వీడ్కోలు సరే - ఆహ్వానానికి ముందో మరి?

తృప్తి - బహుశా మనిషికి కొరబడిన భాగ్యరేఖ ఇదేనేమో.

ఎన్నున్నా ఇంకేవో కావాలని, యేది అందినా ఇంకేదో లేదని ఆరాటం. అసలు వున్న వాటిని ఉపయోగించుకోలేని అశక్తత. ఆఖరుకి ఇంద్రియాలని కూడా సరిగ్గా వాడుకోలేని అనాసక్తి. ఒక సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చి, మరొక దానికి ఆహ్వానం ఇస్తూ గడిపేయటం.

ఆయేటికి ఆయేటికి పెరిగే ఆశలు, అంచనాలు ఇలా అంతు లేని, అదుపు చేయని, అలుపు రాని ఆలోచనలు. ప్రశాంతతని కరవు చేసే జీవనం. కాస్త తన జీవితాన్ని తరిచి చూసి, ప్రక్కవారిని గమనించే ఎవరికైనా ఇవన్నీ కాక ఇంకేమీ స్ఫూర్తి వద్దా అని ప్రశ్న రాక మానదు. అలాగే మనుషులంతా ఇంతేననీ కాదు ఇక్కడ నేను చెప్ప దల్చుకున్నది. కొత్తదనాన్ని స్వాగతించే మనుషులలో నిత్యనూతన ఉత్తేజం ఎపుడూ వుంటుంది.


మన ఆలోచనల్లో, ఆశయాలలో, ఆచరణలోని అంతరాలు తగ్గి, మరొకరికి అనుసరణీయమైన జీవితం గడపటానికి మన చుట్టూరానే ఎన్నో ఉపమానాలు ఉంటాయి. నేను చూసిన అటువంటి కొందరిని పరిచయం చేద్దామని ఈ చిరు ప్రయత్నం. వీరందరిలో యేదో ఒక విలక్షణత. లోటు వున్నా దాన్ని అధిగమించిన సంకల్పం. సముచితంగా వుంటుందని వ్యక్తుల పేర్లు మార్చాను. సదుద్దేశ్యం తో వ్రాసినది కనుక ఎవరినీ దృష్టిలో పెట్టుకుని వ్రాసిన టపా కూడా కాదు.

స్టీవ్ : సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మనలో ఎంతమంది కనుచూపు తెలిపే జీవిత సత్యాలని గ్రహిస్తున్నాము? స్టీవ్ పూర్తిగా అంధుడు. నాకు పరిచయం అయ్యే సరికి దాదాపుగా ఇరవై యేళ్ళ బట్టి కంప్యూటర్/సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన అనుభవంతో, మానేజర్ గా మా కంపనీ/పదవిలో చేరారు. తనకి ఒక గైడ్ డాగ్, "నిప్".

స్పీచ్ అసిస్టెంట్ టూల్ సహాయంతో పనిచేసేవారు. వారానికొక హ్యూమన్ అసిస్టెంట్ వచ్చేవారట. ఈ నడుమ ఆయనకి సాంకేతిక పరిమితి వలన ఆ టూల్ తో కుదరని పనులకి నా పట్ల గల నమ్మకం వలన నన్ను సహాయం అడిగేవారు. చకచకా ఆయనలా తిరుగుతుంటే చాలా ఆశ్చర్యం వేసేది. అలాగే మీటింగ్స్ లో కానీ, ఇతరత్రా చర్చల్లో కానీ ఇట్టే సమాధానాలు ఇచ్చేవారు. ఎదురుపడితే మనం "హాయ్" అనేలోపే "హల్లో XXX" అని సమాధానమిచ్చేవారు. అంత బాగా గొంతు గుర్తు పెట్టుకునేవారు.

కొన్నేళ్ళకి ఇక బ్రతకదనుకున్న ఆయన గైడ్ డాగ్ ని దాని పప్పీ బ్రీడర్ కి ఇచ్చేసి [ఒక నెల ముందు దాని పధ్నాల్గవ పుట్టిన రోజు కూడా చేసారు వర్క్ ప్లేస్లో, నేను "నిప్" వెళ్ళిపోయే రోజు తన ప్రక్కనే కూర్చుని అలా కాసేపు దాని జాలి మొహాన్ని నిమురుతూ కూర్చున్నాను. ఆయన్ని మరి ఇక సాయం ఎవరు అని అడిగితే, నాకు "నిప్" తో అనుబంధం ఎక్కువ, ఇక బహుశా మరొకదాన్ని తేనేమో అన్నారు] ఇప్పటికీ కేన్ స్టిక్ సహాయంతో వర్క్ కి వస్తూ, తన పని తాను చేసుకుంటారు.

ఒకసారి "ఇలా అడిగినందుకు యేమీ అనుకోకండి" అని, "చూపు లేదని ఎప్పుడైనా బాధ పడేవారా?" అని అడిగితే, "ఎందుకు నాకు లేనిదాన్ని గురించి బాధ పడటం, వున్నవాటితో నేనేమి చేయగలనో అదే నాకు ముఖ్యం" అన్నారు. అలాగే తనని చూపులేని కారణం గా జాలి పడటం కానీ, వివక్ష చూపటం కానీ ఇష్టపడనన్నారు. వృత్తి పర విభజనలో నేనిప్పుడు ఆయనతో పనిచేయక పోయినా ఎదురుపడితే "హాయ్" అన్న పదం నా నోటి నుండి వెలువడక ముందే "హాయ్ ఉషా, హౌ ఈజ్ ఇట్ గోయింగ్?" అన్న పలకరింపులో మాత్రం మార్పు లేదు. అతి ముఖ్యమైన ఇంద్రియం లేని జీవితం కూడా ఎంతో తృప్తిగా, విజయవంతంగా జీవిస్తున్నారీయన.

మొరీన్ : ఆఫ్రికన్ అమెరికన్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళవీ మగవారిది పైచేయిగా వుండే సంసారాలు. యం.బి.ఏ. చేసిన తను నాకు పీర్. నేను మానేజ్ మెంట్ రిలేటెడ్ భాద్యత నిర్వహించిన సమయంలో ఇద్దరం రెండేళ్ళు కలిసి పనిచేసాము. బాగా కలిసిపోయాము కూడా. చాలా యెఫీషియంట్ మానేజర్.

తన మొదటి వివాహం ఆమె భర్తకి మాత్రం రెండవది. దాదాపు పదేళ్ళకి విడిపోయాక ఇద్దరు ఆడ పిల్లల్ని పెంచుతూ, అతని కారణంగా కలిగిన ఆర్థిక దుస్థితి నుండి మరొక పదేళ్ళపాటు పొదుపుగా బ్రతికి బయటపడింది. ఒక్కోసారి పిల్లల్ని తన ఆఫీసు రూం లోనే ప్రక్కన పడుకోబెట్టి పనిచేసేదట. వారి ఆలన పాలన అన్నీ తనే చూసుకుంది. ఇప్పటికీ యేవో ఒక వత్తిళ్ళే. ఎదురీత జీవనం.

పెద్ద కూతురు పరిస్థితి బాగా లేదని మనవరాలి బాధ్యత తను తీసుకుంది. పైన ఎనభై యేళ్ళ వృద్దురాలైన తల్లి [ఆవిడకి వైద్యం, శస్త్ర చికిత్సలు] రక్షణ, పోషణ. దరిమిలా తను కూడా రెండు వైపులా Hip Replacement చేయించుకోవాల్సివచ్చింది. మా కుటుంబంలో ఒకరికి ఈ సర్జరీ జరిగింది కనుక నాకు అందులోని సాధక బాధలు తెలుసు. కేవలం మూడు వారాల్లోనే ఇంటి నుండి పని చేయటం ప్రారంభించింది.

ఆలోపుగా ఒకసారి లంచ్, ఫ్లవర్స్, స్ట్రాబెర్రీ పై [తనకవి ఇష్టమని నాకు తెలుసు] తీసుకెళ్ళిన నన్ను చూసి ఒక్క నిమిషం తన కళ్ళలో చిరు తడి, "ఎంత గుర్తుగా తెచ్చావు?" అని సంబరంగా అడిగింది. అంతే ఎప్పటి మాదిరే నవ్వుతూ, ధైర్యంగా నేనున్న గంటా యే పని అడిగినా వద్దని సున్నితంగా చెప్పి, నేనిక పని చేయగలను అని ఎంతో ధైర్యం గా చెప్పింది.

అలాగే నాకొకసారి కలిగిన విపత్కర పరిస్థితి సమయం లో, నా మొహం చూసి యేదో జరిగింది అని తలిచి, ఆ సమయాన నాకు కావాల్సిన నాలుగు కన్నీటి చుక్కలు, బోలెడు మానసిక భరోసాని పంచింది. ఇప్పటికి రెండేళ్ళుగా ఇద్దరం వేరే వేరే కంపనీలకి పనిచేస్తున్నా నేను చనువుగా కాల్ చేసి, సలహా తీసుకునేంత కాంటాక్ట్స్ వున్నాయి.

కాళ్ళు అలా వుండి కూడా వాటర్ యేరోబిక్స్, కార్డియో వర్క్ ఔట్స్, జుంబా డాన్స్ నా జీవితంలోకి రావటానికి తనే కారణం. తనతో లివింగ్ టుగెదర్ చేసే రిచ్ నన్ను చూసి మనసు పడేసుకున్నాడని నవ్వుతూ చెప్పటం తనకే చెల్లింది. నాలో ఇంత పాజిటివ్ గుణాలు ఇంకా నిలబడటానికి తన వంటి మిత్రులు కొంత కారణం. తను కూడా ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా వుంటుంది. కష్ట నష్టాల కోర్చి నడుపుతున్న తన జీవితంలోని ఇన్ని అనుభవాల్లో మనం వెదుక్కోగలిగినవి ఎన్నో వున్నాయి. కాదంటారా?

యేమా/Emma : నేను రోజూ స్కూలుకి దింపే పదేళ్ళ చిన్నారి. మా పాప క్లాస్మేట్. ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. నేను వినే సినిమా పాటలు తనకి నచ్చితే అడిగి అర్థం తెలుసుకుంటుంది. ఉదాహరణకి "ఆప్ కా సురూర్ " నుండి నేను "మెహబూబా మెహబూబా .." వింటుంటే తనూ హమ్ చేసింది. ఆపై వివరాలడిగింది.

మా అమ్మాయి స్నేహ కి నిట్టింగ్ పిచ్చి. యేమా కూడా చేస్తుంది. కానీ మా పాప అంత వేగంగా చేయలేదు. క్రిస్మస్ కి వాళ్ళ కజిన్ కని ఒక స్కార్ఫ్ మొదలుపెట్టింది. తనని చూసి మా పొన్నారి మొదలు పెట్టింది. ఇదేమో చక చకా అల్లేస్తుంది. సరే ఒక రోజు ఓ డీల్ పెట్టుకున్నారు. ఇద్దరూ ఒకరిదొకరు మార్చుకున్నారు. ఆ రకంగా ఆ పిల్లది కాస్త ముందుకు జరుగుతుందని ఆలోచన. ఆ రాత్రి మా పిల్ల చక చకా హోమ్వర్క్ చేసేసి, గబ గబా డిన్నర్ తినేసి, యమా స్పీడ్ గా నిట్టింగ్ చేసి మర్నాటికి తనకి చాలా పూర్తి చేసి ఇచ్చింది.

ఆ పాప కూడా ఎంతో సంతోషపడిపోయి, నేను కూడా వీలైనంత అల్లాను కానీ ఇందుమూలంగా నువ్వు పూర్తి చేయాలనుకున్న సమయానికి అలస్యం జరిగివుంటే నన్ను మన్నించు అని ఎంతో మర్యాదపూర్వకంగా చెప్పి, పైగా ఇకపై మనమిద్దరం అవసరంలో ఇలా పరస్పర సహకారం చేసుకోవాలి అని సూచించింది.

అన్నట్లుగానే స్కూల్ లో యేదో మ్యూజిక్ ప్రాజెక్ట్ కి, అదా ఇదా అనుకుంటూ, అది సగం ఇది సగం చేసిన మా పిల్ల చివరి వారానికి బిక్క మొహం వేస్తే అప్పటికప్పుడు తన టీం లోకి తీసుకుని ఇద్దరూ సమయానికి వర్క్ పూర్తిచేసారు. ఇద్దరిలోనూ తృప్తి, సంతోషం. కలిసివుంటే కలదు సుఖం. ఐకమత్యమే బలం. ఎంత నిజం అనిపించింది. అలా ఆ పసికూనల్లో వున్న పరస్పరావగాహన, సహకారం చూస్తే ఒక సుమతీ శతకం లోని పద్యం గుర్తుకి రావటం లేదూ?

క్రిస్మస్ కి మా అమ్మ, నాన్న, చెల్లి, అన్న, నేను, మా అమ్మమ్మ, తాత, మా డగ్గీ కలిపి ఎనిమిది మందిమి చేసుకుంటాము అన్నప్పుడు, మా బుల్లిది ఆ డగ్గీ అంటే డాగ్ కి స్టైల్గా అలా పేరా అని అడిగితే "కాదు మేము దాన్ని "Doug/డగ్" దగ్గర కొన్నాము, అందుకే అతని గుర్తుగా ఆ పేరు అని చెప్పింది. కుటుంబ విలువలు చాటే ఇటువంటివి కార్లో వాళ్ళ సంభాషణలో ఎన్నో వింటాను.

డ్రైవ్ చేస్తున్నంత సేపు, ఒక ప్రక్క పాటలు, ఒక ప్రక్క యేమా, లోరెన్ [యేమా చెల్లి] మా స్నేహల కబుర్లు నాకు ఉదయపు వార్తల వంటివి. నిజానికి ఇక్కడి జీవితాల్లోకి ముఖద్వారం అటువంటి సమయాలే.

ఇలాగే నేను అవసరానికి వుంచుకో అంటే "లేదు, నాకు యేదైనా చేయగల పనిచ్చి డబ్బు ఇవ్వు" అని, నా చీర మీద వర్క్ చేసి గంట కింత అని మాత్రం చార్జ్ చేసి తీసుకున్న అరవై యేళ్ళ అమెరికన్ ఆండ్రియా, పార్ట్ టైమ్ జాబ్ గా బీడ్స్ దండలు, క్రిస్టల్ సెట్స్ చేసి తన చదువు ఖర్చు తల్లికి భారం కాకుండా జాగ్రత్త పడే మొరీన్ రెండో కూతురు మరియా [తను నాకు ఇలా అయితే చీప్ గా చేయొచ్చు, నీకు ఇది బాగుంటుంది వంటి సలహాలు కూడా ఇస్తుందే తప్పా, యేనాడూ నాకు ఖరీదైన నగ/వస్తువు అంటగట్టలని చూడదు], సంపాదించింది చాలు, నా రచనలతో సంపాదించాల్సిన తృప్తి ఇంకా మిగిలేవుందని ఉద్యోగానికి రాజీనామా చేసి రచనావ్యాసాంగం చేపట్టిన స్కాట్....

ఇలా మరెందరో స్వయంకృషి, స్వయంప్రతిపత్తి, తృప్తి, ప్రేమ, ప్రశాంతత, ఆచరణ, అవగాహన, అభ్యాసం వంటి ఎన్నో లక్షణాలకి సోదాహరణలుగా నాకు జీవితం పట్ల మక్కువ, స్ఫూర్తి ఇస్తారు.

ఒక కాలెండర్ మారి మరొకటి రాగానే మార్పు రావాలని కాదు. క్రొత్త అన్నది జీవితంలో యేదో ఒక నూతనత్వాన్ని తేవాలి, విజయం కలుగజేయాలి కనుక ఈ టపా నుండి మీకు ఒక చిరు సందేశం అన్నా అంది వుంటుంది అని ఆశిస్తూ...

నా వరకు "మరువం" కారణం గా ఎందరో ఆత్మ బంధువులు దక్కారు, కవిత్వం పట్ల అవగాహన, పరిజ్ఞానం వున్న వారి పరిచయభాగ్యం దక్కింది, మార్గదర్శకత్వం అందింది, తద్వారా ఈ లక్ష్యసాధనలో విజయాన్ని, నా బ్లాగు నడిపిన ఈ ఒక సంవత్సర కాలం లోనే కాసింత గుర్తింపు వచ్చిన తృప్తిని వెనకేసుకుని...

ఈ యేటికి వీడ్కోలు పలుకుతూ, వచ్చే యేటిలోకి అడుగిడుతూ, మరిన్ని ఆశయాలకి, ఆచరణకి ఆహ్వానం పలుకుతూ, మీ అందరికీ కూడా మరొక నూతన సంవత్సరం రానున్న ఈ తరుణం లో మీరు, మీ ఆత్మీయులు సంతోషపూరిత వాతావరణంలో, ప్రశాంత సమయాలు మరిన్ని గడపాలని కోరుకుంటూ... మీ నేస్తం.

వివశ గీతం

కాలం ఇంత అస్థిరమేం?
ఒక్క క్షణాన్నీ నిలవనీదు..
నీతో నడిచిన క్షణాల నీడలు
నేను వడిసి పట్టానందుకే.
రాక మానని రేపుకి
ఎపుడో బదిలీ చేసాను.

నీవున్ననేడు ఆగకున్నా,
నీవు లేని రేపు రాదందుకే.
నువు పదం చేర్చని నా పాట లేదు,
నీకు తెలియని నేనూ లేను.
నీవు లేని గతం వద్దు,
నను వదలని భయమూ వద్దు.

నీ ముద్ర వేసిన ఈ మోహం,
నే స్వరాలు కూర్చిన సంగీతం.
నీ కోసం నేను చేసిన గానం,
నిదురించే నీ హృదికి సుప్రభాతం.
నువు పిలిచిన పిలుపు,
యుగాంతం వరకు నాకు మేలుకొలుపు.

అసలు నీవెవరు, నేనెవరు,
మనదొకటే చిరునామా అయ్యాక?
నన్ను నీలో కలిపేసాక,
నా మదికేమిటీ మతిమరుపు?
మైమరపు బంధాన చిక్కిన నేను,
నీ మమతావేశపు పాశాన బందీని.

నిక్షిప్త నిధి

నిశ్శబ్దాన్ని చీల్చే కీచురాళ్ళ కవాతులు,
ఖండ ఖండాల్లోను ధ్వనించు నగారాలు.
స్తబ్దతని పెకలించే కడలి కెరటాలు,
ద్వీప ద్వీపాంతరాల్లోనూ ఎగిసే సునామీలు.
ఇవే నా మాట పదునుకి కొలమానాలు

నిశీధిలో వెలుగు జెండాలు,
రెక్కనాపక శ్రమించు మిణుగురులు.
నిదుర కన్నెరగని తేనెటీగలు,
కాంతితో నింగిపట్టు నింపేటి నక్షత్రాలు.
అవే నా వూహ వునికికి చిరునామాలు

కసాయి గుండె రగిల్చిన కారుచిచ్చు,
చీకటింట అణగారిన నూనెదీపం.
ఆర్తనాదాల నర్తించు అరాచకం,
ఆరుబయట పారేసిన దివిటీ.
నేను సైతం ధిక్కరించు అనాగరీకం

వివేకంతో వినోదానికి హెచ్చవేతలు,
నలుగురితో నాకున్న బాంధవ్యాలు.
విజ్ఞానంతో విచక్షణకి కూడికలు,
పదుగురిలో నా పలుకుబడి.
నేను సభ్యసమాజ ప్రతినిధిని.
**********************

నేను అన్నదిక్కడ మానవుడు/మానవి కి ఆపాదించాల్సిన పాత్ర.

విశ్వామిత్ర - సమాప్తం

మిత్ర వర్క్ అయ్యాక లైబ్రరీకి వెళ్తూ, గిల్డా కి కాల్ చేసింది వస్తావా అంటూ. ఇద్దరూ కలిసి వెళ్ళటం అప్పుడప్పుడూ అలవాటే. మామూలుగా మాట్లాడుతున్నా మిత్ర కళ్లవెనుక కదలాడుతున్న ఆలోచనలు గమనించిందో లేక తను యధాలాపంగా అడిగిన ప్రశ్నకి మిత్ర స్పందించిందో ..

"మీట్రా, ఈజ్ ఎవ్రీ తింగ్ ఫైన్?" గిల్డా మాటకి మిత్ర కళ్లలో నీళ్ళు చిప్పిల్లాయి. తలవూగించిందే కానీ మాట రాలేదు.

"ఓ హనీ" మిత్ర చేతి మీద తన చెయ్యి వేసి సన్నగా నొక్కి "నాట్ ష్యూర్ వాట్స్ బాదరింగ్ యు, హోప్ ఇట్స్ నాట్ టూ సీరియస్.." అర్థోక్తిగా ఆగిపోయింది గిల్డా.

"గిల్డా, ఐ బీ ఫైన్.." మిత్ర తెప్పరిల్లి సన్న గొంతుతో చెప్పింది. విశ్వతోనే చెప్పాలనుకున్న భావనలు అలా వెలికి రాకుండా ఆగాయి. అవే మాటల్లో జాలువారి అతనికి చేరితే ఇలా వుంటాయి.

- నిను చేరక నేనుండలేను

జీవించడానికే ప్రేమిద్దాం
ప్రేమించడానికే జీవిద్దాం
ఈ మార్గానే ప్రయాణించాను
బీడు భూములు దాటాను
మోడు నీడల నిలిచాను
వాగు పొంగున ఈదాను
హరిత వనాల హసితనయ్యాను

రాళ్ళు, ముళ్ళు దర్శించాను
ఫలపుష్ప రంగుల ఆదమరిచాను
రెక్కల జోరు విన్నాను
అడుగుల జాడ కన్నాను
పయనం అన్వేషణైంది
పరుగుల ఆరాటమైంది

ఎగువ దిగువ ఎంచలేదు
వేగం పెంచటమాపలేదు
ఊర్ధ్వముఖమైంది చలనం
వూపిరి సలపని గమనం
కాలం లెక్కలు విడిచాను
చివరి మజిలి చేరాను
శిఖరాగ్రం కాంచాను

పుడమి గుండె పగులువారినా,
ఎదలోతుల ప్రేమ చెలమ పదిలమవదా!
గరికకాడ వెన్ను విరుచుకు నింగికెగిసినట్లు,
నాలోని నీకై నా నిరంతరాన్వేషణ సాగదా!
నీవున్న తావుల జాడకై మరిన్ని బీటలై విచ్చనా,
ఆ నడుమ పాయలై నిను చేరగ నాప్రేమసాగరాన్ని చీల్చనా!

ఆమె భావుకతని ఆరాదించే అతనికి తన భాష్యాలు సగమే అర్థమౌతాయని ఆమెకి తెలుసు. ఇంగ్లీష్ ఎక్కువగా వాడే అతనికి కవితల పట్ల అభిలాష, మక్కువ ఆమె పట్ల ప్రేమ కలిగించినవే.
********* ********* ********* ********* *********

తలస్నానం చేసిన జుట్టుకి చుట్టుకున్న టవల్, ఒక చేతిలో విశ్వ ఇచ్చిన ప్రేమలేఖల (వంటి) పుస్తకం. విశ్వ ఆ సాయంత్రం వచ్చినపుడు తలుపు తీసిన మిత్ర వాలకమది. విశ్వకి కొంచం ఆశ్చర్యం వేసింది.

సాధారణం గా మిత్ర శనివారం ఉదయాన్నే తలస్నానం చేస్తుంది. నియమానుసారం జీవితం గడిపే ఆమె గురించి అతనికి తెలిసిన విషయాల్లో అదొకటి.


"మిత్ర, కాసేపలా బయట వాక్ చేసివద్దామా?" అతనడిగిన ప్రశ్నకి తల అడ్డంగా వూగించి "విశ్వ నాకిక్కడే వుండాలని వుంది." అంది.

విశ్వకి యేదో మార్పు తోస్తుంది. మిత్ర వాకింగ్ రాననటం చాలా అరుదు.

దాదాపు నాల్రోజులుగా కాల్ కూడా చేయలేదు. తను లాండ్ లైన్ కి చేస్తే అన్సరర్ కి వెళ్తుంది. సెల్ ఫోన్ అంతే వాయిస్ మెసేజ్ వస్తుంది. బిజీగా వున్నపుడు కూడా తనలా వుండదు.

సోఫాలో కూర్చున్న మిత్ర వళ్ళో తలపెట్టుకుని పడుకున్న విశ్వ అలాగే ఓ పది నిమిషాల వరకు మాట్లాడకుండానే వుండిపోయాడు.

"మిత్ర, ఐ యాం సారీ." నెమ్మదిగా అన్నాడు.

"కన్నా ఇపుడా మాట ఎందుకు?" మిత్ర అనునయంగా అడిగింది.

"మిత్ర, నీ మౌనం నన్ను నిలదీస్తున్నట్లుగా వుంది. నా పరంగా యేదో జరిగింది కదూ?" అతనడిగిన తీరుకి మిత్రలో చిన్న కదలిక.

విశ్వ మాట పొడిగించాడు, "అమ్మలు, ఈ రోజు ఉదయం డ్రైవ్ చేస్తూ రేడియోలో విన్నానిది. ప్రేమించటానికే కాదు, ప్రేమని స్వీకరించటానికి మనసుండాలట. నాకు..నాకు అది లేదేమో, నీ అంతగా నన్నెవరూ ప్రేమించలేదు. నాకు అందుకే అందులోని లోతు తెలియటం లేదా? నేను నీ ప్రేమని రెసిప్రొకేట్ చేయలేకపోయానా? నిన్ను కోల్పోతున్నానా?"

అతనడిగిన తీరుకి మిత్ర కి ఆ క్షణంలో అతను ఆటబొమ్మ విరగ్గొట్టుకున్న పసిపాపలా తోచాడు.


నెమ్మదిగా అతన్ని పైకి జరిపి, అతని మెడ చుట్టూ చేతులు వేసి మొహం అతని కుడి భుజం మీద ఆన్చి "కన్నా అలిసిపోయాను. తెలిసిన నీలో నాకే తెలియని మరేదో వెదుకులాడుతూ అలిసిపోయాను." నెమ్మదిగా అంది.

"నువ్వు బాగా అనలైజ్ చేస్తావు కదా. చెప్పు ఎందుకు నాలో ఈ సంఘర్షణ?" అడిగింది.

"అమ్మలు, వచ్చేముందు మన గురించే ఆలోచిస్తూ ఒక ఈ మెయిల్ పంపాను చూడు. నీ కళ్ళలోకి చూస్తూ చెప్పలేను." అన్నాడు.

Just like the way you look for messages from god for any occurrence in your life, not really similarly I got a tendency to analyze things. Our journey has brought us closer. Just felt like trying to analyze the journey.

Fate has brought us together. We both had roles in that, but I played major role in getting you from the shell you locked your self in. You resisted it for a long time.

After all that, some thing has touched your nerves, changed you, you opened yourself, you experienced kaleidoscope of emotions. Physical feelings were also thrown into mix. The ones you fought the most.


As you were going through all this, introspection started on how did it happen? who was responsible? how is this change possible? what happend to all my control? why am I feeling like I am in a spell?

ఇలా సాగిన ఆ ఈ మెయిల్ లో అతను తన మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నట్లుగా అనిపించింది మిత్రకి. ఆమె అతని పట్ల యేర్పరుచుకున్న సాప్ ఫీలింగ్స్ కూడ వివరణ వుంది. ఆ భావనలతో ఆమె పడుతున్న వేదన త్రుంచాలన్న అతని ఆరాటముంది. జీవితం పరిచిన పరుధుల చిత్రీకరణ వుంది. తమ పయనం సాగాల్సిన వైనం వుంది. చివర పేరా చదువుతూ...

You have a willing partner who wants to keep
you happy, content and relaxed, enjoying each moment of life to the fullest for rest of your life.

It is on me to protect our relation, I stand by that. Each episode we go through is cementing our relation further.

From the reasons you are against the marriage, I see physical is one among them. I know that your love is beyond physical. I was absolutely sure of that.

I have told many times that is what I think of you. Physical factor is one dimension of whole thing, as we have not attained that, we will be restless until then. In a man-woman relation, that is the last bastion and it takes a lot to happen between their souls, before they offer themselves to the other person. We are reaching that stage.


ఆ పంక్తుల దగ్గర ఆగిపోయిన మిత్ర నెమ్మదిగా లేచి వంటగదిలోకి నడిచి గ్లాసులోకి నీళ్ళు తీసుకుని చిన్నగా సిప్ చేస్తూ నిలుచుంది. ఇంక అతని మనసు విప్పి చూడాలనిపించలేదు. తన మనసే మరొక కోణంలో నుంచి మరొక భాష్యంలో చదివినట్లుగా వుంది.

వెనగ్గా వచ్చిన విశ్వ వెనక నుండి ఆమెని చేతులతో చుట్టేసాడు. గ్లాసు ప్రక్కన పెట్టి తల వెనగ్గా వాల్చి అతని గుండె లయ వినపడేంత దగ్గరగా జరిగి పూర్తిగా అతనికి ఆనుకుని "కన్నా, ఇవి నా మాటలు కాదు. ఈ మధ్య ఒక కొలీగ్ పెళ్ళి శుభలేఖలో చదివి గుర్తుంచుకున్నవి..

Two lives, two hearts,
joined together in Friendship
united Forever in love

Neither of us can honestly say that we were looking for each other,
But it happened.....

We've known each other by CHANCE, became friends by CHOICE.....
still friends by DECISION....

And here were are.... two lovers by SOUL, Just happy being together,

Not knowing where to go, But very sure, that wherever it is.....
We'll be going together "

మంద్రస్వరం తో యేదో లోకంలో వున్నట్లుగా అంటున్న మిత్ర మాటలు పెళ్ళి మంత్రాల్లా తోస్తున్నాయి.

"నాకు నీ స్పర్శ కావాలి, నీ ఒడి కావాలి, నీ గుండె చప్పుడు జోల కావాలి. ఇపుడు నా మనసు ఆకాశగంగ అంత అమృతంగా, తనువు పాలధార అంత మధురంగా మారినట్లుగా వుంది . నాకు కోరికలు చాలా తక్కువ, వున్నా అవి ఎవరికీ అర్థం కావు. ఇప్పుడు త్రివేణి సంగమంలో స్నానంచేసి, కళ్యాణ శ్రీనివాసుని సన్నిధిలో, వెదురు పుష్పం మీద పవళించి, నీలో కరగాలని వుంది. నువ్వు, నా మనసుకి అధిపతి, తనువుకి సర్వాధికారివి, నా ప్రేమకి పిపాసివి, నా చూపుకి బానిసవీ అయిన ఈ ఘడియల్లో నేను నీ పూజకి విచ్చుకుంటున్న నాగమల్లిని.." ఆమె పెదాలని మూసేస్తున్నంత దగ్గరగా విశ్వ పెదాలు.

"అమ్మలు, ఇంక చాలు." విశ్వ మాటలు అతని అధరాలు తెలిపాయి.

కాసేపటికి ఇండియా కాల్ చేసి మిత్ర తాతయ్య గారికి, విశ్వ తండ్రికి తమ నిర్ణయం తెలిపాక ఇద్దరి లో తెలియని ఉద్వేగం. మిత్ర కి మొదటి నుండి అట్టహాసంగా పెళ్ళి చేసుకోవాలని లేదు. తాతగారికి తన మనసులో మాట చెప్పింది. ఇక్కడే గుడిలో పెళ్ళి చేసుకోవాలనున్నదన్న ఆమె అభీష్టాన్ని ఆయన కాదలేదు. విశ్వ ఇంటి నుండీ యే అభ్యంతరం రాలేదు. త్వరలో ఇద్దరం కలిసి వస్తామని చెప్పారు.

తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నది చాలా తక్కువ. తమ విభిన్న మనస్తత్వాలు, పరస్పరావగాహన, ప్రేమ, ఆకర్షణ ఇలా ఒక్కొక్క పరీక్షని తట్టుకుని ఒకటి కానున్న ఆ శుభతరుణం ఇద్దరికీ చాలా మధురంగా తోస్తుంది.

ఇద్దరిలోనూ ఒకరి కొరకు తమలో తెలియకుండానే మార్పు సంభవించింది. అది ప్రేమ చేసిన గారడీ. ఒకరినొకరు మార్చే ప్రయత్నం చేయకూడదని ప్రమాణం చేసుకున్న వారిరువురు తమకి తెలియకనే చేసుకుంటున్న ఆ సర్దుబాటు వారి జీవితాలకి ఆయువుపట్టు. ఒకరి తప్పిదాన్ని ఒకరు క్షమతో సరిదిద్దుకోనున్న ఆ రాజీ మనసు విజయానికి ప్రతీక. అక్కడ మ్రోగుతున్న ఆ మంగళ వాయిద్యాలు వారి హృదయాల చిరు స్పందనల సవ్వళ్ళే.


********* ********* ********* ********* *********

ఆఫీసులో టీంకి వార్త తెలిపి ఒక వారం సెలవు తీసుకున్నారిద్దరు.

అనుకున్నట్లుగానే గుడిలో పెళ్ళి చేసుకుని తిరిగి వచ్చారు.

ఒకరిలో ఒకరు ఒదిగి పోవటానికి, ఒకరినొకరికి అర్పించుకోవటానికి, ఒకరిలోనొకరిని కలిపేసుకోవటానికి ఆ మధుర క్షణాలకోసం వేచి వున్న వారి సమాగమం, దేవుడు నిర్ణయించిన సమయంలో జరుగబోతున్న ఆ శోభనం వారి అనురాగ సంగమంలో శ్రీకారం చుట్టుకున్న తొలి పుట.

మరోసారి తలారా స్నానం చేసి, తెలియని బిడియపాటుతో తడబడుతూ చుట్టుకున్న చీరలో, స్వాతిముత్యం లా ఎదుటికొచ్చి నిలబడిన మిత్ర విశ్వ కౌగిలిలో బందీ అయిపోయింది. అనుభూతులు కలతోడుకుంటున్న మనసు మూటగట్టుకున్న ఆ ప్రణయపు పరిమళాలు..

"ఈ రేయి నా ఉల్లం ఝల్లుమంది, ఒడలు వొణికింది, తనువు తీపిగాట్లతో తెల్లారేవరకు తబ్బిబ్బైంది. చెమరింపుల్లో తృళ్ళిపడింది, అలవోక నవ్వుల్లో మునకలేసింది. నునుసిగ్గు వరదలో మునిగిపోయింది. విల్లో, వీణో ఆ రెండూ కాని మరేదో నా వంటి రూపిపుడు.

గుండె జారిపోయింది, కాని తన సడి దుంధుబి వలే, డమరుకం వలే ఇంకా వినిపిస్తూనేవుంది. వలువలు వంటిపై వుండమంటున్నాయి, వడుపుగా పక్కకి తొలుగుతున్నాయి. ఎంత చిక్కబట్టుకున్నా ప్రాణం నీ దరికే పరుగులు తీస్తోంది. ఏదారిన వెళ్ళను? నా వాటిని తిరిగి పోగేసుకోను? ప్రకృతంతా ఈ నీ స్త్రీలోనే ఆవిష్కరించినట్లుంది. నిన్ను వూహల్లో ఎన్నో రూపాల్లో నిలిపాను, నీవు ఇంకా క్రొత్తగానే వున్నావు.

కన్నా, ఒక్కసారి ఆ గుట్టు విప్పేయనీ నువ్వూ నిజంగా నల్లనయ్యవేనని, అందులోనే నీ అందం దాగుందని. వురుముకి బెదిరే నన్ను చుట్టూ చేయి వేసి పొదివిపట్టే వేళ సిరిగంధపు చెట్టుని చుట్టిన నల్ల త్రాచు కాదా ఆ కరం. అది అందిన నాది కాదా వరం.

గోరువెచ్చని పొద్దులో వున్న వెచ్చదనం నను హత్తుకున్న నీ మేనిదా క్షణం. ఆ అభయంలో ఎంత భరోసా, జగద్విజేతకైనా సాధ్యమా నా ధీమా?

నిదుర రాని నిశీధుల్లో, నిట్టూర్పు వేకువల్లో, నిలదీసే ఏకాంతాల్లో, నిలవరించలేని వేదనలో నీకై లేఖలు పంపగా పదాలు ఇమ్మని ప్రతి సడిని వేడాను. ప్రేమికనై యాగాలు చేసాను. దక్కిన నిన్నే తిరిగి తిరిగి వరంగా కోరుకున్నాను. నీ ఒక్కడి కోసం నేను కోటి హృదయ గీతాలు వ్రాసాను. నన్నే శ్రోతని చేసుకుని నీకై గానం చేసాను, సాధన వలని ప్రేమ ఆలాపన ఇది.

నా కోసం కవితలల్లి, నా కన్నీట నీవూ కరిగి,నీ బాణిలో కథలల్లి,
నా నవ్వులో నీవూ కలిసి,నా కవితకి స్ఫూర్తివై,
నా అనుభూతిలో నీవూ తడిసి,నీ వాణిలో తేనెలునింపి,
నా బాధలో నీవూ గడిపి,నా తోడువై మెసిలి,
నా నిట్టూర్పులో నీవూ ఎగిసి,నీ కౌగిలితో కమ్మేసి,
నా వొడి నీవూ దోచేసి,నా ఉనికి నాకిక వద్దని,
నీ వినా నే మనలేననిపించిన నా ఆత్మబంధువా,
నీ నా బేధమిక లేనేలేదని మనవైక్యమైన ఆత్మలని నేడు చూపవా?
ఆత్మసంగమం అయిన అస్థిత్వంలో తనువు కలయిక అనివార్యమని, ప్రియా,
ఆ పడుగుపేకల మధురిమల మేళవింపే నాకు నీవిచ్చే కానుకని నిరూపించవా?


నీ చెంత నేను కలువల నవ్వుని నా సరసన నీవు నెలరాజువి. మన సావాసం రాగ భరితం మన కలయిక భువికి దివికీ నిత్య వాసంతశోభ.

నిన్నటి గూట్లో పదిలంగా దాగిన గువ్వ నా మది.
రేపటి వలలోకి కలల కడలిలోకి లాగినవాడివి నీవె కదా!
మన వేదం మన సాంగత్యం, మన పయనం మరో ప్రేమ ప్రస్థానం.
మనమిరువురం బహుదూరపు బాటసారులం, సవాళ్ళకొగ్గని సహవాసులం."

విశ్వ వక్షస్థలం మీద తృప్తిగా నిదురపోయిన మిత్ర మర్నాడు ఉదయం కాస్త అలాస్యంగా లేచేసరికి విశ్వ లేవటం, ముందు గదిలో కూర్చుని వుండటం కనపడింది. స్నానం చేసి అలవాటుగా మొలకలు తీసుకోబోయి, మనసు మార్చుకుని ఒక కప్పులో కాఫీ కలుపుకుని "విశ్వ నువ్వేమి తాగుతావు?" అని అడిగింది. విశ్వకి ఉదయాన్నే కాఫీ అలవాటు.

"నీ అధరామృతం" అన్న ఆ సూటి సమాధానానికి చిరుసిగ్గు కమ్మేసి "పో దొంగమొహం నాకు తెలియని కళలు చాలా వున్నాయి నీలో." మురిపెంగా అంటూ అతన్నానుకుని కూర్చుని యేమిటి వ్రాస్తున్నాడా అని కుతూహలంగా చూసింది.

"ఓ అందాల రాణి
నా వలపుల బోణీ
ఓ సుగుణాలా రాణి
నా హృదయపు అలివేణి
నీ మనసు వెన్న
నీ సాంగత్యం నా అదృష్టం
నీతో గడిపిన సమయం నాకు మృదుమధురం
జన్మ జన్మల మన అనుబంధం అపురూపం!"

చదవటం పూర్తి చేసి, విశ్వ బుగ్గమీద మీటి నవ్విన మిత్ర నవ్వు తెరతెరలుగా, పూల జల్లులు కురిసినట్లుగా విశ్వకి శీతల పవనాల మాదిరి తాకింది. అదే అతని తొలి ఆశుకవిత.

విశ్వ,మిత్ర - వారి జీవితాలే వారి పయనం. ఒకరి ప్రేమ అన్వేషణ ఆఖరి మజిలీ మరొకరు. గలగల గోదారి మిత్రవింద. తనని తాను ఆమె ప్రేమలో ఆవిష్కరించుకున్న మౌనమూర్తి విశ్వనాథ్. విశ్వామిత్ర ప్రేమైక జీవన ప్రతినిధులు.

మనం ఒకరికొకరం వరాలం.
తరతరాల ప్రేమ చరిత్ర ఇది.
మనం మనకు అపురూపాలం.
ఇహపరాల ఆత్మ సంయోగమిది.

అని జీవనగీతం పఠిస్తున్న ప్రేమికులు.

[సమాప్తం]

అరచేతి రేఖలు అన్నీ చెబుతాయా?

అద్దమంటి చెక్కిళ్ళు,
ఆదమరిచి నిదురబోవు కళ్ళు,
అమ్మానాన్నల అపురూప చిన్నారి,
విరబూసిన పువ్వంటి పొన్నారి.

అద్దం ఎరుగని కళ్ళు,
అలుపెరగకూడని వొళ్ళు,
అమ్మానాన్నలెరుగని అభాగ్యురాలు,
విధిత్రోసి పారవైచిన అనామకురాలు.

పొన్నారికి పని తెలియదు,
అనామికకి పని తప్పదు,
ఇద్దరికీ పైనున్నది ఒకటే కప్పు,
ఎన్ని యుగాలుగా జరుగుతున్నదీ తప్పు?

చేయి చేయి కొలత ఒకటే,
అర జాచిన ముంజేతి తీరు ఒకటే,
గీతల్లోనే రాతలు ముందే తెలుసుంటే,
గీతాసారం తెలిసినవారికైనా కలగదా కనువిప్పు?

*** *** *** *** *** *** *** *** *** ***
ప్చ్, పాతదే చిత్రం కానీ చిన్ని చిన్ని చేతులతో పని చేసే పనిపిల్లల దైన్య స్థితి నాకెప్పుడూ చాలా మనస్తాపం కలిగిస్తుంది.

గాలి జీవితం - జీవితంలో గాలి?

ఎండుటాకుల కసువు వూడ్చి
మంచునీళ్ల కళ్ళాపు జల్లి
ఎండా నీడల ముగ్గులేస్తున్న
కట్టు బానిస గాలి నోట ఈలపాట
'మళ్ళీ తెల్లారింది మాయ లోకమా
నాకు మాత్రం తప్పకున్నదీ వెట్టి చాకిరీ.'

అంతటితో సరా అకటా ఒకటా రెండా వెతలు
కొమ్మల సైగల అర్థాలు వెదకాలి
పూల పదాలు ప్రేయసి కురులకి చెప్పాలి
ఆమె పెదవుల పలుకులు అతనికి చేర్చాలి
ఈ గాల్లోనే ఏదో మార్పు అనిపించాలి

ఇక్కడితో ముగిసేనా ఆ ముచ్చటలు
వీడ్కోలు వూపిరిలో వేడికి తడవాలి
ఎడబాటు అలజడిలో కంటితడిలో వెచ్చనవ్వాలి
ఎదురుచూపు మధురిమలో ఎద గానమవ్వాలి
సందేహాలు తీర్చాలి, సందేశాలు తీర్చిదిద్దాలి

జీవితాల ఋతువుల్లో కాలం గడపాలి
కాలపు మార్పుల్లో తన పని తాను చేయాలి
నిండువేసవి గాలి వీచాలి, జడివాన హోరుగాలీ కావాలి
ఎడారి మంచు తూఫాను కావాలి, నడిరేయి ఉప్పెనా కావాలి
గాలికెన్నో గాలిపనులు, మనిషి జీవితానా, జీవితంలోనూ ...

విశ్వామిత్ర-14

కాలగమనం ఒకే తీరుగా వున్నా జీవితంలో సంభవించే మార్పులు, సంఘటనలు వేగం అన్న లక్షణాన్ని కలుపుతాయేమో! నానమ్మ అస్వస్థతతో అనుకోని ప్రయాణంగా ఇండియాకి వెళ్ళటం, అదే ఆవిడ ఆఖరు చూపు కావటం, మిత్ర వెళ్ళిన వారానికే ఆవిడ చనిపోవటం అంతా కలా, నిజమా అన్నట్లుగానే జరిగిపోయాయి.

ఎంతటి మనిషినైనా కుదిపేసేది మరణం. మనసులోని జ్ఞాపకాల కన్నా మరింకేమీ అవసరం లేదు, అవి సజీవంగానే వుంటాయి ఎప్పటికీను. అయినా ఏమిటో బాహ్యరూపాన లేరు అన్నది, ఇక మన మధ్య మెసలరు అన్నది జీర్ణించుకోవటం కష్టం. తిరిగి వచ్చిందే కానీ మిత్ర మనిషి మనిషిగా లేదు. ఊహ తెలిసాక ప్రియమైన వ్యక్తిని కోల్పోవటం ఇదే.

దిగులు గూడు కట్టుకున్న మనసు పదే పదే పరధ్యాసలోకి నెట్టివేస్తుంది. గుల్డెన్ సానుభూతి తెలిపినా ఉద్యోగరీత్యా భాద్యత తప్పదు కదా. విశ్వ కూడా తీరిక లేనంతగా పనిలో కూరుకుపోయాడు. అందుకే అతన్ని మునుపటిలా కలవటానికి వీలవటం లేదు.

*************************************************

ఓ ఆదివారం ఉదయం అనాసక్తిగానే తిరిగి వచ్చి అలానే వదిలేసిన సూట్ కేస్ బయటకి తీసి సర్దుదామని మొదలుపెట్టింది. నానమ్మ గుర్తుగా తాతగారు ఇచ్చిన వస్తువులున్న చిన్న వెండి డబ్బా తీసింది.

ఆవిడ వాడుకున్న కాటుక, కుంకుమ భరిణె, మంగళ సూత్రాలు, నల్లపూసలు, ముత్యం, పగడం (చిన్నప్పుడు ఆటల్లో అవి నాకు కావాలి అని మారం చేసినప్పుడు నీకు పెద్దయ్యాక ఇస్తాను అనేవారావిడ), దుద్దులు, గాజులు, ఓ చీర - ఇలా ఒకటొకటి తీస్తుంటే లక్షీదేవమ్మ గారు కళ్ళెదుట నిలిచిన భావన.

కంటి నీటి చెమరింఫుకి మసగ్గా కనపడుతున్న ముత్యం, పగడం గుప్పిట్లో పెట్టుకుని వచ్చేసే ముందు తాతగారి మాటలు మననం చేసుకుంది.

"మిత్ర, చాలాసార్లు చెప్పానమ్మా. తోడు లేనిదే బ్రతలేమని కాదు, ఆ బ్రతుకున అర్థం వచ్చేది మనకి తోడునీడగా సాగే మనిషుంటేనే. మీ నానమ్మ నాతో ఇన్నేళ్ళ సావాసం లో తను లేకపోతే నేనెలావుంటాను అని ఆలోచించలేదు. ఈ క్షణం ఆ వెరపు వస్తోంది. తనున్నంత కాలం గడిచిన ప్రతి ఘటన మాదిగానే సాగింది. ఇకపై నా జీవితం తనున్నా లేకున్నా అలాగే గడుస్తుంది. నువ్వు కూడా త్వరలో పెళ్ళి చేసుకుంటే నానమ్మ కోరిక తీరుతుంది. విశ్వని ఇష్టపడుతున్నావని తెలిసింది. కీడు జరిగిన ఇంట శుభకార్యం మంచిది అంటారు. ఆలోచించుకుని చెప్పు అమ్మలు." అన్నారు.

ఏ కష్టాన్నైనా తట్టుకోగల మానసిక స్థితి వయసుతోనో, పరిణితితోనో వస్తుందేమో. మౌనంగానే మాధవయ్య గారు దుఃఖాన్ని దిగమింగుకుని కార్యక్రమాలన్నీ జరిపించారు.

సురేంద్ర, కస్తూరి, విష్ణు, అతని తల్లి, నవీ తల్లి, అనంత ఇలా అంతా అక్కడికి వెళ్ళాక ఇదే ధోరణిలో పడకు, జరామరణాలు మన చేతిలోవి కాదు. చక్కని జీవితం గడిపి, సునాయాస మరణం పొందిన ఆవిడ అదృష్టవంతురాలు అని ఓదార్చి, ఒంటరిగా దిగులుపడకు నలుగురిలో వుండు అని మరి మరి చెప్పి పంపారు.

విశ్వ కూడా వీలైనంత కలుస్తూనే వున్నాడు.

మరో మూణ్ణెల్లు గడిచిపోయాయి. మిత్ర మాటల్లో తాతగారన్న మాటలతనికి ఓ సారి చెప్పింది. మౌనం గా విన్నాడు. పెళ్ళి విషయం లో మిత్రకి కలిగిన విముఖతకి గల కారణాలు మునుపే చెప్పి వుండటంతో ఆ విషయమై యే వత్తిడీ తేకూడదనే అతని నిర్ణయం.

"మిత్ర, మన విషయమై తీసుకునే యే నిర్ణయమైనా తిరిగి నువ్వు రిగ్రెట్ అవకూడదు. నీ కొరకు ఎంతకాలమైనా నేను వేచివుంటాను. ఆ మధుర క్షణాలకోసం అవసరమైతే జీవితకాలమంతా వేచివుంటా." అనునయంగానే అన్నా అతని మాటల్లోని నిశ్చలత మనసుకి సాంత్వననిచ్చింది.

*************************************************

మనసు పెళ్ళి అన్న ధోరణిలోకి వెళ్ళాక కలగాపులగంగా ఏవేవో ఆలోచనలు. నవీకి కాల్ చేసి చాలా సేపు మాట్లాడుతూనే వుండిపోయింది. ఒకప్పుడు వివాహంలోని అసంతృప్తితో మిత్ర వొడిలో పడుకుని చిన్నపిల్లలా కన్నీరొలికించిన ఒకప్పటి నవీ, ఇప్పుడు ఎంతో సమన్వయంగా మాట్లాడి మిత్ర మనసుకి నిర్ణయం పట్ల స్పష్టత చేకూర్చింది.

మనసు చిత్రమైనది. అంత వరకు పెళ్ళి అనగానే సందేహాలు కమ్మి వెనక్కులాగే అదే ఇప్పుడు ఎప్పెడెప్పుడు విశ్వాకి చెప్పేయాలా అని తొందరిస్తోంది.

మన మనసు స్వేఛ్ఛావిహంగం. మనం దాని నీడలం. ఒక్కోసారి దానికన్నా సాగి పెద్దగా, ఒక్కోసారి అసలు లేనట్లే మనని మనం కనుమాయ చేసుకుంటూ, మరోసారి సాక్షాత్కారం చేసుకుంటూ సాగుతామేమో.

మిత్ర తన అస్థిత్వాన్ని విడిచి విశ్వనే తనుగా మార్చుకున్న ఆ క్షణం ఆమె జీవితంలో పెను మార్పులు సంభవించటానికి నాందీ అని వూహించలేకపోయింది. తనది అన్నది కోల్పోవటం అది పరాధీనం కావటం కూడా శాపమా? కాలం మౌనంగా వీక్షిస్తున్న ఆ పరిణామం విశ్వామిత్రుల జీవితాలపై ప్రభావం చూపటానికి సిద్దపడుతూవుంది.

*************************************************

మిత్ర విశ్వాకి తన మనసులోని మాట "మన బంధాన్ని శాశ్వతం చేసుకుందామా, కన్నా?" అని వెల్లడి చేయటం ఆ వారాంతం లో వచ్చిన ఆదివారం ఉదయాన జరిగిపోయింది.

విశ్వ ఆ రాత్రి చదివిన డైరీలో మిత్రతో తొలి పరిచయం నాటి విషయాలు, అతని అలవాట్లలో తెలియకుండా వచ్చిన మార్పు, ఏ పని ఒక ప్రణాలికతో జరపని అతను మిత్ర కోసం ఆమె కి సమీపంగా వుండటానికని, ఆమె మనసుని గెలవటానికి చేసిన సాధన, ప్రయత్నాలు, అతని ఇంట్రావర్ట్ నేచర్, దానినధిగమించి ఆమెతో మనసు వెల్లడి చేయగల స్థితికి చేరటం, క్రమేణా జీవితం పట్ల కలుగుతున్న నిర్దిష్ట భావాలు, అతను మొదలు పెట్టిన సోషల్ సర్వీస్ సంస్థ వివరాలు, నేర్చుకున్నది తండ్రి ప్రభావం చేతనైనా చిత్రలేఖనానికి ప్రేరణ ఆమె నుండి ఎలా వచ్చిందీ, మారథాన్ రన్, భవిష్యత్తులో మిత్రతో కలిసి చేయాలనుకుంటున్న సహజీవనం పట్ల కలలు, ఇలా ఎన్నో వ్రాసున్నాయి.

నిజానికి తను మిత్రతో పది మాటలు చెప్పాలనుకుంటే ఒకమాట బయటకి చెప్పానేమో అనిపించింది అవన్నీ చదువుకుంటుంటే. తన స్వంతమైన ఆమెకి ఇక ఈ వివరాలు అవసరమా అని కాస్త ఈజీ ధోరణిలో వదిలేసాడు.

అదే సున్నితమైన ఆమె మనసులో మరొక ఆశనిపాతానికి ఆజ్యం పోస్తుందనీ అతడూహించలేదు. మిత్రకి ఆమె పుట్టినరోజునాడిచ్చిన భావాల సంపుటి కన్నా, అతను ఈ డైరీలో వ్రాసుకున్న కొన్ని విషయాలైనా ఆమెకి తెలిపివుంటే అతని జీవితంలో తన పాత్ర, పాళ్ళు ఆమెకి అవగతమయ్యేవి. అతని పట్ల తనవి వూహలే కాదు వాస్తవ ఘటనలు వున్నాయని ఆమెకి తెలిసేది. ఒక్క అపోహ అయినా తొలిగేది. ఎందుకంటే ఆ పుస్తకంలో ప్రేమ పూరితమైన పలుకులు ఆమెకి ఆశ్చర్యానుభూతులని మిగిల్చినా నిజ జీవితానుభవాల గాఢప్రభావం ఇంకాస్త కూరిమి కూర్చేదేమో ఆ బంధానికి.

*************************************************

వాస్తవం ఋతువుల వోలే జీవితాన్ని తాకిపోతుందెపుడూను. కాలక్రమం లోని ఈ సంభవాలకి ఎవరూ అతీతులు కాలేరేమో.

సంతసం వసంతంలా ఇట్టేవచ్చి అట్టే జారుకుంటుంది.
మనస్తాపం గ్రీష్మంలా కాల్చేస్తుంది.
దుఃఖం వర్ష ఋతువులా గుండె లోగిల్ని వరద పాల్చేస్తుంది.
ఆత్మ విమర్శకి, ఆశటూపిరులకి మారుపేర్లు హేమంత, శరద్రుతువులు.
ఆత్మ సాక్షాత్కారం శిశిరంలా మనసు లోపలి తప్పుడు భావనలు రాల్చేస్తుంది.

విశ్వామిత్రుల జీవితంలో గ్రీష్మం అరుదెంచనుంది.

*************************************************

మునుపటి కంపనీలో విశ్వ స్థానంలో ఇప్పుడున్న శివ రెండ్రోజుల క్రొత్త ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తాలూకు మీటింగ్స్ కని వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ముగ్గురూ డిన్నర్ కి కలిసి వెళ్ళారు. అతనితో అంతకు క్రితం వున్న అనుభవం రీత్యా మిత్ర మాటలు ఎక్కువగా పెంచలేదు. అడిగిన ప్రశ్నలకి ముక్తసరిగా సమాధానం ఇస్తూ కూర్చుంది.

"ఊ మిత్ర మొత్తానికి విశ్వని చూజ్ చేసుకున్నారన్నమాట మీ స్వయంవరంలో ..." అదేదో జోక్ లా నవ్వేస్తూ అన్నాడు శివ.

కాస్త మొహం చిట్లించి చూసి వూరుకుంది. విశ్వ ఎప్పటిమాదిరే యే భావమూ గోచరించని మొహంతో కాస్త చిరునవ్వుతో చూస్తున్నాడు.

శివ అక్కడితో ఆపలేదు.

"విశ్వ, నీకన్నా ముందు నేను మిత్రకి ప్రపోజ్ చేసాను." అన్నాడు.

ఇక అతన్ని ఆపటం అనివార్యమనిపించి "శివ, మన పరిచయం అంతవరకు వెళ్ళలేదనుకుంటాను. మీరు ప్రపోజల్ అని ప్రస్తావిస్తున్నది ఒక కాజువల్ సంభాషణ మాత్రమే." అంది చురుగ్గా అతని వంక చూస్తూ.

ఆ తర్వాత జరిగిన రెండు మూడు నిమిషాల చిన్నపాటి వాదన మిళితమైన ఆ సంభాషణని విశ్వ గమనించటమే కానీ పాలుపంచుకోలేదు.

శివ కాస్త పరుషమైన మాట అనేసాడు. ఒకచోట కలిసివున్న ఏ పెళ్ళి కాని ఆడ మగైనా ప్రేమ పేరున అలాగే దగ్గరౌతారని తేలిగ్గా అనేసాడు. ఇక అతనితో అనవసర వాదన పెంచటం ఎందుకని ఆపేసింది.

అయినా మిత్ర కి లోలోపల సంఘర్షణ. విశ్వ మౌనం మొదటిసారి బాధించింది. ప్రక్కనే వుండి తనని సమర్ధిస్తూ ఒక్కమాట అనలేదే అని. ఇంతకు మునుపు ఆశించని ఆ చర్య ఇపుడెందుకు కోరుకుంటున్నది తను?

మనసలా కకావికలంగా వుండగానే ఇంటికి చేరారు. మిత్ర ఎరుపెక్కిన మొహం చూసి విశ్వ కాస్త తటపటాయించి లోపలికి వచ్చాడు.

సోఫాలో మౌనం గా కూర్చునుండిపోయింది. లోపలికి వెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి అందించాడు.

"విశ్వ! శివ అంత కుసంస్కారంగా మాట్లాడుతుంటే ఒక్కటంటే ఒక్కసారైనా జవాబీయలేదేం? నాకంటూ ఓ స్థానం ఇవ్వవా?" ఎరుపెక్కిన కళ్ళు, ముక్కుతో మాట లో బాధతో కాస్త పూడుకుపోతున్న గొంతు ద్వనించింది.

"అమ్మలు, మన సంబంధం ఇంతవరకు వస్తుందని మనమెప్పుడు అనుకోలేదు. మనమిద్దరం ఏమి అనుకుంటే అదే అవుతుంది, ఎలా అనుకుంటే అలా అవుతుంది. మనిద్దరకీ సంబందించి, నీకు నేను, నాకు నువ్వు జవాబుదారీ అంతే. నేను నీ వాడిని, నువ్వు నా దానివి , నా స్వంతం. నా జీవితంలో నీకు ఎప్పటికీ ప్రముఖ స్థానం ఉంటుంది. " అతని గొంతులో అదే నిదానం, మృదుత్వం.

దిగమ్రింగుతూ వచ్చిన బాధ ఒక్కసారిగా పెల్లుబుకింది. అతని మీద వాలి కన్నీరు మున్నీరైపోయింది. "ఈ లోకం ఇంత నిర్దయగా ఎందుకు ఆలోచిస్తుంది. ప్రేమని అలా ఎలా పలుచన చేస్తారు. ..." వెక్కిళ్ళ మధ్య అలా మాట్లాడుతూనేవుంది.

అలా పొదివి పట్టుకుని వెన్ను మీద నిమురుతూ వింటూ వుండిపోయాడు.

"ఇలా సెన్సిటివ్ గా ఆలోచిస్తే ఎలా చెప్పు?" అడిగాడు.

"మన చేతుల్లో ఏమీ లేదు కదా. నిమిత్తమాత్రులం. ఇవాళ కలిసున్నాము. రేపు ఏ కారణంగా నైనా మనం విడిపోతే నా మీద ఇంతగా నీవు ఆధారపడకూడదు. ప్రేమ అన్న భావనని అందరిలోనూ ఒకే తీరుగ ఆశించకూడదు. " విశ్వ మాటలు వింటుందే కానీ అర్థం చేసుకోవటం లోనే ఇద్దరి నడుమ చిన్న అంతరం వచ్చింది.

మిత్ర మనసు తేలిక పరచాలని ఆమె దృఢవ్యక్తిత్వం తన వలన చెక్కు చెదర కూడదని అతని అభిప్రాయం.

తన మనిషి అనుకున్న తనని అతనింకా వేరుగా చూస్తున్నాడని ఆమెలో పొడచూపిన అనుమానం.

"మిత్ర, ఒక మాట చెప్పనా? నీకు గత స్మృతులు తలపోసుకోవటం బాగా అలవాటు. అందువలనే నీలో ఆలోచనలకి అంతం వుండదు. విషయాలని ఇంతగా తరచి చూడటం మానరా అమ్మలు." విశ్వ చిరుచెమటతో తడిసిన ఆమె ముంగురులు వెనక్కి సర్ది నుదురు మీద చిన్నగా చుంబిస్తూ అన్నాడు.

"తేలిగ్గా తీసుకోవటం నాకు రాదు. " మొండిగా అంది మిత్ర.

"నేను SAP మెంటాలిటీ గలదాన్నని నువ్వేగా అన్నావు. ఇంతలో నేనెలా మారిపోతాను." ప్రశ్నించింది.

మిత్ర సెన్సిటివ్ థింకింగ్, తను ఇష్టపడ్డ వాటి పట్ల పెంచుకునే అటాచ్ మెంట్, ఆమెది అనుకున్న వ్యక్తులు, వస్తువుల పట్ల కనపరిచే పొసెసివిటీ కలిపి Sensitive Attachment Possessive [SAP] అలా అనొచ్చని అతనన్నమాట గుర్తు చేసింది.

"ఎందుకంటే నేను కూడా నీ పట్ల BAAL ఫీలవుతున్నానని నువ్వూ అన్నావుగా బంగారు. " కాస్త తేలిక పరచాలని నవ్వుతూ అన్నాడు.

అతను తనని సాప్ అన్నాడని అతను తన పట్ల కనపరిచే లక్షణాలకి మిత్ర కూర్చిన ఆక్రోనిమ్ అది. Bonding Attachment Affection Love [BAAL] వలన అతను తన ప్రేమ దైవం అనేది. నిజానికి ఒక నమ్మిక ప్రకారం ఆ పదానికి మాస్టర్/దైవం అని అర్థం వుంది.

"అందుకే నా ప్రేయసి బాధ పడ కూడదని నా ఆకాంక్ష." విశ్వ మాటలతో చెదిరిన మనసు చిక్కబడ్డట్లు కాస్త తెరిపిన పడింది.

అలాగే పట్టుకుని వుండిపోయింది. మిత్ర నిద్రలోకి జారాక నెమ్మదిగా సోఫాలోనే కంఫర్టర్ తెచ్చి సర్ది, డోర్ లోపల్నుండి లాక్ చేసి అతను వెళ్ళిపోయాడు.

*************************************************

మళ్ళీ డిశంబర్ మాసం. మంచు తన దారిన తన పని చేసుకుంటూ, మిగిలిన ప్రకృతిని తన సమ్మోహనాస్త్రాలతో లోబరుచుకుంటూ వుంది.

మిత్ర సరదాగా నాలుగు లైన్లు వ్రాసుకుంది.

"ఎండుటాకుల కసువు వూడ్చి
మంచునీళ్ల కళ్ళాపు జల్లి
ఎండా నీడల ముగ్గులేస్తున్న
కట్టు బానిస గాలి నోట విన్న పాట
'మళ్ళీ తెల్లారింది మాయ లోకమా
నాకు మాత్రం తప్పకున్నదీ వెట్టి చాకిరీ' "

ఆ రోజు మిత్రకి మరపురాని రోజు. హెల్ముట్ ఇంటి నుండి వస్తూ విశ్వ చేతుల్లో వొరిగి ఇంటికి వచ్చిన రాత్రి మాట గుర్తుకు వచ్చి తనలో అమిత గాఢానుభూతిని మిగిల్చిన ఆ జ్ఞాపకం అతనికెంత గుర్తుందో తెలుసుకోవాలనిపించి వెంటనే ఫోన్ చేసి అడిగింది.

తేదీల ప్రకారం డైరీ వ్రాసుకున్నా కానీ అమెకున్నంత వైనంగా గుర్తు వుంచుకోవటం అలవాటు లేని విశ్వకి వెంటనే తట్టలేదు. అదీకాక వృత్తిపర వత్తిడిలో వున్న అతనికి ఇతరత్రా ఆలోచనలు రాలేదు. అతనామాట నిజాయితీగానే ఒప్పుకున్నా మిత్రలో నిరాశ.

"అమ్మలు, ఆ అనుభూతి నాకూ అపురూపమే కానీ ఇలా రోజు, సమయం వివరాలతో అంటే ఎలారా?" అల్లరిగా అడిగాడు.

*************************************************

తర్వాతి వారం మిత్ర కి శరాఘాతం మాదిరి అనుభవం.

ఉదయమే అడిగింది. లంచ్ కి వెళ్దామని. కొంచం ఆలస్యమౌతుంది కానీ వచ్చి కలుస్తానని చెప్పాడు.

మధ్యాహ్నం పన్నెండున్నర నుండి చూస్తూ కూర్చుంది. నాలుగయ్యే వరకు అతని జాడ లేదు.

అప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడినా అతనికి ఈ మాట గుర్తుకు రాలేదు. తనే గుర్తు చేసి అలగాలని అనిపించలేదు. కానీ ఆ తాలూకు ఆలోచనలు ఆమెని చుట్టుముట్టేసాయి. ఈ మధ్య కాలం లో ఎందుకో ప్రతి సంఘటనలో తను నిరాశకి గురౌతుంది.

చనువు పెరిగాక తను అతనిలో లోపాలు వెదుకుతుందా? అతని పట్ల ఆశింపు పెరిగిందా? తన ప్రేమ అతనికి ప్రతిబంధకంగా మారనున్నదా? ఎందుకు అతనికి అన్నిటికన్నా అందరికన్నా తనే ముఖ్యం కావాలని మనసు మారం చేస్తుంది? ప్రేమలో తను కుంచించుకుపోతుందా? తొలినాటి ఆత్మీయత లోపించిందా తమ మధ్యన?

'విధి ఎంత చిత్రమో అంత బలీయం, కొంత కాలం క్రితం ఇతనికి నా పట్ల ప్రేమ/పెళ్ళి అభిప్రాయం ఎందుకు కలిగింది అని ప్రశ్నించుకున్న నేను, ఇపుడు ఇతనిని వదిలి వుండగలనా అని వ్యధ పడుతున్నాను. విధి మళ్ళీ ఏం వైపరీత్యం చూపుతుందా అని బెంగ పడుతున్నాను.' స్వగతంగా అనుకుంది.

పది ప్రశ్నలు పదివేల ఆలోచనలు. అసలు ఈ మనసు తనని మోసం చేస్తుందా.

1. క్రొత్త బాటలో వెళ్తున్నానా? [తన తోడుని తాను వెదుక్కుని]
2. దారి తప్పుతున్నానా? [తన పొసెసివిటీ గురించి]
3. ప్రకృతినై జీవించగలనా? [రాగ ద్వేషాలు అంటని విధంగా]
4. సాధారణ స్త్రీగా బ్రతికేయనా? [లౌకిక పరంగా]
5. అతనిలో తను కోరుకున్న యే ప్రత్యేకత లేదా? [ స్పష్టత లేని ఆలోచన]
6. తమ అనుబంధంలో ఏది ముఖ్యం? [అతనికి తనకి వున్న అంతరాలు నిలదీస్తున్నట్లు]
7. నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించనున్నాడా?
8. నన్ను శాసించాలని చూస్తాడా?
9. ముందుకు సాగనా?
10. ఆగి వెనక్కి మళ్ళనా?

ఎందుకింత ప్రశ్నార్థకమైపోయింది నా జీవితం?

తల విదిల్చి లేచి స్నానం చెసి కాసేపు ధ్యానం లో కూర్చుంది. నిర్మలీకరణ జరిగినట్లు మనసు మళ్ళీ నియమానుసారం నడుస్తున్నట్లుగా వుంది. కానీ తనలో తన ఆలోచనలను నియంత్రించుకోలేని బలహీనత ఎందుకు కలుగుతుంది. గంట క్రితం కలిగిన ఆలోచనలు స్థిరమైనవేనా? క్షణికావేశమో, బాధో కలించిన పరిణామమా?

"మసక వెలుతురు, పొగమంచు, ధూళితెర, నివురు విడివిడిగానే చిత్రాన్ని కలగాపులగం చేస్తాయి; దృష్టిని ఏమారుస్తాయి. అదీ అంతే! అన్నీ కలిసికట్టుగా కమ్మేసినట్లుగా వుంది. ఉద్వేగం ఊపిరాడనంతగా తనని వణికించేసిన విచిలితమైన ఆ స్థితి మరెన్నడూ రాకూడదనే ప్రార్దిస్థున్నాను. బహుశా నాపై అపైవాడు రువ్విన పరీక్షాపత్రం కావచ్చది." ఇలా తర్జన భర్జన పడుతూనే వుంది.

మనసు ఖాళీ చేసానెందుకు?

ఎందుకు జార్చుకున్నాను,
మనసులోని భావాలు నాలోనే దాచుకోక?
ఎవరు దాచుకున్నారు,
మరపురాని అనుభూతిగ ఎదలోపల పదిలంగా?

కొలమానం లేని, రాసిగల అక్షరాల రాశులు,
ఎవరికి లెక్కలెంచక పంచేసాను?
వెలకట్టలేని, వాసినందూ సాటిలేని కమ్మని కావ్యాలు,
ఎందుకు ఎడతెరిపిలేకుండా లిఖించేసాను?

వెలికి వచ్చినవి తిరిగి నాలోకి ఇముడ్చుకోవాలని,
వెదికి వెదికి వేసారినా జాడ తెలియకున్నదేమి?
ఉబికి వొలికి నన్ను వదిలిపోయాయేమి స్పందనలు!
వెలితి పడిన మనసు ఉసూరురంటోందేల రేయీపగలు?

నాడు ఊగిసలాడి, వేగిరపడి తృళ్ళిపడిన ఉవ్విళ్ళు,
నన్ను నేనే దోచుకుని వేడుకచూసిన సందళ్ళు.
నేడు సత్తువలేక, సాగిలపడి నిట్టూరుస్తున్న సవ్వళ్ళు,
నన్ను నేనే మరిచిన ఈ నిశీధి పయనంలో కీచురాళ్ళు.


పరి పరి విధాల సమీక్షించుకుంటే ఒకటి మాత్రం స్పష్టంగా నిలకడగా తెలిసింది. తనది మోహావేశం కాదు ప్రేమావేశం, అదీ వ్యక్తి పట్ల కాదు, ప్రేమించే మనసు కోసం, ఆ మనసులోని భావన కోసం. ముందుది కలయికలతో తీరిపోతుంది, కరిగిపోతుంది. రెండోది కాలంతో ఎదుగుతుంది, కలిసిన మనసుని కలిపేవుంచే ప్రతి దారినీ వెదుకుతుంది. తనలోని ప్రేమ విత్తు మొలకై, మొలక మొక్కై అలా మహావృక్షంలా ఎదిగిన వున్నత భావన.

ప్రశాంతంగా కూర్చుని అలా తిరిగి తిరిగి పునరావలోకనం చేసుకుంటూ అలాగే దాదాపుగా తెల్లవారే వరకు గడిపింది. మిత్ర కి అలా మనసు చెదిరిన రోజుల్లో నిద్ర మాని గడపటం అలవాటే.

ఉదయం ధ్యానం చేసుకుని విశ్వని ఉద్దేశ్యించి వ్రాసుకుందిలా...

కన్నా, నీ రాక కై ఎదురుచూపుల్లో, నిట్టూర్పుల్లో గోరువెచ్చనైన నా గుప్పిట ఈ వేకువల్లో విప్పి అందులో నా పెదవితో నీ రూపు చిత్రించి, ఆ మోమునిండా ముద్దులద్ది, తిరిగి గుప్పిట గట్టిగా మూసి నీ ద్వారంలోకి పంపాను. అవందుకుని మరి నీ తీపి తేనియలద్ది నా లెక్కకు సరి జోడుగా వెనక్కి పంపేయ్. అవే వూపిరిగా వేచివుంటాను వెయ్యిన్ని వేకువల వరకు. నా వలే మారకు, నీ ముగ్దతనం నాకిచ్చే కానుక అని మాట తీసేసుకున్నావు. అందుకే "కలలో నీవైతే కలనే వరించనా, నిన్నే కలవరించనా" అని పాడుకున్న ఆ తొలిప్రేమ నుండి, "నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జనమలో ఇక ఏ జన్మకైనా ఇలా ..." అని నా మాటలు చాలవని ఇలా అరువు పాటలు కూడా నీ నామ కోటికి అలంకారాలుగా అద్ది ఇంకేమి చేయాలో తెలియక ఇంకా చెప్పాలన్న తపన వదలక, తనివీ తీరక..

నా శక్తానుసారం ఏ రాగద్వేషాలు మన నడుమ ప్రవేశించకుండా చూస్తున్నాను. నీ నుండి నాకు, నా నుండి నీకు దైవం పట్లవుండే ఇష్టం, శ్రద్ద, ప్రేమ, భక్తి మాత్రమే పయనించాలని, ఇవే మనకి పరిణితిని కలిగించి యోగ, ధ్యాన మార్గాల్లో సంపూర్ణతని ప్రసాదించాలని నా ప్రార్థన. "

మనిషికి మనసు, మాట, ఆలోచన శాపమో, వరమో... మరపు మందో మరింత కడగళ్ళు తెచ్చే శాపమో..

[ముగింపు వచ్చే వారం]

నాకు నిదురించాలని వుంది

చలిగాలి సుడులు తిరుగుతూ
ఆలపించే వణుకుల రాగం లో...
వెచ్చెచ్చని దుప్పటి కింద ముడుచుకున్న
అరమూతల కళ్ళ వెనుక కదిలే కలలో...
అమ్మవొడి చూసుకుని,
నాన్న గుండె తలుచుకుని,
మమతకి మారుపేరు నా మనసనుకుని...
ఆదమరవనీయని నా హృదయాన్ని

పలుమార్లు సేదదీర్చి, పలుకుగంధాలు వెదజల్లి

తనకంటి నీడ నా కంటి నలుపున కట్టిపెట్టి
నా చెంత నిలిచే నా తోడు కావలితో...
మంచుకురిసే రేయిలో, వానవీడని పొద్దులో
కాలమాగని గతిలో, కనికరంలేని ఋతువులో
కనపడని మాయ కమ్మిన బ్రతుకులో
నీకు
నేను వున్నానన్న జతలయలో...
తృప్తిగా నాకు నిదురించాలని వుంది

"నీలకంఠారెడ్డి" ఐ లవ్ యు

జీవితంలో ఎన్నో మజిలీలు, మలుపులు, పరిచయాలు, విడిపోవటాలు. కొందరు జీవితంలో తారసపడి, మనకి వారి వలన కలుగజేసే అనుభవాల వలన అలాగే యెప్పటికీ గుర్తుండిపోతారు.

ఈ కథనం సమయానికి మేము ఒంగోలు ప్రాంతాల్లో వుండేవారం. నాన్నగారి ఉద్యోగరీత్యా మాకు ఇంట్లో ప్యూన్స్/అటెండర్స్ బాగానే వుండేవారు. నాన్నగారు ముందుగా రిపోర్ట్ చేసి, తన స్టాఫ్ ని కలవటంతో మాకు కాస్త పరిచయ వ్యాక్యాలు చెప్పారు, "మీకొక మహానుభావుడిని చూపాలి," అని నవ్వారు.

నాకు మహా కుతూహలం, ఎవరెవరా అని ఆసక్తి. సరే, మేము ఆ వూరు మొదటిసారి చేరేసరికి మధ్యాహ్నం అయింది. లంచ్ ఎవరో పంపారనుకుంటా. అచ్చంగా "సాగరసంగమం" లో పొట్టి ప్రసాద్ మాదిరిగా వొంగి అదో మాదిరిగా నడుస్తున్న వ్యక్తి కారేజీలు మోసుకుంటూ రావటం కనపడింది.

దగ్గరగా వచ్చాక దాదాపుగా నేల మీద పడ్డంతగా వొంగిపోయి, ఇప్పుడు మోటర్ బైక్స్ మీద వెళ్ళే కుర్రకారుకి క్రొత్త పాఠాలు నేర్పేంత వడుపుగా, మా అమ్మగారికి నమస్కారం చేస్తూ "అమ్మ! నన్ను నీలకంఠారెడ్డి అంటారు." అన్నాడు. తిరిగి నా వైపు చూస్తూ "పాపా గారామ్మా?" అని కూడా అడిగేసాడు.

వెనక్కి చూసి నన్నే నని అర్థమయ్యాక వోణీ ఓ సారి జాడించి వేసుకున్నాను. :)

అలా ఆరుగురి అటెండర్స్ లో ఒకరిగా నా జీవితంలోకి వచ్చిన మనిషి "నీలకంఠారెడ్డి". నాకు తెలిసి నాన్నగారి తో అతిగా విసుక్కోబడ్డ మనిషీ తనే.

మాటకి ముందు "అమ్మ" వెనక "పాప" ఇలా కనీసం నన్నొక కోటిసార్లు పిలిచివుంటాడు. మచ్చుక్కి "అమ్మా, పాప, అమ్మగారు పిలుస్తున్నారమ్మా పాప." :(

నేనూ అన్నిసార్లు చెప్పాను, నన్ను "పాప" అని పిలవకు అని. ఆఖరుకి అమ్మ చీరలు చుట్టబెట్టుకున్నా ఆ విపత్కర పరిస్థితి తప్పలేదు.

వేసవికాలం కావటంతో సాయంత్రాలు అలా కెనాల్ దగ్గర కూర్చుని వచ్చేదాన్ని. కను చీకటి వేళ వరకు అలా పారే ఆ నీటి గలగలలు వింటూ, పొలాల్నుండి ఇళ్ళకి చేరే రైతువారి జనాలని చూస్తూ కూర్చునేదాన్ని. కనీసం పుస్తకం కూడా తీసుకెళ్ళేదాన్ని కాదు, ప్రకృతి వీక్షణం అంతే. అలాంటి ఓ సాయంత్రం కాస్త దగ్గరగా వున్న చెట్ల వెనగ్గా అలికిడి. తృళ్లిపడి చూస్తే ఎవరో ఒక మనిషి కదులుతున్నట్లుగా అనిపించింది.

చక చకా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసాను, నాకోసం అన్నలు వచ్చేసారు. మహదానందం. ఇంత తేలిగ్గా తీసుకుపోతారనుకోలేదు. గబ గబా గుర్తుచేసుకుని "అన్నలు మా ఎర్ర మల్లె పూవులు .." పాడుతూ ఓ రెండు నిమిషాలు చూసినా ఆ శాల్తీ కదలదే. సరే నేనే వెళ్ళాలేమోనని, నెమ్మదిగా లేచి, చేతులెత్తి అటుగా వెళ్ళి చూస్తే, అక్కడ వున్నదెవరో తెలుసా? ఇంకెవరు, "నీలకంఠారెడ్డి".

"ప్చ్, నువ్వెందుకొచ్చావిక్కడకి." అన్నాను.

"అమ్మ, పాప మీరీ చోట
కి రోజూ వస్తున్నారని..." అని ఆగి "తోడుగా వుందామని." నీళ్ళు నములుతూ ఆగిపోయాడు.

సూరేకారం లా మండిపడి "ఇంకోసారి, ఇలా చేసావంటే కాలవలోకి తోస్తాను" అని అరిచి "ఐ హేట్ యు" అని విసా విసా ఇంటికి చేరి, అమ్మకి చెప్పబోయి పోన్లే నేనే ఓ తట్ట వరస పెట్టాను కదా అనుకుని, నా సిల్కు దుప్పటికి వాడిని ఎందుకు అరిచానో చెప్పి పడుకున్నాను. అదో అలవాటు.

మర్నాడు నిమిషానికొకసారి ఆ చెట్ల వైపు చూస్తూ కూర్చున్నాను. నా ప్రకృతారాధన కాస్తా వాడి కోసం ఎదురుచూపుగా మారిపోయింది. ఎటువైపు నుండి నీళ్ళలోకి తోయాలా అని కొలతలు, లోతులు చూస్తూ కూర్చున్నాను.

కానీ రాలేదు, అలా మూడు రోజులు గడిచాక నా దృష్టిని మరొకటి ఆకర్షించింది. అదేమిటంటే గడ్డిమోపులు నెత్తిన పెట్టుకుని వయ్యారంగా సాగే ఆ రైతు జనాలు నాకేసి దొంగని చూసినట్లు చూస్తూ వెళ్ళటం. ఓ రెండు రోజులు వూరుకుని, మూడో రోజు ఓ పడుచుని పిలిచి "ఎందుకు అలా చూస్తున్నావు?' అని అడిగాను.

"అమ్మ, పాప మీరీ పెద్దయ్యగారి పాప అంటగా?" అని అడిగింది.

"అయితే.." నా మాట పూర్తి కాకుండానే..

"ఆ రెడ్డి మీమీద ఓ కన్నేసి పెట్టమన్నాడు." అన్నది.

"ఎందుకు?" నేను నచ్చానో, నా ప్రశ్న ముద్దొచ్చిందో, నెమ్మదిగా దగ్గరకి జరిగి, గుస గుసగా చెప్పింది "మీ కోసం ఎవరన్నా కుర్రోడు వస్తున్నాడేమో, మీరేమన్నా ఈ నీళ్ళలోకి పడతారేమో/దూకుతారేమో చూడమన్నాడు." నాకు ఆది పరాశక్తి కొచ్చినంత కోపం. ఇక వాడిని భస్మీపటలం చేయాల్సిందేనని ఇంటికి చేరే సరికి, ఏదో తింగర పని చేసి తలవాయా చీవాట్లు తింటున్నాడు.

"ఛీ ఛీ అవతలకి పో, అతి వినయం ధూర్త లక్షణం" ఇలా సాగుతుందా భారతం.

కాస్త మనశ్శాంతించి ఆ రోజుకి వదిలేసా. మర్నాడు ప్రొద్దున్నే స్పాట్ పెడదామని నిర్ణయించాను.

ప్రొద్దున్నే నాన్నగారికి తోటపని అలవాటు. అలాగే నాతో నాటిస్తే అవి "మరువం" మాదిరి ;) పచ్చగా ఎదుగుతాయని నమ్మకం.

"ఉషడు, లేమ్మా కాసేపలా వెనక దొడ్లో తిరుగుదాం." అన్నారు.

మేమలా ఒక అరగంట మొక్కల మధ్య తిరిగే సరికి అయ్యగారు దిగబడ్డాడు. చూట్టానికి నిగ నిగా మెరిసే నల్ల జుట్టు, తెల్లటి ఇస్త్రీ బట్టలు భలే ఠీవిగా వుండేవాడు.

నేను, నాన్నగారు ఆకుకూరల మడిలో కలుపు తీస్తూ కూర్చున్నాము. మరేమనుకున్నాడో, నాన్న గారిని ఇంప్రెస్ చేయటానికి పాంట్స్ మడిచి తనూ ఓ మూల ఏదో పీకుతూ కూర్చున్నాడు. కాసేపటికి అలా చూసేసరికి సగం కొత్తిమీర పీకేసాడు, అది గడ్డీ గాదం వేసిన బుట్టలో పడేసాడు. ఇక చూస్కోండి నాన్నగారి శివాలు. అలా మళ్ళీ నా చేతిలో చావు తప్పించుకున్నాడు. జాలిగుణం కదా, ఒకరి చేతిలో పడ్డాయి కదా ఇక మన చేయెందుకని వదిలేసా.

ఇక మూడో పాపం ఏమి చేసాడు అంటారా? ;)

ఓ పట్టాన పొరుగూరు ప్రయాణాలకి ఒప్పుకోని నాన్నగారిని వొప్పించి సినిమాకి బయల్దేరాం. వాడు మాకు అంగరక్షకుడు. మధ్యలో వంటమనిషితో ఏదో మాట్లాడటం కనపడింది కానీ సరీగ్గా చూడలేదు.

జీప్ లో నేను, చెల్లి, డ్రైవర్, రెడ్డి గారు. సరే సినిమాహాలుకి చేరి దిగటానికి కాలు కిందమోపానో లేదో

"తప్పుకోండి, ఇంజనీర్ గారి పాపలు వస్తున్నారు." అంటూ మా ముందు తను సాగుతూ హడావుడిగా జనాల్ని అదిలిస్తూ రెడ్డి తాండవాలు మొదలెట్టాడు.

కాస్త సిగ్గుగా, వెనకా, ప్రక్కనా మాకేసి చూసేవారి కళ్ళకి బలౌతూ, పళ్ళు నూరుకుంటూ నడిచి ఎలాగోలా లోపలకి చేరి సీట్లలో సర్ధుకుని కూర్చున్నామోలేదో,

"పాప, పెద్ద పాప మీకు బోర్నవిటా ఇదిగోమ్మా" అని ఫ్లాస్క్ లోంచి కప్పులోకి వంచి ఇచ్చాడు, ఇదన్నమాట వంట గదిలో చేసిన నిర్వాకం.

తప్పుతుందా, వద్దంటే అసలు వదలడు, కాళ్ళావేళ్ళా పడి బతిమాలతాడు.

ఇంతలో ఇంటర్వెల్. మళ్ళీ ఇంకో ప్రహసనం.

"పాపా పకోడీలు ఇదిగోమ్మా." అంటూ సిద్దం. "ఐ హేట్ యు" అని ఓ వెయ్యిసార్లు అనుకుని వదిలేసానప్పటికి.

వెనకనుండి ఎవరో ఈల వేసి ఏదో కొంటె కామెంట్ విసిరారు.

ఇక వీడిని జీపుతో గుద్దేయటమే అని డిసైడ్ అయ్యాక, మిగిలిన సినిమా మొత్తం నాకవే సీన్లు.

కానీ వాడి రోజు బాగుంది. అలసటగా వుండి జీపెక్కగానే నిద్రపోయాను.

అలా ముమ్మారు నా చేతిలో ప్రాణాలు పోకుండా రక్షించబడ్డ ఆ రెడ్డి, మేమా వూరి నుండి వచ్చేసేప్పుడు

"పాప మంచిదమ్మ. మంచిపిల్లాడు వస్తాడు." అని దీవెన లిచ్చి, కంటి నీటితో సాగనంపాడు.

ఇప్పుడు ఇక్కడ కేవలం అవర్లీ బేసిస్ మీద వచ్చి పైపైన మాటల్తో పని పూర్తిచేసుకుని వెళ్ళేవాళ్ళని చూస్తే ఎందుకో మా "నీలకంఠారెడ్డి" గుర్తుకొస్తాడు.

తన ఆప్యాయత, ఆదుర్దా,- నాన్నగారి కోపం వెనుకనున్న మంచితనాన్ని గుర్తించి- మా పట్ల ఆదరంగా వుండటం, వినయం ఇలా అన్నీ మూర్తీభవించిన మా రెడ్డి ఇప్పుడు కనిపిస్తే ఒక్కసారన్నా చెప్పాలని వుంది,

"నీలకంఠారెడ్డి, 'ఐ లవ్ యు', నన్ను మన్నించు!" అని. మనకక్కడ ఎలావున్నా ఆ 'మూడు ముక్కల్లో' ఇక్కడ ఎంతో ఆత్మీయత తొణికిసలాడుతుంది. అందుకే అలా అనిపించింది. నాకెలా
గూ తన చిరునామా తెలియదు. మీకెవరికైనా ఆ పేరున్న వ్యక్తి కనపడితే ఆ మాటలు చెప్పండి. అవి నా కన్నీట ముంచి తీసినవి అని కూడ చెప్పటం మరవకండి.

************************************************
చాలాకాలం అవటంతో నాకు ప్రకాశం జిల్లా మాండలీకం గుర్తు లేదు. కానీ సందర్భాలు, సంభాషణలు మాత్రం గుర్తున్నాయి.

క్రిస్మస్ సెలవలకి వెళ్ళేముందు నా తెలుగుబడి కబుర్లు!


క్రిస్మస్ సెలవలు రానున్న కారణంగా ఈ నెల కేవలం రెండు వారాలు మాత్రం క్లాసు ఇచ్చాను. మిగిలిన మూడు వారాలు పంతులమ్మ డుమ్మా కనుక నా బుడుగులూ గప్ చుప్ ;) వివిధ కారణాలతో ముగ్గురు, నలుగురైనా రాలేకపోతున్నారు. కానుకలు మాత్రం అందరికీ పదిలం. మారి నాకో? :(
వీళ్ళ కోసం అలా షాపింగ్ చేసి, గిఫ్ట్ రాప్ వేయటం నాకు అదో సంతోషం. లోపల 2010 కాలెండర్, కాండీస్, కీచెయిన్ + పెన్, పెన్సిల్, మార్కర్ వుంచాను. అన్నీ వాళ్ళకి ఉపయోగపడే వస్తువులే.

ముందుగా దశరా, దీపావళి సమయంలో నేర్పిన పండుగ, వేడుక, సంబరాలు, ఉత్సవాలు గురించి మాట్లాడాక క్రిస్మస్ ప్రస్తావన తెచ్చి, అందరినీ ఆ చర్చలో పాల్గొనేలా చేసాను. కనీసం సగం మందికి చాలా విషయాలు గుర్తున్నాయి. పైగా కళ్యాణం, అభిషేకం వంటి క్రొత్త పదాలు కూడా [మరలా కాస్త నటీంచపోతే నాకు నేర్పరు వాళ్ళు :)] చెప్పారు. ఇదొక కిటుకు, వాళ్ళకి తెలిసినవి చెప్పించటానికి కొన్నిసార్లు తప్పదు.

పదకుండు మంది నవ్వుల కాంతులే సిరి దీపాలు

Align Center ఇది నా పుత్రికా రత్నం అలంకరించిన క్రిస్మస్ ట్రీ
అల్లరికి మాత్రం అందరూ సై సై - ఒకరిని మించి ఒకరు


పగలు కూడా శోభామయమే మా ట్రీ

ఇక పాఠాల్లోకి వెళ్తే, థాంక్స్ గివింగ్ సెలవల గురించి కానీ, వాళ్లకి నచ్చిన ఏదైనా అంశం గురించి ఒక్కొక్కరితో రెండు నిమిషాలు మాట్లాడమన్నాను. భలే చెప్పారు, కొందరు భవిష్యత్ లో యూనివర్సిటీ లో పెద్ద ప్రొఫెసర్ అవుతామని, మరొకరు పేద్ద ఉద్యోగం చేస్తామని ఇలా ;)

.. గుణింతాలు వల్లె వేయించకుండా పదాలతో ఒకేసారి నేర్పాను. దాదాపుగా అన్ని శబ్దాలకీ ఏదో ఒక పదం పట్టగలుగుతున్నారిప్పుడు.

ఉదా: "క" గుణింతం:

కల, కాకి, కిస్, కీస్, కుక్క, కూర, కృష్ణ, క్రూరమృగం, కెటిల్, కేక్, కొన్ని, కోతి, కైట్, కంచం

ఇప్పుడు గుణింతాలు, వత్తులు, సంయుక్త అక్షరాలు [ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు] కూడా దాదాపుగా చెప్తున్నారు.

.. మరికొన్ని పదాలు చాలా కూలంకషగా తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మారుస్తూ, వ్యాక్యాల్లో కూడా ప్రయోగించి నేర్చుకున్నాము. ఇవి మాత్రం ఉద్దండపండితులైపోయారు.

ఎవరు, ఎలా, ఎట్లా, ఏమిటి, ఏంటీ, ఏమని, ఎంత, ఎన్ని, ఎక్కడ, ఎందుకు, ఎందరు, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎందుకైనా, ఎన్నడూ, ... ఇలా చాలా సందర్భాన్ని బట్టి వాడే పదాలు.

.. లెక్కల్లో - ఒకరు, ఇద్దరు... ఏడుగురు ఇలా మొదలైన లెక్క ఎనిమిది సుమారుల్లో "ఎనిమిది మంది" కి మారటం. వంద తర్వాత నూటఒకటి కి మారటం వగైరా నేర్చాము.

ఇవి కాక ఒక మాటకో, పాటకో అభినయించటం కూడా చేసాము. అన్నీ వ్రాయను అంత ముఖ్యంగా అనిపించటం లేదు. కానీ అంతా నాకు హగ్స్ ఇచ్చి వచ్చే యేడు కలుస్తామని వెళ్ళారు.

విశ్వామిత్ర - 13

విరహిత వదిలిన తావున మల్లియ గొల్లున గగ్గోలు పెట్టదా?
తీయని తలపుల తాపపు తాకిడి తప్పని మనుగడ మనది.

వేచిన కన్నుల వేడికి వాడిన తనువు, వగపు నా బ్రతుకై,
నిను కౌగిట చేర్చగ తామసి వశమై నిలిచాను ప్రియా!

********************************

చేతిలోవున్న పెన్ను కాప్ క్రింది పెదవికి ఆనించి, ఆ నాలుగు పంక్తుల వెంటా మరోసారి దృష్టి సారించి మురిపెంగా చూసుకుంది మిత్ర. ఉదయాన్నే మెలుకువలో అస్పష్టంగా వచ్చిన వూహ అది.

కాస్త వేడిగా ఏమైనా తాగాలనిపించి లేచి వంట గదిలోకి వెళ్ళింది. పాలు వేడిచేయటానికి కప్పు తీసుకుందామని పరధ్యాసగా కిచెన్ కాబినెట్ వైపు చాపిన చేతికి సిరియల్ డబ్బా తగిలి క్రిందపడి రంగు రంగుల ఆ పలుకులు చెల్లాచెదురుగా పడ్డాయి. క్రింద కూర్చుని పోగేయటానికి చెయ్యి చాపబోతు "V" ఆకారంలో పడ్డ వాటిని చూడగానే మదిలో మళ్ళీ ఓ ఆలోచన.

మరొక పదినిమిషాల్లో "విశ్వామిత్ర" అని వ్రాసిన సిరియల్ వంక చూస్తూ కూర్చుంది. ఉదయపు గోరువెచ్చని కిరణాలు విశ్వ స్పర్శని గుర్తుకి తెస్తున్నాయి.

ఎటు చూస్తే అటే విశ్వ యేదో ఓ రకంగా తలపులనుంచి తొలగనని స్థిరంగా పరుచుకుపోయాడు.

అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు. విశ్వ పరిచయం అయిననాటి నుండి జ్ఞాపకాలు అలలు అలలుగా ఎగిసిపడుతున్నాయి. ఇంతలో ఫోను మోగింది.

"అమ్మలు.." ఫోను తీయగానే ఆత్మీయంగా వినిపించిన నానమ్మ గొంతు.

"నానమ్మా," మిత్ర గొంతులో అమితాశ్చర్యం "ఎలా వున్నావు?" అని అడిగింది.

"ఏంట్రా తల్లీ ఇది? నెల పైనే అయింది నీ ఉత్తరం వచ్చి. ఫోను చేసీ పది రోజులైంది. తీరిక లేదా బంగారం?" లక్ష్మీదేవమ్మ గారి గొంతులో ఈమారు కాస్త ఆదుర్దా ధ్వనించింది.

ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్లుగా, కాస్త అపరాధభావన, తడబడుతున్న స్వరంతో "బానే వున్నాను నానమ్మా, ఏదో కాస్త బద్దకం.." అన్నాగానీ తప్పించుకుంటున్నట్లుగా తనకే అనిపించింది మిత్రకి.

కాసేపు అవీ ఇవీ మాట్లాడి పెట్టేసాక, అవే ఆలోచనలు. ఎందుకు తననింతగా అతను ఆక్రమించేసుకున్నాడు? వద్దనీ అనాలనిలేదు. తనని అతనంతగా ప్రభావితం చేయటం ఎందుకో అప్పుడప్పుడు తనకే సమాధానం తెలియని ప్రశ్నార్థకంగా తోస్తుంది. ఇంతకు మునుపు ఎప్పుడూ తన మనసుకి కలగని స్థితి ఇది. ధ్యాస అంతా అతని పైనే.

లేచి వెళ్ళి మంచం మీదకి చేరి నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ, పుస్తకం తిరగేస్తూ కాసేపు స్నానం కూడా చేయకుండా ఒంటిగంట వరకు అలాగే గడిపేసింది.

ఏదైనా వ్రాయాలనివుంది. విశ్వకి ఫోన్ చేసి రమ్మని అడగాలని వుంది.

క్రొత్తగా పరిచయమయిన నైబర్ తో కలిసి గోల్ఫ్ ఆడటానికి వెళ్తానని నిన్న సాయంత్రమే చెప్పాడు. ఈ మధ్యనే నేర్చుకోవటం మొదలుపెట్టాడు కనుక అతన్ని డిస్టర్బ్ చేయాలనిలేదు.

మళ్ళీ పుస్తకం తెరిచి వ్రాసుకుంటూ కూర్చుంది.

"నా మనసు నాది కాదు, అది నీ చెంతనేవుంది..
నాకూ నేను లేనా, కన్నా?
ఈ నిశ్శబ్దం నను నలిబిలిచేస్తుంది,
ఈ ఎడబాటు నను శిధిలజీవిని కమ్మంటుంది
నీవు లేని వనాన నేనిక విహారం చేయను,
ఈ విలాపాల విరహగీతమాలపిస్తాను.
నివురువోలె నింగికెగయనా,
వానవోలె నేలకు జారనా,
ఏవిధముగ నిను చేరను?
ఏ దిక్కున నిను వెదకను,
వేగిరపడి ఏ మలుపున నిను కలవను?

నీ కొరకు గుండె చేసే నాదంలో మూగపోతూనే మౌన రాగాలు ఆలపిస్తున్నాను. నా జీవనాన ఇదే అతి మధురమైన పయనం. నీవు పంచిన స్మృతులు మల్లెల మాలలా అల్లి నిన్ను వరించే వరమాలగా చేసుకుని నిలిచున్నానిచట! ..."

ఇంకొక నాల్గు పేజీలు ఏవేవో వ్రాస్తూనేవుంది. పాలు తాగాలని వెళ్ళినది మొదలు ఆ క్షణం వరకు ఏమీ తినలేదు. నిస్సతువగా నిద్రలోకి జారిపోయింది.

*************************************************

కాలింగ్ బెల్ మోతతో కళ్ళు విప్పి టైం చూస్తే దాదాపు సాయంత్రం అయిదు. వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా విశ్వ. ప్రక్కకి తొలగి లోనికి దారి ఇచ్చింది.

"మిత్ర, ఏమైంది?" లోనికొస్తూనే చేతిలో వున్న ఫ్రూట్స్ వున్న బాగ్ ప్రక్కగా వుంచి నుదురు మీద చేయివేసి చూస్తూ "ఇలా వున్నావేం?" అని అడిగాడు.

మొదట్లో ఓసారి హైదరాబాదులో కంప్యూటర్ లో ఏదో ప్రాబ్లం చూడటానికి వచ్చినప్పటి జ్ఞాపకం మెదిలింది.

"ఏమీ లేదు, మనసుకి నలతగా వుంది, విశ్వ." మిత్ర నవ్వేసింది.

అతన్ని కూర్చోమని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి యాపిల్స్, పేర్స్, బెర్రిస్ ముక్కలుగా కోసి ప్లేట్స్ లో సర్ది వుంచాడు.

"అమ్మలు, యేంట్రా ఇది?" మిత్ర ఉదయం వ్రాసిన "విశ్వామిత్ర" అన్న సిరియల్ పలుకులు చూపుతూ అడిగాడు.

నవ్వుతూ జరిగిన సంగతి చెప్పింది. ఇద్దరూ కూర్చుని పళ్ళముక్కలు తింటూ మాటల్లో పడ్డారు.

లేత గోధుమ రంగు టీ షర్ట్, డార్క్ కాఫి కలర్ పాంట్స్, వుంగరాల జుట్టు. సాధారణం గా కనపడే అతనిలో ఏదో అసాధారణ విలక్షణత. చిలిపి వూహ కదలాడింది.

అలవాటుగా అతని ఎడమ అరచేతిలో తన కుడిచేతి చూపుడు వేలితో సున్నాలు చుడుతూ "
విశ్వ నీకు కొన్ని పేర్లు పెట్టనా?" అని అడిగింది.

ఆమె చెప్పేది వింటూ కుడిచేత్తో ఆమె ముంగురులు సవరిస్తూ వున్న విశ్వ "ఊ" అన్నాడు.

"నీ శరీరాకృతి చూస్తే సింహం గుర్తుకొస్తుంది - ఎందుకంటే నువ్వు నా కెంతో ప్రీతికరమైన సింహమధ్యముడువి.

నీ మంద్రస్వర కంఠం నాకు గండు కోయిలని ఎదుట నిలబెడుతుంది

నీ మంచితనం మహావృక్షాన్ని గుర్తు తెస్తుంది - చల్లని నీడ, తన తావుని వీడని మేరు గంభీరత్వం.
సేదతీరానిచట అనిపించే నీ సమక్షం గోదారి ఒడ్డునున్న భావననిస్తుంది."

ఒక క్షణం ఆగి అతని మెడ వంపులో తలవాల్చి
"నీ ఆలింగనాలు, చుంబనాలు తుమ్మెదని జ్ఞప్తికితెస్తాయి." నెమ్మదిగా పూర్తిచేసింది.

"మిత్ర, ఒక మాట అడగనా?' మిత్ర నుదురు మీద సన్నగా ముద్దిడి, కాస్త ప్రక్కకి జరిగి, మిత్రని తన వొడిలో పడుకోబెట్టుకుని
అడిగాడు విశ్వ.

"అడుగు, ఏమని అడుగుతావు.." అంది మిత్ర.

"మన ఇద్దరినీ బయటనుండి చూద్దాం. నీవు మంచి అందగత్తెవి, భావుకురాలివి, కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నదానివి. ఇక నేను అన్నిటా సామాన్యుడినే. పెద్దగా సాధించేమీ లేదు. నువ్వు కూడా మన తొలిపరిచయం లో నన్ను నిరాకరించావు. మరి ఇప్పుడు మనమింత సన్నిహితం ఎలా కాగలిగాము?" అని అడిగాడు.

"ఊ, తెలియదు కన్నా." అంది.

"బహుశా అప్పుడు నా బాహ్యరూపం చూసావేమో, ఇప్పుడు నాలోని మనిషిని చూస్తున్నావేమో?" అన్నాడు. అతని మాటలు కూడా సుధీర్ఘ ఆలోచనలోంచి వస్తున్నట్లుగా వున్నాయి.

"మిత్ర, ఇదంతా కలగా తోస్తుంది. నీకు దూరం అయిపోతానేమోనని ఒక్కోసారి తెలియని వెరపు. నువ్వు నిజంగానే నన్ను యాక్సెప్ట్ చేసావా?" విశ్వ మాటకి ఛివాల్న లేచిన మిత్ర మొహమ్మీద చిరు కోపం తాలూకు కెంజాయ వన్నె. ముక్కు మాత్రం మంకెన రంగుకి మారింది.

"ఏమిటి నీ ఉద్దేశ్యం, నాకు పరిణితి లేదా? నాకంటూ వ్యక్తిత్వం లేదా? నా భాగస్వామి గురించి ఆలోచనలు వుండవా?" అంది మిత్ర.

"అమ్మలు, ఎందుకురా అంత కోపం? ఎంత ముద్దుగా వున్నావో.." తిరిగి ఆమె తన సంధిట బందిస్తూ "మన బంధం ఇలాగే సాగాలన్న ఆశ" అన్నాడు.

గట్టిగా అతని బుగ్గ మీద గిల్లాక కానీ కోపం కాస్త తగ్గలేదు.

"మరి, కేవలం నీ రూపు చూసే కాదన్నానకున్నావా?" అంది. మళ్ళీ తనే పొడిగిస్తూ

"వూహ తెలిసిన దగ్గర నుండీ ఎన్నో పరిచయాలు, అనుభవాలు జీవితం పట్ల, పెళ్ళి పట్ల, జీవిత భాగస్వామి పట్ల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తూనే వున్నాయి. కొంత జంకు, కొంత నిరాసక్తత వున్న సమయంలో దాదాపు అపరిచితుడివైన నీ నుండి ప్రపోజల్. ఎలా అంగీకరిస్తావనుకున్నావు? నాకు ఇప్పటికీ నీ పట్ల యే ఆశింపు లేదు. నీ లక్ష్యాలు, వాటి పట్ల అవగాహన నాకు తెలుసు. నీలో నేను ప్రేమికుడినే కానీ నాకేదో సాధించిపెట్టే వ్యక్తిని కోరుకోవటం లేదు." అంది. మిత్ర మాటల్లో కూడ దృఢస్వరం.

"మిత్ర, నాకు నీ అంత పట్టుదల లేదు. నాకు లక్ష్యాలు వున్నాగానీ ఒక ప్లాను తో వెళ్ళను. నీ అంత నియమంగా వుండను. ఒక్కోసారి ఆ సమయానికి ఏది తోస్తే అది చేస్తాను." విశ్వ మాట పూర్తి చేయకుండానే..

"ఆగాగు, మొద్దబ్బాయ్ కి ఈ సందేహాలన్నీ ఇపుడెందుకు కలుగుతున్నాయి.." మిత్ర గొంతులో ఈసారి అల్లరి ద్వనించింది.

"నాకు నువ్వు నచ్చావు. అదీ సంపూర్ణ వ్యక్తిగానే ఇష్టపడ్డాను. నీ రూపం నా కళ్లకి మనోహరంగా వుంది. నా జీవితం నీకు ఆహ్వానం పలుకుతుంది. ఇక మనం
మనకోసం. నన్ను, నిన్ను కలిపిన ప్రేమకి తెలుసు మననెందుకు కలిపిందో.." అంది మిత్ర.

ఆమె మాటల్లో భావుకతకి, స్వఛ్ఛతకి విశ్వ చలించిపోయాడు. ఒకరినొకరు హత్తుకున్న ఆ స్పర్శలో హృదయాలు సంభాషించుకున్నాయి.

మిత్ర ఏదో మగతలో అన్నట్లుగా అంది..

"
విశ్వ నీ సమక్షంలో నేను దైవానికి చేరువగా వున్నట్లు ఫీలవుతున్నాను. నీ ప్రేమలోని పవిత్రతకి లోబడిపోతున్నాను. నీ చెంత
శూన్యంలో మౌనాన్ని నేను
మౌనంలో రాగాన్ని నేను
రాగంలో భాష్యాన్ని నేను
భాష్యంలో భావాన్ని నేను
భావంలో జీవాన్ని నేను
జీవంలో పూర్ణాన్ని నేను
నువ్వెవరు?"

"ఈ అనంత విశ్వంలో నీ కోసం సృష్టించబడ్డ వస్తువుని. లేదా పదార్ధాన్ని." విశ్వ గొంతులోనూ అల్లరి.

"వస్తువుకి రూపు, రంగు మాత్రమే వుంటాయి. రుచి వుండదు, మరి నన్ను వెంటాడుతున్న ఆ రుచేంటబ్బా? అదీ తనువంతా అలముకొని మరీ... ఇంకా నయం రంగు కూడా అంటలేదు. పోనీ పదార్ధం అందామంటే తమరేమో జడపదార్ధమాయే. నువ్వు పంచుతున్న ఈ అనుభూతులకి అది సరిపడదు. మరి ఎలా,ఏమని పిలవను నిన్ను?" మిత్ర కూడా ఏమీ తగ్గలేదు.

"ఆనందం దేన్నుంచి పుట్టుకొస్తుందో ఎవరి మనసుకు వారికే తెలుస్తుంది. చిన్ని చిన్ని ఆశలున్న నా ప్రాయానికి నడక, పరుగు నేర్పావు. మరింత చిన్ని కలలున్న నా గుండెకి మేలుకొలుపు పాడావు. లౌకిక, అలౌకిక భావాలు - ఆ రెండిటా నీదాన్ని చేసేసుకున్నావు. ఈ అలాపన కువ కువల గువ్వ పయనాలు మాదిరే ఎప్పటికి నిలవాలి." అంది.

అలా అలా ఇద్దరూ వూసులాడుకుంటూ గడిపిన ఆ సాయంత్రం మిత్రకి ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ సంతృప్తి తాలూకు సంతోషం,
అనుభూతి మనసుకి సంబంధించినవే. మూలకారణం, నిర్వచనం, ప్రమాణం, కొలమానం అన్నీ ప్రేమ నిర్ణయించేసింది.


విశ్వకీ అంతే. ఎక్కడో మనసులో కలిగిన సందేహం నివృత్తి అయిపోయింది.

అపుడపుడు మిత్ర చెప్పే వూసుల్లో ఆమెకి తన జీవితం పట్ల గల నిబద్దత, లక్ష్యాల పట్ల స్పష్టత, అనుకున్నదాని మీద లగ్నం చేయగల మనసు చూస్తే లోలోపల సంధిగ్దత కలుగుతుంది. తమ విరుద్ద స్వభావాల వలన ఏదైనా దూరం తమ మధ్య చోటు చేసుకుంటుమ్దేమోనని. వీటన్నిటినీ మించి ఆమె ప్రేమ తనకి దక్కింది.

ఇద్దరిలోను ఒకటే భావన. తాము ఒకరినొకరు ఒక గురిగా సాధించలేదు. ఒక మజిలీగా చేరారు. అవును వారిరువురు ఒకరి ప్రేమ అన్వేషణ మరొకరు.


*************************************************

విశ్వ చాలా రోజుల తర్వాత చిత్రం గీసాడు.

కొబ్బరిచెట్టుకి ఆనుకుని వున్న
యువకుడు, నిండు పౌర్ణమి రేయిలో ఆ కొబ్బరాకుల వెనగ్గా వున్న చందమామ, ప్రక్కనున్న సన్నజాజి పందిరి ని ఆనుకుని స్వాప్నికావస్థలో వున్నట్లున్న యువతి. ఇరువురికీ నడుమ జాడలుగా పరుచుకునున్న వెన్నెల. వారువురి నడుమ పరుచుకునున్న ఆ కాంతి, ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తున్న అనురాగ వాహినా అన్నట్లుగా వుంది.

పాఠకులకి ఓ ప్రశ్న: ఈ చిత్రం మీకు ఏ భావన కలజేసింది. చెప్పినవారు నా ప్రియ స్నేహితులు. చెప్పనివారు నా ప్రియ శత్రువులు.

*** శుక్రవారం ఇంతవరకు వ్రాసి ఆపిన ఆ భాగానికి ఈ క్రింది కవిత శనివారం రాత్రి కలిపాను.

నా వూహా చిత్రానికి నా భావ వీచిక ఇది
/****************************

వెన్నెల్లో ముంచితీసిన సన్నగాలి కలాలు
కొబరాకు పత్రాలమీద నీకు లేఖలు లిఖిస్తే
చందురూడు నిన్ను కాంచి నివ్వెరపోయాడో
నీ మది దోచిన నను చూసి సంబరపడ్డాడో
సన్నజాజి వూగిసల చిరుస్వరాలు
నీ చెవి జూకాలకి సాటి అంటుంటే
నీకంటి కలల వర్ణాలు నా కలలసౌధానికి
మంచి గంధపు దూపాలు చదివిస్తుంటే
చెలియా నిను చేరిన ఈ ఇహం మరిచి
నా అహం విడిచి మళ్ళీ నీకు అర్పితమవనా?
సఖీ, నీదని నాదని ఏదీ లేదని తెలిసినదేదో,
మనది కానిదేదీ వలపు కాదనీ తెలిపినది

****************************/


[సశేషం]

మనసు వెచ్చబడింది - కాస్త చూసివెళ్ళండి

ఏటి ఒడ్డున ఏదమ్మ నా ఆలిచిప్ప?
తోట మలుపున కానరాదే నా రామచిలుక?
కోట దాపుకి రాననదే నా కొండమల్లి?
గూటిలోపల తొంగొనదే నా గోరువంక?
వేటగాడికి చిక్కిందేమో నా లేడికూన?
వీడు దొరకక బావురందేమో నా కన్నెమొలక?
అమ్మో నా మనసు చింతకి వైద్యమేదీ?
*******************************
పైన నా మనిషి మానసాన్ని నేను కవితీకరిస్తే, ఇదిగో మా భావన భావన. :) మరిది నాకు తగ్గ సమాధానమే! కాదంటారా? ;)

ఏటి ఒడ్డున అల్చిప్ప...
ముత్యమంటి
మగని మనసును దాచి పెట్టి
ఏమి ఎరుగని నంగ నాచై
తళుకు నవ్వులు రువ్వుతోంది....
తోట మలుపున రామ చిలుక
కొమ్మ
పైని కొంగుచాటున
ప్రియుని విరహం చూసి చూసి తుళ్లుతున్నది
కొమ్మ చాటున కొండ మల్లి
ఆకు
చాటున వొదిగి వొదిగి
వలపు తలపుల పరిమళాన్ని రువ్వుతోంది నిలిచి చూడోయ్
గూటి లోపలి గోరువంక
కువ
కువ లతో నవ్వుతోంది
దిక్కులోంకన చూడకండా తొంగి చూడోయ్ చిన్ని కన్నా
వేట గానికి చిక్కునా నీ వలపు తలపుల జాజి మల్లె
అండ దండ విలుకానివి నువ్వు వుంటే.......
నీ మనసు చింత కు మందు వేయగా
నడిచి
వచ్చిన వలపు కొమ్మ
అల్ల నల్ల అధర మదరగా నక్కేనచ్చట చిట్టి చిలుక
అలక తీర్చి శయ్య పరచగ వేచివున్నది కలహకంఠిత

వలపు దోబూచులు

ఈ గుండె ద్వీపాల్లోకి ద్వారాలు నా కళ్ళే,
అవి మూసినా తెరిచినా ఆ చూపు నీ కొరకే.

శిశిరపు గాలులు పాడే పదాలు నా ఎద రొదలే,
ఆ పదాల మాటున దాగిన వేదనలు నీ కొరకే.

మల్లియ నడిగి మంచు తెచ్చుకున్న తెలుపుకి,
సుగంధ పరిమళాలు అద్దేవి మన వలపులే.

నీ సందిట నేను చేరినా, నా మోహపు వలలో నీవు చిక్కినా,
వేడుకలు మనవే, మదనుని చిరునామా మనదే!

నీవు కప్పిన నా మేను పుష్కరస్పర్శకి పునీతమైన నది.
నా ఒడి చేరిన నీవు గంగాజలకాలాడిన పవిత్రుడివి.

నాదని నీదని ఏమీ లేదని నీకూ నాకూ తెలిసినదే,
ఎదలో ప్రేమని దాచిన ప్రతి జంట ఆడే దోబూచులివే.

విశ్వామిత్ర-12

ఆ చేరువలోని అనుభూతి ఇద్దరికీ క్రొత్తగా వుందో, విడివడాలనిలేదో. మిత్రకి మధ్యలో కాస్త వదిలి మళ్ళీ బిగిసిన విశ్వ చేతుల స్పర్శ తెలుస్తూనే వుంది.

"కన్నా! ఇలాగే వుండిపోవాలనుంది." మిత్ర మాటలో కాస్త గారం కలిసిన మురిపెం.

"అలాగేనేం. జోలపాట పాడతాను, ఇంకా పడుకోకపోతే నాలుగు దెబ్బలేస్తాను గట్టిగా." అన్నాడు విశ్వ.

ఇంత చనువు ఒక్క నిమిషంలో ఏమో సాధ్యమేనేమో. ప్రేమ దేన్నైనా అధిగమించగల ధైర్యాన్ని ఇస్తుందేమో. ఇద్దరూ పరిచయమైన ఇన్నేళ్ళకి, ఇన్నివేళ మైళ్ళ దూరాన వేళ కాని వేళ ఆ ఘటన.

విశ్వ మొహాన్ని రెండరచేతుల మధ్య తీసుకుని కొద్దిగా వంచి, తనూ కాళ్ళెత్తి నుదురు మీద చిన్నగా చుంబించి కాస్త దూరం జరిగి, నాలుగడుగులు వేసి సోఫాలో కూర్చుంది.

తనూ అమె వెనగ్గా వచ్చి అదే సోఫాలో అటుప్రక్కగా కూర్చున్నాడు విశ్వ. మరిక మాటలేమీ లేవు ఎక్కువగా. ఎగిసిన అల విరిగిపడ్డట్లు, ఇద్దరిలోను ఏదో ప్రశాంతత. ఒకరి మనసు మరొకరికి వ్రాసి ఇచ్చేసినంత ధీమా.

పదీ పదిహేను నిమిషాలు గడిచాయో లేదో మిత్ర గాఢనిద్రలోకి జారిపోయింది.

*************************************************

మరొక వారం గడిచిందో లేదో హెల్ముట్ రాజీనామా చేసాడు. ఒక ఆర్నెల్ల పాటు ప్రంపంచయాత్రలో గడిపి తర్వాత ప్లాన్ గురించి ఆలోచిస్తానని చెప్పాడు. మిత్రకి చాలా ఆశ్చర్యంగా వుంది. అలా నడివయసులో ఉద్యోగం వదిలి, కుటుంబాన్ని విడిచి వెళ్లటం తనవాళ్ళెవరైనా చేస్తారా అని ఆలోచన కూడ కలిగింది.

ఆ రోల్ కొరకు ఇంటర్నల్ కాండిడేట్స్ కూడా అప్ప్లై చేసుకోవచ్చని మానేజ్మెంట్ నిర్ణయించారు. మిత్రకి అప్పుడు కలిగింది ఓ ఆలోచన, విశ్వ కూడా ప్రయత్నించవచ్చు కదా అని. హెల్ముట్ కూడా ఇంటర్వ్యు చేస్తున్నాడు. విశ్వ కి మనసులో మాట చెప్పింది.

తర్వాత అంతా అనుకోకుండా సజావుగా జరిగిపోయింది. హర్షతో మాట్లాడి విశ్వ అప్ప్లై చేయటం, సెలక్ట్ కావటం జరిగింది. అక్కడ ఆఫీస్ లో శివ కి విశ్వ స్థానం ఇవ్వటంతో పెద్ద ఇంపాక్ట్ లేదని హర్ష కూడా అంగీకరించటంతో విశ్వ కూడా ఇతరత్రా ఆలోచనలు చేయకుండా మారగలిగాడు. అందులోను మిత్ర విషయం కూడా చెప్పటంతో హర్ష కూడా చాలా సంతోషించాడు.

మిత్ర ఇండియా నుండి వచ్చిన నెలన్నరకి విశ్వ తన వూరికి మారటం జరిగిపోయింది.

రోజూ ఆఫీసు లంచ్ లో కలవటం వీలు పడింది. మరొక నెలకి మిత్ర కమ్యూనిటి కాలేజిలో తనకి నచ్చిన టెక్నికల్ కోర్స్ తో పాటుగా, పాటరీ క్లాసులు కూడా తీసుకోవటంతో సాయంత్రాలు కలవటం పడటంలేదు.

శనాదివారాలు మాత్రం తప్పక కలిసి లైబ్రరీకి వెళ్ళటమో, లేదా డ్రైవ్ చేసుకూంటూ వెళ్ళి చుట్టు ప్రక్కల ప్రదేశాలు చూసిరావటం లేదా ఇద్దరి ఇళ్ళలో ఎక్కడో ఓ చోట కబుర్లతో కాలక్షేపం చేయటం. ఎంతసేపు కలిసున్నా తనివి తీరనట్లుగానే వుంటుంది.


**************************************************

ఆ యేడు మిత్ర పుట్టినరోజు శనివారం వచ్చింది. శుక్రవారమే విశ్వకి చెప్పింది.

మర్నాడు విశ్వ వచ్చేసరికి పదైంది. ఈలోపుగా మిత్ర తలస్నానం, ధ్యానం పూర్తి చేసి, గారెలు, కొబ్బరి పచ్చడి, పాయసం చేసింది. మధ్య మధ్యలో ఇండియా నుండి ఫోన్ కాల్స్. కాసేపు మనియాద.

విశ్వ రావటంతోనే మళ్ళీ మనసంతా ఆహ్లాదంగా మారిపోయింది. అనంత పెయింట్ చేసిచ్చిన పాలపిట్ట రంగు చీరలో మిడిసిపడుతున్న వంటి ఛాయ. సన్నని బసరా ముత్యాల దండ. గాలికే వూగినట్లున్న జూకాలు. చుక్క బొట్టు. అదీకాక ఏదో గ్రేస్ ఆ మొహమ్మీద. విశ్వ కళ్ళలో అదే ఆరాధన.

"అమ్మలు, మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే." ఆ మాట అంటూనే చేతిలో వున్న చిన్న డైరీ వంటిది మిత్ర చేతిలో పెట్టాడు. అదికాక చిన్న కేక్, మిత్రాకి ఇష్టమైన లెబనీస్ స్వీట్ బక్లవ కూడా తెచ్చాడు.

"విశ్వ, ఇది నీ డైరీ కదా?" అన్న మాట పూరికాకుండానే "అవన్నీ నీకు చెప్పాల్సినవే." చిన్నగా నవ్వేసాడు.

"పద పద కాస్త నోరు తీపి చేస్తాను." అన్న మిత్ర మాటకి అతని మొహమ్మీద కదలాడిన నవ్వుకి యేదో వూహ మదిలో కదలాడి నునుసిగ్గు ముంచుకు వచ్చింది.

కేక్ కట్ చేసి తీసుకున్నాక ఇద్దరూ కలిసి గారెలు తిన్నారు. తను తిన్నది తక్కువే కానీ విశ్వకి మాత్రం ఒకటొకటి అంటూ దాదాపు ఆరు గారెలు వేసేసింది. పాయసం తెస్తానని లేచింది.

"కాసేపు ఆగుదాం. అసలు ఖాళీ మిగిల్చితేగా." అన్నాడు విశ్వ.

సోఫాలో ఓ ప్రక్కగా వాలి కూర్చున్న విశ్వ దగ్గరకి చొరవగా జరిగి ఆనుకుని కూర్చుంది. నెమ్మదిగా పొదివి పట్టుకుని, పెదాల మీద అనీ ఆననట్టు చిన్నగా ముద్దు పెట్టాడు.

తొలిముద్దు. లేత పెదాల మీద అతని పెదాల తాకిడికి, శ్వాసలోని వేడికి చిత్రంగా తొలకరి జల్లు తాకినంత చిరు వొణుకు. నల్లటి కళ్ళ వెనుక సప్తవర్ణ కలల ప్రపంచం ఒక్క క్షణం లో భ్రమణం చేసింది. అతన్నీ, ఆమెనీ మరో లోకపు అంచుల్లోకి తోసేసింది.

ఆమెలోని జలదరింపుకి విశ్వలో మరింత కదలిక. అది గమనించిన మిత్ర నెమ్మదిగా విడివడి దూరం జరిగి కూర్చుంది.


"విశ్వ, మన ఈ బంధం శాశ్వతం కావాలంటే నాకు మరి కొంచం సమయం కావాలి. ఇది ప్రేమ అని తెలిసినా ఏదో అస్పష్టమైన భావన నాలో పెళ్ళి పట్ల గల విముఖతని తొలగనీయటం లేదు." అంది మిత్ర.

"నాకెన్ని లోపాలు ఉన్నా, అదృష్టవశాత్తు, అలుసు, అహం మాత్రం తక్కువ. అమ్మలు, నువ్వు చనువు ఇచ్చావని, ఎప్పుడూ అలుసుగా తీసుకోను, రుబాబు చెయ్యాలని చూడను, అహం ప్రదర్శించను, నీ వ్యక్తిత్వానికి విలువనిస్తాను,నిన్ను ఆరాధిస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను, ప్రేమిస్తాను. YOU ARE MY LOVE" మృదువుగా అన్నాడు విశ్వ.

తల స్నానం చేసిన జుట్టు ఆరీ ఆరక నుదుటి మీద పరుచుకుని, ఆలోచనలో పడ్డట్లు కాస్త ముడుచుకునున్న పెదాలు, ముద్దుగా వుంది.

"మిత్ర, ఇక ఆ విషయం వదిలెయ్యి. పద అలా కాసేపు బయటకి వెళ్దాం." అన్నాడు.

"ఊ.." అంటూ లేచి "విశ్వ నన్ను అర్థం చేసుకున్నారు కదు. నాకు దూరం అవరు కదూ?" అని అడిగింది. అంతకు మునుపు మాటల్లోని బింకం లేదు. చివరి మాటకొచ్చేసరికి బేలతనం.

"మిత్ర, నీ మనసు తెలుసు నాకు. నీ ఆలోచన ఏదైనా కానీ నువ్వు సఫలీకృతంకావటానికి నా తోడు, అండ ఎల్లప్పుడూ ఉంటాయి, ఏమి చెప్తే అది చేస్తాను. I will never leave you, ever. నువ్వు నా దానివి ఐనప్పుడు, ఇంక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తానురా అమ్మలూ." మంద్రస్వరంతో పలికిన విశ్వ మాటల్లోని మార్థవం మిత్రకి మనసుకి వూరటనిచ్చింది.

తర్వాత గడిపిన సమయమంతా ఎప్పుడూ లేనిది విశ్వ మాటలతో మిత్ర మౌనంలో గడిచిపోయింది.

ఆర్ట్ గాలరీకి వెళ్ళి, బయట లంచ్ తిని, మొదట్లో ఇద్దరూ కలిసి వెళ్ళిన తోట కి వెళ్ళారు. కొంచం లోపలకి వెళ్ళాక అటుగా వున్న చిన్న చెరువు ప్రక్కగా కూర్చున్నారు.

చిన్న చిన్న పిట్టలు వొళ్ళంతా నీలిరంగు కలిసిన నలుపు, కంఠం దగ్గర మాత్రం నెమలిపింఛం లో వుండే ఒకలాంటి పచ్చని రంగు. వాటి కూత అదో మత్తు కలిసిన స్వరంలో ఏదో పాటలా వుంది. గుంపులు గుంపులుగా అక్కడక్కడే వాలి గాల్లో గిరికీలు కొడుతూ తిరుగూతువున్నాయి.


"ఏటిదాపున తోటలోపల ఎవరినే పిలిచేవు కోయిల ఎవరినే .." మిత్ర సన్నగా కూనిరాగం తీసింది.

"ఇంకెవరినీ ఈ రాజకుమారినే.." విశ్వ నవ్వేసాడు.

ఆ ఆహ్లాదకరమైన వాతావరణం, అతని సమక్షం. చెరువుకి ఆవలి ప్రక్కన ఇద్దరు చిన్నారుల కేరింతలు కొడుతూ ఫ్రిస్బీ ఆడుతున్నారు.

"నాకు చిన్న బాబు కావాలి." మిత్ర నోటి నుండి అనుకోకుండా వచ్చిందా మాట.

చటుక్కున అతని మొహం లోకి చూసింది. అదే ప్రశాంతత, తొణికిసలాడే ప్రేమ. ఆ కళ్ళలో ఎప్పుడో గానీ మరో భావం కనపడదు.

పాణీ గ్రహణం అయింది, కలిసి అడుగులు వేసేసారు. మనసులు కలిసాయి. మన మధ్య ఇక ఈ దూరం ఎందుకు మరి తన మనసు కోరుకుంటుంది. ఏమో!

*************************************************

ఆ రాత్రి మంచం మీద వాలాక విశ్వ ఇచ్చిన డైరీ గుర్తుకి వచ్చి, లేచి తెచ్చి అలా తిప్పుతూ ఓ పేజీ దగ్గర ఆగింది. నిజానికి తననుకున్నట్లుగా డైరీ కాదది. అన్నీ తనకి చెప్పినట్లుగా వున్న సంభాషణలు, ప్రేమ లేఖలు. తమ ఇద్దరి ప్రస్తావన తప్ప మరేమీ లేవు. కొన్ని చోట్ల తేదీలు వేసి వ్రాసి వుంటే, మరి కొన్ని పేజీల్లో ఏదో ఒక ఆలోచన యథాతథంగా పెట్టినట్లుగా వున్నాయి.

హెల్ముట్ ఇంటి దగ్గర నుండి వస్తూ మంచులో ఆగిన రాత్రి జ్ఞాపకం వ్రాసుకున్నాడు.


----------------------------------------------------------------------
దేవకన్య లా మెరిసిపోతున్న నా మనసైన మగువతో, ఈ రాత్రి నీలిమలోంచి నక్షత్రధారలుగా పైనున్న వారు జల్లుతున్న మంచు తలంబ్రాలతో మనువు జరిగినట్లుగా వుంది. నా మీద బాధకి బరువు ఆన్చి అడుగులు వేసినప్పుడు "ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నీకు తోడవుతాను. నీ కంట కారిన ఆ చుక్క నీ బాధకి చివరి చిహ్నం కావాలి. నేస్తమా, నా సాంత్వన వచనాలు నిన్ను నిమ్మళించేనా?" అనాలని వున్నా చెప్పలేకపోయాను. కానీ తను నాదే అన్న భావన మాత్రం బలపడిపోయింది. తనని దాటుకుని ఇక ఎటూవెళ్ళలేను.
----------------------------------------------------------------------

ఆశ్చర్యం. విశ్వలోను ఇంత భావుకత వుందా? తనలో తనే ప్రశ్న వేసుకుంది. ఒక్కసారిగా మళ్ళీ తనని చూడాలన్న కోరిక. మళ్ళీ అతనికి అర్పితమైపోవలన్న భావన. తన వ్యక్తిత్వం ప్రక్కకి తొలగి అతనితో కలిసి సాగాలన్న ఆత్రుత. బలవంతంగా ఫోను చేయాలన్న ధ్యాస మళ్ళించి విశ్వ డైరీలోనే చివరి పేజీలో తన మనసు పరుచుకుంది.

"విశ్వ, ఏమిటో నా మనసు పిచ్చిదైపోతుంది. ఈ నిశ్శబ్దంలో చిరు సవ్వడి నా గుండెది మాత్రమే. జేగంటలా ఏదో మంగళాలు వినిపిస్తుంది. స్నేహమంత్రాలు జపియిస్తుంది. అలుపుగా వుంది, ఇక ఆగిపోవాలనీవుంది. తోడుకావాలనీ, అదీ తొందరగా దొరకాలనీ వుంది. ఒంటరి పయనం నీ ముంగిట నిలిపి, నీతో కలిసి మరొకపరి నే చూసొచ్చినవన్నీ చూడాలనివుంది.

నువ్వెందుకు నాకు లొంగవని మునుపనుకున్న నేను, నా మీద నీకు సర్వాధికారాలు ఇచ్చేసే ద్రోహమెందుకు చేస్తున్నాను, అసలెందుకు నన్నిలా ఏమారుస్తున్నాను? ఎక్కడికి వెళ్ళిపోయావు. నాకు నువ్వు ఈ క్షణమే కావాలి.

ఆకాశంలో నా వలెనే ఒక ఒంటరి తార ఇంత వానలోనూ, బహుశా నే బిక్కు బిక్కు మనటం తాచూసిందేమో. తోటి చుక్కలకేం చెప్పి వచ్చిందో, వెన్నెల్లో తడిసే ఒంటిని వానధారలకి అప్పచెప్పి, నా వంక మినుకు మినుకున చూస్తూ నాకు తోడువున్నానంటుంది. నీకన్న అదే నయం, గగనాలనుండి స్నేహహస్తం అందిస్తోంది. నా కినుక నీ పైనా? నిను చేరలేని నా పైనా? తెలవారనీయని ఈ నిశిపైనా?

ప్రకృతి తన పురుషునిలో ప్రేమికుని వెదుకుతున్నట్లు, అందుకు తనకొక రూపు కావాల్సి నా దేహమరువడిగినట్లు, ఏడనో దాగి వేదిస్తున్న తన మగని వునికి నీ దాపుల్లో కనుగొన్నట్లు, నన్ను నిలువున క్రమ్ముకున్న దాహమో, విడలేని మోహమో విన్నవిస్తానన్నదీ ఈ క్షణం.

ఎంతకాలమింక నన్ను వేధించుకు తింటావ్? నిజమొకటి చెప్పనా - కాలంమీద చాలా కోపంగా వుంది. అది కదలను, కరగను పొమ్మంటుంది. పాడు నా మనసు నీ మాట వింటానంటుందేంటీ? ఎక్కడెక్కడో తిరగను ఇక్కడే నీతో వుంటానంటుంది."

అస్తిత్వం మరిచి ప్రేమకి అర్పితమైన ఆ విశ్వామిత్రల మనసులు, ఉదయపు వేళల సుమధుర పరిమళంతో దైవపూజకి సిద్దమయ్యే పారిజాతాలు.

[సశేషం]