్తే
మెలిమి ఆణిముత్యమై మెరిసి, నా మీద రువ్విన,
మెరుపుల జడికి ప్రతీకవై నిలిచిన,
నా అపురూప నేస్తం,
కంటి బాస, గుండె వూసు, జతగూడి గుస గుసలాడితే,
నీ కలకంఠి నోట పలికే పాటకి పల్లవి నీ స్ఫూర్తే.

పునరపి జననం, పునరపి మరణం.

మరణం:
తానొంటరిగా వస్తది, వేరొకరిని ఒంటరి చేసేందుకు.
పిలుపులు, ఎదురుచూపులు వలదన్నట్లే,
తనకు తాను చెప్పుకుంటది వీడ్కోలు.
విడిచిపోతున్న నీటివెంట వెల్లువయ్యే పాలపొంగల్లే,
నిట్టూర్పు ఘోషతో వేదన వుప్పెన్లు.
వాడినా, వాసన వీడని మరువం,
గుండె గాయానికి అద్దిన మరపు గంధం.
పరిమళిస్తూనే వుంటుంది అనుక్షణం,
తడారని కనులకిస్తూ పొడి వాయనం.
కాకుంటే సాగుతుందా కాల గమనం, జీవన క్రమం?
కాలం కూల్చిన గతపు శిథిలాల్నుండి ఎవరో పిలిచినట్లు,
నేటి నిట్టూర్పుల వేడికి రేపటి కలల మంచు కరిగే వేకువలో,
బ్రతుకు కొమ్మపై, వూపిరి చిగురులు త్రుంపేస్తూ,
తపించే మనస్సుకి మరుజన్మ వరకు మరి రానని
మాటిచ్చి వెంటపెట్టుకుపోతుంది
మరణం.
తనువు వునికి దూరమైనా, తనవారి జ్ఞాపకాల కాష్టంలో,
కాలుతూనే వుంటుంది తానొదిలిన వెళ్ళిన సమిధ.
గడప గడపనీ తట్టి వెళ్తూ,
తన కడుపు పదిలమన్న కన్నవారి మమతలు కాలరాస్తూ,
నా తోడు వీడకన్న ప్రియమార మురిపాలు కన్నీట ముంచేస్తూ,
తను రాక తప్పదని,
వస్తూనే వుంది, వచ్చిపోతూనే వుంటుంది మరణం .
*******************************************************
చెల్లీ, నువ్వెక్కడికీ వెళ్ళలేదమ్మా. అప్పుడు అక్కున చేర్చుకున్న అక్కనే ఇప్పుడు కడుపున మోసానంతే.

*******************************************************
జననం:
అన్నకి ఇష్టం చెల్లంటే,
నాన్నకి ప్రాణం పాపంటే,
అమ్మకి తానే అన్నీనూ,
స్నేహంటే మా లోకం,
తనదేమో నవ్వుల లోకం!*******************************************************
అవును చెల్లీ! నీ మరణం ఒక విరామం మాత్రమే. తిరిగి ఈ జననం ఆ పైవాడి వినోదమేమో కానీ నాకు మాత్రం చాలా ప్రమోదం.

వస్తాను మరల మరల, ఓ సంద్రమా!

ఎప్పుడెప్పుడు కలుస్తానోననుకున్నా,
అప్పుడప్పుడు కలుస్తుంటాను.
ఇక్కడిక్కడే చూస్తున్నాననుకుంటూ,
ఎక్కడెక్కడో చూస్తుంటాను.

అదిగో నీలం, ఇదిగో నల్లనంటూ, నీ రంగులు
వెదికేస్తుంటాను ఎప్పటిమాదిరే!
అలల చెక్కిళ్ళపై నురుగు మెరుపులతో,
నవ్వేస్తావ్ తప్పనిసరిగా.

తనననుమతి అడుకగ తన ప్రతిమని
నీ ఒడిలో దాచావని,
చుప్పనాతి సూరీడు గుర్రుమంటాడు,
చర్రుమని నీ నీరు కొల్లగొట్టేస్తాడు.

దోచింది దాచేందుకు ఖజానా లేదా ఖలిఫాకి.
మబ్బు దుబ్బుల్లో వంచేసి మొఖంచాటేస్తాడు.

తబ్బిబ్బులయ్యే నీలికొండల మేఘమాలకి,
నీనున్నా నీకండంటూ,
రాడా మరి రయ్యి, రయ్యీ మంటూ గాలి చెలికాడు?

అదను చూసి ఓ దెబ్బేసి,
మబ్బు కుండలు దబ్బున తన్నేసి,
జారుకుంటాడు పొలికేకలెట్టే గొల్లోడిలా,
తత్తరపడ్డ బుల్లిమేకంటి వాన చిన్నోడు,
దోసిళ్ళ తోడీ, గుప్పిళ్ళనింపీ, నీ నీరు,
నీకిదిగో లెమ్మని వంచిపోతుంటాడు, అయితేనేం,
మానాడేంటి నేల కన్నేమీద తన చిలిపి జల్లుల వసంతాలు?

చేసిందంతా చేసేసి ఇక ఇప్పుడు తొంగి చూసేటి సూరీడ్ని,
రారమ్మని చెలిమి చేసేస్తావు. నీ రంగు తనకద్దుకోమంటావ్
సిగ్గుపడి ఎర్రబడ్డా, కుంచెకందని రంగుల్లు
ఆకసానికి అద్దేసి, ప్రతిరూపుగా నీ తనువెల్ల కప్పేసి
సెలవు తీసుకుంటాడు తన నెలవుకి.

నీ ఎదురుగ నేనలా నిలుచుంటా, లెక్కపెట్టలేనన్ని మార్లు,
సాక్షినవుతూనేవుంటానీ అనుభూతికి.

అలలెక్కి దిగే గవ్వనై, దోబూచులాడలేను.
చిందేసే చేపపిల్లనూ కాలేను.
కొమ్మల మెట్లు దిగి ఓ మునకేసి,
మళ్ళీ రెమ్మల వూయలలూగే గువ్వనసలే కాలేను.

బాటసారినై వచ్చి నీ చెలిమికి పిపాసినయ్యానో,
మరి బానిసనయ్యానో, అందుకే అంటున్నాను,
వస్తాను మరల, మరల, ఓ సంద్రమాని!

అవును, నీ నాయిక ఇప్పుడు ఖండిత, విన్నావా నాయకా?

నాకు కళ్ళు తెరవాలని లేదు,
వాకిట్లోని నిన్ను స్వాగతించాలనీ లేదు.
రెప్పల గోడల వెనుక జాలువారుతున్న,
జలధారల ఇక నిన్నభిషేకించాలని లేదు.
నా గుండెకోట లోని వేల గదుల్లో,
ఎక్కడో ఒకచోట నీ కంటపడకుండా దాగిపోవాలనుంది.
మరలిపొమ్మని నీకు కబురంపాలనీవుంది.
నీతో కలిసి విహరించిన వూహల పూతోటలు,
శిశిరపు శిధిలకళతో కొనవూపిరులు వదులుతున్నాయని,
నీ ఒడిలో నిదురించిన నా కనులు,
నిప్పు కణికలై నన్నే కాల్చేస్తున్నాయనీ వివరించాలనివుంది.
నీ చేతల పులకించిన నా తనువిక,
తానర్పితం కాబోనని "ఖండితంగా" శాసనమేస్తుంది.
చెప్పినవిక చాలని వెళ్ళిరావా మరి?
మన ఆశల సమరంలో, ఆశయాల రణంలో నువ్వొక విజేతవై,
కాదు కాదు జగద్విజేతవై, నా చేయి నీ చేత నుంచి,
నన్ను నీ చెంత చేర్చుకునే ధీరోదాత్తవై మరలిరావా మరి?

నేస్తం, ఒక్కసారి తిరిగిరావూ?

స్థబ్దతలో నన్నొదిలి నిశ్శబ్దంగా,
నువ్వు వెళ్ళిన మరుక్షణమే

నా గుండెని జయించిన నిరీక్షణ,
నా చూపుల్ని శూన్యానికి బదిలీచేసిందా క్షణమే.

వినికిడి మాత్రం మిగిలిన నా చెవులకు,

నీ అలికిడి ఇంకా అందనేలేదు.
రోదించాకే తెలిసింది నా గొంతు మూగవోయొందని,
తామర లేని కోనేరులా నేను మిగిలున్నానని.

మౌనప్రాంగణమైన మదిలోకి,
చిన్న సవ్వడితో అడుగిడే వూహా కన్యలు
నానుంచి కొల్లగొట్టిన నీ జ్ఞాపకాలని
అలంకరించుకొని ఆదమరిచిపోతునాయి.

వసంతం ముగిసిన కోయిలలా తిరిగి నీ రాకకు
క్రొత్త గీతం వల్లించుకుంటున్నాను.
కలగాపులగంగా రంగులద్ది వదిలిన
అసంపూర్తి చిత్రంలా నా జీవితం.

పచ్చని వేడుకల నీడల నల్లని వేదనలు,
వునికిలో శూన్యంలా, ధ్వనిలో మౌనంలా,
నింపేకొలదీ వెలితౌతున్న నా మది,
తనకు తానే బందీ అయింది,

పంచేకొలదీ మిగిలిన వెతల సంకెళ్ళతో.

రేపటి రేవులో ఎదురుచూపుల గేలం,
ఆశల ఎరతో,
తిరిగి తిరిగి పట్టిస్తుంది,
కాలం తల్లి కన్న క్షణాన్ని.


క్షణాలు కరిగి, క్షణాలు తరిగి,
జీవితం ఘనీభవించదే కాసంతైనా?
పరుగు పరుగున ప్రవహిస్తుంది,
నిన్నటి గాయానికి నేటి మందు రాసేస్తూ.

కాలానికి ఎదురీదుకుంటూ గతం వెదుకుతూ,
స్మృతుల తిన్నెలపై, నీ జాడనన్వేషిస్తూ,
అలసితి, సొలసితి,
నేస్తం, ఒక్కసారి తిరిగిరావూ?