ఒకానొక తేనెపిట్ట రాకతో

మధ్యాహ్నపు గాలి పూలలో జోగుతూన్న వేళ
చప్పుడు చేయక తుంటరి తేనెపిట్ట తుర్రు తుర్రుమని
తిరుగాడుతూ ఉంటుంది తరుచుగా
దయగా దమయంతి ఏనాడో చుట్టిన పచ్చకోక
మెరుస్తూ ఉంటుంది
కిటికీ రెక్క చాటున మాటేసిన నేనేమో
చీకటి మోమున నా చుక్కల కనులు
అరమోడ్చి సేదతీరుతూ ఉంటానిక...


 

ముసాబు ఉదయాల మునకల్లో

-1-

వానచినుకులు

పిల్లకాలువలు కట్టుకుని

ఇనకనని మొరాయిస్తున్నాయి


వలస పక్షులు

నిన్న లేనివేవో చూస్తూ

వింతపడుతూన్నట్లు

నిమ్మళంగా ఒళ్ళు కడుక్కుంటున్నాయి


ఎప్పుడూ ఉన్న చెట్లు, 

ఇప్పుడిప్పుడే విచ్చుకున్న పూలు

ఆరాటం గా దిగుతున్న నీటి మబ్బులకి

వసతి ఏర్పాట్లలో 

హడావుడిగా మాట్లాడేస్తున్నట్లుగా ఉంది

చిరుగాలుల సవ్వడిలో కొత్త తీరు వింటుంటే


కిటికీచట్రాలు అడ్డం పడి ఆగిన 

ఇంకాసిని నీటిబొట్లు

ఆగి ఆగి దూకుతున్నాయి  


వానంటేనే ఆహ్లాదం, 

వానొస్తే చెప్పలేనంతదేదో ఉంటుంది

ఎప్పటికీను...


-2-

పక్కకి వచ్చి వాలి, 

కువకువల కేరింతల మినహా 

పలుకరించని పిట్టలన్నా,

"గుర్తుకొస్తున్నావ" ని చెబ్దామంటే

 నీడకీ ఆచూకీ తెలుపని నువ్వన్నా,

పట్టరాని కోపంగా ఉంది, 

పంతం పట్టాలని పౌరుషంగా ఉంది...

నువ్వు పిలవగానే టక్కున పారిపోయే 

నా బెట్టుసరితనాల మీదొట్టు.

-3-

వానలోనూ, 

ఆనందాల వానలలో

తడిసి ఒళ్ళు  ఆరబెట్టుకున్న

అక్షరాలలోనూ 

నానిపోతున్న హాయి!

360°

 కాసేపు నీతో

ఆ రవ్వంత తడవే
మరి-
కనులకి దారి ఇస్తూ నీ కాంతులు
ఇక, రోజూ ఉదయమో, అస్తమయమో చివరికి నిశి వేళల లోనో
లోనుంచి నమ్మిక ఒకటి
త్రోవ వెంట నీవు చిమ్మిన
గురుతుల కొరకు
గమ్యం ఎరుగని యాత్ర కొరకు
నిరంతరం కదులుతూ ఉంటుంది.
ఇదేనంటావా జీవితానికి తుది నిర్వచనం..
అసలుకి అదేమీ లేదు, ఉండదూ అనా !?